సాహితి

కళింగాంధ్ర కథల వారధి బలివాడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేపటి వాస్తు శిల్ప వికాసంమీద ఒక కల్పనా సాహిత్యం సృష్టించే రచయితగా, కథా సంవిధానం తెలుసుకొని, ఉత్తమ కథా రచయితగా పలువురి ప్రశంసలందుకున్న సాహితీమూర్తి, సుప్రసిద్ధ కథా, నవలాకారుడు బలివాడ కాంతారావుగారు ఒక మాటంటారు- ‘‘ఎందరో రచయితల ఊహల్ని పంచుకోవడం వలన రచయిత ఎదుగుతాడు. ఏదో ఒక ఆదర్శం వెంట నడవనిదే రచయిత మనగలగలేడు. ముందుతరాలు మన కథలు చదవాలి. ఈ తరం నాడిని వైద్యునిలాగా పరీక్షించగలగాలి’’. మరో ఫ్రెంచి రచయిత విక్టర్ హ్యూగోనిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ‘తన తరం కోసమే రచయిత రాస్తే నేను నా కలాన్ని విరిచి పారేస్తాను’ అన్నారు. అలా చెప్పడంలోని ఔచిత్యం రచయితగా ఎంత బలవత్తరమైందో అర్థవౌతోంది.
బలివాడ కాంతారావు 1949-50 సంవత్సరాల మధ్యకాలంలో విశాఖ రచయితల సంఘం ఏర్పాటులో కొంతమంది సాహితీ మిత్రులు మసూనా, ఎం.జి.కె.మూర్తి, శ్రీనివాసుల శ్రీరామమూర్తి, అంగర సూర్యారావు ఒక సమావేశంగా ఏర్పడినపుడు బలివాడ కాంతారావుగారి వయసు పాతికేళ్లు మాత్రమే. నిరాడంబరంగా, నిష్కల్మష హృదయంతో అందరి మన్ననలు పొంది, సభ్యుడిగా చేరి ఆకట్టుకున్నారు. అప్పటికే అనేక వార, మాస పత్రికల్లో వారి రచనలు ప్రచురింపబడటం, అందరూ చిరపరిచితుడిలాగానే ఆహ్వానించారు.
బలివాడ కాంతారావుది ఉదాత్త స్వభావం, ఆ వయసులోనే కనపడే అణుకువ, నమ్రత, ఎవ్వరినైనా ఒక్కలాగనే ఆదరించడం, వారిలో కనిపించే చిన్న నవ్వే ఆ సుగుణం. తన కథల ద్వారా సంఘం కుళ్ళును తుడిచిపెట్టాలని, అట్టడుగు వర్గాల జీవితాల్ని సరిదిద్దాలని తపన పడేవారు. ఆ నేపథ్యంలో రచించిన కథ ‘వదిన’ చదివిన వారి కళ్లు చెమర్చకుండా ఉండవు.
బలివాడ కాంతారావు 1927 సంవత్సరం జూలై మూడో తేదీన జన్మించారు. చిన్నతనంలోనే చదువుకోసం పక్క గ్రామాలకు వెళ్లవలసి వచ్చింది. హైస్కూలు చదువు పూర్తిచేసిన అనంతరం విశాఖపట్నంలోని నేవల్ ఆర్మమెంట్ డిపోలో ఉద్యోగిగా చేరారు. అంచెలంచెలుగా పదోన్నతి పొంది, ఉన్నత అధికారిగా అనేక ప్రాంతాలలో పనిచేసి అపారమైన అనుభవం సంపాదించారు. అందుకు వారి రచనలే తార్కాణం. ఉద్యోగ రీత్యా విశాఖపట్నంలో నివసించినప్పుడు ఉదయం ఆరింటికి బయలుదేరిన వ్యక్తి సాయంత్రం ఆరింటికి ఇంటికి చేరి ఎటువంటి విరామం తీసుకోకుండా సాహితీమిత్రుల కొలువులో గడిపేవారు. ఆర్.కె.బీచ్‌లో కూర్చొని గంటల కొద్దీ సాహితీ చర్చలలో మునిగేవారు. ఒకమారు వారు రాసిన ‘గోడమీద బొమ్మ’ వరుసగా కొన్ని రోజులు మిత్రులకు చదివి వినిపించి లోటుపాట్లు సరిదిద్దుకున్నారు. తన పురోభివృద్ధికి విశాఖ రచయితలు, విశాఖ ప్రాంత అందచందాలు, సాగరతీరాన షికార్లు, ఆపైన విశాఖలోని గవర్నమెంటు ఉద్యోగం ఇవన్నీ తనకెంతో దోహదపరిచాయని మిత్రులతో పదేపదే చెప్పుకుంటూ ఆనందపడేవారు. ప్రముఖ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీగారు బలివాడ కాంతారావుని కలిసినపుడు ఆయన ఎంతో ఆశ్చర్యంతో భుజం తట్టి ‘‘కథలు బాగా రాస్తున్నావ్, వాటి తీరు చూస్తే ఏ షష్ఠిపూర్తి చేసుకున్న రచయితోనని భావించాను. నీవు పాతికేళ్లకే ఇంత కథకుడివయ్యావు’’ అని సంతోషంతో అక్కున చేర్చుకుంటూ, ‘‘నీలా రాయడం ఎవరికీ సాధ్యపడదు’’ అన్నారు ప్రోత్సాహంగా.
