సాహితి

‘ఆహా...’ హూహూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఒక రోజున ఉదయం లండనులో ‘ట్రైఫాల్గర్ స్క్వేర్’వద్ద జనం గుంపులు గుంపులుగా మూగి యున్నారు. వారొక విచిత్ర జంతువు వంక చూస్తున్నారు. ఆ జంతువు వారిని అన్ని విధాల ఆకర్షించింది. తల, జూలు, నిక్కిన చెవులు, సగము కనబడుతున్న తిరగలి రాళ్ళల్లే పళ్ళ జంట. మొగాన మాత్రం బొట్టు ఉన్నది. అది నిలువుబొట్టు. ఆ జంతువుకు తక్కిన అవయవాలన్నీ మనుష్యులవే. రెండు చేతులు, రెండు కాళ్ళు, కాళ్ళకి కడియాలున్నవి. అవి బంగారపువో ఇత్తడివో తెలియదు గాని రంగు మాత్రము పసుపు పచ్చన. వాటిని కడియాలనటంకన్నా అందెలనవచ్చు. కాళ్ళ వ్రేళ్ళకు పది రత్నపుటుంగరాలున్నవి. దండలయందు ‘బాజుబందులు’, బుజముల మీద ‘్భజకీర్తులు’ ఉన్నవి. శిరసున కిరీటముంది. ఈ జంతువు చచ్చిపోయినదో, మూర్ఛలో ఉన్నదో తెలియదు. ఇది జంతువో, మనుష్యుడో తెలియదు. ఒకవేళ నిద్రపోవుచున్నదేమో! ఒత్తిగిలి పండుకొన్నది ఆ జంతువు. ‘పట్టుబట్ట’ కట్టుకొని ఉంది. ఆ జంతువు రెండు చేతుల వెనుక పొడుగైన రెండు పెద్ద గాయాలున్నవి. ఆ గాయాలనుండి ఇదివరకెంత నెత్తురు కారిందో తెలియదు కాని కొంత నెత్తురు భూమి మీద గడ్డకట్టి ఉంది...’’ ఇది విశ్వనాథ సత్యనారాయణ రాసిన ఓ నవలలోని తొలి అధ్యాయం, తొలి పేరాలోని వాక్యాల సముదాయం. ‘హాహా హూహూ’ ఇదీ నవల పేరు! కేవలం నలభై తొమ్మిది పేజీల నవలికలో ఒకే ఒక పాత్రకు పేరుంటుంది. ఆ పాత్రే ప్రధానం, కీలకం. ఆ పాత్ర పేరే హాహా హూహూ! ఈ నాలుగక్షరాలు ఎక్కువని ‘హాహూ’ అని కూడా పిలువచ్చని సూచిస్తారు కథ మధ్యలో రచయిత విశ్వనాథ సత్యనారాయణ. దీనిని 1952లో రాసి ఉంటారని భావిస్తున్నారు.
విశ్వనాథవారు పదాలతో చిత్రకల్పన చేస్తారు. ఇది వారికిష్టమైన పని. అంతేకాదు సులువుగా సాధ్యపడిన నైపుణ్యం. ఈ లక్షణం వారి రచనలన్నింటా చూడవచ్చు. కథ లండను నగరంలో ట్రైఫాల్గర్ స్క్వేర్‌లో ప్రారంభమవుతుంది. ఈ కథ అక్కడ జరగడంతోనే రక్తి కడుతుంది. దీన్ని భారతదేశంలో అంత బాగా నడపలేమని కూడా వారికి తెలుసు. అందుకే అలా ఎన్నుకుని ఉంటారు. మొత్తం పది అధ్యాయాలతో ఈ నవలిక ముగుస్తుంది. ప్రతి అధ్యాయం ఐదు పేజీలుంది. ఒకటి మాత్రం నాలుగు పేజీలు. అటువంటి క్రమశిక్షణ వారి ఆలోచనా తలంలోనే అంది ఉండాలి. కనుకనే ఆశువుగా వారు అలా చెప్పుకుపోయినా- ప్రతి అధ్యాయం ఒక స్పష్టమైన ప్రణాళికతో సాగుతుంది! కొసమెరుపుతో నవలిక ముగిసి- అంతవరకు రేకెత్తించిన ప్రశ్నలకు జవాబులు లభించి కథ సుఖాంతమవుతుంది. తొలి అధ్యాయం కేవలం భౌతిక వర్ణనకే సరిపోయి, ‘‘జంతువు మేల్కొనవలెనని ఎదురు చూస్తున్నాను-’’ అనే వాక్యంతో ముగుస్తుంది. ఇలాంటి ముగింపు రెండో అధ్యాయం చివర- ‘‘మృగము తుపాకిని తీసుకుని దానిని పరిశీలించడం మొదలుపెట్టింది-’’ అనే వాక్యం తటాలున మెరిసి మూడవ అధ్యాయంలోకి పాఠకుడిని లాక్కుపోతుంది. మిగతా ఏడు అధ్యాయాల కొసలు ఇంత ఆసక్తిగా ఉండవు. మనో ఫలకంపై తారట్లాడి; సమయమూ రాయసకాడు దొరికిన వేళ రూపం పోసుకున్న సాహిత్య కృషి గనుక ఇలాగే ఉండవచ్చు.
