సాహితి

వాస్తవి‘కథ’కు ప్రతిబింబం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాత్రముల చరిత్రములను విస్తరించుటలో వర్ణనీయమైన పద్ధతి యేదనగా
స్ర్తి పురుషులు గుణానుగుణమైన నడవడిగలవారయ్యును
ప్రపంచాచారములయందు వలెకావ్యములందును
గాల దేశవర్తమానములవలన
నొక్కొక్కయెడ విరుద్ధమైన వర్తనము గలవారుగా
నున్నట్లునూ ప్రదర్శించుట.
(కట్టమంచి రామలింగారెడ్డి: కవిత్వత్త్వ విభాగము (1947) పు.21)
సమాజం స్థలకాల పాత్రబద్ధమై నడుస్తుంది. సామాజిక వాస్తవికతకు కళాత్మక ప్రతిబింబమైన సాహిత్యం కూడా స్థలకాల పాత్రబద్ధంగానే పుడుతుంది. రామాయణ భారతాలు మొదలుకొని ఏ సాహిత్యానికైనా ఈ నియమం వర్తిస్తుంది. అమరావతి కథలు (సత్యం శంకరమంచి) పెనే్నటి కతలు (పి.రామకృష్ణారెడ్డి) వంటివి స్థలబద్ధమైనవి. తొలితరం తెలుగు కథలు, (మధురాంతకం రాజారాం.సం) తొలితరం తెలంగాణ కథలు (ముదిగంటి సుజాతారెడ్డి.సం) వంటివి కాలబద్ధమైనవి. వటీరావు కథలు (చింతాదీక్షితులు) కాంతం కథలు (మునిమాణిక్యం నరసింహారావు) అత్తగారి కథలు (్భనుమతీ రామకృష్ణ) మాయమ్మ జెప్పిన కతలు (నాయిని సుబ్రహ్మణ్యంనాయుడు) వంటివి పాత్రబద్ధమైన కథలు. అయితే ఈ మూడు రకాల కథలు విడివిడి ప్రక్రియలు కావు. ప్రతి దానిలోనూ తక్కిన రెండు కలిసి ఉంటాయి.
సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి స్థల కాల పాత్రబద్ధమైన కథల రాయడంలో దిట్ట. 1985 తర్వాత రాయలసీమ ప్రాంత ప్రజా జీవిత ప్రతిఫలనాలు ఆయన కథలు. ఆయన రాసిన ఎనభై కథలలో దాదాపు పది కథలలో పాత్రబద్ధత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆ పది కథలూ ఉత్తమ పురుషలో నడుస్తాయి. కథకుడు కథ చెబుతుంటాడు. ఆ కథలలో ఇందిర ఆయన భార్యగా వస్తుంది. కథకుడు పాఠశాల అధ్యాపకుడు. సైకిల్ మీద చుట్టుపక్కల గ్రామాలలో ఉద్యోగం చేస్తూ వ్యవసాయం కూడా చేస్తుంటాడు. చదువుకున్నపల్లె సంస్కారాన్ని శ్రామిక సంస్కృతిని వదులుకోని మనిషి. ఇందిర గృహిణిగా ఉంటుంది. కొన్ని కథలలో నామమాత్రం గానూ, కొన్ని కథలలో ప్రధానంగానూ ఉంటుంది. ఇందిర రాయలసీమ గ్రామీణ మహిళా సంస్కారానికి ప్రతీకగా కనిపిస్తుంది. సమాజం మారుతున్నా గ్రామీణ స్వభావం వదులుకోని స్ర్తి ఇందిర. భర్త ఆమెను మార్చే ప్రయత్నం చేసినా తన వౌలికతకు కట్టుబడి నడిచే పాత్ర ఇందిర. రాయలసీమలోని పోరు మామిళ్ళ ప్రాంతంలో ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబ మహిళకు ప్రతినిధి ఇందిర.
