సాహితి

వెలుగు జాడ.. గురజాడ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మతములన్నియు మాసిపోవును
జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును
- అని భవిష్య దశా గీతిక పలికాడు గురజాడ. యుగకర్త, తెలుగు సాహిత్యానికి వెలుగుబాటలు పరిచిన గురజాడ అప్పారావు గారు మరణించి నవంబర్ 30కి నూరేళ్లవుతోంది. గురజాడ శతవర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడు ఆశించిన లక్ష్యాల దిశగా, ఆశయాల పథంలో వ్యవస్థ ఏ మేరకు ముందుకు వెళ్లింది అంటే ఇంకా సందేహాస్పదంగానే ఉంది. ఇవాళ దేశంలో అసహన వాతావరణం ఉంది అంటున్న తరుణంలో ఆయన సందేశాలు స్మృతిపథంలో మెదలడం సహజం. సాహిత్యకారులు, సైంటిస్టులు మొదలైన వారి అవార్డుల తిరస్కరణ ఒక ప్రధాన చర్చనీయాంశంగా ఉంది.
ఆకులందున అణగిమణగి / కవిత కోకిల పలుకవలెనోయ్ / పలుకులను విని దేశమందభి / మానములో మొలకెత్తవలెనోయ్ - అని గురజాడ పలికాడంటే దేశంపట్ల అభిమానాన్ని, భక్తినీ కలిగించేదిగా సృజనకారులు మెలగవలసిన ఆవశ్యతను నొక్కివక్కాణిస్తోంది అది. రాజకీయం ఏదైనా కానీ, అధికార పీఠాలు ఎవరివయినా కానీ పౌరులకు దేశభక్తి ఉండాలి. ఈ దేశంలో నివసించేవారంతా జాతీయాభిమానంతో వుండాలే కానీ ఎలుకలు వున్నాయని ఇంటిని తగలబెట్టుకోకూడదు కదా!
అడుగు జాడ గురజాడది / అది భావికి బాట / మనలో వెధవాయిత్వం / మరిపించే బాట - అని శ్రీశ్రీ ఊరికే అనలేదు. తెలుగు కవిత్వం, కథ, నాటకం, బాల సాహిత్యం, భాష ఇవాళ ఇంత జనజీవన మమేకంగా సామాన్యుల, అట్టడుగు వర్గాల స్థాయికి కూడ రాగలిగిందంటే అందుకు గురజాడ వేసిన ప్రాతిపదికలు అవిస్మరణీయాలు. పునర్మూల్యాంకనల పేర గురజాడకు కులం, మతం, ప్రాంతం అనే పాక్షికతలు అంటగట్టే చర్యలు జరిగాయి. బ్రతికి ఉండగానే విమర్శలు ఎదుర్కొన్న కవికి మరణించి బ్రతకడం మొదలెట్టాక అలాంటి వివాదాలు రావడం విడ్డూరమేమీ కాదు.
బ్రతికి చచ్చియు జనులకెవ్వడు / మేలు చేసెనో, వాడు ధన్యుడు - అని ఆయన అన్నట్టుగానే నిజానికి గురజాడ భావనల ఆవశ్యకత ఈనాడు మరీ ఉంది. ‘1915లో, నిజానికి, మరణించిన తరువాతనే గురజాడ బతకడం మొదలుపెట్టాడు’ అన్న కృష్ణశాస్ర్తీ మాట యధార్థం. ‘గురజాడను కవిగా గుర్తించని వాడిని నేను మనిషిగానే గుర్తించను’ అన్నాడు శ్రీశ్రీ. కన్యాశుల్కం నాటకంలో గిరీశం ఒక్కడే! కానీ ఈనాడు గిరీశం సంస్కృతి వ్యవస్థీకృతమైపోతోంది. కుహనా మేధావులు, పబ్బం గడుపుకునే రాజకీయవేత్తలు, స్ర్తి సముద్ధరణ వాదులూ పెరిగిపోయారు.
దేశమనియెడి దొడ్డవృక్షం / ప్రేమలను పూలెత్తవలెనోయ్ / నరుల చెమటను తడిసి మూలం / ధనం పంటలు పండవలెనోయ్ - అని శ్రమశక్తినీ, శ్రమశక్తి ఫలాలను మాత్రమే అనుభవించాలనే ఆదర్శాన్నీ ఆనాడే వెల్లడించాడు గురజాడ. అంతెందుకు గురజాడ దేశభక్తి గీతంలోని ప్రత్యంశమూ ఏ దేశానికయినా వర్తించే విశ్వజనీన అంశాలు. శ్రీశ్రీ మాటలో గురజాడను ఈనాడు ముఖ్యంగా గుర్తించాల్సిన ఆవశ్యకత ఉంది. ‘స్వచ్ఛమైన సత్యాన్ని చూపి చచ్చుపుచ్చు అబద్ధాలనే కవిత్వంగా చెలామణి చేసే వాళ్లకి గురజాడలోని మహత్తర మానవత్వం అర్థం కాదు. వాళ్లకి ఎదుటివాడు ఒక దేవతగానో, రాక్షసిగానో కనబడతాడే తప్ప తన లాంటి మనిషిగా కనిపించడు...’’
‘‘గాంధీ మహాత్ముడు డ్రాయింగ్ రూమ్ రాజకీయాలను ప్రజాయత్తం చేసినట్టే గురజాడ మహాకవి పండితులు తన గుత్తసొత్తుగా భావించే కవితా శక్తిని ప్రజలందరు పాడుకునే జీవితావసర వస్తువుగా రూపొందించాడు’’.
‘‘దేశభక్తి గీతం సమస్త ప్రపంచ మహాజనుల జాతీయ గీతం. రామాయణ భారతాది ఇతిహాసాలకున్న విలువ ఈ ఒక్క గీతానికి ఉందని అంటే కొందరు ఆశ్చర్యం పొందుతారేమో! కానీ ఆశ్చర్యకరమైన యథార్ధం ఇది. కాలం గడుస్తున్న కొద్దీ బలం సంతరించుకునే కొద్దిపాటి మహా కావ్యాలలో ఒకటిగా దీనిని గుర్తించక తప్పదు. ఒక తెలుగు కవి ప్రపంచానికి ఇచ్చిన కవిత్వపు కానుక ఇది. మానవుని ఆధ్యాత్మిక యాత్రలో భగవద్గీతకు ప్రత్యేక స్థానంలా గురజాడ కవి దేశభక్తి గీతానికి ఉంది. ఒక కాలానికీ, ఒక స్థలానికీ పరిమితం కాని సందేశం ఇచ్చేది ఈ గీతం’’ అని శ్రీశ్రీ ఢంకా బజాయించి చెప్పాడు.
మెచ్చనంటావీవు, నీవిక / మెచ్చకుంటే మించిపాయెనె / కొయ్యబొమ్మలు మెచ్చుకళ్లకు / కోమలుల సౌరెక్కున - అన్న గురజాడ భావన రంధ్రానే్వషక విమర్శలకు కనువిప్పు కాదగిందే! గురజాడకు శతవర్ధంతి నివాళులు.

- సుధామ, 9849297958