సాహితి

పీఠికలూ... పాఠకులూ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రంథాంశ జ్ఞాన సాధికారత, విశే్లషణా సామర్థ్యం, రచనను, రచయిత
సత్తాకు తూకం వేయగల దక్షత ఉన్న వారిచే పీఠికలు రాయించుకుంటే ఆ గ్రంథానికి గ్రంథకర్తకు ప్రయోజనాధిక్యం వుంటుంది. అచ్చు పొత్తంలో ఏది వుంచుకోవాలన్నది ఎంచుకోవడంలో రచయిత లేక ప్రకాశకులదే హక్కు అయినా అతిగా వుంటే భరించవలసింది పాఠకులే అవుతారు. పీఠికలు
శిరోధార్యాలుగా ఉండాలేగాని
శిరోభారాలుగా ఉండటం
మంచిది కాదు.

సాహిత్యవేత్తలు, కవులు రాసిన పొత్తాలను తెరచీ తెరవగానే ముందుగా దర్శనమిచ్చేవి పీఠికలు! పీఠికలుగా వెలుగొందే అభిప్రాయాలు, ముందు మాటలు, రచయితలే రాసుకునే నా మాటలు వంటివీ కొన్ని ముందు పుటల్లో ఉంటూంటాయి. పీఠికలుగా విహంగ వీక్షణలు, సమీక్షలూ వుంటాయి.
వెనకటికి ఒక బక్కచిక్కిన కవి అసలు పుస్తకం ఆర్థికంగా వేసుకోగలనా లేనా అనే తటపటాయింపుల్లో కొన్నాళ్ళుండి, దృఢ నిర్ణయం తీసుకున్నాట్ట, తన యాభై పుటల గ్రంథం అచ్చొత్తించడానికి. ఒక గొప్ప సాహితీ విమర్శకుడు, అందరి నోట్లోనూ పేరున్న ఓ పెద్దాయనకు అయ్యా పీఠిక రాయండి అని వ్రాతప్రతి పంపాడట! ఆ పెద్దాయన నూటయాభై పుటల తర్జన భర్జనల చక్కని పీఠికను రచయితకు పంపాడట! రచయిత బక్కచిక్కినవాడు కదా! యాభై పుటల అసలు పుస్తకానికి నూట యాభై పుటల పీఠికను చూసి సుమారుగా మూర్ఛపోయి, తేరుకుని పీఠికాప్రదాతకు సవినయంగా ‘‘అయ్యా! నేను నా పుస్తకాన్ని ముద్రించడం అనే పనినుండి నిష్క్రమించాను. క్షమించండి మీ పీఠికను తిరిగి పంపుతున్నందుకు’’ అని రాశాడట.
రచయితల పరిస్థితులు మారాయి. కవులు, రచయితలు అందమైన ‘అట్టహాసాల’తో సుందర ముద్రణలతో పలువురి పెద్దల అభిప్రాయాలతో గ్రంథ పాఠక స్వాగత తోరణాలతో గ్రంథ ప్రకాశనాలు చేస్తున్నారు. పుస్తకం- రచయిత- అభిప్రాయ, రూపపీఠికలు కలసి ఒక ప్రణాళికతో చేరేది పాఠకుల్నే! గ్రంథస్థ అంశాల వివరణలు, సంబంధితాంశ స్పర్శలు, కవి చరిత్రాంశాలు, లేదా జీవిత విశేషాలు, ప్రశంసలు కొండొకచో పీఠిక కర్త ధైర్యాన్ని వివేచననిబట్టి విమర్శలూ ఇవన్నీ పీఠికలుగా జమకట్టబడి గణింపబడేవి. కొన్ని మొక్కుబడి పీఠికలు! కొన్ని సాహిత్యరంగంలో శాశ్వతంగా నిలచే పీఠికలు. రచయితకు సమర్థత కొంతేవున్నా ప్రోత్సాహక బలాన్ని అందిస్తూ ముందుకు దూసుకుపో అనిపించే పీఠికలు. పీఠికల్లో అభిమాన దురభిమానాలూ వ్యక్తమవుతూంటాయి. తన వీరాభిమానాన్ని రచయితకే పోస్టుచేస్తున్నామని జోరుగా హుషారుగా రాసే పీఠికలు కొండొకచో పాఠకుల్లోనూ విమర్శకులుంటారని గ్రహించక ఆకాశానికెత్తడాలు మధ్యమధ్యలో కొందరైతే- పాఠకులనేవారు ఆలోచనాపరులూ వుంటారనే సత్యాన్ని గ్రహిస్తూ చిన్నపాటి పోలీసు దెబ్బలవంటి వాక్యవిన్యాసాలకు స్థానపరికల్పనలు! పీఠికలు గ్రంథం మధ్యంతరంగా రచయిత భావప్రకటనలు, సంక్షిప్త కృతజ్ఞతలు కొందరివి ముక్తసరిగా కొందరివి వుంటాయి. ఈమధ్యన కొందరి రచయితల రచనల్లో కృతజ్ఞతలు విస్తృతరూపంలో ఉంటున్నాయి. ఇంక భవిష్యకాలంలో ‘నేను ఫలానాచోట, రాస్తా ఎక్కువున్నచోట కార్లూ లారీలు తెగ ప్రయాణించే చోట ఓ ప్రెస్సులో నా పుస్తకం అచ్చుపనులు చూసుకున్నాను. ఈ పనుల కాలంలో ఎవ్వరూ నాకు యాక్సిడెంటు చేయకపోవడం వల్లనే ఈ పుస్తకం అచ్చయి ఇలా వచ్చింది. అందువలన ఈ కాలంలో నన్ను చంపని ఆ వాహనాన్ని నడిపిన తెలియని అందరికీ కృతజ్ఞతలు’ అని వ్రాసుకున్నా ఆశ్చర్యపోవలసిన అవసరం వుండదు. ఎందుకు ఇలా వ్యంగ్యంగా చెప్పడమంటే నీ పుస్తకం, నీ ముద్రణ, నీ వ్యయం, అచ్చమైన అచ్చు స్వాతంత్య్రం నీదే. కాని పొదుపుతనం వుంటే గ్రంథానికి అందం. ముక్తసరిగా చెప్పడం హృదయ బంధం కలవానిని చెప్పడం సంస్కారమే కాని అతి సర్వత్ర వర్జయేత్ అని కదా! పీఠికాశాఖా చంక్రమణం ఇప్పుడు దుర్లక్షణమవుతుంది. గ్రంథావిష్కరణ సభా సంబంధితమైతే- నిజానికి గ్రంథావిష్కరణలు పీఠికల రూపంలో జరుగుతాయి, ముందుగా. అసలు ఈ పీఠికల కథాకమామీషు ఏమిటి?
దేశమైనా చూడు కోశమైనా చూడు అన్నారు. వివిధ ప్రాంత జన వీక్షణం నీకు ఎంత గొప్ప జ్ఞానాన్ని ముందుబెడుతుందో అంత పనీ నిఘంటువు చేస్తుందనేది ఈ మేలి మాటల సారార్థం. కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్ పండిత బృంద శ్రమఫలం సూర్యరాయాంధ్ర నిఘంటువులో పీఠిక అంటే, ఆసనము, పీట గద్దియ అని ఒక అర్థమిచ్చి రెండవ అర్థంగా ‘గ్రంథము మొదట వ్రాసెడు దాని పుట్టుపూర్వోత్తరములు’ అని ఇచ్చారు. జె.పి.ఎల్ గ్విన్‌ని నిర్మించిన ఏ తెలుగూ ఇంగ్లీష్ డిక్షనరీలో 337వ పుటలో పీఠిక అంటే ప్రిఫేస్, ఇంట్రడక్షన్ అనే అర్థాలిచ్చారు. పీఠిక అంటే ముందుమాటలు, ఉపోద్ఘాతంగా అర్థంచేసుకోవచ్చు. బహుజనపల్లి సీతారామాచార్యులు శబ్దరత్నాకరం పీఠికకు గ్రంథము మొదట వ్రాసెడు దాని పుట్టు పూర్వోత్తరములని, ఉత్కృష్టపీఠము అనే అర్థాలిచ్చింది.
