సాహితి

చెరగని సిరా... షేక్స్‌పియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవి గాంచని చోట కవి గాంచునన్నది కవిత్వ విస్తృతికి, గాఢతకు,
కాలాతీతమైన సమకాలీనతకు దర్పణం. వర్తమానంలో భవితను చూసే
దూరదృష్టి కవికి ఉంటుంది. సమాజాన్ని భిన్న కోణాల్లో స్పృశించి దాని
స్వభావాలను భిన్న పాత్రలతో చిత్రీకరించగలిగే సృజన కూడా కవి సొంతమే. కవి కలానికి ఉండే ఆలోచనల బలం విశ్వజనీన పాత్రలకు జీవం పోస్తుంది. కాలమేదైనా, ప్రాంతమేదైనా... భాష ఏదైనా ఆ పాత్రలు అజరామరంగా,
సజీవంగా నిలుస్తాయి. నిత్య నూతనత్వంతో విరాజిల్లుతాయి. ఇలాంటి
పాత్రలెన్నింటినో పుంఖానుపుంఖాలుగా పుట్టించి దశాబ్దాలే కాదు,
శతాబ్దాలు దాటినా వనె్న తగ్గని కవితా రవి షేక్స్‌పియర్.

పంచవ్యాప్తంగా తన కవిత్వం, నాటకాలతో ఆంగ్ల భాషను పరిపుష్టం చేసిన మహాకవుల్లో షేక్స్‌పియర్‌దే అగ్రతాంబూలం. ఆయన రచనలన్నింటికీ విశ్వఖ్యాతి లభించింది. వందలాదిగా ప్రపంచ భాషలన్నింటిలోకి అనువాదమయ్యాయి. ట్రాజెడీలు, కామెడీలు ఇలా ఎన్నింటి ద్వారానో షేక్స్‌పియర్ ప్రపంచ ప్రజలకు చేరువయ్యారు. ఆయన నాటకాల్లోని విశిష్టత, ప్రత్యేకతలే వాటికి అనునిత్య సజీవత్వాన్ని అందిస్తున్నాయి. ఏ కవికీ దక్కని ఘనత ఆయనకు దక్కిందనడానికి నిదర్శనం ఇప్పటికీ భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో ఒకచోట షేక్స్‌పియర్ నాటకాల ప్రదర్శన జరుగుతూండటమే! ఓ కవి రచనలు ఎంత గొప్పవైనా వాటిలో కాలానుగుణంగా మార్పు జరగడం అన్నది సహజం. కానీ, షేక్స్‌పియర్ నాటకాలు ఇందుకు భిన్నం. వాటిలో ఎలాంటి మార్పును ప్రేక్షకులు ఒప్పుకునే పరిస్థితి లేదు. విక్టోరియా కాలం నాటి దుస్తులతో, నాటి సంక్లిష్ట ఆంగ్ల భాషోచ్ఛరణలతో వాటిని ఇప్పటికీ ప్రదర్శిస్తున్నారంటే కాలంపై ఆ కవి ఎంతగా బలమైన ముద్ర వేశారో స్పష్టమవుతుంది. గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నో నాటక కంపెనీలు దేశమంతటా షేక్స్‌పియర్ డ్రామాలను ప్రదర్శిస్తూనే వస్తున్నాయి. ఇప్పుడు ఆంగ్ల డ్రామాల గురించి ప్రస్తావన వచ్చినా అనివార్యంగానే షేక్స్‌పియర్ పేరు తప్ప మరొకరు పేరు గుర్తుకొచ్చే అవకాశమే లేదు. పదహారవ శతాబ్దపు ఇంగ్లాండ్‌లో జన్మించిన షేక్స్‌పియర్ అప్పటి పరిస్థితులను తన నాటకాల ద్వారా వ్యక్తీకరించడమే కాకుండా భవిష్యత్తులో సామాజిక ధోరణులను వాటి ద్వారానే ఆవిష్కరించారు. మనిషి తత్త్వం, ఆలోచన తీరు ఎలా ఉంటుందో పరిస్థితులను బట్టి ఏ రకమైన మార్పును సంతరించుకుంటుందో తన పాత్రల రూపకల్పన ద్వారా బలమైన పునాదులే వేశారు. ఆయా పాత్రల స్వభావాన్ని బట్టి పదజాలాన్ని ఉపయోగించడం, వాటి ధోరణులను ఆవిష్కరించడమన్నది షేక్స్‌పియర్‌తోనే మొదలైందని చెప్పాలి. కాలమేదైనా నాటక కర్తగా ఆయన సాధించిన విజయం, వేసిన ముద్ర నిరంతర స్ఫూర్తిదాయకమే. రోమియో జూలియట్, హామ్లెట్, మెక్‌బెత్ వంటివి ఆయన అద్భుత నాటక విన్యాసాల్లో కొన్ని మాత్రమే. ఈ మూడూ కాలాతీతంగా ప్రపంచ ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. ఆయన రాసినవన్నీ దాదాపు అమితమైన ప్రాచుర్యాన్ని పొందినవే. ఒక నాటక రచయితకు పేరు తెచ్చేవి ఒకటో రెండో ఉంటాయి. కానీ షేక్స్‌పియర్ ముద్ర ప్రతి నాటకంపైనా బలంగానే పడింది. అందుకు కారణం వాటిని రూపొందించడంలో ఆయన పడిన తపన, నాటి సామాజిక పరిస్థితులను, సమకాలీన తీరుతెన్నులను అవగతం చేసుకున్న విధానమే. ఇప్పటికీ ఆంగ్ల సాహిత్యమంటే అనివార్యంగా ఆయనదే అగ్ర తాంబూలమవుతుంది. షేక్స్‌పియర్ లేని ఆంగ్ల సాహిత్యాన్ని ఎప్పటికీ ఊహించలేం. ఎందుకంటే అనివార్యంగా ప్రతి విద్యార్థి ఈ సాహిత్యాన్ని అధ్యయనం చేయాల్సిందే. ఆ మహనీయుడి రచనా విన్యాసాల సొబగులను, లోతులను అవగతం చేసుకోవాల్సిందే. 400 సంవత్సరాలు దాటినా ఆయన నాటకాలు ఇప్పటికీ తిరుగులేని స్ఫూర్తిగా కొనసాగడానికి కారణం - వాటిల్లో వున్న ఎన్నో ప్రత్యేకతలు, పాత్రోచిత రూపకల్పన, భావ వ్యక్తీకరణ, సంక్లిష్ట మానవ నైజం - ఇవన్నీ కూడా ఆయా నాటకాల్లో సందర్భోచితంగా ప్రస్ఫుటం కావడమే. ఈ రకంగా మానవ జీవన వైవిధ్యాన్ని ఇన్ని కోణాల్లో ఆవిష్కరించిన రచయిత మరొకరు లేరనే చెప్పాలి. ప్రతి పాత్ర స్వభావాన్ని బట్టి ఆయన ఉపయోగించిన భాష, అందులో నిబిడీకృతమై వున్న సాహితీ లోతులు, అన్నింటికీ మించి ఒక నాటకాన్ని రక్తి కట్టించాలంటే ఎంతగా తపన పడాలో, అంతగా తపన పడిన ఆయన ఆలోచనా రీతి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఓ దుష్ట పాత్ర అయినా, సాత్విక పాత్ర అయినా అది నిరంతరం ఆయన నాటకాలను సజీవంగా నిలుపుతోందంటే వాటిని రూపొందించడంలో ఆయన సృజనకు ఇచ్చిన ప్రాధాన్యతే నిదర్శనం. ఏ నాటకంలో అయినా కొన్ని పాత్రలే నిలిచిపోతాయి. కానీ షేక్స్‌పియర్ నాటకంలో ప్రతి పాత్ర తమదైన ముద్ర వేస్తుంది. ఏ పాత్రను తీసేసినా మొత్తం నాటకమే లేదన్న అభిప్రాయం ప్రేక్షకులకు కలుగుతుంది. అంతగా ఆయన నాటకాల ద్వారా ప్రజలను అలరించారు.
ప్రాథమికంగా కవిగానే ఆయన వెలుగులోకి వచ్చినా అనంతరం నాటకాలతోనే విశ్వ కళారంగాన్ని అలరించారు. 1592 ప్రాంతంలో అప్పట్లో లండన్‌లోని అన్ని నాటక థియేటర్లను ఐదేళ్ల పాటు మూసివేయడంతో షేక్స్‌పియర్ సహా అనేకమంది కొత్త మార్గాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండేళ్ల తర్వాత అంటే 1594లో అన్ని థియేటర్లను తిరిగి తెరవడంతో నాటకాలను పెంచి పోషించే కంపెనీలు మళ్లీ బలోపేతమయ్యాయి. అప్పటికే నటుడిగా, రచయితగా పేరొందిన షేక్స్‌పియర్ తన దృష్టిని స్క్రిప్ట్‌లపై మళ్లించారు. తొలిసారిగా 1597లోనే షేక్స్‌పియర్ రాసిన రిచర్డ్-2 అనే నాటకంలో ఆయన పేరు ప్రచురితమైంది. అలాగే రోమియో-జూలియట్ సవరించిన నాటక ప్రతిలో కూడా ఆయన పేరు ప్రస్తావించారు. ఎప్పుడైతే లండన్ థియేటర్లను మూసివేశారో అనేకమంది నటులు లండన్ వదిలి ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. షేక్స్‌పియర్ స్క్రిప్ట్ రైటింగ్ వదిలేసి కళల వైపు దృష్టి సారించారు. అందుకు కారణం రంగస్థలానికి ఎలాంటి ఆదరణ లేకపోవడమే. ప్రతి దశలోనూ షేక్స్‌పియర్‌కు సాహిత్యం పట్ల, సమాజం పట్ల ఆయనకున్న అవగాహన ప్రస్ఫుటమవుతూనే వచ్చింది. మానవ భావోద్వేగాలను, అంతర్గత సంఘర్షణలకు ఆయన నాటకాలన్నీ దివిటీ పట్టాయి. అంతగా అజరామరమైన లక్షణాలు వాటికున్నాయి కాబట్టే మహానగరాలు, పట్టణాలే కాకుండా గ్రామాల్లో సైతం ఏదో ఒక రూపంలో ఆయన నాటకాలు ప్రదర్శితమవుతూనే వచ్చాయి. గత నాలుగు వందల సంవత్సరాలుగా వనె్న తగ్గని కవిగా ఆంగ్ల భాషను పరిపుష్టం చేసిన సృజన స్రష్టగా షేక్స్‌పియర్ తన కీర్తిని దిగ్దిగంతాలకు వ్యాపింపజేసుకున్నారు. షేక్స్‌పియర్ వ్యక్తిగత జీవితం అంతుబట్టనిదిగానే ఉన్నప్పటికీ అందుకు సంబంధించి అతి తక్కువ వివరాలే అందుబాటులోకి వచ్చాయి. ఆయన రాసిన నాటకాలు, కవితలు, సొనెట్లు ఇలా ప్రతిదీ కూడా ఎనలేని ప్రాచుర్యాన్ని సంతరించుకున్నాయి. అప్పటి సాంద్రాయక రీతిలోనే తొలి నాటకాలను రచించిన షేక్స్‌పియర్ వాటి ద్వారా ఎన్నో రకాలుగా కొత్త పదాలను ఆయా పాత్రల స్వభావాన్ని బట్టి సృష్టించారు. అవన్నీ కూడా మొత్తం నాటకం వౌలిక రూపంలో అంతర్భాగం కావడంతో ప్రతిదీ రక్తి కట్టింది. సమకాలీన ధోరణులకు భిన్నంగా ఆలోచించగలగడమే షేక్స్‌పియర్ అనంతంగా నిలిచే నిరంతర కవిగా మారడానికి దోహదం చేసింది. పడికట్టు పదాలతో కాకుండా ఓ భావ పరంపరను సృష్టించే విధంగా పదజాలమూ ఆయన పాత్రల ద్వారా రూపుదిద్దుకుంది. తొలి దశలో అంటే 1590 ప్రాంతంలో చారిత్రక అంశాలపైనే షేక్స్‌పియర్ నాటకాలు సాగాయి.
ఒక నాటక రచయితకు ఇంతగా అంతర్జాతీయ ఖ్యాతి లభించడం ఒక ఎత్తయితే, శతాబ్దాలు గడిచినా ఎన్నో రూపాంతరాలు చెందుతూ యావజ్జగతిని అలరించడమన్నది మరో ఎత్తు. ఎన్నో వేల ఆంగ్ల పదాలు షేక్స్‌పియర్ నాటకాల నుంచి పుట్టుకొచ్చాయి. ఆయన గురించి తెలియకపోయినా, ఆయనెవరో కనీస పరిజ్ఞానం లేకపోయినా శతాబ్దాల క్రితం ఆయన పదాలను నేడు మనం అనివార్యంగా వాడుకుంటున్నాం. ఎన్నో ఆంగ్ల పదాలకు పుట్టినిల్లుగా షేక్స్‌పియర్ నాటకాలను పేర్కొనవచ్చు. ఆంగ్ల భాష ఉన్నంతవరకూ, నాటకం ప్రేక్షకులను అలరిస్తున్నవరకూ షేక్స్‌పియర్ యశస్సు చిరస్థాయిగా నిలిచిపోతుంది. తనకు తానే అన్నట్టుగా ఆయన నిర్దేశించిన సాహితీ బాట ఎందరో సాహితీవేత్తలకు దిశా నిర్దేశన చేసింది. సృజనకు అనంతమైన కొలమానాన్ని అందించిన షేక్స్‌పియర్ సాహితీ జగత్తులో నిత్యం ప్రకాశించే విశ్వ కవి. ఈ నాలుగు వందల సంవత్సరాల కాలం వర్థిల్లిన ఆయన రచనలు కొత్త రచయితలకు, సృజనకు పట్టం కట్టేవరకు నిరంతర స్ఫూర్తి అవుతాయి. నాటకం మొదలు పెట్టడం దగ్గర్నుంచీ, చిత్రీకరణ వరకూ వాటిమధ్య ఉన్న స్వాభావికమైన స్వల్పస్థాయి తేడాలను భాషాపరమైన విన్యాసాల ద్వారా వ్యక్తీకరించే వరకు ప్రతి దానిపైనా షేక్స్‌పియర్ ముద్ర ఉంటుంది. అదే ఆంగ్ల సాహిత్యానికి అజరామరమైన కీర్తినందిస్తోంది.

- బి. రాజేశ్వర ప్రసాద్