సాహితి

నిబద్ధత, నిమగ్నత కలనేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంకించంద్ర చటర్జీ, రవీంద్రనాథ టాగూర్, ప్రేంచంద్, శరత్‌చంద్ర చటర్జీ, కిషన్‌చందర్‌లు లాగా తెలుగువారికి సొంతమైపోయిన మరో భారతీయ రచయిత మహాశే్వతాదేవి. అమృతాప్రీతం, ఆశాపూర్ణాదేవి, కమలాదాస్, అరుంధతీరాయ్, వాసిరెడ్డి సీతాదేవి, రంగనాయకమ్మ, ఓల్గా వంటి భారతీయ రచయిత్రులలో అగ్రగామి మహాశే్వతాదేవి. శ్రామిక వర్గ ఉద్యమాలలో, శ్రామిక వర్గ సాహిత్య సృష్టిలో ముందువరుసలో వుండే తెలుగువారికి మహాశే్వత సొంతంకావడం ఆశ్చర్యం కాదు- అవసరమూ అనివార్యం కూడా. ఆమె హైదరాబాద్ వస్తే అన్ని రకాల తెలుగు పత్రికలూ నాలుగు ప్రశ్నలడిగి ఆమె సమాధానాలు రాబట్టాలని ముచ్చటపడటమే ఆమెకూ తెలుగు సమాజానికీగల అనుబంధాన్ని తెలుపుతుంది. తెలుగు సాహిత్య ఆదాన ప్రదానాలతో ఆమె సాహిత్యం ఒక అంతర్భాగమైపోయింది. సంఘ సంస్కరణోద్యమకాలం నుండి నేటి దాకా కొనసాగుతున్న బెంగాలీ, తెలుగు సాహిత్యాల అనుబంధానికి తాజా గుర్తే మహాశే్వత సాహిత్యం.
మహాశే్వత డ్రాయింగ్ రూం రచయిత కాదు. రీడింగ్ రూం రచయిత కాదు. ఆమె క్షేత్ర స్థాయి రచయిత. పుస్తక పరిజ్ఞానంకన్నా వాస్తవ సామాజిక జ్ఞానంమీద ఆధారపడే ఆమె సాహిత్య సృష్టి చేశారు. ఆమె బతికిన 91 ఏళ్ళలో 60 ఏళ్లు సాహిత్య సృష్టి చేశారు. 1956లో ‘ఝాన్సీరాణి’తో ఆమె రచనాప్రస్థానం మొదలయ్యింది. అంతకు నూరేళ్ల క్రితం జరిగిన సంఘటనమీద చరిత్ర రచన చేయడం, అదీ ఒక మహిళా పోరాట జీవిత చిత్రణతో రచనా జీవితం ప్రారంభించడం- ఇదొక ఆరోగ్యకరమైన పునాది ఆమె సాహిత్యానికి.
మహాశే్వతాదేవి శాంతినికేతన్ విద్యార్థి. ఆమె రచయిత, పాత్రికేయురాలు, ఉద్యమకారిణి. అందుకే ఆమెను నిర్వచించాలంటే ‘నిబద్ధత, నిమగ్నతల కలనేత’ అనడం ఉచితంగా ఉంటుంది. ఆమె సాహిత్యాన్ని, ఆమె జీవితాన్ని విడదీసి చూడడం సాధ్యం కాకపోవడమే ఇందుకు కారణం. మహాశే్వతాదేవి మార్క్సీయ రచయిత. వర్గపోరాటం ఆమె దృక్పథం. పీడిత శ్రామిక నిస్సహాయ, భయకంపిత జనంవైపు ఆమె పక్షపాతం. వాళ్ళకోసం, వాళ్ల జీవితాలను వస్తువులుగా తీసుకుని రచనలు చేయడమేకాదు వాళ్ల సమస్యలను పరిష్కరించడానికి ఉద్యమాలు కూడా నడిపారు మహాశే్వతాదేవి. తెలుగులో కందుకూరి, గరిమెళ్ల సత్యనారాయణ, ఉన్నవ లక్ష్మీనారాయణ, దాశరథి, కాళోజి, శివసాగర్ వంటివాళ్లు ఈ పనిచేశారు. నిస్సందేహంగా మహాశే్వతాదేవి రాతకు చేతకు వైరుధ్యంలేని రచయిత. ఈ విషయంలో ఆమె నిజంగానే ‘మారందాయి’!
విద్యార్థి దశలోనే వామపక్ష భావాలను జీర్ణించుకొన్న మహాశే్వతాదేవి ఆంగ్ల అధ్యాపకులుగా వాటిని అభివృద్ధి చేసుకున్నారు. మార్క్సిస్టు కావడం మూలాన ఉద్యోగం పోయినా చెక్కుచెదరని ధైర్యంతో సమాజ పాఠశాలలోకి ప్రవేశించారు. ప్రజల దగ్గర పాఠాలు నేర్చుకున్నారు. ప్రజలకు పాఠాలు చెప్పారు. గోడలు లేని సమాజమే ఆమెకు పాఠశాల. గోడలు లేని సమాజానికి ఆమె అధ్యాపకురాలు.
