సాహితి

సామాజిక మాధ్యమంలో కవిత్వం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాంకేతికత అభివృద్ధి చెందని రోజుల్లో కవిత్వ పుస్తకాలని గ్రంథాలయాల్లో చదువుకునేవారు. ప్రతి గ్రామము, పట్టణం, మండలంలో విరివిగా గ్రంథాలయాలు ఉండేవి కాబట్టి వారంలో ఒక రోజు కవిత్వ పుస్తకాన్ని చదవడానికి కేటాయించేవారు. ఔత్సాహిక కవులు తమ కవితలను ఆయా పత్రికలకు తమ చిరునామాతో రాసి పంపేవారు. అవి వచ్చేదాకా రోజుల తరబడి ఎదురుచూసేవారు. ఇదంతా 80, 90 దశకాల్లో జరిగిన ప్రక్రియ, అయితే 90వ దశకంలో వచ్చిన ప్రపంచీకరణ పుణ్యాన సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఇంటర్నెట్ (అంతర్జాలం)ని అంది పుచ్చుకున్నారు. మొదట వ్యక్తిగతంగా బ్లాగులతో సాహిత్య ప్రస్థానం మొదలయింది. ఆ క్రమంలోనే కవిత్వానికి ప్రత్యేకంగా బ్లాగులు రావడం అవి త్వరత్వరగా ప్రజాదరణ పొందాయ. కవిత్వాన్ని అన్ని ప్రాంతాల భాషల్లో చేరువ కావడానికి అంతర్జాలంలో ప్రాంతీయ భాషలో బ్లాగుని ఏర్పాటుచెయ్యటం మూలాన కవిత్వంకోసం విరివిగా బ్లాగులను తయారుచేసుకోవడం మొదలుపెట్టారు. చాలా సులభతరంగా బ్లాగుని తయారుచేసుకొని తమ స్వీయ కవితల్ని అందులో పెట్టి నలుగురితో పంచుకోవడంవలన మరింత మందికి చేరువ అవ్వటం మూలాన సామాజిక మాధ్యమంలో కవిత్వ పయనం ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగుతుంది. బ్లాగులతోనే ప్రసిద్ధులు అయిన వ్యక్తులను కూడా మనం చూడొచ్చు. ఇక బ్లాగుల నుంచి మరింత ముందుకు వస్తే ఫేస్‌బుక్ (ముఖ పుస్తకం) కొత్తగా కవిత్వంలోకి అడుగుపెట్టే వారికి వరం అనే చెప్పవచ్చు. ముఖ్యంగా ముఖ పుస్తకంలో వందలాది కవిత్వపు సమూహాలు ఉన్నా ఈమధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పేరు ‘‘కవి సంగమం’’ అని చెప్పవచ్చు. 2012లో కవి యాకూబ్ ఈ సమూహాన్ని ప్రారంభించారు.
ముఖ పుస్తకంలో ఓ వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రతినెల రెండవ శనివారం కవి సంగమం గ్రూప్‌లో కొత్తగా రాస్తున్న ముగ్గురు కవులను, మరో ఇద్దరు సీనియర్ కవులను ఓచోట చేర్చి కవిత్వం తీరుతెన్నులు, కొత్తగా రాస్తున్న క్రమాన్ని సరిచెయ్యడం, లోపాలను సవరించడం, ఆ రకంగా కవిత్వ ప్రేమికులని ఒక్కటి చెయ్యడం మొదలైంది. మొదటి సిరీస్ లామకాన్‌తో మొదలుపెట్టి గోల్డెన్ త్రెష్హోల్డ్‌లో ఇప్పటివరకు 25 సిరీస్‌లు రావడం అంటే మాటలు కాదు.. దాని వెనుక గొప్ప కృషి ఉంది.. ఆ ప్రక్రియ ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నది. ‘‘నువ్వు ఒక చెట్టు అయితే, పిట్టలు వాటంతట అవే వాలును’’ అన్న నినాదంతో కవులను, కవిత్వాన్ని ప్రేమించే వారిని ఒక్కచోట చేరుస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పటివరకు ఎంతోమంది పరిణితి చెంది కవిత్వ సంపుటాలను వెలువరించారు. అయితే ఇందులో ఉన్నది అంతా మంచి కవిత్వమే నా అన్న ప్రశ్న వచ్చినప్పుడు 100 శాతంలో 70 శాతం వరకు అవును అనే చెప్పవచ్చు.. చాలావరకు ఆ కవిత్వాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినా అనుభవజ్ఞుల సలహాలతో అధిగమిస్తున్నారు. ప్రాంతీయ భేదభావం లేకుండా రెండు రాష్ట్రాలలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి గ్రూప్‌లకు గుర్తింపురావడం ముదావహం.
