సాహితి

సామాజిక చలనం నాగావళి కవిత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామాజిక పరిణామక్రమంలో మనిషి జీవితం గత రెండు దశాబ్దాల నుండి మరింత విధ్వంసానికి గురవుతోంది. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా అవే స్థితిగతులు, అవే సంక్షోభాలు, అవే గాయాలు భారతదేశం నిండా పర్చుకొని ఉన్నాయి. సకలాన్ని ధ్వంసం చేస్తోన్న వర్తమాన పరిస్థితితో చీకటి ఊడలు మనిషి మూలాల్లోకి దిగిపోతున్నాయి. అది తెలంగాణ అయినా, ఉత్తరాంధ్ర అయినా, రాయలసీమ అయినా ఇవే సంకీర్ణ దృశ్యాలు కనిపిస్తాయి. వర్తమాన జీవితం అనేక సంక్షోభాల జీవన గ్రంథమైపోయింది. లెక్కలేని గాయాల సంకలనమైపోయింది. ఇక్కడే కవిత్వం దుఃఖమయమవుతోంది. ధిక్కారమవుతోంది, ఉద్యమ రూపు దాల్చుతోంది. ఇలాంటి పూర్వ రంగాన్నంతా మనసు పొరల్లో ఇంకించుకొని కవిగా నెత్తుటిదారుల మీదుగా ప్రయాణం మొదలుపెట్టిన కవి సిరికి స్వామినాయుడు. కాలం కనికట్టుకు మట్టి కలలు ముక్కలయిన చప్పుడును లీలగా వినిపిస్తున్న అతని కవితా సంపుటే ‘మంటి దివ్వ’. ఇందులోని ప్రతీ కవిత సమాజ నగ్న చిత్రాన్ని విప్పి చెప్పడానికి విశ్వప్రయత్నం చేస్తుంది. ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ భూగోళం మూల మూలాలకు చొచ్చుకొని పోయిన తర్వాత సమాజం కూలిపోతున్న విధం, రోజురోజుకు మనిషి జీవితం కుదేలవుతున్న తీరు, జీవిక కోసం సగటు మనిషి ఆరాట పోరాటాలు ప్రతి పుట నిండా అక్షర రూపం దాల్చి నిలబడ్డాయి ఈ సంపుటిలో.
‘‘రుూ నాగావళీ నదీ తీరం మీద
బతుకు పాట పాడే పల్లె పట్టులేవనడిగాడతడు
బీళ్లుగా మారిన పంట పొలాల మీద నడుస్తూ...
అభివృద్ధి తిరుగుడు గుమ్మిలో పడి- అవి
ఎండుటాకుల్లా కొట్టుకుపోయాయన్నారు వాళ్లు
వొట్టిపోయిన వనకాబడి గెడ్డమీద నడుస్తూ...’’
ప్రపంచీకరణ ఇనుప పాదానికి నలిగిపోని రంగమేది? పల్లెలన్నీ ఇవాళ పత్రహరితాన్ని కోల్పోయిన చెట్ల మాదిరి నిల్చున్నాయి. తాడు లేకుండా ఉరివేయబడిన పల్లెలు దేశం నిండా కనిపిస్తాయి. మొండి గోడలు, కూలిన మిద్దెలు, మట్టిదిబ్బలు, పిచ్చిమొక్కలు, తవ్వకాల్లో బయల్పడ్డ పురానాగరికతలా, నిశ్శబ్ద శ్మశానాల్లా ఆయుధం లేకుండానే హత్యకు గురైన, రక్తపాతం జరగకుండానే ఉసురు తీయబడిన పల్లెలు అడుగడుగునా కనిపిస్తాయి. పొదుగు నుండి పెయ్యను లాగేసినట్టు, మట్టినుండి మొక్కను దూరం చేశాక కుక్కమూతి పిందెల్లా పుట్టుకొచ్చిన కర్మాగారాలు కాలుష్యానే్న కక్కుతాయి. పల్లె దువ్వారానికి కట్టుకున్న పచ్చతోరణం తెగిపోయాక, బతుకు మండుతున్న యిటుక బట్టీలా భగ్గుమంటుంది. సెజ్‌లు, ఇండస్ట్రియల్ కారిడార్లు, రైతు నమ్ముకున్న నేలను ఎలా దొర్లించుకుపోతున్నాయో, సామాన్యున్ని కన్నీటి మడుగులో ముంచేసి రాజ్యం చేసుకుంటున్న రహస్యపు ఒప్పందాలను, దానిలోని మార్మికతను గుండె మంటతో వెలిగిస్తాడు కవి.
