Others

కుల వ్యవస్థ నిర్మూలనే భీమన్న భావన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలా విషయాల్లో ఆయనది చెరపడానికి అసాధ్యమైన రికార్డు. బాల్యంలో పనె్నండేళ్ల వయస్సులోనే మృదుమధురమైన పద్యకవిత వ్రాశారు. శతాధిక గ్రంథాలను రచించి ప్రచురించారు. కాశీ, ఆంధ్ర, ఉస్మానియా విశ్వవిద్యాలయాల నుండి కళాప్రపూర్ణ గౌరవాన్ని, గౌరవ డాక్టరేట్ పట్టాలను అందుకొన్నారు. భారత ప్రభుత్వంనుండి పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను అందుకొన్నారు. 95 సంవత్సరాలు జీవించడం కాదు విశేషం, చివరి రోజుల వరకు కవిత్వం చెపుతూనే ఉన్నారు. గ్రంథాలు వెలువరిస్తూనే ఉన్నారు. ఆయన వ్రాసిన చివరి గ్రంథం శ్రీశ్రీ కమ్యూనిస్టు కాదు అన్న గ్రంథం ఆయన మరణానంతరం వెలువడింది.
సాహిత్యంలో ఆయన సిద్ధాంతం రసాద్వైతం. కాగా ఆయన రచనలన్నింటిలోనూ అంతర్లీనంగా ఉన్న విషయం భారత జాతిని ఏకజాతిగా రూపొందించడం. ఏకరస భావనతో ఈ జాతి జనులనందరినీ ఓతప్రోతం చేయటం. పంచములుగా, దళితులుగా, హరిజనులుగా పిలువబడుతున్న వారి అంతరంగాలలో స్వాభిమానాన్ని నింపి, సమకాలీన సమాజంతో గౌరవానికి అర్హులయ్యేటట్లుగా చేయటం. పాలేరు, కూలిరాజు వంటి నాటకాలలోనూ, ‘జన్మాంతరవైరం’, ‘అంబేడ్కర్ సుప్రభాతం’, ‘అంబేడ్కరిజం’, ‘పంచమ స్వరం’ మొదలైన కావ్యాలలోనూ ఈ తపన స్పష్టంగా గోచరిస్తుంది. 1911 సెప్టెంబర్ 19న తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో శ్రీయుతులు పుల్లయ్య, నాగమ్మ దంపతులకు జన్మించిన భీమన్న కాకినాడలో కళాశాల విద్య పూర్తిచేశారు.
1937నుండి ప్రముఖ హరిజన నాయకులు కుసుమ ధర్మన్నగారి పత్రిక ‘జయభేరి’లో సహాయ సంపాదకులుగా పనిచేశారు. 1953లో గుంటూరు జిల్లా చెరుకుమిల్లి గ్రామ ప్రజలు ఆయనకు గండపెండేరం తొడిగి సన్మానించారు. 1955నుండి రాష్ట్ర ప్రభుత్వంలో అనువాదకునిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి నామినేట్ అయ్యారు. కేంద్ర సాహిత్య అకాడమీ నుండి పురస్కారం అందుకున్నారు. జాషువా ఫౌండేషన్‌వారు ఇచ్చే జాషువా పురస్కారాన్ని అందుకున్న ఏకైక ఆంధ్రుడు భీమన్నగారే. మతమార్పిడి వంటి సమస్యలపై ఆయన చాలా దృఢంగా, బలంగా స్పందించారు. 