వేమూరి రాధాకృష్ణమూర్తి తెలుగు హిందీ నిఘంటువులో పీఠిక అంటే భూమిక, ఆముఖము అని అర్థాలిచ్చారు. మహానుభావుడు సి.పి.బ్రౌన్ 1852లో నిర్మించిన తెలుగు-ఇంగ్లీషు నిఘంటువును 1999లో తెలుగు విశ్వవిద్యాలయం తిరిగి అచ్చువేసింది. అందులో పీఠిక అంటే ఏసీట్, ఏ ప్రిఫేస్, ప్రియాంబిల్ అనే అర్థాలతోబాటు ఏ టేబిల్ ఆఫ్ కంటెన్ట్స్ అని కూడా ఇచ్చింది. ఆర్.ఎస్.ఎమ్‌సి గియర్గన్ హిందీ ఇంగ్లీషు నిఘంటువులో పీఠికా అంటే స్మాల్‌సీట్, ప్రింట్ సెక్షన్ ఆఫ్ ఎ బుక్ అని అర్థాలిచ్చింది. పుస్తక ముద్రణాభాగం అనేది విస్తృతార్థమైంది. ఇంకా ఇలా కొన్ని వుంటాయి. గ్రంథాంశ జ్ఞాన సాధికారత, విశే్లషణా సామర్థ్యం, రచనను, రచయిత సత్తాకు తూకం వేయగల దక్షత ఉన్నవారితో పీఠికలు రాయించుకుంటే ఆ గ్రంథానికి గ్రంథకర్తకు ప్రయోజనాధిక్యం వుంటుంది. అచ్చు పొత్తంలో ఏది వుంచుకోవాలన్నది ఎంచుకోవడంలో రచయిత లేక ప్రకాశకులదే హక్కు అయినా అతిగా వుంటే భరించవలసింది పాఠకులే అవుతారు.
పీఠికలు శిరోధార్యాలుగా ఉండాలేగాని శిరోభారాలుగా ఉండటం మంచిది కాదు. ఎపుడో చెళ్లపిళ్ల వెంకటశాస్ర్తీ సాహిత్యం ఇలాగయిపోతోందేమిటంటే ఇపుడు నోటి నుండి వచ్చు తుంపరలు కూడా అచ్చవడంవల్ల అదే భావం వచ్చేలా పద్యంలో చెప్పారట. అసలాయన కాలంలో ‘అచ్చులు’ అధిక సంఖ్యలో అంతగా ఉన్న కాలం కాదు, ఇప్పటితో పోలిస్తే పీఠికాకారులు తమ దారుల్లో ప్రతికక్షుల్లాంటి వారిని గుద్దుట వంటివీ తారసపడుతుంటాయి.
పీఠికలు కొందరికైతే తమని వ్యతిరేకించేవారి భావాల్ని వ్యతిరేకించేందుకు లభించిన వేదికలే. పీఠికల్లో విమర్శక పీఠికాకారులు ఎంతోమంది. కవిత్వానికి సాంద్రత, సంక్షిప్తీకరణ ఎలా అవసరమో పీఠికలకూ అవసరమే. పాటిస్తే.
