సాహితి

‘నానీల పీఠికా ప్రస్థానం’లో కవిత్వ పాఠాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు కవిత్వరంగంలో లఘు కవితా కిరణం ఒకటి వెలిగింది. అది ‘నానీలు’ కవితా రూపం. ఇది డా. ఎన్.గోపి చేతిలో నిర్దిష్టంగా రూపుదిద్దుకుంది. ఆయన కలం నుంచి ధారావాహికంగా కొన్నాళ్లు వెలువడ్డాయి. ఆ తరువాత ఆపేసారు. కానీ నానీలు విజృంభణ ఆగలేదు. నానీల్లో కవితా సృజనకి విరామం లేదు. నిర్విరామంగా సీనియర్ కవులనుండి కొత్త కవులదాకా, వయోధికుల నుండి బాలకవులదాకా నానీలను తలకెత్తుకున్నారు. కళ్లకద్దుకున్నారు. మనసున హత్తుకున్నారు. ‘నానీలు చిన్న కప్పుల్లో జలపాతాలు వర్షిస్తున్నట్టు’గా రాస్తున్నారు. ఇప్పటివరకు 270కి పైగా నానీల పుస్తకాలు వెలువడ్డాయి. వేలాది నానీలు పత్రికల్లో వచ్చాయి. ‘ముత్యాల సరాలు’ తరువాత బాగా నిలదొక్కుకున్న కవితా రూపం ‘నానీ’ అన్న నాగభైరవ ప్రశంస అతిశయోక్తి కాదు. ఎందరో సాహిత్యేతర కారణాలతో కువిమర్శలు సంధించారు. నానీల సూర్యుళ్లని అడ్డగించాలని విఫలయత్నం చేసారు. నానీలే గెలిచాయి. విమర్శలు చేసిన నోళ్లు మొత్తానికి మూతపడ్డాయి. నానీలు మాత్రం తెలుగు తోటలో గులాబీల్లా రోజూ పూస్తూనే వున్నాయి. ఇది నానీ ప్రక్రియా విశిష్టతగా గుర్తించవచ్చు.
నానీలు అనుష్టుప్ ఛందం నుంచి ఆటవెలది ఛందం దాకా చేసిన పరిశీలనతో స్థిరపడిన కవితా రూపం. దీని నిర్మాణం యాదృచ్ఛికం కాదు. ఇది విదేశీ కవితా రూపాలకు పోటీగా పుట్టించలేదు. వ్యతిరేకంగానూ పుట్టలేదు. ఈ నానీలకు కొన్ని నియమాలున్నాయి. వెసులుబాటు వుంది. అందుకేనేమో ఎందరో నానీలను ముట్టి మెరిసారు.
నానీలు అక్షర సంఖ్య, పాద నియమం, అంతర్గత నిర్మాణాలవల్ల ఆకర్షణ శక్తిని సంపాదించుకున్నాయి. గుండెల్లోకి దూసుకెళ్లే పదును ఈ బుల్లి పద్యాల్లో వుంది. ధారణానుకూలతకి ఇంచక్కా ఒదిగిపోతాయి. సారళ్యం, సౌలభ్యం, సద్యఃస్ఫూర్తి, నానీల్లో సాధ్యం! తళుక్కున మెరిసిపోయేది కాదుకానీ, స్థిరకాంతిని వెదజల్లుతూ మెల్లగా మనసు నిండా వ్యాపించే గుణం నానీలకుంది. నానీల నిండా అనంత వస్తు వైవిధ్యం పరచుకుంది. సమకాలీన అవసరాలకు నానీలు ఎంతో ఉపకరిస్తున్నాయి. తెలుగుని వెలిగించడానికి నానీలు విశేషంగా తోడ్పడుతున్నాయి. అన్ని మానవ సంవేదనల్ని నానీలు పలికిస్తున్నాయి. హాస్యం, వ్యంగ్యం, చమక్కులు, చరుపులు, విరుపులు, మెరుపులతో నానీలు కళకళలాడుతున్నాయి. పాఠకుల కళ్లల్లో ఆడుతున్నాయి. రెండు దశాబ్దాలుగా కాలానికెదురీది నిలబడ్డ నానీలకు ఇంకే పరీక్షలు అక్కర్లేదు. అయినా ‘నానీల నాన్న’ గోపి నానీ కవులకు పాఠాలు చెబుతారు. కొత్తగా కలమందుకుని పేలవంగా సృజించేవాళ్లకు, ఉబలాటంతోనే కీర్తి కండూతితోనో నానీల్లో వేలెట్టేవాళ్లకి నానీల రచన, నానీల సృజన మర్మాలను ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తుంటారు. అదికూడా నానీ కవులకు ఆయన రాసిన పీఠికల వేదికలమీద మాత్రమే!
ఎన్నో కవిత్వ వ్యాఖ్యానాలు నానీల సంపుటాలకు గోపి రాసిన పీఠికల్లో లభిస్తాయి. ఈ వ్యాఖ్యానాలు కొత్త కవులకి, ముఖ్యంగా నానీ కవులకి లాభిస్తాయి. నానీలు పరిణితితో పలకాలి. ఎందుకంటే నానీలు దేశీయ మూలాల నుంచి అంతర్జాతీయ సమస్యలదాకా చిత్రిస్తున్నాయి. అనేక భాషల్లోకి నానీలు అనువాదంగా వెళ్తున్నాయి. అందువల్ల నానీ కవులు అప్రమత్తతతో రాయాలి. రాళ్లేసే వాళ్లున్నప్పుడు జాగ్రత్తలు పాటించడం అనివార్యం. గోపి పీఠికల్లోని కవిత్వ పాఠాలు చదవడం నానీ కవులకి అనివార్యం కావాలి.
నానీలపై ఎన్నో విమర్శల వ్యాసాలు, పుస్తకాలు వచ్చాయి. ఎంఫిల్, పిహెచ్‌డిలు జరుగుతున్నాయి. నానీల కుటుంబం ఏర్పడింది. ఇప్పుడు అందరూ నానీల శక్తిని అంచనా కడుతున్నారు. నానీ ఒఠ్ఠి కవితా రూపం కాదనీ, దేశ కాల పరిస్థితుల్లో వర్తమాన వస్తు భావజాలంతో అవిభాజ్య స్థితిని పొందుతున్నది గోపి నానియోత్సాహం చెందడం సముచితమే!
మన తెలుగు దేశీయ ప్రక్రియగా ఎదిగిన ‘నానీ’లకు సంబరపడటం మాని బురదజల్లడం అవివేకం. పరాయి డప్పు కొట్టడమే తెలిసినవాళ్లకి మన మట్టి మూలాల్ని మూలకి నెట్టాలనుకోవడం క్షమార్హం కాదు. ఏ ప్రక్రియ అయినా వెలగాలి. కవిత్వ శక్తికే పట్టం గడతాం! నానీలను అంతే!

- మెట్టా నాగేశ్వరరావు 9951085760