మెయిన్ ఫీచర్

తిక్కన్నల తైతక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎర్రన్నల కబంధహస్తాల్లో సాహిత్య అకాడమీ (30-4-18) వ్యాసం చూడగానే నవ్వొచ్చింది. ఎవరో పాపం అవగాహన లేక రాశారని అనుకున్నా. మళ్లీ అదే వ్యక్తి తెలుగునాట సిద్ధాంత రాజకీయం (7.5.18) అనే వ్యాసం రాశాడు. వ్యాసం చూడగానే ఆలోచించాల్సిన విషయంగా తోచింది. ఇది అజ్ఞానంతో రాస్తున్న వ్యాసాలు కావు. అక్కసుతో రాస్తున్న వ్యాసాలు అన్పించింది. కాలం చెల్లి, అరిగిపోయిన ముసలి భావాలే కన్పించాయ. ఇలాంటి తాటాకు చప్పుళళు తెలుగు సాహిత్యంలో మామూలే. కానీ, ఇలాంటి వ్యాసాలు చూసి నాలాంటి యువత అస్పష్టత, గందరగోళానికి గురవ్వాల్సిన అవసరం లేదని, అలాంటి ప్రమాదమేమీ దేశానికి లేదని స్పందిస్తున్నాను.
ఈ వ్యాసాల్లో ప్రధానంగా మూడు అంశాలు చోటుచేసుకున్నాయ్. ఒకటి - ఏం తినకూడదు, ఏం తాగకూడదు, తాగితే ఏం చేయకూడదు అన్నది. రెండు- కమ్యూనిస్టులపై అకారణ భయం. మూడు- రాచపాళెం చంద్రశేఖరరెడ్డి. మిగతావి చిల్లర విషయాలు. విషయానికి సంబంధం లేని పాణిని, మహేశ్వర సూత్రాలూ అంటూ ఏవేవో చెప్పాడు. పాణిని గొప్పతనం ప్రపంచమే గుర్తించింది. మహేశ్వర సూత్రాలు కేవలం సంస్కృతానికి పరిమితమైన ఆధ్యాత్మిక భావాలతో నిండింది. ఈ సూత్రాలు అన్ని భాషలకూ సరిపోతాయని భాషలమీద కనీస అవగాహన కూడా లేకుండా మాట్లాడే అజ్ఞానపు మాటలతో మొదలౌతుంది మొదటి వ్యాసం. పాణిని గొప్పదనం గురించి చెప్పడానికి చాలా విషయాలున్నాయ. అలాంటిది పాణినికి సంబంధం లేని విషయాలతో ముడిపెడితే పాణినికి ద్రోహం చేసినట్లే. పాణినిని అభాసుపాలు చేయాల్సిన అవసరంలేదు. ఇంకా వ్యాసకర్తకు తెలీని కులాలు, ప్రధాన పండుగలంటూ ఏవేవో చెప్పుకుపోతాడు. దీనికి తోడు ఏవి ప్రధాన పండుగలో, కావో అందరిపైనా రుద్దే విఫలప్రయత్నం మరోటి.
గత కొంతకాలంగా దేశంలోని జనాలు ఏం తినాలి? ఏం తినకూడదు? అని జాబితాఇచ్చే సంప్రదాయం మొదలైంది. అలాంటిదే ఏం తాగకూడదు అనేది. ఇక్కడ తాగడమంటే మద్యపానం సేవించడం అని అర్థం. తాగుడు మనకు కొత్తేం కాదు. ముందు నుంచీ మన దేశం తాగుడు దేశం. మనది తాగుడు సంస్కృతి. మనం తాగుడు సంతానం. దీనికి వేదాలు మొదలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, కావ్యాల్లాంటి ఆధారాలు కొల్లలుగా దేశంలో లభిస్తున్నాయ. తాగడం ఆరోగ్యానికి హానికరం అనే నైతికతతో చెబితే పర్లేదు. ఇది అలాంటిది కాదు. తాగితే రాయకూడదట. ఇదెక్కడి విడ్డూరం. తాగనీ, తాగకపోనీ పనికొచ్చే రచనలు చేస్తున్నారా? లేదా? అనేదే మనకు కావాల్సింది. తాగి ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఏం చేసుకోవడానికైనా రాజ్యాంగం అనుమతిచ్చింది.