* * *
విజ్ఞాన నేపథ్య గాథలు- అనే 20 సైన్స్ ఫిక్షన్ కథల పుస్తకాన్ని రచయిత డా. వక్కలంక వెంకట రమణ 2015 అక్టోబర్‌లో వెలువరించారు- సాహితీ ప్రచురణ ద్వారా. ఈ కథల గురించి కాదు గానీ ఈ పుస్తకం ముఖచిత్రంగా రచయితే ఒక కార్టూన్ వేసాడు. ఎద్దు ముఖం గల ఒక మనిషి (డాక్టరును) ఇలా అడుగుతున్నాడు- ‘ఇది మీకేమన్నా న్యాయమా? మరీ నా తల మార్పిడి ఇలా చేసారేమండీ! నన్నిప్పుడు గడ్డి తినమంటారా, లేక అన్నం తినమంటారా?’ అని. దీని జవాబుగా డాక్టరు- ‘క్షమించండి, ప్రాణాలు కాపాడాలని అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న తలను తగిలించాం మరి’ అంటారు. ఇది ఒక రకమైన కామన్‌సెన్స్.
పది తలల రావణాసురుడు ఎలా నిద్రపోతాడనే సందేహం నాకు చాలాకాలం క్రితం కలిగింది. తర్వాత ఒక తలనొప్పి మందు కంపెనీ తమ ఉత్పత్తిని రావణాసురుడు వాడినట్టు ప్రకటన రూపొందించి, చాలాకాలం పత్రికల్లో వాడినట్టు గుర్తు. అలాగే వినాయకుడి గురించి పలు చమత్కార భరితమైన ఆలోచనలు చేయవచ్చు. ‘శబ్ద మంజరి’లో హాహా హూహూ అనే ఒక గంధర్వుడి పేరు చూసిన తర్వాత విశ్వనాథవారికి ఈ నవలా చమత్కారం తట్టి ఉండవచ్చు. ఈ పేరు చాల విశేషంగా ఉంది, దానికి తుంబూరుని ఆకారం తీసుకుని; కథను పేని ఉండవచ్చు. ముంతకు చెవులు లేవు, కథకు కాళ్ళు లేవు. కానీ కథకుడు ప్రతిభావంతుడైతే కథను సొగసుగా, అర్థవంతంగా, ఆలోచనాత్మకంగా నడపవచ్చు. ‘హాహా హూహూ’లో అదే జరిగింది.
కథ లండనులో జరిగినా, అక్కడ నడుస్తోంది మాత్రం మనకు బాగా తారసపడిన, విశ్వనాథకు ఇష్టమైన ప్రతీకల ఆధారంగా. ఈ ప్రాణి పేరు మనకు నాలుగో అధ్యాయంలోనే తొలుత తారస పడుతుంది. రెండో అధ్యాయంలో అది కదలడం, మాట్లాడటం, ఆ భాష సంస్కృత భాషా రూపమని గుర్తించడం గమనించవచ్చు. జంతుశాల అధికార్లు, మనుషుల అధికారి మేయరు రావడం, వింత ప్రాణి స్నానం చేయడం, పళ్ళు ఆరగించడం- మూడో అధ్యాయంలో కనబడుతుంది. ఇక నాలుగో అధ్యాయంలో ధ్యానం చేయడం, పండితులు ప్రాణితో చర్చించడం, పాత్రకు గల పేరు ప్రస్తావించడం చూడవచ్చు. జంతుశాల అధికార్లు, మేయరు, పోలీసులు ఒక వైపూ; పశు శాస్తవ్రేత్త, భాషా శాస్తవ్రేత్త, బిషప్పు, పండితులు మరోవైపు క్రమంగా కథలో ప్రవేశించి కథనానికి తోడ్పడుతారు. ఇంతవరకు కథను నడిపి, పిమ్మట జంతువు వర్సెస్ మనిషి, శాస్తవ్రేత్తల చర్చలు, ప్రయోగం, పరిశోధన, నమ్మకం, మతం, శాస్త్రం, జ్ఞానం వంటి విషయాలపై రచయిత ఆలోచనలు సాగుతాయి. ఈ నవలిక సైన్స్‌ఫిక్షన్ అవుతుందా, విశ్వనాథ నారాయణకు ఏమేరకు సైన్స్ తెలుసు, సైన్స్ తెలిసిన వారంతా రాసింది సైన్స్ మాత్రమేనా, సైన్స్ ఫిక్షన్లో నానె్సన్స్ ఉండదా- అనే ప్రశ్నలు ఇక్కడ, ఇప్పుడు అవసరం లేదు. కానీ రచయిత ఈ నవలికలో ప్రస్తావించిన విషయాలు తప్పక ఆసక్తి కల్గిస్తాయి.
