సంపాదకీయం

ఆగని ‘బీటీ’ ఆగడం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వాలు అనుమతించని ‘బోల్‌గార్డ్- మూడు’ రకం ‘బీటీ’ పత్తి విత్తనాలను తెలంగాణ అంతటా అక్రమంగా విక్రయిస్తుండడం ‘స్వేచ్ఛా విపణి వ్యవస్థ’- మార్కెట్ ఎకానమీ- మాయాజాలం. ఇలా అక్రమంగా విక్రయిస్తున్న వ్యాపారులపై మంచిర్యాల పోలీసులు అభియోగాలను నమోదు చేయడంతో ఈ విత్తనాల దొంగ వ్యాపారం గురించి మళ్లీ ప్రచారం జరుగుతోంది. ఈ ‘బీటీ’ రకం పత్తి విత్తనాలను రైతులు ఉపయోగించడానికి కేంద్ర ప్రభుత్వం ‘జన్యు సాంకేతిక సమీక్షా సంఘం’- జెనటిక్ ఇంజనీరింగ్ అప్రయిజల్ కమిటీ- జియాక్- వారు ఇంతవరకు అనుమతించలేదు! అయినప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాలలోను ఈ పత్తి విత్తనాలను దళారీలు బహిరంగంగానే విక్రయించడం, విక్రయించగలగడం ప్రభుత్వం యంత్రాంగాల ‘పెనునిద్దుర’కు మరో ప్రబల ప్రమాణం. ఇలాంటి విక్రయాలు విత్తనాల చట్టానికి విరుద్ధంగా మాత్రమే కాదు, మానవ ఆరోగ్యానికి, జీవజాలం మనుగడకూ భంగకరం కూడ. అయినా మూడేళ్లకుపైగా ఈ విత్తనాల విస్తరణ చాపకింద విషంలా కొనసాగుతోందని ఇప్పుడు బయట పడింది. 2013లోనే శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో ‘బోల్‌గార్డ్-మూడు’ రకం ‘బీటీ’ విత్తనాల విక్రయం జరిగినట్టు ప్రచారమైంది. ఆ తరువాత ప్రభుత్వాలు ఈ సంగతిని మరచిపోవడం ‘మార్కెట్ ఎకానమీ’ మాయాజాలంలో భాగం! ‘ప్రపంచీకరణ’- గ్లోబలైజేషన్- వ్యవస్థీకరించిన ఈ ‘మార్కెట్ ఎకానమీ’- స్వేచ్ఛావిపణి-ని బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు- మల్టీ నేషనల్ కంపెనీస్- నిర్వహిస్తుండటం, నియంత్రిస్తుండడం, ప్రభుత్వాలు ఈ సంస్థల దుశ్చర్యలను నిరోధించలేకపోవడం ‘వాణిజ్య మారీచ మాయాజాలం’లో భాగం. ఈ ‘మాయలేడి’ వాణిజ్య విన్యాసాలు ప్రభుత్వాలకే అంతుపట్టడం లేదు, సామాన్య ప్రజలకు ఎలా అర్థమవుతాయి? సంపన్న దేశాల ప్రభుత్వాలు ఈ ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ను మనదేశంలోకి, ఇతర ప్రవర్థమాన దేశాలలోకి ఉసికొల్పుతుండడం రెండు దశాబ్దుల ఆర్థిక బీభత్సకాండలో భాగం! మనదేశంలోని ప్రభుత్వ నిర్వాహకులు, రాజకీయ వేత్తలు, అధికారులు ఈ వాణిజ్య బీభత్సకారులతోను, దళారీలతోను జట్టుకట్టి ఉండడం ‘మార్కెట్ ఎకానమీ’ వల్ల సంభవించిన మహా పరిణామం. అందువల్లనే ‘మల్టీనేషనల్ కంపెనీలు’ సాగిస్తున్న అనేకానేక వాణిజ్య దురాగతాలు ఏళ్ల తరబడి బయటపడడం లేదు. ఈ ఘోరాలు బయట పడిన సందర్భాలలో సైతం ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ వారు శిక్షలను తప్పించుకొని యథేచ్ఛగా యథాపూర్వంగా తమ ‘ప్రక్రియ’ను కొనసాగిస్తున్నారు. రసాయన విషాలతో సంకరమైన సేమ్యాలను, చాక్లెట్లను, ఐస్‌క్రీములను, శీతల పానీయాలను మన జనానికి అమ్ముతూనే ఉన్నారు. అక్రమ విదేశీయ వ్యాపారులు తమ వస్తువులను అమ్ముకునే మహా విక్రయ ప్రాంగణంగా మనదేశం రూపొందడం ‘మార్కెట్ ఎకానమీ’ మాయ. ఈ ‘బోల్‌గార్డ్’ మూడు రకం పత్తి విత్తనాలను దళారీలు రైతులకు పంపిణీ చేస్తుండడం సరికొత్త నిదర్శనం!
