సాహితి

ఘటనాత్మక కవిత - ఒక భావన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సాహిత్యం సామాజిక విప్లవాన్ని తెస్తుంది. అది కాగడాలాంటిది, వేగుచుక్క లేదా మార్గదర్శి, సాహిత్యం సమాజాన్ని ప్రతిఫలిస్తుంది’, అది దానికి అద్దం వంటిది’’ - అని ఇలాంటి వాక్యాలు సాహిత్య విమర్శలో అటు లిఖిత రూపంలోను ఇటు వౌఖిక మార్గంలోను చాలాకాలంగా అనాదిగా వ్యాప్తిలో ఉన్నవి. ఈ వాక్యాల్ని అలవోకగా అంటుంటారు. అంత సీరియస్ విషయంగా మాత్రం చాలామంది పరిగణించరు. సమాజాన్ని ఎలా ప్రతిఫలించింది లేదా ఎలా ప్రభావితం చేసింది దీనివల్ల స్పష్టంగా ఇంత మేలు జరిగింది అని చెప్పే కొలబద్దలు కాని లేదా కొలిచి చెప్పిన దాఖలాలు కాని మనకేం దొరకవు. కవిత్వం మూలంగా సామాజిక పరిణామాలు ఎలా ఎంతమేరకు జరిగాయి అని చెప్పిన పరిశోధనాత్మక రచనలు కూడా లేవనే చెప్పాలి. తెలుగులో పరిశీలించి చూచినా మృగ్యం. కాని ఈ వ్యాసానికి ఇక్కడ ఒక స్పష్టమైన సందర్భం ఉద్దిష్ట ప్రయోజనం ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో రోహిత్ అనే విద్యార్థి ఆత్మహత్య ఘటనని పురస్కరించుకొని చాలామంది కవులు కవితలు రాశారు. వాటిని అన్నింటిని కలిపి మిత్రులు ఒక కవితా సంకలనంగా తెచ్చారు. కొంచెం వెనక్కి జరిగితే దాదాపు ఒకటి రెండేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లా సోంపేట దగ్గర దళిత రైతుల పైన హత్యాకాండకు ప్రతిస్పందనగా వచ్చిన వాటిని డా. కోయి కోటేశ్వరరావు ఒక కవితా సంకలనాన్ని ప్రచురించారు. ఇలాగే ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలపైన మంచి కవితా సంకలనాలు వచ్చాయి. దాదాపు ఒకటిన్నర దశాబ్దం క్రితం మహారాష్టల్రో తీవ్ర భూకంపానికి గురైన ఉస్మానాబాద్‌కు చాలామంది తెలుగు కవులు బృందంగా వెళ్లి కవితలు రాశారు. వాటన్నింటినీ ఒక సంకలనంగా అచ్చువేశారు. ఇందులో కొన్ని ప్రాచీన పద్య ప్రక్రియలో ఉన్నాయి. మరికొన్ని ఆధునిక వచన కవితలున్నాయి. అక్కడి విషాదాన్ని కళ్లకు కట్టినట్లు ప్రతిభావంతంగా చూపారు కవులు. మరీ ఇటీవల అసహనం అనే అంశంమీద, గోహత్య మీద సమాజంలో చాలా చర్చ జరిగింది. గోవు అనే అంశం మీద ముగ్గురు దళిత కవులు మంచి కవితలు రాశారు. సమాజంలో జరుగుతున్న వైపరీత్యాల గురించి ప్రకృతి వైపరీత్యాల గురించి ఇలా కవులు ఝటితిగా స్పందించడం, కవిత్వం రాయడం ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా జరుగుతూ వచ్చింది. ప్రత్యేకించి కవితా సంకలనాల రూపంలో రావడం ఇటీవలి కాలంలో వచ్చిన మంచి పరిణామం.
