ఆ అందం మళ్లీ పుట్టాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1963-2018
*
ఆమె వచ్చింది.. ఆమె చూసింది.. ఆమె గెలుచుకుంది. ఏ స్వర్గం నుంచి అయితే వచ్చిందో తిరిగి తను అక్కడికే వెళ్లిపోయింది. ఆమె సినీ సామ్రాజ్యపు అతిలోకసుందరి, ప్రేక్షకుల ఆరాధ్యదేవత శ్రీదేవి. ఈ పేరు అందానికి పర్యాయ పదం. భారతీయ సినిమా ఎంతో మంది కథానాయికలను చూసి ఉండొచ్చు. కానీ శ్రీదేవి మాత్రం వాళ్లందరిలోనూ ప్రత్యేకం. అందం, అభినయం, అమాయకత్వం.. అన్నీ కలగలిస్తేనే శ్రీదేవి. ఒక దశలో ఆమె అందాన్ని అభివర్ణించడానికి కవులు సైతం పదాల కోసం పరితపించిపోయారు. వివిధ భాషల్లో విభిన్నమైన పాత్రలతో అలరించిన శ్రీదేవి అంచెలంచెలుగా ఎదిగి గ్లామర్ క్వీన్‌గా మారింది. ఐదు పదుల వయస్సులోనూ కుర్ర కథానాయికలకి పోటీ ఇచ్చింది. నేటి తరం హీరోయిన్లు కూడా ఆమె అందాన్ని చూసి కుళ్లుకోవడం ఖాయం. వివిధ భాషల్లో రెండు దశాబ్దాల పాటు చిత్రసీమలో వెలుగొందడమంటే మాటలు కాదు.. చేతలు కావాలి. శ్రీదేవి కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసింది. ఆమె ఏ ఒక్క భాషకో పరిమితం కాలేదు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ ఇలా పలు భాషల్లో దాదాపు 260కి పైగా సినిమాల్లో మెరుపులు కురిపించి వెలకట్టలేని అభిమానుల్ని సొంతం చేసుకుంది. స్టార్ హీరోలకు కళ్లు చెదిరే స్టార్‌డమ్ ఆమె సొంతం చేసుకుంది.
1963, ఆగస్టు 13న శివకాశిలో జన్మించిన శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మయ్యంగార్ అయ్యప్పన్. 1967లో బాలనటిగా ‘కన్దర్ కరుణాయ్’ అనే తమిళ చిత్రం ద్వారా వెండితెర ప్రయాణాన్ని ప్రారంభించారు. బాలనటిగా మురుగన్, కృష్ణుడిగా కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు. తెలుగులో ‘పదహారేళ్ల వయసు’, హిందీలో ‘సోల్వా సావన్’ కథానాయికగా ఆమె నటించిన తొలి చిత్రాలు. ప్రఖ్యాత దర్శకులు కె.బాలచందర్ దర్శకత్వంలో 1976లో వచ్చిన ‘మాండ్రు ముడిచు’లో కమల్‌హాసన్, రజనీకాంత్‌లతో కలిసి నటించింది. ఈ చిత్రంలో రజనీకాంత్ సవతితల్లి పాత్రలో కనిపించింది. 1976లో ఈ సినిమా విడుదలైన సమయానికి శ్రీదేవి వయస్సు 13 సంవత్సరాలు. ఆ తర్వాత 1989లో ‘చాల్‌బాజ్’లో రజనీకాంత్ సరసన హీరోయిన్‌గా నటించడం విశేషం. ఎన్.టి.రామారావు సరసన కథానాయికగా నటించిన శ్రీదేవి బాలకృష్ణతోనూ ఆడిపాడింది. అక్కినేని నాగేశ్వరరావుతో రొమాన్స్ చేసింది. నాగార్జునతోనూ జతకట్టింది. ఇలా రెండు తరాలకు చెందిన హీరోలతో మెరిసింది. కొండవీటి సింహం, క్షణక్షణం, వేటగాడు, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి, ప్రేమాభిషేకం, జగదేకవీరుడు అతిలోకసుందరి, గోవిందా గోవిందా వంటి సినిమాల్లో శ్రీదేవి నటన ఎంతటి పేరు తెచ్చిపెట్టిందో మరచిపోలగమా? 1975-85 మధ్య కాలంలో తెలుగు, తమిళంలో అగ్రశ్రేణి కథానాయి