ఒక దృక్పథం ఉన్న కవి, కవిత్వాన్ని ప్రజల పక్షం చేసే కవి, తన ప్రాంతంపై మమకారం ఉన్న కవి ఏ దేశంలోనైనా ఇలానే రాస్తాడు. ఇలానే స్పందిస్తాడు. సమాజం అన్నా, మనిషన్నా, కన్నీటి ఉప్పదనమన్నా, విలువ తెలిసిన కవులు ఈ విధంగానే రాస్తారనేదానికి ఈ కవిత్వం నిదర్శనం.
‘‘యిపుడు పల్లె నడివీధిలో విచ్చుకున్న
వేయిరేకుల వెలుగు పువ్వు రంగస్థలం లేదు
హరికథలు ల్లేవు
బుర్రకథల్లేవు భాగోతాల్లేవు
బుడబుక్కల నాదాల్లేవు
చెక్క్భజనల్లేవు సన్నాయి రాగాల్లేవు
కోలాటాల్లేవు కొమ్మ దాసరి పాటల్లేవు
తుళ్లిపడే సెలయేటి పాటలాంటి పల్లెమీద
రంగు రంగుల పొగమంచు కమ్ముకుంటోందిప్పుడు’’
ప్రపంచం ఇవాళ ఒక టీవీ లేని ఇల్లును కలగంటోంది. బాల్యం తన చేపల్లాంటి కళ్లను టీవీ స్క్రీన్‌కు అతికించి అందులోనే చేపలా ఈదులాడుతోంది. యవ్వనం బుల్లితెరమీద ఆరేసిన అందాల చుట్టూ తిరుగుతూ చొంగ కార్చుకుంటోంది. సీరియల్స్ అంతమయ్యేలోపు వృద్ధాప్యం తన బతుకును చాలిస్తోంది. సమస్త మానవజాతి చేతనత్వం ఉడిగిపోయి, చెదలు పట్టిన మోడులా తయారవుతోంది. కేబుల్ కుట్రకు జీవితమే బలవుతోంది. అందుకే మనిషి ఓ నిరసన పతాకమై ఎగరాలిపుడు అంటాడు కవి. ఈ కవితా సంపుటి నిండా జీవిత చిత్ర లిపి పరుచుకొని ఉంటుంది. కష్టజీవి స్వేదంనుంచి ఇంద్రధనుస్సు విరిసినట్లు అంతా ఒక వర్ణ సంచయం కనిపిస్తుంది. కొత్త లిపినేదో చదువుతున్నట్లు మనసంతా బరువుగా మూల్గుతుంది. ఒక్కో కవిత చదువుతున్నపుడు దేహంలోని అనేక జీవగ్రంథులు ఉత్తేజితమై అంతా ఒక మానవత్వపు రసాయనం విడుదలై ఏవో మనిషితనపు వేర్లను మనసు మూలాల్లో నాటుతుంది. వస్తువేదైనా అందులో ఒక మానవతా దృష్టి కోణం తొంగిచూస్తుంది.