1980లో వెలువడిన ‘జన్మాంతర వైరం’ గ్రంథంలో వారు చర్చించిన విషయాలు గమనించదగ్గవి. ‘నేను హిందువుగా పుట్టాను. మతం మార్చవలసిన అవసరం లేదు. పెనంలో నుండి పొయ్యిలోకి దూకటం దేనికి? ఈ హిందుమత మూలపురుషులు ఈ భారత సంస్కృతీ మూలరుషులు నావాళ్ళు. నా హరిజనులు అని నేను విశ్వసిస్తున్నప్పుడు, నా వారసత్వపు హక్కుల్ని ఏదోవిధంగా తిరిగి సంపాదిస్తానేగాని, పారిపోవడమనేది ఎందుకుంటుంది? మెజారిటీ జనం వాణ్ణి మైనారిటీగా ఎందుకు మారతాను? కాగా, నేను హిందువుని. ఈ జాతీ, ఈ దేశమూ నావి. పోనీ నేనొక్కణ్ణీ మరో మతంలోకి పారిపోతాననుకోండి. నాతో కొంతమందిని తీసుకుపోతాననుకోండి. ఎంతమందిని తీసుకుపోగలను? లక్షా, రెండులక్షలూ? వాళ్ళయినా, నామీద గౌరవంతో వస్తారు. అవతలి మతంలో విశ్వాసంతో కాదు గదా? గొంతెమ్మ, బతుకమ్మ, మైసమ్మ పండుగలకు, బోనాలకు, గ్రామదేవతలకు, పసుపు కుంకుమతో దైవత్వం కల్పించబడ్డ రాళ్లకూ, చెట్లకూ, గదులలోని గోడలకూ ఆత్మార్పణ చేసుకునే ఈ నా కులం పదిహేనుకోట్ల మంది మాదిగలను నాతో తీసుకుపోగలనా?
నా స్వార్థం కోసం, నా ప్రతిష్ఠ కోసం నేను పారిపోకూడదు.
ఈమధ్య హిందూ మతాధిపతులు కూడా ఇదే ధోరణిలో ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇది చాలా హర్షించదగిన హృదయపరివర్తన. ఆదిలో ప్రపంచ మానవులందరూ హిందువులేనని, రకరకాల కారణాలవల్ల ఇతర మతాలు ఏర్పడుతూ వచ్చాయని కంచి కామకోటి పీఠాధిపతి అన్నట్లు పత్రికలలో చదివాం. ‘అలా ఇతర మతాలలోకి పోయినవారు తిరిగివస్తే, వారికి హిందూమతం హృదయపూర్వకంగా స్వాగతం ఇస్తుంది’ అని కూడా వారన్నారు. ఇది మరీ హర్షదాయకం. అయితే ‘ఏ దుష్టహేతువులు ఆనాడు (ఈనాటికి కూడా) హిందువులను ఇతర మతాలలోకి తరిమివేశాయో (తరిమివేస్తున్నాయో) ఆ దుష్ట హేతువులు ఈనాడు తొలగిపోయాయా?’ అనేది నా మరో ప్రశ్న.
హిందూమత పునరుజ్జీవనం కోసం తన కులనిర్మూలనా గ్రంథం ద్వారా డా. అంబేడ్కర్ చక్కని సూచన చేశాడు. ‘ఒక సర్వహిందూ పరిషత్తు సమావేశమై మొత్తం హిందూమతానికి ఒక సిద్ధాంత సంహితను రూపొందించాలి’ అన్నాడాయన. తక్కిన మతాలకు ఉన్నట్లే హిందూమతానికి కూడా ఒక ఏకైక సంహిత ఉండాలి. పోనీ ఆర్షమతం ఒక స్వేచ్ఛాసంహిత అనుకొన్నప్పటికీ, దాని విశ్వజనీనత నిలబడాలంటే, విశ్వజనం దానిని విశ్వసించాలంటే కనీసం కులవ్యవస్థ అయినా నిర్మూలించబడాలి’ (1980లో వెలువడిన ‘జన్మాంతర వైరం’లో డా. బోయి భీమన్న)
‘జన్మాంతర వైరం’ కావ్యం ద్వారా ఎప్పటికీ నిలిచిపోయే సందేశాన్నిచ్చిన బోయ భీమన్న 2005 డిసెంబర్ 16న తన 95వ ఏట తనువు చాలించారు.

--కె. శ్యాంప్రసాద్, 9440901360