కగా ఎదిగారు. తెలుగులో అగ్ర నటీనటులందరితోనూ జోడీ కట్టిన శ్రీదేవి తెలుగులో 85, తమిళం 72, మళయాలం 26, హిందీ 71 చిత్రాల్లో నటించారు. బాలీవుడ్‌లో చాందిని, లమ్హే, మిస్టర్ ఇండియా, నాగిని వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఆమె కనబరిచిన నటనకు ప్రేక్షకలోకం నీరాజనాలు పలికారు. తన నటనతో ఎన్నో ప్రశంసలు అందుకున్న శ్రీదేవి పలు అవార్డులు కూడా అందుకున్నారు. నాలుగు సార్లు ఉత్తమనటిగా, రెండు సార్లు స్పెషల్ జ్యూరీగా మొత్తం 15 ఫిలింఫేర్ అవార్డులు కైవసం చేసుకున్న ఆమె తెలుగులో నటించిన ‘క్షణక్షణం’ చిత్రానికి ఉత్తమ నటిగా నంది అవార్డును అందుకున్నారు. అంతేకాకుండా ప్రముఖ ఆంగ్ల టీవీ ఛానెల్ సీఎస్‌ఎన్-ఐబీఎన్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ‘ఇండియాస్ గ్రేటెస్ట్ యాక్ట్రెస్ ఇన్ 100 ఇయర్స్’గా శ్రీదేవి ఎంపికయ్యారు. నటనకు ఆమె చేసిన సేవను గుర్తించిన భారత ప్రభుత్వం 2013లో పద్మశ్రీ అవార్టుతో సత్కరించింది. 2012లో ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ చిత్రంతో శ్రీదేవి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తర్వాత 2017లో ‘మామ్’తో మరోసారి అలరించారు. ‘మామ్’ ఆమె నటించిన అద్భుత చిత్రాల్లో ఒకటి అని చెప్పాలి. ఈ సినిమాలో అమ్మ అంటే శ్రీదేవిలా ఉండాలి అన్నంతగా ఆ క్యారెక్టర్‌లో లీలనమై నటించారు. ఆ తరువాత మంచి కథలు వస్తే తప్పకుండా నటిస్తానని శ్రీదేవి చాలా సందర్భాల్లో చెప్పారు. శ్రీదేవి అందానికి ఫిదా కాని స్టార్ హీరో లేడంటే అతిశయోక్తి కాదు. నిజంగానే ఈ అందం దివి నుంచి భువికి వచ్చిందేమో అన్నట్లుగా అతిలోక సుందరి పాత్రలో జీవించింది. ఆ అందానికి, అభినయానికి ఒకటా, రెండా ఎన్నో నిదర్శనాలు. పదహారేళ్ల వయసులోని ఆమె అమాయకత్వం.. వసంతకోకిలగా ఆమె పలుకులు.. అతిలోక సుందరిగా ఆమె అభినయం.. ఇలా తను పోషించిన ఏ క్యారెక్టర్‌ని తీసుకున్నా దేనికదే సాటి. ఆయా పాత్రలో ఆమె జీవించిన తీరు అమోఘం. అపురూపం.. అనితర సాధ్యం. అలా చేయడం ఆమెకు మాత్రమే చెల్లింది. సినిమాల్లో ఎంత పేరైతే తెచ్చుకున్నారో వ్యక్తిగత జీవితంలో అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్రీదేవికి చిన్నప్పటి నుంచి అమ్మంటే ప్రాణం. ఆమెకి తల్లితో ఉన్న అనుబంధం ఎక్కువ. ఆమె మరణం తనకు తీరని లోటని శ్రీదేవి చెబుతుండేవారు. తల్లి మరణం తర్వాత శ్రీదేవి బాలీవుడ్ నిర్మాత, హీరో అనిల్‌కపూర్ సోదరుడు బోనీకపూర్‌ను 1996 జూన్ 2న వివాహం చేసుకున్నారు. వారికి జాహ్నవి, ఖుషి ఇద్దరు పిల్లలు. పెళ్లి తర్వాత సినిమా కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశారు శ్రీదేవి. సిల్వర్ స్క్రీన్‌మీదే కాదు.. బుల్లితెర మీద కూడా మెరిశారు. 