మొదటి వ్యాసంలో ద్వారక హోటల్ అంటూ విషయాన్ని నేరుగా చెప్పకుండా రెండో వ్యాసానికి కొంత సమాచారం దాచిపెట్టుకున్నాడు పాపం. వాళ్ళక్కడ తిని తాగి రాస్తే దేశానికొచ్చిన నష్టమేమీ లేదు. అందులో దేశానికి పనికొచ్చేదేమైనా ఉందా? లేదా? అదీ కావాల్సింది. ఇవాళ కేవలం రాయడంతోనే కాక, వాళ్లు జీవితంలో అది ఏ మేరకు పాటిస్తున్నారు అనేది ప్రధానమైపోయింది. ఈ విషయాల్లో ఈ ద్వారక బ్యాచ్ మిగతా వారితో పోల్చుకుంటే నయమే. ఈ ద్వారకా బ్యాచ్ వాళ్ళ అలవాట్లను దాచుకుని ఊరేగలేదు. వాళ్లు తిని, తాగే ఆహారంపై కాకుండా, వాళ్ళ వ్యక్తిత్వంలో లోపాలేవైనా ఉంటే, అవి చెప్తే బాగుంటుందిగానీ, వాళ్లు ముక్కలు తింటేనేం? ఏకంగా కోళ్ళనే తింటేనేం? మాంసాహారం దేశద్రోహంగా కన్పిస్తోందా?
ఎవరు అవునన్నా కాదన్నా తెలుగు సాహిత్య రంగంలోకి కమ్యూనిస్టులు వచ్చిన తర్వాతే స్నేహపూర్వక వాతావరణం పెరిగింది. ఈ కమ్యూనిస్టులు ఎక్కడినుంచో ఊడిపడలేదు. ప్రగతిశీలాన్ని, అభివృద్ధినీ, కాలాన్నీ అర్థం చేసుకున్న హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు వగైరా వగైరా. అంతకుమించి వాళ్లంతా భారతీయులు. ఇక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు పొందినవాళ్ళు, అకాడమీ సభ్యులలో కమ్యూనిస్టులు ఏ మేరకు ఉన్నారు అని పాత లెక్కలన్నీ తిరగేస్తే, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలని వెంటనే తెలిసిపోతుంది. చరిత్ర సమాచారం లేని విషయాల్లో తప్పులు చెబితే వెంటనే తగిన ఆధారాలతో ఎత్తిచూపలేం. కానీ, ఇది కళ్ళముందున్న చరిత్ర, సమాచారం అందుబాటులోనే ఉంది. దీన్ని కూడా వక్రీకరిస్తే ఏమనుకోవాలి?
ఇన్ని దశాబ్దాలుగా కమ్యూనిస్టులు ఎక్కువగా అకాడమీ సభ్యులుగా లేరేమని ఏ కమ్యూనిస్టూ ప్రశ్నించలేదు. మొదటిసారిగా తెలుగులో ఈసారి కమ్యూనిస్టులు ఎక్కువగానే ఉన్నారు. అందువల్ల దేశంలో ఏ విధ్వంసమూ జరిగిపోలేదు. జరిగిపోదు కూడా. ఆ వ్యాసకర్తకు స్ర్తీలు, అణగారిన వర్గాలు చప్పున గుర్తుకొచ్చారు. ఆలాంటివాళళు ఎవరూ బెంగపెట్టుకోనవసరం లేదు. ఆ వర్గాలవాళ్ళతో అంతోఇంతో కలిసేది కమ్యూనిస్టులే. వాళ్ళగురించి మొదట్నుంచీ మాట్లాడుతున్నదీ, చేస్తున్నదీ వీళ్ళే. ఇప్పుడు ఊరకే ‘ముసలి’ (మొసలి కాదు) కన్నీరు అవసరం లేదు.
