సాహితి

కలలకు స్వాతంత్య్రం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జర్మనీ - ఫ్రాంక్‌ఫర్ట్ బుక్‌ఫెయిర్‌లో
21 అక్టోబర్ 2006న
మహాశే్వతాదేవి చేసిన
ప్రారంభోపన్యాసం

ఎనభై దాటిన వయసులో ముందుకు ప్రయాణిస్తూ, ఒక్కోసారి గడచిపోయిన దట్టమైన నీడల్లో అడుగు పెడుతుంటాను. మరోసారి ధైర్యంగా గడచిన వెలుగులోకి నడుస్తుంటాను. వయసు ప్రభావం వల్ల ఒక్కోసారి ఏమీ వినబడనట్లు, కనబడనట్లు, అంతకుముందు జరిగిన విషయమే గుర్తులేనట్లు నా కొడుకు దగ్గర నటిస్తుంటాను. అదొక తమాషా అని నాకు తెలుసు. కానీ జీవితం తమాషా యేం కాదు. అదే జీవితం మళ్ళీ మళ్ళీ తిరుగుతోంది. అవే విషయాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తుంటాయి. గడచిన జీవితమంతా జ్ఞాపకాల్లో పునరావృతమవుతుంది.
చెట్టుని చూడండి. అడవిని చూడండి. పచ్చని పంటపొలాలు, జలజల పారే సెలయేళ్ళు, మెరిసే ఎండ, అడవిలో సంతోషం పట్టలేక ఎగిరే కృష్ణ జింకలను చూడండి. అడవులే కాదు, కొండలు, గుట్టలు కూడా పచ్చదనంతో నవనవలాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఏమీ జరగదు! ఏమీ కాదు! నువ్వు కల గననంతవరకు, కల గనడం ఎలాగో నీకు తెలియనంత వరకు అక్కడ ఏమీ జరగదు - అయితే రాజకీయ, పరిపాలనా వ్యవస్థలు రిమోట్ కంట్రోల్‌తో నీతో కలలు కనిపించే నీ మెదడు జీవకణాల్ని నాశనం చేస్తూనే ఉంటాయి. అయితే కొన్ని కలలు తప్పించుకుని బయటపడతాయి. అట్లా తప్పించుకుని బయటపడ్డ కలల వెంట నేనెప్పుడూ పరిగెత్తుతుంటాను. ఈ మానవాళి సజీవంగా కొనసాగాలంటే కలలుగనే హక్కు తప్పకుండా ఉండాలి. వ్యక్తిగత స్థాయిలో, ప్రపంచ స్థాయిలో ప్రతివారూ తమతమ కలల్ని కంటున్నప్పుడు... పరిపాలనా వ్యవస్థ కలలుగనే నీ హక్కును కూలగొడుతుంటే ఏమవుతుంది? వ్యక్తులు కూలిపోతారు. దేశాలు కూలిపోతాయి. మొత్తానికి మొత్తంగా ప్రపంచమే కూలిపోతుంది. కలలు కనడమన్నది మనందరి ప్రాథమిక హక్కు. దాన్ని మనం కాపాడుకోవాలి!
ఒక పౌరురాలిగా, రచయిత్రిగా, సామాజిక కార్యకర్తగా నాదంటూ ఏమీ లేదని అంతా ప్రజలదేనని తెలుసుకున్నాను. లోపలి మనిషిలాగా నన్ను నేను ఎప్పుడూ కుంచించుకుపోనీయలేదు. అట్లని సమస్య ఏదైనా ఎదురైనప్పుడు నాకేమీ పట్టనట్లు బయటి మనిషిలాగా కూడా ఉండిపోలేదు. నిజమైన స్నేహం, సహృదయపు వెచ్చదనం, సద్భావన, కపటం లేక స్వచ్ఛంగా మసలుకోవడం నాకెంతో బలాన్నిచ్చింది. బహుశా 1980 నుండి నేను నా పోరాటాన్ని ఉధృతం చేశాను. గొంతు విప్పాను. జనంతో కలిసి జీవించాను గనుక, వాస్తవాలేమిటో దర్శించగలిగాను. అలక్ష్యం చేయబడ్డ, అవహేళన చేయబడ్డ ఎన్నో జాతుల జీవితాలు వెలుగులోకి తెచ్చి, ప్రపంచం తలెత్తి గమనించే విధంగా, గుర్తించే విధంగా చేయగలిగాను. భారత దేశంలో స్వాతంత్య్రం ఎన్ని తప్పిదాలతో, ఎన్ని తప్పు నడకలతో ముందుకు వస్తోందో విప్పి చెప్పగలిగాను.