2004-05 మధ్య కాలంలో మాలినీ అయ్యర్‌గా ప్రత్యక్షమయ్యారు. శ్రీదేవి నటించడం వల్లే మాలినీ అయ్యర్ పాత్ర బాగా పాపులర్ అయింది. ఆ సీరియల్ అయిపోయాక రెండు మూడు సార్లు టీవీ షోలకు హాజరుకావడం తప్ప నటిగా మళ్లీ తెరమీదకు రాలేదు. అయితే నిర్మాతగా ‘పోకిరి’ చిత్రాన్ని హిందీలో సల్మాన్‌ఖాన్‌తో ‘వాంటెడ్’గా నిర్మించారు. పదహారేళ్ల వయసులో అందాల తారగా అలరించిన శ్రీదేవిని స్టార్ హీరోయిన్‌గా నిలిపిన చిత్రం వేటగాడు. బాలనటిగా ‘బడిపంతులు’లో ఎన్‌టిఆర్ మనవరాలిగా నటించిన శ్రీదేవి తరువాత ఏడేళ్లకు అదే ఎన్‌టిఆర్ సరసనే 16ఏళ్ల ప్రాయంలో ‘వేటగాడు’ చిత్రంలో హీరోయిన్‌గా నటించి ఔరా అనిపించుకుంది. ‘బడిపంతులు’ చిత్రంలో ‘బూచాడమ్మా బూచాడు.. బుల్లిపెట్టెలో ఉన్నాడు’ అంటూ బాలనటిగా అందరికీ గుర్తుండిపోయిన శ్రీదేవి.. ‘వేటగాడు’లో ‘ఆకుచాటు పిందె తడిసే..’ అంటూ తడిపొడి అందాలతో తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో గిలిగింతలు పెట్టింది. ఆ తర్వాత ఎన్‌టిఆర్‌తో ‘ఆటగాడు’, ‘సర్ధార్ పాపారాయుడు’, ‘గజదొంగ’, ‘కొండవీటి సింహం’ ‘జస్టిస్ చౌదరి’, ‘అనురాగదేవత’, ‘బొబ్బిలిపులి’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. వేటగాడుతో విజయం సాధించిన ఎన్‌టిఆర్, శ్రీదేవి జంట తరువాత వరుసగా నాలుగేళ్లపాటు వెండితెరపై వరుస విజయాలను నమోదు చేసింది. అక్కినేని నాగేశ్వరరావుతో ఆమె నటించిన ప్రేమాభిషేకం (1981), బంగారు కానుక (1982), శ్రీరంగనీతులు (1983) లాంటి సినిమాలు అభిమానుల మదిలో నిలిచిపోయాయి. ఆ తరంలో కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు లాంటి హీరోలందరితోనూ సూపర్‌హిట్ సినిమాల్లో నటించిన శ్రీదేవి తరువాతి తరం హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌తోనూ విజయవంతమైన చిత్రాల్లో నటించారు. చిరంజీవికి జోడీగా రాణీకాసుల రంగమ్మ, జగదేకవీరుడు అతిలోక సుందరి, ఎస్.పి పరశురాం లాంటి తెలుగు సినిమాలతో పాటు చిరు హీరోగా తెరకెక్కిన బాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు. ఆఖరి పోరాటం, గోవిందా గోవిందా లాంటి సినిమాల్లో నాగార్జునతో, క్షణక్షణం సినిమాలో వెంకటేశ్‌తో కలిసి నటించి మెప్పించారు. అదే సమయంలో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన శ్రీదేవి అక్కడ కూడా తన హవాను కొనసాగించారు. 1975 జూలీ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయం అయిన శ్రీదేవికి హిమ్మత్‌వాలా సినిమాతో తొలి బ్లాక్‌బస్టర్ దక్కింది. హిమ్మత్‌వాలా తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోలకు హాట్ ఫేవరేట్‌గా మారిన ఆమె వరుస విజయాలతో ఇండియన్ టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. నెమ్మదిగా దక్షిణాదికి దూరమై బాలీవుడ్‌లోనే సెటిల్ అయ్యారు. తనలాగే తన కుమార్తెలను కూడా స్టార్ హీరోయిన్లుగా చూడాలనుకున్నారు శ్రీదేవి. ఆమె పెద్ద కూతురు జాన్వీకి 16 ఏళ్లు రాకుండానే సినిమా అవకాశాలు వెల్లువలా వచ్చినా