మనం ప్రయోగాల కోసం ఎలుకలు, కుందేళ్ళు వంటి వాటిని చాల వాడుతాం. వాటికి కూడా మనలా ఆలోచించే అవకాశం ఉంటే, హక్కుల కోసం తిరగబడితే మనిషి ఏమవుతాడు? అతని పరిశోధన ఏమవుతుంది? ఈ దిశలో ఆధునిక వైజ్ఞానిక రంగ పరిస్థితిని జోడించి, ఆలోచిస్తే విశేషమైన రీతిలో సైన్స్‌ఫిక్షన్ ఉత్పన్నమవుతుంది. ప్రయోగాలకు గురయ్యే ప్రాణులకు హక్కులుండవా? అవి తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుంది? సమస్త ప్రాణి ప్రపంచంలో ప్రకృతిపరంగా మనిషికి ఏమయినా అదనపు హక్కులున్నాయా? విశ్వనాథ సత్యనారాయణ ఇంత ఆలోచించి ఈ కోణంలో తర్కించారని భావించడం లేదు. అయితే వారు పూర్తిగా కామన్‌సెన్స్‌తో ఈ ప్రశ్న వేసారు! ఈ దృష్టి కోణానికే విలువనివ్వాలి. విశ్వనాథ సత్యనారాయణ గారు విజ్ఞాన సంబంధమైన విషయాలను ఎంతవరకు ఆకళింపు చేసుకున్నారో మాకు అవగాహన లేదు. మొత్తం నవలికను సైన్స్‌ఫిక్షన్‌గా పరిగణించాల్సిన పనిలేదు. ఒక వింత మనిషి లేదా వింత జంతువు భారతీయ మత చిహ్నాలతో ఒక పాశ్చాత్య దేశంలో ప్రత్యక్షమైనపుడు అక్కడివారి స్పందనలు చేష్టలతో కథ తయారైంది. ఈ కథను గంధర్వ లోకం తీసుకువెళ్లి విఠలాచార్య సినిమాలాగా నడిపించవచ్చు. కానీ ఇంగ్లండును సంఘటనా స్థలంగా విశ్వనాథ సత్యనారాయణ ఎంపిక చేసుకొని కొంత ఆసక్తినీ, కొంత హాస్యాన్నీ, కొంత తన విశ్వాసాన్ని సాధించారు. అట్లని వారికి సైన్స్ పట్ల ఆసక్తిలేదని చెప్పలేం. ఒక సందర్భంలో అటువంటి దృష్టి ఉందని స్పష్టంగా కనబడుతుంది.
చివరగా కొన్ని విషయాలు చెప్పాలి. విశ్వనాథ సత్యనారాయణ ఏదైతే చెప్పాలని ఇతర రచనలలో ప్రయత్నించారో, ఇక్కడ కూడా దాని కోసమే ప్రయత్నించారు. సందేహం లేదు. అయితే చమత్కార భరితమైన వస్తువు తీసుకుని, తన పరిధిలో ఆసక్తికరంగా కథ నడిపారు. సందర్భం వచ్చినప్పుడు మాత్రం యధార్థనే్వషణ అంటే ఏమిటో వివరిస్తారు. ఈ పదాలకు ‘సైన్స్’, ‘సెర్చ్ ఆఫ్టర్ ట్రూత్’ అనే మాటలు బ్రాకెట్లలో కనబడతాయి. విశ్వనాథ వారి కామన్‌సెన్స్‌నూ, ఆకాంక్షనూ, పరిశ్రమను గౌరవించాలి. అభినందించాలి. నవలిక చివర హాహా హూహూ అన్న మాటలు ఇవి - ‘మృగాలలో కృత్రిమత్వం విజృంభించలేదు గాన, వాటిలో చేవ లేదు. అందుకనే జంతు ప్రదర్శనశాలలో జంతువులు నేను వెళ్లగానే అరిచినవి. మనిషి కృత్రిమ జ్ఞానం వృద్ధి చేసి పాడైపోతున్నాడు’. - ఈ మాటలు 1952లో పేర్కొన్న విశ్వనాథ సత్యనారాయణ అవగాహన మనకు పూర్తిగా తెలియదుగానీ, ఈ మాటలు నేటికీ అర్థవంతం, రేపటికి మరింత అవసరం. ఇంకా చెప్పాలంటే సార్వత్రికమైనవి.

- నాగసూరి వేణుగోపాల్, 944073239