కళింగాంధ్ర జనం గుండె చప్పుళ్ళను కైవసం చేసుకున్న రచయితల్లో ప్రముఖులు బలివాడ కాంతారావు. వీరు వందకుపైగా చిన్నా పెద్ద నవలలు, దాదాపు ఐదు వందలకుపైగా కథలు, కొన్ని నాటకాలు, వ్యాసాలు రాస్తూ నిరంతర సాహితీ వ్యాసంగంలో తలమునకలయ్యేవారు.
వీరి నవల ‘పుణ్యభూమి’కి సాహిత్య పురస్కారం లభించింది. నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వారు ‘దగాపడిన తమ్ముడు’ నవలను అనేక భారతీయ భాషల్లోకి అనువదించారు. ‘ఇదే నరకం - ఇదే స్వర్గం’ హిందీ, ఆంగ్ల భాషల్లోకి అనువాదం జరిగి అందరి ప్రశంసలు పొందింది. ‘సంపంగి’ నవల అటు కన్నడం, ఇటు హిందీలోకి తర్జుమా జరిగింది. ‘అడవి మనిషి’ నాడు కొన్ని నేషనల్ ప్రోగ్రామ్స్‌లో ఆకాశవాణి ప్రసారం చేసింది. వారి కథలు కావిడికుండలు, అంతరాత్మ, ఢిల్లీ మజిలీలు, బలివాడ కాంతారావు కథలుగా ప్రచురింపబడ్డాయి. 1998లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందడం వారి సాహిత్యానికి ఎనలేని గుర్తింపు వచ్చినట్లయ్యింది. ‘శోధన’, ‘గోపురం’ అనే కథలను భారతీయ జ్ఞానపీఠ్, న్యూఢిల్లీవారు ‘ఋషికేష్ కా పత్తర్’ అనే సంకలనంలో హిందీలోకి తీసుకువచ్చారు. ‘మన్ను తిన్న మనిషి’ కన్నడంలోకి ‘కొత్తనీరు’గా అనువాదంలోకి వచ్చింది. దేవుళ్ల దేశం, మదనిక కూడా కన్నడంలోకి వెళ్లాయి. ఐదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యులుగా వ్యవహరించారు. వీరికి కీర్తితెచ్చి పెట్టిన నవలలపై ఇప్పటికే ఎంతోమంది విద్యార్థులు పిహెచ్‌డి చేసి ఉన్నారు. సమాజాన్ని అద్దం పట్టిన ఇతివృత్తంతో వచ్చిన ప్రముఖ నవలల్లో ‘ఇదేదారి’, ‘నాలుగు మంచాలు’ పేరు తెచ్చిపెట్టాయి. ఇటీవల మరో గొప్ప నవల ‘మత్స్యగంధి’ని వారి కుమార్తె ఆంగ్లంలోకి అనువదించి ఆవిష్కరించడంతో వారి నవలలు మళ్లీ వెలుగులోకి రావడం మొదలైంది.
తెలుగు కథకు విశ్వవిఖ్యాత కీర్తి గడించిన కథకులు పాలగుమ్మి పద్మరాజుగారు. ఆయన ఒక రోజు విశాఖపట్నంలో ఉన్న బలివాడ కాంతారావు ఇంటిని వెతుక్కొని వచ్చారు. ఒక గంటపాటు ఆత్మీయ సంభాషణ జరిపి, తనకు సమయం వెచ్చించినందుకు జీవితంలో అదొక మరపురాని ఘడియగా భావించారు. ఆ ఆనందోత్సవాలను పలువురితో ముచ్చటించుకున్నారు ఆనాడు.
సాహిత్యాన్ని ఒక చేత్తో అనేక అద్భుతాలు చేస్తూ అభినందనలు, పురస్కారాలు, అవార్డులు అందుకుంటూ, మరో చేత్తో ‘జ్యోతిషం’ లోతుల్ని పరిశోధించి ‘హస్తసాముద్రికం’లో కూడా పటిష్ఠమైన అవగాహనతో అనేకమందిని ఆశ్చర్యచకితుల్ని చేయడం, తాను ఒక సవ్యసాచిగా ఋజువు చేసుకున్నారు. వారు తన విలువైన జీవితానికి 2000 మే 26వ తేదీన దూరమయ్యారు.

- అడపా రామకృష్ణ, 9505269091