భారతీయ సంస్కృతి చాలా సంక్లిష్టమైంది. దాని అల్లిక ఎన్నో రంగురంగుల దారాలతో సాగిపోతూ వచ్చింది. ఒక్కోచోట కలనేత అందంగా ఉండొచ్చు. మరికొన్ని చోట్ల సరిగా లేకపోవచ్చు. లేదా చిరిగి పోవచ్చు. అయినా ఈ దేశ సంస్కృతిని, ప్రత్యేకతల్ని నిలుపుకునే విషయంలో అన్నీ ఒక్కటై, ఒక్కటిగా నిలబడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో సంస్కృతిని ఎలా కాపాడుదాం? ఏ సంస్కృతిని కాపాడుదాం? ఇరవై ఒకటవ శతాబ్దంలో భారతీయ సంస్కృతి అంటే మనమెలా అర్థం చేసుకుందాం? ఏ సంస్కృతి, ఏ భారతదేశం? ఈ అరవయ్యేళ్ళుగా ఎంతో శ్రమిస్తూ కాపాడుకుంటున్న మన దేశ స్వాతంత్య్రాన్ని ఎలా చూడాలి? ఖాదీ నేత చీరలాగానా, టెర్లిన్ మిడ్డీ లాగానా? అదీ భారతదేశమే, ఇదీ భారతదేశమే. ‘సత్యం శివం సుందరం’ ఇండియానే. ‘్ఛళీ కే పీఛే క్యా హై’ - కూడా ఇండియానే. పాములు పట్టేవాళ్లదీ భారతదేశమే. తపస్సు చేసుకునే మునీశ్వరులదీ భారతమే. వీటిలో ఏది నిజమైన భారతదేశం? ఏది భారతీయ విధానం? ఇదొక వెలుగునీడల సయ్యాట! ఒకవైపు నా దేశం గర్వంతో పొంగిపోతూ, మరోవైపు చిరిగిపోతూ, వేడిగా, చల్లగా, వెలుగులు వెదజల్లుతూ, ముఖం మాడ్చుకుని, నిస్తేజంగా, ఆటవికంగా, అత్యాధునికంగా నా దేశం మెరిసిపోతోంది.
భవిష్యత్తులోకి చూస్తూ ఇక్కడ ప్రపంచ మేధావుల ముందు నిలబడి నా దేశం, నా సంస్కృతి గురించి మాట్లాడటమంటే అది నాకు దొరికిన అత్యంత విలువైన గౌరవం. ఇందాక కలల గురించి చెప్పాను కదా. నా దేశం ఎటు వెళ్లాలని నాకుందో, నా కలేమిటో మీతో పంచుకోదలిచాను. కలగనడమనేది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. ఇప్పుడు, నేనా హక్కుని వినియోగించుకుంటున్నాను. ఎక్కడ నా దేశం భయరహితంగా తలెత్తుకు తిరగగలదో, ఎక్కడ జ్ఞానాన్ని స్వేచ్ఛగా, ఉచితంగా హాయిగా సంపాదించుకోగలమో, ఎక్కడ ప్రపంచం సంకుచితత్వాలతో విడగొట్టబడదో, ఎక్కడ రెక్కల కష్టం సామర్థ్యంతో పరిపక్వతను సాధిస్తుందో - అక్కడ నా దేశం గురించి కలగంటున్నాను. ఎక్కడైతే వెనకబడినతనం ఉండదో, ఎక్కడ అభివృద్ధి చెందుతున్న మూడో ప్రపంచ దేశాలుండవో, అక్కడ - అంతా... అంతటా ఒకే ప్రపంచమైన చోట, పిల్లలందరూ విద్యావంతులు కావాలి! దేశంలోని ప్రతి భాషలో ఇంకా ఇంకా పుస్తకాలు రాయబడాలి. ముద్రించబడాలి. మాటలు గుమ్మరించబడాలి. జీవిత కథలు ప్రవహించాలి. ప్రజలు వినాలి. చదవాలి. ప్రతి ఒక్కరి చేతివేళ్ళు అక్షరాల కోసం అంగలార్చాలి. మూగబోతున్న గొంతులు గొంతు విప్పాలి. ప్రతి ఒక్కరు స్వేచ్ఛా స్వర్గంలో తమ అస్తిత్వం నిలుపుకోవాలి. భారతదేశం మళ్ళీ మళ్ళీ మేల్కోవాలి.
ఇదే నా సంఘర్షణ. ఇదే నా కల. ఇదే నా జీవితం! ఇదే నా సాహిత్యం!!

తెలుగు అనువాదం - దేవరాజు మహారాజు, +919908633949