అంగీకరించలేదు. కూతురుకి సినిమాల్లో నటించేందుకు మానసిక పరిపక్వత రాగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్ ‘్ధడక్’ చిత్రంతో సినిమాల్లోకి రాబోతున్నారు. శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. శ్రీదేవి తన కుమార్తె వద్దే సెట్స్‌లో ఉంటూ అన్నీ దగ్గరుండి చూసుకునేవారు. కాగా, షారుక్‌ఖాన్ నటిస్తున్న ‘జీరో’ చిత్రలో శ్రీదేవి అతిథి పాత్రలో నటించాల్సి ఉంది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షారుక్ మరుగుజ్జు పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ నచ్చడంతో శ్రీదేవి తన పాత్రలోనే నటిస్తానని చెప్పారట. ఇంతలో శ్రీదేవి ఇలా హఠాత్తుగా మరణించడం బాధాకరం. ‘బూచాడమ్మా బూచాడు..బుల్లిపెట్టలో ఉన్నాడు’ అంటూ పాడటమేగాక, ‘సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా’ అంటూ ‘పదహారేళ్ల వయసులో’ ఊయల ఊగుతూ పాడుతున్న దృశ్యం ఇంకా మన కళ్ల ముందు కదలాడుతూనేవుంది. ఈడు వచ్చిన ఏ ఆడపిల్లయినా ఈ పాట పాడుకుంటూ శ్రీదేవినే ఊహించుకుంటుంది. అప్పట్లో ప్రతీ కుర్రకారు ‘అందాల దేవత’ శ్రీదేవే కదా. ఏ అమ్మాయిని చూసి వర్ణించాలన్నా ‘శ్రీదేవిలా ఉందిరా’ అని ఆమె పేరే చెప్పేవాళ్లు. కుర్రకారంతా ‘నీ కళ్లు చెబుతున్నాయి.. నిను ప్రేమించానని’ అంటూ పాడుకునేవాళ్లు. ‘అమ్మాడి నవ్వవే.. గుమ్మాడి నవ్వవే’, ‘దేవీ వౌనమా.. శ్రీదేవి వౌనమా’, ‘కట్టుకథలు చెప్పి నేను కవ్విస్తే.. నవ్విస్తే..బంగారు పాలపిచ్చుకా.. మా మల్లి నవ్వాలి పకాపకా’ ‘ప్రేమాభిషేకం..ప్రేమకు పట్ట్భాషేకం’, ‘వెల్లువచ్చి గోదారమ్మా ఎల్లికలా పడ్డాదమ్మో’, ‘కుడికన్ను కొట్టగానే కుర్రాడిని.. ఎడమకన్ను కొట్టగానే ఎర్రోడిని’ ఇలా ఎన్నో..ఎనె్నన్నో మన మదిలో అలజడి కలిగిస్తూనే వుంటాయి. ‘కన్నులున్నవని కనె్న పిల్లవని నువ్వు ఎన్ని వగలు..’, ‘నాకొక శ్రీమతి కావాలి.. నీ అనుమతి దానికి కావాలి’లాంటి వాటిని మరచిపోగలమా? నటిగా ఏ పాత్ర పోషించినా అందులో పరకాయ ప్రవేశం చేయడం శ్రీదేవి సొంతం. కాస్ట్యూమ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునే శ్రీదేవి ‘రూప్ కి రాణీ చోరోంకా రాజా’ చిత్రంలో ‘దుష్మన్ దిల్ కా వో హై’ పాట కోసం ఇరవై ఐదు కేజీల బరువైన గోల్డెన్ డ్రెస్ ధరించి, పదిహేను రోజులపాటు షూటింగ్‌లో పాల్గొన్నారంటే ఒక పాత్ర కోసం ఆమెకున్న కమిట్‌మెంట్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఆమె తమిళ ‘పులి’ చిత్రంలో ఇరవై కేజీల బరువైన కాస్ట్యూమ్స్‌ను ధరించి అందర్నీ అందంతో మెస్మరైజ్ చేశారు. అలాంటి సిరిమల్లె పువ్వు రాలిపోయింది. అందాల తార దివికేగింది. మానవా..మానవా’ అంటూ తెలుగువారిని పలుకరించిన అతిలోకసుందరి అభిమానులకు శోకాన్ని మిగిల్చి లోకాన్ని విడిచివెళ్లిపోయింది. లెజెండరీ నటి, అతిలోక సుందరి ఇక లేరనే విషయం తెలిసిన సినిమారంగం మూగబోయింది.