కట్టమంచి, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, పింగళి లక్ష్మీకాంతం, వేటూరి ప్రభాకర శాస్ర్తీ, దీపాల పిచ్చయ్య శాస్ర్తీ, వెంపరాల సూర్యనారాయణ శాస్ర్తీ మొదలైనవారు వెలువరించిన పీఠికలు ప్రామాణికతల్ని పీఠికా ‘పదార్థ’ అనుగుణ అంశాల్నీ సంతరించుకున్నవై వుండేవి. నిడుదవోలు వెంకటరావు అసంఖ్యాక పీఠికలు సాహిత్య పరిణామ దర్శనాలు చేయిస్తూ విస్తృత స్వరూప స్వభావాల్ని తెలిపేవి. దివాకర్ల వెంకటావధాని తమ అధ్యయన పరిశీలనలతో సాత్త్విక స్వభావాన్ని పీఠికల్లో సైతం వ్యక్తం చేసేవారు.
విశ్వనాధ పీఠికల్లో విమర్శక పాత్ర కన్నా భావుకత్వ పాత్ర, రసదృష్టి, కవితా మమైక్యం ఉంటాయి. ఒక్కొక్కప్పుడు రచయిత కులాంశాల్ని తడిమి సమర్థించుకునే కారణాలు చెబుతారు. ఇష్టం లేక ఒత్తిడులవల్ల రాసిన పీఠికల్లో ఆయన వ్యంగ్య శీలత, నర్మగర్భ వాక్యాంశాలు కొన్ని చోటుచేసుకుంటాయి. అయితే సంప్రదాయక కవులు విశ్వనాధ పీఠికలకు ఎంతో మొగ్గు చూపడం సహజాంశం. విశ్వనాధ పీఠికలపై పరిశోధన గ్రంథాలే రాయవలసినంత వస్తు విస్తృతి ఉంది, చర్చనీయ విభేదాంశాలు వుంటాయి. విశ్వనాధ పీఠిక వుంటే సంప్రదాయ కవికి ఎంతో బలకరంగా భావించబడేది.
శ్రీశ్రీ, ఆరుద్ర వంటి వారి పీఠికలు తక్కువగా ఉన్నా ప్రజోన్ముఖంగా ఉండేవి. ఇంక ఈయన రాస్తున్నారు నేను రాయవలసిన అవసరం లేదు అన్న తాదాత్మ్య కవిత్వ ప్రేమలు కనపడతాయి. ఆవంత్స సోమసుందర్ పీఠికాపురవాసి. ఆయన ‘వెలుతురు పిట్టల’ కవిత్వానికి రాసిన దివ్య చైతన్య స్రవంతి మంజుల నినాదం ఒక గొప్ప పీఠిక. ఆయన ప్రోత్సాహక, విశే్లషణాత్మక, పరిచయాత్మక పీఠికలెన్నో రాశారు.
శ్రీశ్రీ మహాప్రస్థానానికి చలం పీఠిక ఈనాటికీ ప్రశంసింపబడుతోంది. జ్యోతిష సంబంధంగా కూడా పీఠికా పద వ్యవహారం ఉంది. జ్ఞాన పీఠ పురస్కారం పొందిన ఆచార్య సి.నారాయణరెడ్డి మంగళకర శుభ వాక్యాలతో కొన్ని చెప్పుకోదగ్గ ఉటంకింపులు వందల కొలదీ పుస్తకాలకు అభిప్రాయాలిచ్చారు. కె.వి.రమణారెడ్డి గ్రంథాల బేరీజులు వేస్తూ నూతన భావజాల ప్రేరణలిస్తూ పీఠికలు రాశారు. అద్దేపల్లి రామమోహనరావు పీఠికలు ఎన్నో వ్రాసిన వారిలో ఒకరు. ప్రోత్సాహ బలం అమిత శక్తిగా యువ కవులెందరికో ఆయన వల్ల అందింది.
