సాహితి

ప్రశ్నల కవితా పేటిక.. కాల నాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్నించడం నేరం అయ్యేది నియంతృత్వంలో మాత్రమే. ప్రశ్నించడాన్ని స్వాగతించడం, సమాధాన పరచడం నిజ ప్రజాస్వామ్య ఆరోగ్య లక్షణం. పాలనా బుర్రకథలో ‘తందానా తందాన తానలు’ మరీ ఎక్కువైపోతున్నప్పుడు, ప్రజల భళాభళులు తక్కువై పోతున్నప్పుడు ప్రజాహృదయ పాళీ భాషలో కవుల కలాలు ప్రశ్నిస్తాయి, నిరసిస్తాయి. సంస్కరణలను నినదిస్తాయి అవసరమయిన సందర్భాలలో నిలదీస్తాయి. ఈ పనులే చేస్తున్నాయి ఈ కవితా సంకలనంలోని కవితలు.
ఉద్యమదూరులైనవారు రాసినవి కావివి; ఉద్యమశూరులైన భాగస్వాములు రాసినవి. అందుచేతనే వ్యతిరేకతల్లో నిజాయితీ వికసించింది! తెలంగాణా ఇటీవలి చరిత్రలో రెండు ముఖ్య దశలున్నాయి. మొదటిది రాష్ట్రావతరణ ముందు పోరాట చరిత్ర. రాష్ట్రం ఏర్పాటు తరువాత చరిత్ర రెండో దశ. ఈ రెండో దశలో ఉద్యమఫలాలు రైతులు, వివిధ రంగ కార్మికులకు అట్టడుగు వర్గాల వారికి అందడంలేదని, అందాలని కల్లోల పడుతున్నాయి కవుల మనస్సులు. 2016 ఫిబ్రవరి 21న మహబూబ్‌నగర్ జిల్లా రచయితల మహాసభల సందర్భంలో తెలంగాణా రచయితల వేదిక (తెరవే) పక్షాన పది జిల్లాల్లోని కవుల ‘మండు గుండెల’ కవితలివి. రాష్ట్రావిర్భావ అనంతర పరిస్థితుల కవితా ధార. నలభై ఆరు కవితలు. సంపాదకులు ‘ఇది రేపటి కవిత్వం’ అంటూ రాసిన ముందుమాటలు గద్దెకెక్కిన పాలకుల ముందుమాటల్ని గుర్తుచేస్తున్నాయి. ఉద్యమ విజయానంతరం కల్పిత ఉద్యమ సంస్థల్ని వాటి సృష్టితీరును ఆవేదనతో ప్రశ్నించారు. పోరాట కాలంలోని అభ్యుదయ వేషధారుల్ని గమనించమంటున్నారు. ఉద్యమ భాగస్వామ్య రచయితలకు ఆర్థిక సహాయమందించాలని కవి రచితగ్రంథాలు వందేసి చొప్పునైనా కొనాలనే విజ్ఞప్తులు గమనించాలని కోరారు. ముఖ్యంగా ‘తెలంగాణ భాష అధ్యయనం’, ‘తెలంగాణ భాషాకోశం’, ‘తెలంగాణా వ్యాకరణ నిర్మాణం’ వంటి మూలాంశాలను మూలనబెడుతున్నారని ఆవేదన పడుతున్నారు. ఈ కవితా సంపుటిలో డా.సి.నారాయణరెడ్డి, అందెశ్రీ, గోరటి వెంకన్న, జలజం, జూకంటి, తెలిదేవర, సలిమెల, పులి జమున, దిలావర్, ఎస్వీ వంటి నలభైఅయిదు మంది కవుల గుండె చప్పుళ్ళున్నాయి. ‘కాలం నిడివి/ సాగిపోయే మనసుకు అందదు/ అందినంతలో/ ఆ కాలాన్ని పురోగమన దిశలో నడిపించడమే/ నిరంతర క్రియాశీలి/ నిత్యకర్తవ్యం అంటూ ‘ఇది చాలు’నంటున్నారు జ్ఞానపీఠస్థులు ఆచార్య సి.నా.రె. ‘‘మా పందిరి గుంజకానె్న పొద్దుపొడుస్తుంది/ మా కోడిపుంజు కూస్తనె తెల్లవారుతుంది/ మేము రిమోటు నొక్కితేనే భూగోళం తిరుగుతుందనే/ భ్రమల భ్రమరాలు గాలితరగలపైన ఊరేగుతున్నాయి’ అని పాలక వ్యవస్థ తీరును ధ్వనిగా ప్రశ్నించారు- పొద్దుతిరుగుడు పూలులో ప్రకృతిని అందుకున్న అందెశ్రీ. మరో ప్రాకృతిక కవి గోరటి వెంకన్న ‘పూల తోవల తోటలోన తొణుకునట తేనియల పంట/ వనిత నవ్వుల చెలిమి లోన పలుకునట మురిపాలు ఇంట/ ఎద్దు మురిసిన ఊరిలోన ఏది ముట్టిన పసిడెనంటా/ రైతు దేవుని వోలె కొలిసిన నేలకెప్పుడూ శుభములేనట/ ఏలికల కది తెలిసెదెప్పుడొ నేల కల నెరవేరేదెప్పుడొ’ అంటూ తమ దిగులు గూడును తెలుపుతూ నేల కలదన్నారు.
గాజోజు నాగభూషణం ‘ఊరుఊరంతా ఉత్సవాల్లో ఉక్కిరిబిక్కిరవుతున్న వేళ/ కావలి కుక్కైన అక్షరం ఉలిక్కిపడుతుంది/ కాలనాళికై గొంతు విప్పుతుంది’అన్నారు.
గొంతు విప్పిన ఈ కాలనాళికలో దొరతనం పట్ల ద్వేషం, శతృత్వంతో రాసినవికాక, ఆవేదనల నిజాయితీతో రాసినవి.

- సన్నిధానం నరసింహశర్మ, 9292055531