‘బీటీ’ పత్తి విత్తనాలు తయారు కావడం ‘జీవజన్యు పరివర్తన’- జెనటిక్ మోడిఫికేషన్- జిఎమ్- సాంకేతిక ప్రక్రియ- జెనటిక్ ఇంజనీరింగ్‌లో భాగం! ఒక మొక్కను అదే రకానికి చెందిన మొక్కలకు అంటుకట్టడం ద్వారా ‘సంకర జాతి’- హైబ్రిడ్- మొక్కలను రూపొందించడం దశాబ్దులుగా కొనసాగుతున్న ప్రక్రియ. ఒక జీవ జన్యుకణాన్ని మరో జీవ జన్యుకణంతో అంటుకట్టడం ఈ కొత్త ‘జెనటిక్ మాడిఫికేషన్’ ప్రక్రియ. అంటే మొక్కలలో మాత్రమే కాదు జంతువుల జన్యుకణాలతో సైతం సంకరం చేయడం ఈ కొత్త ప్రక్రియ! గతంలో జంతుకణాలను మరో జంతుకణాలతో ‘మార్పిడి’ చేయడం ద్వారా సంకరజాతి ఆవులను ఇతర జంతువులను సృష్టించారు. కానీ జంతుకణాలతోను, ఇతర జాతుల మొక్కల జన్యుకణాలతోను మరోజాతి మొక్కను, విత్తనాలను సంకరం చేయవచ్చునన్నది ‘జెనటిక్ ఇంజనీరింగ్’. ఈ ప్రక్రియ ప్రపంచ వ్యాప్తంగా ఇంకా ప్రయోగదశలోనే ఉంది. ఈ ప్రక్రియ ద్వారా తయారవుతున్న విత్తనాలలో, వంగడాలలో ‘బాసిలస్ తురింజెనిసిస్’- బీటీ- అనే జీవ రసాయనం నిహితవౌతుందట! మొక్క పెరిగిన కొద్దీ ఈ ‘బీటీ’ రసాయన పరిమాణం విస్తరిస్తుంది. ఈ రసాయనం ప్రభావం వల్ల పంటల దిగుబడి రెట్టింపు అవుతుందని, మూడు రెట్లు పెరుగుతుందని ప్రచారం జరిగింది..
