సాహితి

‘మార్కెట్’ సాహిత్యానిదే ఆధిపత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు అన్ని రంగాలపై ప్రపంచీకరణ దుష్ప్రభావం ప్రసరిస్తోంది. చాపకింద నీరులా ప్రవహిస్తూ, కనిపించని శత్రువులా దాడిచేస్తూ అన్ని రంగాలను, నిర్వీర్యం చేస్తోంది. సాహిత్య రంగం అందుకు మినహాయింపేమీ కాదు. సాహితీ ఉద్యమాలు, సిద్ధాంతాలు, అస్తిత్వపు వేదనలు, మానవ హక్కులు, మానవ సంబంధాలు, అన్నింటిపై ప్రపంచీకరణ ప్రభావం ఊహించని విధంగా పెరిగింది. వస్తుసంస్కృతి పెరిగిపోయి, మార్కెట్ దోపిడీ మాయజాలంలో మధ్యతరగతి ప్రజలు దుర్భర పరిస్థితుల అగాధాల్లోకి నెట్టబడుతున్నారు. రాజకీయ పార్టీలు, ఏలికలు, తమ మనుగడకోసం ఆర్థిక వనరుల సమీకరణలకోసం బడాబడా కంపెనీల, కార్పొరేట్ సంస్థల బ్రోకర్లుగా మారిపోతున్నారు. రాష్ట్రాలు కేంద్రాన్ని, కేంద్రం విదేశాలను మేధిరించుకునే దుస్థితిలో సగటుమానవుని అస్తిత్వం ప్రశ్నార్థకమయింది. ఇలాంటి పరిస్థితుల్లో రచయితలు, కళాకారులు, మేధావులు, కింకర్తవ్యమని తలలు పట్టుకుని ఏం రాస్తారు? సాహితీ సామాజిక ఉద్యమాల్లో పారదర్శకత కరువైపోయి ప్రతివాడూ డబ్బున్నవాడి చేతిలో కీలుబొమ్మగా మారిపోయి ఖరీదైన సరుకుగా అమ్ముడుబోతున్నాడు. ఒకప్పుడు సిద్ధాంతాలు వల్లెవేసిన వారు, విప్లవాలు నడిపినవారు, అజ్ఞాతంలో గడిపినవాళ్లు, రహస్యోద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించినవాళ్లు నేడు పదవులకు, డబ్బుకు, వస్తు సంస్కృతికి బానిసలైపోతున్నారు.. ఒకపక్క రైతులు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ఏలికలు ఉద్యోగులకు జీతాలు పెంచి తమ పార్టీలు పదవులను కాపాడుకోడానికి ప్రయత్నిస్తున్నారు. మరోపక్క నిరుద్యోగం ఊబిలోకి యువతరం బలవంతంగా నెట్టబడుతోంది. బ్లాక్‌మార్కెట్లు పెరిగిపోయి నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పేద మధ్యతరగతి కుటుంబాల్లో అశాంతి అలజడులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గోర్కి అన్నట్టు కవులు, రచయితలు ఎటువైపు నిలిచి రచనలు చేస్తారు? ఏ శత్రువుపై ప్రజలను ఉసిగొలుపుతారు? ఏ ఉద్యమాలకు సానుభూతి తెలియజేస్తారు? ఏ రహస్య శత్రువును తుదముట్టించమని సందేశమిస్తారు? ఎవరి బతుకుతెరువు పోరాటంలో వారు తలమునకలై ఉన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలు, తరిగిపోతున్న ఉపాధి అవకాశాలు, కూడుబెట్టని కులవృత్తులు, కనీస అవసరాలు తీరని ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ దినదిన గండంగా బతుకులు వెళ్లదీస్తున్నారు. నిరుద్యోగులు, నిరుపేదలు, రైతులు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర మానసిక వేదనల్లో, జీవన సంఘర్షణలో సందిగ్ధపు సంధ్యలో కొట్టుమిట్టాడుతున్నారు.