గ్రూప్‌ల తరువాత ప్రముఖంగా పేర్కొనాల్సినవి అంతర్జాల పత్రికలు. ఇవి కూడా కవిత్వానికి చాలా మేలుచేస్తున్నాయి అని చెప్పవచ్చు. అందులో పేర్కొనదగినవి సారంగ, వాకిలి, మాలిక, జాబిలి లాంటివి. ఇందులో కొన్ని వారపత్రికలు కాగా, మరికొన్ని మాస పత్రికలు. ముఖ పుస్తకంతో పోల్చిచూస్తే ఇవి కూడా ఏమాత్రం తీసిపోవు అనిపిస్తుంది. క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీపడకుండా చిక్కని కవిత్వాన్ని వెలువరిస్తున్నాయి. అభివ్యక్తి, శైలి, రూపం, సారం విషయములో శ్రద్ధ తీసుకొని మంచివి అనుకున్న వాటినే ఫిల్టర్ చేసి వెయ్యడం చూడవచ్చు. కవి సంగమంలో వ్యక్తిగత స్వేచ్ఛ వుండటం వలన తమ స్వీయ రచనని కొద్ది గంటల్లోనే పేస్‌బుక్‌లో ప్రచురితం అవ్వటం, దానికి స్పందనలలో తమ అభిప్రాయాన్ని తెలియచెయ్యడం జరుగుతోంది. అదే అంతర్జాల పత్రికలో కొద్దిరోజుల వరకు వేచి చూడాలి. అయినా కూడా కవులు వెరవక వాటికోసం ఎదురుచూస్తూనే ఉంటారు. వీటిలో వచ్చిన కవిత్వాన్ని సాహితీ విమర్శకులు, విశే్లషకులు చూసి వాటిలోని లోపాలని సవరించడం మెరుగైన కవిత్వానికి సూచనలు సలహాలు ఇవ్వడం కొత్త తరానికి కవిత్వాన్ని వంటబట్టించడంలో సఫలం అయ్యారు అనే చెప్పవచ్చు. అంతేకాకుండా కొత్తగా కలం పట్టినవారిని ప్రోత్సహించే దిశగా ‘‘ఈనాటి కవిత’’ అనే శీర్షికలో ఒక కవితను విశే్లషించడం, ఆ తరువాత చిక్కని కవిత్వాన్ని నేర్చుకునే దిశగా అడుగులు వెయ్యటం జరుగుతోంది. ఇదంతా కూడా కవిత్వాన్ని నేర్చుకునే పరిధిని విస్తరింప చెయ్యడంకోసం మాత్రమే. వారంలో ఒక్కోరోజుకి ఒక శీర్షిక చొప్పున ఏడు రోజులు వివిధ శీర్షికలను ప్రవేశపెట్టి పాఠకులకు అవగాహన కల్పించడం మరో మంచి విషయంగా పేర్కొనవచ్చు.
కవి తాను పొందిన అనుభూతిని రససిద్ధిని పాఠకుల్లో కలుగచెయ్యడానికి ఇలాంటి కవిత్వ అంశాలకు సంబంధించిన శీర్షికలు ఎంతగానో సహాయకారిగా ఉంటాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కొత్తగా రాస్తున్న యువ కవులు ఒక స్థాయికి వచ్చిన తరువాత సంపుటిని వెలువరించాలి అనుకోవడం దానికోసం పలు మార్గాలను అనే్వషించడం అన్నది ఈతరం వారికి కవిత్వం పట్ల ఉన్న ఆపేక్ష అని చెప్పవచ్చు. ఇక కవిత్వాన్ని ప్రచురించే ప్రచురణకర్తలు కూడా కవిత్వంకోసం నడుం కట్టడం ముదావహం. కినిగే, పాలపిట్ట, సాహితీ ప్రస్థానం లాంటివి కవిత్వాన్ని నేటి యువతరంలో ముందుకు తీసుకువెళ్తున్నాయి. కవిత్వాన్ని ఉత్పత్తిచేస్తున్న తెలియనితనాన్ని అనుభవంగలవాళ్ళు సరిచేస్తే ఈతరం కవులు మరింత సాధన చేసి ముందుకు వెళ్ళగలరు. పత్రికల మాధ్యమంలోనివి మాత్రమే నిజమైన కవిత్వం, విభిన్నం అన్నవారి వాదనని ఒప్పుకుంటున్న కూడా ఇప్పుడు వస్తున్న ముఖ పుస్తకపు కవిత్వాన్ని తీసి పారేయలేము. ప్రపంచమంతా కుగ్రామం అయినప్పుడు ఎల్లలు లేని భావాలను పంచుకోడానికి సామాజిక మాధ్యమం సహాయకారిగా ఉండటం సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ కొత్తదనాన్ని ఒడిసిపట్టుకొని నేటి తరం కవులు కవిత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తారు.

- పుష్యమీ సాగర్, 9032215609