సబ్ ఫీచర్

సాధికారతతోనే సమాజ పురోగమనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా స్ర్తిలు శారీరక, మానసిక, లైంగిక, ఆర్థిక హింసకు బలవుతున్నారు. మహిళలపై హింసకు సంబంధించి ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదికలో ఎన్నో దిగ్భ్రాంతికరమైన నిజాలు వున్నాయి. ఆదిమ సమాజంలో పురుషునితో సమానంగా స్ర్తి స్వేచ్ఛ అనుభవించింది. ‘‘అడవికి వెళ్ళా - పిట్టను కొట్టా - పొయ్యిలో పెట్టా’’ అనేంత కాలం స్ర్తి స్వేచ్ఛకు ఆటంకం రాలేదు. సంతానోత్పత్తి కారణంగా స్ర్తి ఇంటికి పరిమితం అయి పురుషుడు బయటకు వెళ్ళి సంపాదన ప్రారంభించటంతో విభజన మొదలైంది. అంతరాల దొంతర లాంటి సమాజంలో పురుష బానిసకు మరో బానిసగా స్ర్తి మారింది. పురుషస్వామ్య సమాజంలో నేటికి తలకిందు భావనలే సవ్యమైనవిగా చెలామణీ కావటం విచిత్రం. మనిషి పుట్టుకకు, యవ్వనంలోనూ, వృద్ధాప్యంలోనూ, నిరంతరం స్ర్తి పైనే ఆధారపడి ఉంటాడు. కానీ స్ర్తి పరాధీన అనటం మన స్మృతిని అణువణువున జీర్ణించుకుని పోయిన పురుషులకు అలవాటై పోయింది.
స్ర్తి హక్కుల గురించి సాధికారత గురించి మాట్లాడగానే అది పురుషులకు వ్యతిరేకం ఏమాత్రం కాదు. అంతర్జాతీయ ఆర్థిక వేదిక వెలువరించిన స్ర్తి, పురుష సమానత నివేదిక-2017లో 144 దేశాల జాబితాలో భారత్ 108వ స్థానంలో వుండటం చాలా విషాదం. భారత స్వాతంత్య్ర పోరాటంలో ఝాన్సీ లక్ష్మీబాయి నుంచి కెప్టెన్ లక్ష్మీ సెహగల్, అరుణా అసఫలీ, కల్పనాదత్ లాంటి వారి వరకు ఎందరో మహిళలు అసాధారణ ప్రతిభ చూపింరు. కానీ క్రమంగా రాజకీయాల్లో మహిళా ప్రాధాన్యం తగ్గుతోంది. 1993 నాటికి 73-74 రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థలో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్లు కల్పించారు. దీనివలన స్థానిక సంస్థల్లో దేశవ్యాప్తంగా 32 లక్షల మంది ఎన్నికైన ప్రతినిధుల్లో 14 మంది మహిళలు ఉన్నారు. పార్లమెంట్‌లోనూ, రాష్ట్రాల శాసనసభల్లోనూ మహిళలకు మూడో వంతు ప్రాతినిధ్యం కల్పించాలన్న బిల్లు నేటికి 22 ఏళ్ళు గడిచినా పార్లమెంట్ ఆమోదం పొందలేదు. పార్లమెంట్‌లో మహిళల ప్రాతినిధ్యం మన దేశంలో 12 శాతం, బంగ్లాదేశ్‌లో 20 శాతం, పాకిస్తాన్‌లో 17.5 శాతం వుంది. స్కాండినేవియన్ దేశాలైన డెన్మార్క్ నార్వే, స్వీడన్‌ల్లో మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ ఎప్పటినుంచో వుంది.
2011లో భారత రాష్టప్రతి, లోక్‌సభ స్పీకర్, ప్రతిపక్ష నాయకురాలు లాంటి అత్యున్నత పదవులను మహిళలు చేపట్టినా మహిళా రిజర్వేషన్ బిల్లులో కదలిక రాలేదు. మార్చి 9, 2016న మహిళా రిజర్వేషన్ బిల్లు వెంటనే ఆమోదించాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రపంచంలోనే మొదటిసారిగా జాతీయ మహిళా పార్లమెంట్‌ను 2017, ఫిబ్రవరిలో విజయవాడలో జరిపి ‘అమరావతి డిక్లరేషన్’ను 2017, నవంబర్ 17న ప్రకటించారు. విద్య, చట్టపరమైన హక్కులు, ఆరోగ్యం - పోషకాహారం, ఎంటర్‌ప్రెనర్‌షిప్, రీసెర్చి మరియు ఇన్నోవేషన్, రాజకీయాలు, సామాజిక భద్రత, సమతుల్య అభివృద్ధి లక్ష్యాలు, సామాజిక అభివృద్ధి - డిజిటల్ అక్షరాస్యత లాంటి పది అంశాలపై దృష్టి సారించి మహిళల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని అమరావతి డిక్లరేషన్ కార్యాచరణ ప్రణాళిక సూచించింది. జాతీయ ఉమెన్ పార్లమెంట్ విజయవంతంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్పీకర్ కోడెల శివప్రసాద్ అభినందనీయులు.