ఈ ప్రచార ప్రలోభంతో మన దేశంలోని వివిధ రాష్ట్రాల రైతులు ‘బీటీ’ పత్తిని పండిస్తున్నారు. తెలంగాణలో ఈ ఏడాది దాదాపు ఇరవై లక్షల ఎకరాలలో పత్తిని పండించగా అత్యధిక శాతం రైతులు ‘బీటీ’ పత్తి విత్తనాలనే ఉపయోగించారు. ఈ విత్తనాలను అనేక దేశాలలో నిషేధించారు. అయినప్పటికీ మనదేశం ఈ పత్తిపంటలో అగ్రగామిగా ఉందన్నది జరుగుతున్న ప్రచారం! ఈ ‘బీటీ’ రసాయన వ్యాప్తివల్ల భూమి క్రమంగా నిర్జీవమైపోయి కొనే్నళ్ల తరువాత ‘బీటీ’ పత్తిని తప్ప ఇతర పంటలను పండించడానికి పనికిరాకుండా పోతుందట! రాయలసీమ, విదర్భ ప్రాంతాల రైతులు ఈ వాస్తవాన్ని ధ్రువపరిచారు. మరి కొనే్నళ్ల తరువాత ఈ ‘బీటీ’ పత్తి వ్యవసాయ క్షేత్రం సాగుకి పనికి రాకుండా పోయిందని కూడా ప్రచారం జరుగుతోంది. ‘బీటీ’ రసాయనం వ్యాప్తివల్ల పరిసరాలు ‘గాయపడి’ ప్రాకృతిక సమతుల్యం దెబ్బతింటుందట! రసాయన ప్రభావ స్పర్శతో మానవులకు, జంతువులకు చిత్ర విచిత్ర మానసిక, శారీరక రుగ్మతలు సంభవించే ప్రమాదం కూడా ఉందన్నది ప్రచారం. వరంగల్లు జిల్లాలో పదునాలుగేళ్ల క్రితం ‘బీటీ’ పత్తి ఆకులను మేసిన వందల గొర్రెలు ప్రాణాలు కోల్పోయిన ఘటన సంచలనం సృష్టించింది. ఉమ్మెత్త మొక్కలు మాత్రమే పెరిగే పనికిరాని భూములలో సైతం కంది, గోధుమ, వరి, మామిడి పంటలను పండించడానికి ‘జిఎమ్’ ప్రక్రియ దోహదం చేస్తుందన్న ప్రచారం కూడ జరిగింది. ‘బీటీ’ పంటలకు తెగుళ్లు సోకవన్నది జరిగిన మరో ఘోరమైన ప్రచారం. క్రిములు, కీటకాలు సోకని రీతిలో ‘బీటీ’ పత్తి విత్తనాలను రూపొందించారట మరి. కానీ నాలుగేళ్లు గడవక ముందే గులాబీ రంగులోని ‘అందమైన’ పురుగులు, తెల్లటి ఈగలు, చిత్రవిచిత్ర ఆకారాల రెక్కల కీటకాలు పుట్టుకొచ్చి పత్తికాయలను నమిలి మింగేశాయి.
పంజాబ్‌లో 2015లో పదమూడు లక్షల ఎకరాలలో ‘బీటీ పత్తి’ని విత్తగా తొమ్మిది లక్షల ఎకరాలలోని పంటను తెల్లపురుగులు కబళించాయి. ఒకే వారంలో పదిహేను మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మొదటి రెండు రకాల బీటీ విత్తనాల కంటె ఈ ‘బోల్‌గార్డ్-మూడు’ రకం పత్తి విత్తనాలు మరింత మెరుగైనవట. వీటిని వాడడం వల్ల పత్తిపంటలో కలుపు మొక్కలు, గడ్డి కూడా పెరగదట. అందువల్ల ‘కలుపు తీయడం’ వల్ల జరిగే ఖర్చును తగ్గించుకోవచ్చునన్నది అమాయక కర్షకుల భ్రాంతి! ‘జియాక్’ ఇంతవరకు ఈ విత్తనాలకు అనుమతినివ్వలేదు. అయినప్పటికీ ప్రయోగ క్షేత్రాల నుంచి ఈ ‘మూడు రకం’ విత్తనాలను దొంగరవాణా చేస్తున్నారట! మొత్తం ‘బీటీ’ విత్తనాలను నిషేధించే వరకు ఈ వాణిజ్య బీభత్సం ఆగదు..