ఇక ఈమధ్య చాలా విషయాల్లో, చాలాచోట్ల కమ్యూనిస్టులకు అవార్డులు ఎందుకు వస్తున్నాయో అని తలపట్టుకుంటున్నారు చాలామంది. ఇది ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మంచి పరిణామం. ఒకానొకప్పుడు మతం ఆధారంగా రాసిన రచనలకు అవార్డులు వాస్తవమే. ఆస్కార్, పులిట్జర్ బహుమతి వంటివన్నీ అలాంటివాటికే వచ్చాయ. ఇప్పుడు పంథా మారింది. ఏవో ఊహాపోహలతో తెలిసీ తెలియని విషయాల గురించి రాసే రచనలకు అవార్డులు రావడం లేదు. వాటివల్ల ప్రపంచానికి ఏమీ ఒరగడం లేదని చాలామంది గ్రహించేశారు. ఇప్పుడు వాస్తవికత, మానవ జీవితంలో సంక్షోభం, ప్రపంచాన్ని అభివృద్ధి పంథాలో నడిపించే విషయాలతో రచనలు చేస్తున్నవాళ్లకి ఇలాంటి అవార్డులొస్తున్నాయ. ఇలా అవార్డులొస్తున్న వాళ్ళంతా కమ్యూనిస్టులే కాదు. కమ్యూనిస్టులు అవ్వాల్సిన అవసరమూ లేదు. కాస్త నిజాయితీ, ప్రపంచ జ్ఞానం ఉంటే చాలు. ప్రపంచం ఈ విషయాలు ఎంతో ముందుగా అర్థం చేసుకుంది. భారతీయులక్కూడా ఇప్పుడిప్పుడే ఇవన్నీ అర్థమవుతున్నాయ. అలాంటి పరిణామంలో భాగమే శివారెడ్డికి మధ్యప్రదేశ్ భాజపా ప్రభుత్వం ఇచ్చిన అవార్డు. ప్రపంచమంతా ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయ. అందరూ ఆనందించాల్సిన అంశాలే. ఇకపోతే, ఇప్పటి అకాడమీలోని తెలుగు సభ్యులు ఇకముందు కూడా అభివృద్ధికర, ప్రగతిశీల, ప్రజాస్వామ్య భావాలతో వచ్చిన రచనలకే అవార్డులు సిఫార్సు చేస్తారనడంలో సందేహమెందుకు? ముందుచూపున్న ఇలాంటివాళ్ళు సభ్యులైతే ఆనందించాల్సిందిపోయి, ఇలాంటి వెనుక చూపులెందుకూ? పైగా శివారెడ్డి, రాచపాళెంలాంటివాళ్లు పద్యకవిత్వం నుండి పుట్టుకొచ్చినవాళ్లే. వాళ్లకు సంప్రదాయమూ తెలుసు, కాలంతో మారుతున్న విలువలూ తెలుసు.
ఇంకా అతడికి తెలీని సెమినార్లు, సభలు అంటూ ఏవేవో చెప్పుకుపోయాడు. ఇప్పుడు సెమినార్లన్నీ ఇలాగే జరుగుతున్నాయ్. ఇదిప్పుడు కొత్తగా కమ్యూనిస్టులేం మొదలుపెట్టలేదు. పైగా కమ్యూనిస్టులకు ఎక్కడ సభ జరిగినా చేతిలో ఒక ఆకుపెట్టి, అందరికీ పెట్టే ఏ భోజనమైనా, నిల్చున్నది నిల్చున్నట్లే మొహమాటాలు, ఆర్భాటాలకు పోకుండా, భేషజాల్లేకుండా తినేసేవాళ్ళే. ఇప్పుడున్న తెలుగు సంఘంలోని ఆ మెజారిటీ సభ్యులు ఇలాంటివాళ్ళే.
కమ్యూనిజం జడపదార్థం కాదు. కాలానుగుణంగా సరైన మార్పుల్ని అది ఆహ్వానిస్తూనే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఆ మార్పులు అనేకం చోటుచేసుకున్నాయ్. భారతీయ కమ్యూనిస్టులు ఈ విషయంలో కాస్త వెనుకబడ్డారు. కానీ, ఈ అకాడమీ సభ్యుల్లో ఆలాంటి వెనుకబడ్డవాళళు లేరు. అందరూ ముసలోళ్ళైనా, మనసుకు ఇంకా ముసలితనం రాలేదు.
రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి మీద ఆ వ్యాసకర్తకు పాపం వెళ్ళగక్కలేనంత అక్కసు ఎందుకొచ్చిందో తెలీదు. ఈ కమిటీ ఎంపికలో కర్త, కర్మ, క్రియ రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి అంటాడు ఆ వ్యాసకర్త. అంతా తానే వెనుకనుండి జరిపిస్తే నేరుగా కన్వీనర్ అయ్యేవాడు. సభ్యుడిగా ఎందుకుంటాడు? ఈమాత్రం ఆలోచించే పసివాడిక్కూడా ఈ తర్కం అర్థవౌతుంది. ఏవో పసలేని ఆరోపణలు, కుట్రలు, ఓర్చుకోలేని ఈర్ష్య ద్వేషం, అహంకారం, అంధకారం, మూర్ఖత్వం తప్ప ఇలాంటి మాటలు ఎవరంటారు?
ప్రముఖ అభ్యుదయ, వామపక్ష, ఎక్సెట్రా ఎక్సెట్రా అని ఒకసారీ, వీర కమ్యూనిస్టు అని మరోసారీ అంటాడు. పనిలోపనిగా రాచపాళెం రాసిన గుజరాత్ గాయం అనే కవితను అరకొరగా ఉదహరించాడు. ఆ కవిత రాచపాళెం అలా రాయడానికి కారణం ‘వక్రదృష్టి, పక్షపాతబుద్ధి’ అట.
