సాహితి

కథా మాలిక ( శ్రీవిరించీయం 7)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొప్ప నవలాకారులుగా పేరు తెచ్చుకున్నవాళ్లు మొదట్లో అంటే వారి రచనా ప్రారంభ దశలో- కథల రచయితలుగానే పరిశ్రమించారు. నవలల కంటె కథల వల్లనే వాళ్లకు ఎక్కువ గౌరవ ప్రతిష్టలు వచ్చాయి అని చెప్పినా అతిశయోక్తి కాదు.
కథలకు, నవలలకు పేజీలలోనే వ్యత్యాసం అనుకుంటారు చాలామంది, విశేషంగా తెలిసినవాళ్లు. ప్రక్రియ వ్యవహారం బాగా తెలిసినవాళ్లు ఈ చిక్కులో పడరు. కథ ప్రయోజనం వేరు, నవల ప్రయోజనం వేరు. దేని పీఠిక కూడా దానిదే. చదవరులకు కూడా నవల చదవడం కంటె కథ చదవడంలోనే ఎక్కువ ఉత్సాహం చూపుతారు. కథయితే పది పదిహేను నిముషాలలో అయిపోతుంది. నవల పట్టుకుంటే పదిరోజులు గడిచినా పూర్తి కాకపోవచ్చును. ఏకబిగిన చదవడానికి సమయ విరామం దొరకదు. అంతవరకు చదివిన కథాంశం గుర్తుపెట్టుకోవడం కష్టం. పాత్రల పేర్లు, మననం చేసుకోవడం సులభమైన పని కాదు. ఈ రకమైన కారణాలు అనేకం.
రచయితలు కథలనుంచి నవలలకు పాకడానికి కూడా కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. నవల రాయడానికి ఎక్కువ సమయం కావలసి వచ్చినా, దానికి వచ్చే ప్రతిఫలం (మూల్యం-్ధనం) కథలతో పోలిస్తే ఎంతో ఎక్కువ. నవల రాయడంలో కొంత విశ్రాంతి ఉంది. సన్నివేశాలు, సంఘటనలు, సంభాషణల వివరాలు విస్తారంగా పెంచుకుంటూ పోవచ్చును. కథనాన్ని ఎన్ని మలుపులైనా తిప్పవచ్చును. కథలలో అవసరం అయిన క్లుప్తత, ఏకత ఇక్కడ అవసరం కాకపోవచ్చును. కథా రచనలో ప్రధానంగా నాలుగు ప్రధానాంశాలు ఉన్నాయి. ప్రారంభ దశను విడవని మూలాన్ని ఆశ్రయించడం (దీనినే ఏకత అని పిలవడం అలవాటు అయింది) కథ భూమికలో ఉన్న వనరులను ఉపయోగించుకునే నైపుణ్యం (చాకచక్యం అని కూడా అనవచ్చు), ఎక్కడ ఎంతవరకు చెప్పాలో ఏ విషయం ఎంత రాయాలో తెలిసి వుండడం, (క్లుప్తత అనే పేరుతో ప్రసిద్ధి). అభూత కల్పనాత్మకమైన అందమైన ఊహా చిత్రాన్ని నిర్మాణం చేయడం. కథ అన్నా, నవల అన్నా కాల్పనిక రూపకల్పనే. అయితే ఈ కల్పన యదార్థతను తలపించేదిగా ఉండాలని, తలదన్నినట్లుగా ఉండకూడదని గుర్తుంచుకోవాలి. నవలలు వ్రాయడానికి అలవాటు పడిపోయి కథా కథన శైలిని మరిచిపోయిన రచయితలు కూడా ఉన్నారు-అన్ని భాషలలోను. ఏమైనా కథలు, నవలలు జమిలిగా ప్రచురించడం పత్రికలకు అలవాటు అయిపోయిన పని; అవసరం అయిన పనిగా కూడా రూపొందింది. ‘సీరియస్’ రచనలకంటె ‘సీరియల్’ అయిన రచనలకే ఎక్కడైనా ప్రచారం ఎక్కువ. సాహిత్యంపట్ల విస్తృత వితరణ భావం, దాక్షణ్యం వున్నవాళ్లు కథలను మరిచిపోలేకపోతున్నారు. కథలకే కట్టుబడి అయి ఉండకపోయినా చలామణి అవుతున్నారు. స్ఫూర్తిలో చిన్నదే అయినా, వ్రాతలో విస్తృతంగా పెరుగుతున్నది కథానికే. దేశ దేశాల కథలు చదవడం సాధ్యం అయిన కొద్దీ మన కథా రచయితలకు గ్రీకుల ‘రూప’ ప్రభావం, లాటిన్ల నిర్మాణ సూత్రం, ఫ్రెంచివారి శైలీ విన్యాసం సాధ్యం అయినాయి.
కథలలో ఒక అనర్థ పదం గానీ, అవసరమయిన పదం కొత్తగా చేకూర్చడం లాంటి అవసరం గానీ రాకూడదు. కథా విధానంలో తప్పిదంగానీ, తడబాటుతనం గానీ వుండకూడదు. కథ సర్వ సంపూర్ణంగా, సమగ్ర స్వరూపంగా తయారుచేసుకోవడం తప్పనిసరి అవసరం.

- శ్రీవిరించి, ఫోన్ : 09444963584