బాల్య వివాహాలు, సతీ సహగమనం, వితంతు వివాహాలు లాంటి సాంఘిక దురాచారాలు రూపుమాపేందుకు కందుకూరి వీరేశలింగం లాంటి వారు చేసిన కార్యాచరణ మనకు ఆదర్శం కావాలి. ఇలాంటి సమస్యలు ప్రస్తుతం మరో రూపం తీసుకుంటున్నాయి. ఆడపిల్లలకు వేధింపులు, వరకట్న సమస్య, గృహహింస పెరిగిపోతున్నాయి. గృహ హింస చట్టం కూడా పురుషస్వామ్య భావజాలానికి అడ్డం వేయలేకపోతోంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం ప్రతి 44 నిమిషాలకు ఒక కిడ్నాప్, 47 నిమిషాలకు ఒక రేప్, 17 నిమిషాలకు ఒక వరకట్న హత్య జరుగుతున్నాయి. స్ర్తిలపట్ల ఘోరమైన నేరాలు జరుగుతుంటే సమాజం చూపిస్తున్న నిర్లిప్తత ఆందోళన కలిగిస్తోంది.
మనకు రాజ్యాంగం ప్రకారం అన్ని హక్కులు వున్నాయి. కానీ ఆచరణలో మాత్రం వెనుకబడి వున్నాం. రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ అన్నట్లు ‘‘ఆచరణలోకి రాని చట్టాలు ఎన్ని మాత్రం ఉంటే ఏం?’’ అనేది ఎంతో నిజం. అప్పుడూ, ఇప్పుడూ స్ర్తి జీవించే హక్కు కోసం, స్వేచ్ఛ, భద్రతల కోసం, ప్రైవసీ కోసం, రాజ్యాంగ బద్ధ హక్కుల కోసం పోరాడుతూనే ఉంది. చట్టం తన పని తాను చేయకపోవడంవల్ల, పోలీసులు శాంతిభద్రతలను మాత్రమే తమ బాధ్యతగా భావించడం మహిళల దుస్థితికి మరో కారణం జనాభాలో సగభాగం వున్న మహిళల మీద జరుగుతున్న హింసని నివారించాల్సిన, అడ్డుకట్ట వేయాల్సిన అంశంగా పోలీసులు భావించడం వల్ల ప్రభుత్వాలు చేసిన సర్వ చట్టాలు బూడిదలో పోసిన పన్నీరుగా పనికికరాకుండా పోతున్నాయి.
సతీ సహగమనం దురాచారాన్ని వ్యతిరేకిస్తూ నాటి బ్రిటిష్ పాలకులు చట్టం వేశారు. సతీ సహగమనం వద్దని ఈ రోజు ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. సంఘ సంస్కార స్థాయి ఆ మేరకు పెరిగింది. వరకట్న నిషేధ చట్టం వున్నప్పటికీ కూడా కట్నం సమస్య అలానే ఉంది.
స్ర్తి సంక్షేమ చట్టాలు చేయటంతోపాటు, అమలుకోసం గట్టి చర్యలు, ప్రణాళిక అవసరం. మహిళ పురుషుడితో సమానమని, ఎందులోనూ తక్కువ కాదని చిన్నతనం నుంచే ప్రతి మగవానికి తల్లిదండ్రులు చెబుతూ ఉత్తమ సంస్కారాన్ని అందించటం అవసరం. ‘ఆడపిల్లగా పుట్టినందుకే నాకు ఇన్ని కష్టాలు’ అని ఏ ఆడపిల్ల అనుకోకుండా సమాజంలోని సంస్కార స్థాయి పెరిగేందుకు, పితృస్వామ్య భావజాలాన్ని వ్యతిరేకించేందుకు అందరమూ కృషి చేయాలి. మహిళా సాధికారితతోనే సమాజ పురోగతి సాధ్యం అని గుర్తించాలి. అప్పుడే మహాకవి గురజాడ చెప్పినట్లు ‘‘ఆధునిక మహిళ చరిత్రను తిరగ రాయగలదు.’

..................................
మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

-పోతుల సునీత ఎంఎల్‌సి, కార్యదర్శి తెలుగుదేశం