మనిషన్నవాడు ఎవడైనా గుజరాత్‌లో జరిగిన దారుణ మారణకాండను తలుచుకుంటే ఒళలు గగుర్పొడుస్తుంది. రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి సౌమ్యుడు కాబట్టి, పాపం బాధను వెళ్లగక్కుతూనే మనిషితత్వాన్ని, మానవత్వాన్ని, మానవవాదాన్ని నింపుకున్న కవిత రాశాడు. ఆ కవిత చదివితే మనిషనేవాడు ఎవడికైనా కళ్లల్లో నీళలు తిరుగుతాయ. గుండె బరువెక్కుతుంది. అక్కడ మతమే కావాలా? ఎవడు అలా చేసినా మనసున్న ప్రతివాడు స్పందిస్తాడు. ముక్కుపచ్చలారని అమ్మాయి శరీరాన్ని కూడా గుడిలో దేవుడి విగ్రహం ముందు కళ్ళు మూసుకుపోయి, కండకావరంతో, మతం ముసుగులో మారణహోమం సృష్టిస్తున్న దేశం మనది. సర్వేజనా సుఖినోభవంతు అనే మన దేశంలో మతం ఇంత భయంకరంగా తయారైందని కొత్తగా చెప్పాలా? తప్పు చేసింది మన మతం వాళ్ళై, మనమంతా నోరు మూసుకుని ఉండాలా? అసలు మనం మనుషులుగా బతకాలా? మతస్థులుగా బతకాలా? మనిషి గొప్పా? మతం గొప్పా? మనుషుల్ని మనుషులుగా ఉండనివ్వని మతం ఏదైతేనేం? మనం పూజించాలా? అనుసరించాలా? ఎవరో ఒకరిద్దరు మతం పేరుతో తప్పులుచేస్తే, ఆ తప్పును మతం ప్రేరేపిస్తే, అలాంటి బుద్ధినిచ్చిన మతానికి సంస్కరణ అవసరం లేదా? అసలు అలాంటి మతోన్మాదాన్ని ప్రశ్నించకూడదా? ఎంత దారుణం! ఎంత దారుణం! దేశం ఎటువైపు వెళ్తోంది?
మన మతాన్ని, మన దేశాన్ని పనికిమాలిన మతతత్త్వాల విష కౌగిళ్ళనుండి మనకు మనమే సంస్కరించాల్సిందే.
ఇంతకీ, రావూరి భరద్వాజకు మొహం కడుక్కోవడానికి సబ్బు కూడా ఇవ్వని ఆ కుటుంబం కమ్యూనిస్టులదో కాదో చెప్పనేలేదు. విదేశీ కవితల్ని అనువాదం చేసేస్తున్నారంటూ గగ్గోలు పెట్టిన వ్యక్తే, పేద కవుల్ని ఉదహరించాలనున్నప్పుడు ఏ జర్మన్ కవి దగ్గరికో పరిగెత్తడం నవ్వు తెప్పిస్తుంది. బీదరికంతో బాధలుపడ్డ మన మానవల్లి, శంకరంబాడి సుందరాచారి, శ్రీపాద వంటి తెలుగు పండితులెవరూ గుర్తుకు రాకపోవడం విడ్డూరమే.
తమకు నచ్చని, అభివృద్ధిని కాంక్షించని జాతి ఇవాళ కొత్తగా తెలుగుదేశంలో పుట్టుకురాలేదు. కొన్నివేల ఏళళుగా, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే వేదకాలంనుండీ నమ్మనివాళ్ళ తలలు తీసేయ్, కొట్టు, తరిమేయ్ అని హేతుబద్ధమైన చార్వాక ఆలోచనల్ని బలప్రయోగంతో మట్టిలో కలిపేయాలనుకునే దురాశాపరులకు దేశంలో కొదువలేదు. బూజుపట్టిన మసలి భావాలతో దేశానికి బాగా జబ్బు చేసింది. ఇలాంటి భావాలతో ఉన్నవాళ్ళపై, మానసిక రోగులపై చూపేంత జాలి చూపాలి. చికిత్సచెయ్యాలి. తప్పదు. ప్రగతిశీలురు దేశం బాగును, సౌభాగ్యాన్ని కోరుకోవాలి కదా!
ఇప్పుటి తెలుగు సాహిత్య అకాడమీ సభ్యులు ఎక్కువమంది ప్రగతిశీలురు, ప్రజాస్వామికవాదులు. ఇలాంటి కుళ్ళి కంపుకొట్టే భావాలకు అనవసర ప్రాధాన్యం ఇవ్వడం అనవసరం. జాతి అభివృద్ధికి, చైతన్యానికి పనికొచ్చే రచనలకే అవార్డులు ఇవ్వాలనీ, ఇలాంటి పనికిమాలిన ఒత్తిళ్లకు లోనుకాకుండా అవార్డులిస్తారనీ ఆశిస్తున్నాను.

- టి.సతీశ్, 9391614443