శివారెడ్డి పీఠికల్లో ఆయన అధ్యయన గ్రంథాల ఉద్ఘాటనలు ప్రాపంచిక చింతనల్ని సమకూరుస్తుంది. మధురాంతకం రాజారాం, కోడూరి శ్రీరామమూర్తి, మరికొందరి పీఠికలు కథా రచయితలకు కొండంత బలాన్ని చేకూర్చాయి. రా.రా పీఠికలు విశే్లషణా జ్ఞాన సమన్వితాలు. చే.రా పీఠికలు వచన కవుల కవితా దర్పణాలైతే, బే.రా పీఠికలు పద్యకవుల సామర్ధ్య వ్యక్తీకరణల ఆశాకిరణాలయ్యాయి. కవితా సంకలనాలకు కొందరైతే పరిచయాలకు పీఠికలు, ఆశంసలు, శుభాకాంక్షలు ఎక్కువ వేసుకుంటూ ముద్రణ భారాన్ని భుజాలకెత్తుకుంటున్నారు. రక్తం లేనప్పుడు దొంగ ధ్రువపత్రాలున్నా మనిషి అంతగా నిలబడలేడు. రచనా సామర్ధ్యం లేనప్పుడు ఎంత గొప్పవాడు ఎవర్ని నిలబెట్టాలని చూచినా పీఠికాకారులు రాసినా అనంతర కాలంలో రచయిత కనుమరుగు కాక తప్పదు. సహృదయ పాఠకుడే ప్రమాణం.
ఎంకి పాటలకి ఏ పీఠిక అవసరం? సహృదయ భావుక పాఠక వ్యవస్థే హృదయ పీఠాలకి ఎక్కించుకుంది. ‘నూతిలో గొంతుకలు’ కవిత్వ పుస్తకంలో కొన్ని అంశాలు తెలుపుడు చేస్తూ వ్యాఖ్యానం రాయాలని ఆరుద్ర అంతటి వ్యక్తి భావించినా (ఈ విషయాన్ని దాశరధికి రాసిన లేఖలో ఆరుద్ర వ్యక్తం చేసారు) ఏ పీఠికా లేకుండానే బైరాగి తన హృదయ సందేశం అనుగుణంగా గొంతుకల్ని ప్రచురించుకున్నారు. ఊరుకున్నారా? తానే తన గ్రంథానికి తొలి పలుకంటూ ఓ పీఠిక రాసుకున్నారు. అందులో ‘‘ఈ పుస్తకానికి పీఠిక అవసరం లేదనుకున్నాను. కానీ నాలుగు ముక్కలు రాద్దామని బుద్ధి పుట్టింది. న్యాయంగా ఏ కృతైనా దానికదే భాష్యం, కావ్యం తనంతట తాను వెలువరించలేని అర్థాన్ని ఏ భాష్యకారుడూ వెలువరచలేడు. కావ్యం స్వతస్సిద్ధం. దానికి భాష్యకారుని చేయూత అనవసరం. పోతే భాష్యకారుడు అపరిణతబుద్ధులైన పాఠకులకు సహాయకారి కావచ్చు, సాధారణార్థాలు బోధించవచ్చు. కానీ ఈ ప్రయత్నంలో తరచు అతడు కావ్యంలో మసృణత్వాన్ని చెరుస్తాడు. అతి సున్నితంగా వ్రేలిడవలసిన చోట నానార్భటులూ చేసి తుదకు రసాభాస చేసి కూర్చుంటాడు’’ అన్నారు. బైరాగి పీఠికా విరాగి అన్నమాట!
ఏమైనా గ్రంథాన్ని చదివి పాఠకులు స్పందనలు తెలియజేయడం లాగే గ్రంథ పీఠికల్ని చదివి పీఠికా కర్తలకూ గ్రంథ కర్తలకూ తమకు ఏర్పడిన సానుకూల ప్రతికూల అభిప్రాయాలను పాఠకులు తెలియజెయ్యాలి. పీఠికలు చేరేది పాఠకులనే కనక పాఠకులు బహుపరాక్‌గా ఉంటే పీఠికలూ బహుపరాక్‌గానే వస్తాయి.

- సన్నిధానం నరసింహశర్మ, 9292055531