సన్నపురెడ్డి వాస్తవికవాద కథకుడు గనక ఇందిరను వాస్తవిక పాత్రగానే చిత్రించారు. ఆదర్శీకరించలేదు. ఇందిర కథకుని తల్లికి మేనకోడలు. ఆమెకు మధ్యతరగతి వ్యవసాయ కుటుంబ స్ర్తికి ఉండే బలమూ బలహీనతా రెండూ ఉన్నాయి. ఆమె గ్రామీణ మహిళ గనక ఊరికే పరిమితమై ఉంటుంది. ఒక్క కథలో బెంగుళూరికి వెళుతుంది. 1994నాటి ‘గిరిగీయొద్దు’ కథలో ఇందిర మొదటిసారి పరిచయవౌతుంది. భర్త ఉద్యోగం చేస్తుండగా అత్తమామలు కసువూడ్చడం, పేడ ఎత్తివేయడం వంటి పనులు చేయడం ఆమె సహించదు. ఇందుకు రెండు కారణాలు. 1.ముసిలోళ్ళతో పనిచేయిస్తున్నారని ఇరుగు పొరుగు వాళ్ళు ఆడిపోసుకుంటారన్న భయం. 2. పెద్దవాళ్ళు కాలోచేయో విరిగితే ఎలా అన్న భయం. మూడోది కూడా ఉంది. ఎదురింటి పెద్దాయనను ఆయన కోడళ్ళు ఏ పనీ చేయకుండా కట్టడిచేశారు. తాను అలా చేయలేకపోతున్నాననే బాధ. అయితే కథ ముగిసేలోపల ఇందిరకు తెలియని విషయమేమంటే ఎదురింటి పెద్దాయన కోడళ్ళ ఒత్తిడికి లొంగి పగటిపూట గమ్మున ఉన్నా, రాత్రిపూట వీధిలో పేడను కూడేస్తూ ఉండడం. దానిని కథకుడు గమనిస్తాడు. తన తల్లిదండ్రులను నిర్బంధించకూడదనుకుంటారు. ఇది అచ్చంగా మధ్యతరగతి స్వభావాన్ని ఆవిష్కరించిన కథ. దానికి ప్రతినిధి ఇందిర. ఇందిర మంచి వంటలక్క. తక్కువగా తిందామనుకున్న కథకుడు ఇందిర చేసిన పుల్లగూర రుచివల్ల ఎక్కువగా తింటాడు.
‘ఒక్క వాన చాలు’ (1994), చనుబాలు (1996), వసంతం (2001) కథలలో ఇందిర సూచన ప్రాయంగా కనిపిస్తుంది. ‘ఒక్క వాన చాలు’ లో రాత్రిపూట వానను కలవరిస్తూ, వానొచ్చి తడిసిపోయినా ఫరవాలేదనుకొని ఇంటి బయట మంచమేసుకొని పడుకున్న భర్తను, రెండు చినుకులు రాలగా, వానొస్తుంది లేచి ఇంట్లో పడుకోమని హెచ్చరిస్తుంది. ఈ కథలో వానకోసం భర్త పడుతున్న తపనలో ఆమె భాగస్వామి అయినట్లు లేదు. తక్కిన రెండు కథలలో ఆమె రెండు వ్యాఖ్యానాలు చేస్తుంది. ‘చనుబాలు’లో దళిత పొట్టక్కపాలు తాగి పెరిగి పెద్దవాడై ఆమె పట్ల గౌరవం కలిగిన కథకుడు, పెద్ద ఉద్యోగి అయినాక అందరూ ఆ విషయాన్ని గుర్తుచేసి ఎగతాళి చేస్తుంటే ఆమెను దూరంగా ఉంచాలనుకుంటాడు. ఆమెను దగ్గరికి చేరదీయొద్దని తల్లికి, ఇందిరకు చెబుతాడు. అప్పుడు ఇందిర ‘పొట్టక్కను జాగ్రత్తగా చూసుకోమని నువ్వే చెప్పినావే’ అని దెప్పిపొడుస్తుంది. తన భర్త పొట్టక్క పాలు తాగి పెరిగిన విషయం పట్ల ఇందిరకు అభ్యంతరం ఏమీ కనిపించినట్లు లేదు. బయట జరిగే ప్రచారంతో భర్త సతమతమవుతుంటే తన స్పర్శతో ఉపశమనం కలిగించింది ఇందిర. ‘వసంతం’ కథలో పెళ్ళిచేసుకొని పెళ్ళాంతో కాపురం చెయ్యడానికి భయపడుతూ తప్పించుకు తిరుగుతూ తన గదిలోకి దూరిన బాల కొండన్నను ‘అట్టాంటోడు పెళ్ళెందుకు చేసుకోవా’లని నిలదీస్తుంది ఇందిర. బతుకు సేద్యం కథలో ఒక్క క్షణం కనిపిస్తుంది.