పవర్ ప్లాంట్లకు నిరసనగా విరుచుకుపడినా, ‘హామీల నీటి బుడగల మీద రంగు రంగుల కలల్ని ఆవిష్కరించి ప్రజల బతుకుల్ని కొల్లగొట్టుకుపోతున్న ఏడో ఋతువు మంత్ర కవాటాల్ని తెరిచి చూపినా, నిర్వాసితులకు కవిత్వపు గుడారాల్ని వేసినా, సముద్ర తీరం మీద తడారని శోకానికి దోసిలి పట్టినా, అడవిని కాపాడుకునేందుకు బరిసె పట్టిన యోధుని గురించి చెప్పినా, ‘మట్టి మగ్గంమీద ఆకుపచ్చని నేత నేసే’ రైతును చిత్రించినా స్వామి నాయుడు కలం నడిచే శిల్పం వేరే విధంగా ఉంటుంది. కొల్లగొట్టడం నేరమైతే బాల్యాన్ని కొల్లగొట్టడం కూడా నేరమేనని తూనిగల్లాంటి బాల్యాన్ని తరగతి గదుల్లో బంధిస్తావెందుకని నిలదీస్తాడు. వేయి శిశిరాల్ని మోస్తున్న ముసలి సత్రపు ఊసులన్నీ గుండెకు వినిపించి మనసంతా రక్తపు వర్ణం వెదజల్లుతాడు. యాసిడ్ దాడికి గురైన యువతి పక్షాన నిలబడి సానుభూతి వర్షమై కురుస్తాడు. తార్రోడ్డు కాన్వాసుపై బతుకు బొమ్మను గీసి, శవం మీద చల్లిన చిల్లర ఏరుకునే భిక్షగాడిగా మారిన కళాకారుడికి నూరు రూకల ఆత్మవిశ్వాసమవుతాడు. కామందు కొరడా దెబ్బలకు గజ గజ వణికే బాల కార్మికుడి గాయాలపై ఉమ్మి తడి అవుతాడు. భూమినంతా గుంజుకొని రాజ్యం ఒక రైతులేని రాజ్యాన్ని కలగంటున్నపుడు తుపాకి మొనకు పూసిన ఎర్రమందారమవుతాడు. సెజ్ డేగ రెక్కల కింద నలిగి నేల ఎద్దు పుండైనపుడు మట్టికి మరణం లేదంటూ, మనిషై మళ్లీ నడిచొస్తుందని ఆశావాదాన్ని వినిపిస్తాడు. మెతుకు వేటలో బతుకు చేత పట్టుకొని నగరపు మురికి వాడకు వలసపోతున్న పల్లెకు ఆశ్రయమవుతాడు. ‘మంటిదివ్వ’ చదివాక మనసు జ్వరపీడితమవుతుంది. ఒక యుద్ధానంతర బీభత్స దృశ్యం కనులముందు కదలాడుతుంది. నిప్పు కణికలనే అక్షరాలుగా మార్చి ప్రతీ పుటలో పేర్చినట్టుగా కవిత్వపు సెగ తాకి దేహం పక్కకు ఒరుగుతుంది. ఒక సామాజిక బాధ్యతతో కూలిపోయిన కుల వృత్తుల గురించి, రైతు తన చేనులోనే మృత్యువును కౌగిలించుకున్నపుడు దుఃఖపు రూపుదాల్చిన రైతు భార్య గురించి పొగిలి పొగిలి ఏడ్చే కవి. చివరాఖరికి ఇతడు ఒక కళింగాంధ్ర కవే కాదు, సామాజిక చలనసూత్రాలను అర్థం చేసుకున్న కవి. నక్సలైట్ కంటే సున్నితమైన మనసున్న కవి. నాగలికి కవిత్వపు ఖడ్గాన్ని నూరి గుండె గోడలకు అనేక నెత్తుటి మరకల్ని శాశ్వతంగా అంటించే కవి. ఈ కవిత్వపు ఆసరాతో నేల మాళిగలోకి వానపాములా వెళ్లిపోతాం. కల్లోలమైన మనసుతో ఒక నిర్వాసిత గుడారాన్ని చేరుకుంటాం.

- వెల్దండి శ్రీధర్, 9866977741