మాధ్యమవ్యాప్తి అనేది కవితా ప్రక్రియ వ్యాప్తికి ప్రధాన కారణమైంది. కవులు తమ దృష్టిలోనికి వచ్చిన ఘటనపైన రాస్తున్న కవితలకు వ్యాప్తి వచ్చింది. ఈ కారణంగానే ప్రతి సామాజిక సంఘటనకు స్పందనగా కవితలు రావడం బాగా పెరిగింది. ఇలా ప్రముఖ సంఘటనలకు స్పందనగా వచ్చే కవితలను ‘ఘటనాత్మక కవిత్వం’ అని కొత్త వర్గంగా సాహిత్య విమర్శలో, తెలుగు సాహిత్యంలో వ్యవహరించాలని ప్రతిపాదిస్తున్నాను. ఈ ఘటనాత్మక కవితకు కొన్ని లక్షణాలు మనకు కనిపిస్తాయి. ఒకటి ఝటితిగా స్పందించడం, రెండు తీవ్రమైన లోతైన భావన ఉండటం. ఇది ప్రధానంగా వేదన కాని ఆగ్రహం కాని, ఆవేదన కాని కావడం, జరిగిన ఘటనకు నిరసన తెలపడం, జరిగిన ఘటనల పట్ల ఆగ్రహాన్ని ప్రకటించడం, అనుచిత సామాజిక క్షోభ కలగకూడదని కోరుకోవడం ఇవి ప్రధానంగా కనిపించే లక్షణాలు. జరిగిన సంఘటన ప్రజల మనస్సులో తాజాగా ఉంటుంది కాబట్టి రాసిన కవిత ప్రజలకు త్వరగా బలంగా తాకుతుంది. ప్రజల్లో ఒక సానుభూతిని కలిగిస్తుంది. వారి స్పందనను కూడా ఝటితిగా రాబట్టుకోగలుగుతుంది.
సిరియాలో సముద్ర తీరానికి కొట్టుకు వచ్చిన ఐదారేళ్ల బాలుడి మృతదేహం ప్రపంచవ్యాప్తంగా చాలామందిని కదిలించింది. ఈ ఘటనపైన మన వద్ద కూడా కవితలు వచ్చాయి. ఇక్కడ చెప్పేదేమంటే ఘటనాత్మక కవిత అన్నది ప్రాంతీయ, జాతీయ వస్తువులపైనే కాకుండా అంతర్జాతీయ వస్తువు పైన కూడా ఉండవచ్చుననే. ఇది కూడా ఒక లక్షణంగా పేర్కొనవచ్చు. చరిత్రలోకి తొంగిచూస్తే ప్రాచీన కవితలో కూడా ఘటనాత్మక కవిత ఉందని చెప్పడానికి వీలుంది. రాజులు యుద్ధాలలో గెలిచినప్పుడు వారి విజయ యాత్రలను, దండయాత్రలను తర్వాతి రాసిన కావ్యాలలో పేర్కొన్నారు. పెద్దన తన మనుచరిత్రలోనూ, తిమ్మన తన పారిజాతాపహరణంలోను కృష్ణరాయల విజయ యాత్రలను సుదీర్ఘంగా వర్ణించారు. ఇది ఒక రకంగా ఘటనాత్మక కవిత్వమే. ప్రాచీన కవితలో ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయో శోధించి వివరిస్తే అదొక పరిశోధన అవుతుంది. ఇటీవలి కాలంలో వస్తున్న పై తరహా కవితను ఘటనాత్మక కవిత అని, మరింత సులభంగా ఘటనా కవిత అని కొత్తగా వ్యవహరించవచ్చు. ఒక పది సంవత్సరాలలో, గడచిన దశాబ్ద కాలంలో లేదా గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో వచ్చిన ఘటనాత్మక కవితలను గ్రహించి ఒక పిహెచ్‌డికి అవసరమైనంత పరిశోధన చేయడానికి అవకాశం ఉంది. ఈ ఘటనాత్మక కవితలలో సామాజిక స్పృహ సంపూర్ణంగా ఉండటం వీటికున్న మేలి గుణం.

- పులికొండ సుబ్బాచారి, 9440493604