ఈ సంక్షోభ సమయంలో ఇక సాహిత్యమేం చదువుతారు? ప్రపంచీకరణ ప్రభావంతో అభివృద్ధి చెందుతున్న దేశాల భాషాసాహిత్యాలు కనుమరుగయ్యే పరిస్థితులు దాపురించాయి. మార్కెట్ సాహిత్యానికి ఉన్న పబ్లిసిటీ, ప్రాచుర్యం, సీరియస్ సాహిత్యానికి ఉండదు. పైగా ఇంగ్లీషు ఒక్కటే ప్రపంచీకరణ భాషగా అభివృద్ధి చెందడంతో ఆ భాషలో ప్రచురించే ఇతర భాషా సాహిత్యాలనే అంతర్జాతీయ పబ్లిషింగ్ సంస్థలు మార్కెటింగ్ చేయగలిగాయి. తల్లి అల్లమాయే పెళ్లాం బెల్లమాయే అన్నట్టు విదేశాలలో ఉన్న భారతీయ రచయితలు తమ మాతృదేశ ఆచార సంప్రదాయాలను ప్రపంచీకరణ విలువలకు జోడించి రచనలు చేసి లబ్దిపొందుతున్నారు. ఇంటర్‌నెట్‌లు, ఫేస్‌బుక్‌లు, బ్లాగులు, ట్విట్టర్లు మొత్తం యువతరం మెదళ్ళకు చెదలు పట్టించాయి. కొన్ని సాహిత్యపు వెబ్‌సైట్‌లు ఉన్నా వాటిలో సీరియస్ సాహిత్యం ఉండదు. ప్రపంచీకరణ దుష్ప్రభావాలు అట్టడుగు ప్రజల బతుకు చిత్రాలను ఎలా ఛిద్రం చేస్తున్నాయో చిత్రించిన రచనలు కనిపించవు. ఇలాంటి తరుణంలో పాశ్చాత్య కల్చర్ సాహిత్యం ప్రపంచమంతటా నెట్‌లోకే కాదు మార్కెట్‌లోకి దూసుకొచ్చింది. అయితే గతంలో 1995 తర్వాత మన సాహిత్యంలో ప్రపంచీకరణ దుష్ప్రభావాల నేపథ్యంలో సామాజిక విధ్వంసాల మూలాల్లోకెళ్ళి కవులు రచయితలు ఒక అలజడి, అస్థిరత, అభద్రత, మానవ సంబంధాల్లో వస్తున్న అనూహ్య మార్పులను, పల్లెలు, కుల వృత్తుల విధ్వంస జీవన దృశ్యాలను అక్షరీకరిస్తూ వచ్చారు. అది 2015నాటికి ప్రపంచీకరణ పెనుభూతం వికృత రూపం దాల్చడంతో ఇప్పుడు సృజనకారులు క్రమక్రమంగా అంతర్ముఖులవుతున్నారు. వస్తువైవిధ్యం శిల్పసోయగమంటూ కవిత్వం గెలికేస్తున్నారు. ఎక్స్‌స్ట్రిమిస్టులను తయారుచేసే సృజనకారులు ఎస్కేపిస్టులుగా మారిపోయారు. మరికొందరు తూ.తూ మంత్రంగా ప్రపంచీకరణ దుష్ప్రభావాలపై కవితలూ కథలూ రాస్తున్నా వాటి ప్రయోజనం అంతంతమాత్రమే... బలమైన సామాజిక ఉద్యమాలు లేకపోవడంవల్ల సాహిత్యం ఉద్యమ ఉధృతినందుకోలేకపోతోంది. పైగా ప్రజాఉద్యమాల్లో ప్రత్యక్ష పోరాటాల్లో పాల్గొన్నవారు రచనలుచేయడం తగ్గిపోయింది.
ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ ఉద్యోగులు సాహితీ సృజనచేసే మధ్యతరగతి మందభాగ్యులే ఎక్కువగా కనిపిస్తున్నారు. వీరిలో అధిక సంఖ్యాకులు ప్రపంచీకరణ అంటే ఏమిటో తెలియని తికమకలో ఉండటంవల్ల, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, సాంఘిక, రాజకీయ రంగాల్లో వస్తున్న మార్పులు, కన్స్యూమరిజం, గ్లోబల్ మార్కెట్ దోపిడీ విధానాలు, ప్రజాప్రభుత్వాల దళారీగిరి విధానాలు, మేడిపండు సంక్షేమ పథకాల లొసుగులు, వాటి ఫలితంగా సామాన్య మధ్యతరగతి ప్రజల దుర్భర బతుకుల విషాద గాథలకు కారణాలను అనే్వషించి అక్షరీకరించడంలో విఫలమవుతున్నారు. అన్నింటినీ ధ్వంసం చేసి మార్కెటింగ్ చేయడమే ప్రపంచీకరణ ప్రధాన లక్ష్యం. ఈ విషయం లోతులకు వెళ్లకుండా తెలుగు సాహిత్యకారుల్లో చాలామంది రోగమొకటైతే మందొకటన్నట్టు తమ కథల్లో కవితల్లో పైపై దృశ్యాలకే రంగులద్దారు. మూలాలకు వెళ్ళే పరిశీలనలు, మానవ విలువల విధ్వంసాల కారణాలను, ప్రపంచీకరణ కుట్రలను పసిగట్టడంలో చాలావరకు వైఫల్యం చెందారు. సాహిత్యం ఉద్యమాలను విప్లవాలను సృష్టించే కాలం పోయింది. విడదీసే సంస్కృతిలో నలుగురిని ఒకచోట చేర్చి వాస్తవాలు వెల్లడించి చైతన్యపరిచే ప్రజానాయకులు, సృజనకారులు, ప్రజాసాంస్కృతిక కళాసాహిత్య వేదికలు కరువయ్యారు.