‘గంపెడు గడ్డి’ (2005), ‘రాలిన చింతపండు’ (1994), ‘ఆమె మొలకెత్తిన నేల’ (2008) కథలలో ఇందిర తనను తాను వాస్తవిక ముఖాలతో ఆవిష్కరించుకుంటుంది. అచ్చమైన మధ్యతరగతి మహిళగా రుజువు చేసుకుంటుంది. ‘రాలిన చింతపండు’లో గురమ్మ పేద స్ర్తి. ఆమె స్థలంలో ఒక చింత చెట్టు ఉంది. దాని కొమ్మలు కథకుని పొలంలోకి విస్తరించి కొంత నేల పైరుగాకుండా పోయింది. అయినా పేదరాలు జోలికి పోతే ఆమె గొడవకు దిగితే తలవంపులని భయపడి ఇందిర వౌనంగా వుండిపోతుంది. శేషమ్మ అనే మరో పేదరాలు గురమ్మతో కొట్లాడి, గొడవపడి తెచ్చిన చింతపండును తీసికొని దాచుకోడానికి వెనుకాడదు. అందుకు ప్రతిఫలంగా కొన్ని కాఫీనీళ్ళు, సాయంకాలం చారు బువ్వ ఇస్తానంటుంది. భర్తతో, గురమ్మ శేషమ్మల గొడవను గురించి కొట్లాడుకోవడం పేదోళ్ళకు మామూలే అని వ్యాఖ్యానిస్తుంది. ఇతరులది ఎలాగైనా తనకువస్తే వద్దనని స్వభావం ఈ కథలో కనిపిస్తుంది. ‘గంపెడు గడ్డి’లో తనది ఇతరులకు వెళితే గొడవపడే లక్షణం అభివ్యక్తవౌతుంది. తమ పొలంలో దొంగతనంగా గడ్డికోసుకుపోతున్న అందమైన యువతిని ఏదో బలహీనత వల్ల కథకుడు నివారించలేకపోతున్నాడు. ఆమెను నివారించడం తనవల్ల కాదనుకున్న కథకుడు ఆ పనిని ఇందిరకు అప్పజెప్పుతాడు. ఇందిర తానొక ఉద్యోగి భార్యనన్న సంగతి కూడా మరచిపోయి, గడ్డికోసుకుపోయే అమ్మాయిని దులిపేసింది. భర్త అంచనాలకు మించి విజృంభించి, మళ్ళీ చేలోకి వస్తే చెప్పుతో కొడతాననే దాకా పోయింది ఇందిర. గొడవలకు సంపద మూలం అని తెలియని ఇందిర గొడవ పడడం పేదోళ్ళ లక్షణమని వ్యాఖ్యానించి, తన గడ్డి తీసుకుపోయే పేదమ్మాయి మీద, తాను పేద కాకపోయినా గొడవకు దిగింది. ఇదీ మధ్యతరగతి లక్షణం.