మా ఇంట్లో ఎదిగిన పిల్ల: కృష్ణ
శ్రీదేవి మరణం నన్ను చాలా కలిచివేసింది. ఆమె మరణవార్త వినగానే భూకంపం వచ్చినట్లు కంపించిపోయాను. తనతోనే ఆమె ఎక్కువ సినిమాలు చేసింది. శ్రీదేవి మా ఇంట్లో ఎదిగిన పిల్ల.

దురదృష్టకరం: చిరంజీవి
శ్రీదేవి గురించి ఇలాంటి ఒక సందర్భం వస్తుందని అనుకోలేదు. ఆమె గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందని నిజంగా నేనెప్పుడూ ఊహించలేదు. ఇది దురదృష్టకరం. అందం, అభినయం కలబోసిన నటి శ్రీదేవి. ఇలాంటి నటి ఇంతవరకు లేరు. ఇక మీదట వస్తారని కూడా నేను అనుకోవటం లేదు. నిజంగా భగవంతుడు ఆమెకు చాలా అన్యాయం చేశాడు. శ్రీదేవి హఠాన్మరణాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను.
షాక్‌కు గురిచేసింది: రజనీకాంత్
అందాలనటి శ్రీదేవి మరణవార్త నన్ను షాక్‌కు గురిచేసింది. ఓ మంచి స్నేహితురాలిని కోల్పోయాను. చిత్రసీమ గొప్పనటిని కోల్పోయింది.
లాలిపాట ఇంకా వినిపిస్తూనే ఉంది: కమల్‌హాసన్
టీనేజ్ నుంచి గొప్పనటిగా ఎదిగిన తార శ్రీదేవిని చూశాను. స్టార్‌డమ్‌కు ఆమె అన్ని విధాలా అర్హురాలే. ఆమె మరణించిందని తెలియగానే ఆఖరిసారి నేను శ్రీదేవిని కలిసిన జ్ఞాపకాలన్నీ ఒక్కసారి కళ్లముందు మెదిలాయి. ‘సద్మా’ చిత్రంలోని లాలిపాట ఇంకా వినిపిస్తూనే ఉంది.
అద్భుతమైన నటి : హేమమాలిని
శ్రీదేవి బాలీవుడ్‌లో సూపర్‌స్టార్‌గా ఎదిగినప్పటికీ దక్షిణ భారతీయ సంప్రదాయాన్ని, సంస్కారాన్ని వీడలేదు. ఆమె చనిపోయారని తెలిసి ఎంతో షాకయ్యాను. అసలు అనుకోలేదు. ఆమె నటనతో చాలామందిని ప్రభావితం చేశారు. అద్భుతమైన నటి. చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.
- ఎం.డి అబ్దుల్
*
అమరజీవి
నీవు...! కళామ్మ తల్లి ముద్దుబిడ్డవి
అతి చిన్న వయసులోనే చిత్రసీమలో అడుగుపెట్టి
ఒక మనవరాలిగా, భార్యగా,
అత్తగా ఎన్నో పాత్రలు పోషించి
ఎంతోమంది నటీ, నటులకు స్ఫూర్తిగా నిలిచి
కోట్లాది హృదయాలను నీ నటనతో మెప్పించి
చిత్రసీమలో ఒక ధ్రువతారగా వెలిగిన
బహుభాషా నటివి,
కళామ్మతల్లికి దొరికిన అపురూప కానుకవి
నటనకు నడకలు నేర్పించి
నటనకు ఊపిరిపోసి,
ఏ పాత్రకయినా ప్రాణం పోసి, రక్తికట్టించి
కోటి భావాలను కళ్ళలో పలికించి
ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న
నీ నటన అమోఘం, అనిర్వచనీయం
ఎంతోమంది అభిమానుల ఆరాధ్య దైవానివి
కళాభిమానుల గుండెల్లో కొలువైన దేవతవి
ఎన్నో అవార్డులు రివార్డులు నీ సొంతం
నీ హఠాన్మరణం యావత్ సినీ ప్రపంచానికి తీరని లోటు
ఎంతోమందిని శోక సముద్రంలో ముంచి
వెళ్ళిపోయావా తల్లీ..!
నిన్ను తలచి చెమ్మగిల్లని మనసుంటుందా..!
- కాసర సింధూరెడ్డి