కొందరు కథకులు సెజ్‌లు, కారిడార్లు భూదురాక్రమణలు, రాజధాని నిర్మాణం పేరిట విలువైన రైతుల భూములు లాక్కోటాలు, జపాన్, సింగపూర్ ప్రణాళికల వెనుకదాగిన ప్రయోజనాల గురించి, రైతుల ఆత్మహత్యల గురించి కథలు కవితలు రాయడం బానే ఉంది గాని అదే కవులు ప్రభుత్వాలు ఇచ్చే ఉగాది పురస్కారాలకు, పుష్కర కవి సమ్మేళనాల సన్మానాలకు ఎగబడటంతో వారి నిబద్ధత ప్రశ్నార్థకమవుతోంది. జలగం వెంగళరావు లాంటి ముఖ్యమంత్రులను తన కవితాస్త్రాలతో ఎదుర్కొన్న శ్రీశ్రీగాని, చెరబండరాజు లాంటి నిబద్ధత కలిగిన విప్లవ రచయితలు గాని ఇవాళ లేకపోగా ప్రపంచీకరణ అంటే ఏమిటో తెలియని అల్పమతులైన కవులు రచయితలు మిగలడం తెలుగు సాహిత్య దౌర్భాగ్యం, ప్రపంచీకరణ పెనుమంటల్లో సమాజం తగలబడిపోతుంటే, మానవులంతా మార్కెట్ వస్తువులై అమ్ముడుబోతుంటే, ప్రభుత్వాలు కార్పొరేట్ ప్రపంచానికి కామన్ ప్రజానీకానికి మధ్యదళారీలుగా మారిపోతుంటే ఇంకా కులం, ప్రాంతం, అస్తిత్వం, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అంటూ రంకెలేస్తూ సృజనకారులు గ్రూపులుగా, కూటాలుగా విడిపోవడంవల్ల ప్రయోజనం లేదు. అందరూ ఏకంకావాల్సిన సందర్భమిది.
ఎందుకంటే దక్షిణాది రాష్టమ్రైన కర్నాటకలో జరిగిన కాల్బుర్గి హత్యను నిరసిస్తూ నయనతార సెహగల్‌తోపాటు ఉత్తరాది రచయితలు ప్రముఖ హిందీ కవి అశోక్‌వాజ్‌పెయ్, మహారాష్ట్ర కవి రెహమాన్ అబ్బాస్, పంజాబ్‌కు చెందిన భల్లార్, అజ్మిర్‌సింగ్, గుజరాత్ రచయితలు గణేశ్‌దేవి తదితరులు తమ సాహిత్య అవార్డులను వెనక్కు ఇచ్చేశారు. అప్రజాస్వామిక నరహంతక ముఠాల హత్యాకాండలను, రక్తక్రీడలను సామూహిక కంఠంతో ఖండించారు. ఇంతవరకు బాగానే ఉంది. ఏదో ఇద్దరు ముగ్గురు రచయితలను చంపితేనే దేశమంతటా రచయితలు ఉద్యమించారే ప్రపంచీకరణ పేరుతో కోట్లాది మంది పేదలను, రైతులను రోజూ చంపుకుతింటున్న ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ దేశవ్యాప్తంగా రచయితలు, సృజనకారులు సాహిత్య ఉద్యమాలు ఎందుకు చేపట్టకూడదు. ఎందుకంటే గత పదిహేనేళ్లలో సుమారు లక్ష మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. పల్లెల నుండి రైతు కుటుంబాలనుండి వచ్చిన సృజనకారులు ఇప్పటివరకు అందుకున్న సాహిత్యపు అవార్డులను రివార్డులను ఎందుకు ప్రభుత్వాల మొహాన విసరికొట్టకూడదు? సమాజంలో బలమైన సామాజిక ఉద్యమాలకు సాహిత్యం ఎందుకు ప్రేరణగా నిలవకూడదు?. రవిగాంచని కవిగాంచునన్నారు. మరి ప్రపంచీకరణ కుట్రలు ఈ కవులకెందుకు కనిపించవో.. గతంకన్నా ఇప్పుడే సృజనకారులు తమ కలాలకు ఎక్కువగా పదునుపెట్టాల్సిన అవసరం ఉంది.

- బిక్కి కృష్ణ, 9912738815