‘ఆమె మొలకెత్తిన నేల’ కథలో ఊరు దాటిపోని ఇందిరను కథకుడు బెంగుళూరుకు పిల్చుకుపోతాడు. పల్లెటూరునుండి మహానగరం చేరినా ఇందిర తన సహజమైన పల్లెమాటల్లో పల్లె సంబంధాలనే వ్యక్తం చేస్తుంది. ఎవర్ని ఎవరూ పట్టించుకోని మహానగరంలో, అందులోనూ ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో వండుకోడానికి స్టౌలేని ఓ నడిప్రాయపు జంట స్టౌ అడగడానికి ఇబ్బందిపడుతుంటే ‘అంత నోరూ సచ్చినోళ్ళయితే ఎట్టా?’ అని సాటి రోగుల దగ్గర స్టౌ తీసివ్వడానికి ప్రయత్నించింది. కూరలు లేకుండా తింటున్న జానకమ్మకు తన కూర అడిగి మరీ పెట్టింది. ఆసుపత్రి రెస్ట్‌హౌస్‌లోని అందరినీ కలుపుకొని రాత్రి పదకొండు దాకా నవ్విస్తూనే మాట్లాడుతుంది ఇందిర. ముఖ్యంగా పనివాళ్ళతో. కథకుడు ఇందిరకు నగరం చూపించి ఆమెలో మార్పు తేవాలనుకుంటాడు. బస్సులో కూర్చొని మొక్కజొన్న కంకిని పళ్ళతో కొరికి తినడం మొదలుబెట్టింది. భర్త ఆమెను మార్చాలని ప్రయత్నించాడు. ఆమె బదులిచ్చింది. ‘పల్లె దాన్ని పల్లెదాన్నట్లా వుండక ఎట్లుంటా? కొత్త తావుకొచ్చినపుడంతా మారి, కొత్త కూతలు కుయ్యాలంటే నేనేం అయ్యగారి ముసలి బాపనమ్మను గాను. మనూరి మాటలే నేను మాట్లాడతా. నాయట్లే ఆ వూరు దిరిగి ఒకమాటా, రుూవూరు దిరిగి ఒక మాటా నే నేర్చుకోలే’’ అని. కథంతా చెప్పిన కథకుడు చివరికి ‘‘వాటన్నిటికీ కారణం ఆమె పల్లెదనమే’’నంటాడు.
సన్నపురెడ్డికి గ్రామీణ మానవ సంబంధాలు ప్రత్యక్ష అనుభవాలు. ఆయన కథలు వాటి ప్రతిఫలనాలు. ఆయన చిత్రించిన ఇందిర మూస పాత్రకాదు. యాస పాత్ర. రాయలసీమ గ్రామంలో నివాసమున్న పాత్ర. ఆమె భాష ఆమెది. ఆమె ఆలోచన ఆమెది. ఆమె ఆచరణ ఆమెది. ఇందిరలో మెచ్చదగినవీ ఉన్నాయి. నొచ్చదగినవీ ఉన్నాయి. ఎందుకంటే జీవితంలో ఆ రెండూ ఉన్నాయి గనక. పల్లె మట్టిలోంచి, సీమ నీళ్ళలోంచి సేద్యం చెమటలోంచి మధ్యతరగతిలోంచి స్వస్వరూపంతో ఆవిష్కృతమైన పాత్ర ఇందిర.
ఇంకా చాలా కథలలో కథకుడు ఆయన భార్య పాత్రలుగా ఉంటారు. అక్కడ కూడా ఇందిరే ఉంటుంది. కొందరు కథకులు ఒక్కొక్క అనుభవాన్ని, ఒక్కొక్క భావనను చిత్రించడానికి ఒక్కొక్క పాత్రను సృష్టిస్తారు. సన్నపురెడ్డి అనేక అనుభవాలను, భావనలను చెప్పడానికి ఇందిరను సృష్టించాడు.

- రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, 9440222117