సిపాయి తిరుగుబాటు అని ఆంగ్లేయులు పిలిచినా ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంమీద ‘అమృతార్ సంచయ్’ రాశారు. దక్షిణ బీహార్‌లో గ్రామీణ భూస్వామ్య పెత్తందారీతనంతో చితికిపోతున్న పేద ప్రజల దైన్యంమీద, ‘నైరుతి మేఘ్’ రాశారు. ఆమె రచనలలో తెలుగువారికి బాగా సొంతమైన రచనలు ‘రాకాసికోర, ఎవరిదీ అడవి, ఒక తల్లి’ - అనే రచనలు. ఇవి తెలుగు పాఠ్యప్రణాళికలో సైతం స్థానం పొందాయి. 1970 ప్రాంతంలో నక్సల్బరీ ఉద్యమం తొలి దశలో మరణించిన ఒక యువకుని తల్లి ఆవేదన, గర్భశోకానికి అక్షరరూపం ‘ఒక తల్లి’. మన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి రెండువందల యాభై ఏళ్ళకుముందే 17వ శతాబ్దం చివరలో ఒరిస్సా, బెంగాల్, బీహార్ రాష్ట్రాలమధ్య బిర్సాముండా నాయకత్వంలో భారతీయ జమీందారులు, బ్రిటిష్ వలస పాలకుల దౌర్జన్యాలను దోపిడీకి వ్యతిరేకంగా ముండా జాతి ఆదివాసులు చేసిన తిరుగుబాటుమీద మహాశే్వతాదేవి ‘ఎవరిదీ అడవి?’ అనే నవల రాశారు. ఇది భారతీయ భాషలలో వచ్చిన శ్రామిక వర్గ నవలా సాహిత్యంలో ఒక ఇతిహాసం. వైరుధ్యాలతో కూడిన భారతీయ జీవితంలో వెలుగులో మానవ సంబంధాలను, శ్రామికవర్గ ఆదివాసీల తెగువను ఆమె సజీవంగా చిత్రించారు. మన ‘మాలపల్లి’, మన ‘ప్రజల మనిషి’, మన ‘కొల్లాయిగట్టితేనేమి’ వంటి అసంఖ్యాక శ్రామికవర్గ .... ప్రతిబింబాలైన నవలల వంటిది ‘రాకాసికోర్’. భారతీయ గ్రామంమీద కాల్పనిక వ్యామోహం గలవారి కళ్ళు తెరిపించే నవల ఇది. గాంగీర్, ద్రౌపది వంటి కథలలో మహాశే్వతాదేవి స్ర్తిల జీవితాలను స్ర్తి దృష్టికోణం నుంచి ఆవిష్కరించడం, మాటలలో స్ర్తిలపట్ల పూజ్యభావాన్ని, చేతలలో అణచివేతను అమలుచేసే పురుషాధిక్య స్వభావాన్ని ఈ కథలో విప్పిచూపారు. మన అల్లూరి సీతారామరాజుమీద మహాశే్వత నవల రాయాలనుకున్నారు. కానీ రాయలేకపోయారు. ఒక కథను మాత్రం రాసి, ఆయన వీరోచిత పోరాటాన్ని తెలుగు నేలలో జరిగినదాన్ని బయటి ప్రపంచానికి చాటి చెప్పారు. ఆమె జ్ఞానపీఠ పురస్కారం దాకా అనేక పురస్కారాలు తీసుకున్నా ఆ పురస్కారాలకే ఔన్నత్యం తీసుకొచ్చారు. ఆ పురస్కారాల ద్వారా ఆమె రాజ్యంతో చేతులు కలపలేదు.
ప్రపంచ రచయిత్రులలో మహాశే్వతాదేవి ఒకరు. పీడిత జాతిపక్షం వహించి, వాళ్ళ సమస్యలకు పరిష్కారాలు ఆకాశంలోంచి ఊడిపడవని, అవి పోరాటాల ద్వారా మాత్రమే పరిష్కారమవుతాయని రుజువుచేశారు పనికిమాలిన కారణాలతో సమాజంలో సంఘర్షణను సృష్టిస్తున్న శక్తులు మహాశే్వతాదేవి సాహిత్యాన్ని చదివితే అసలైన మానవ సమస్యలేవో, దానికి జనం ఏం చేయాలో తెలుస్తాయి. ‘‘ఆడవాళ్ళకు చదువెందుకు? ఉద్యోగాలు చేస్తారా? ఊళ్ళేలుతారా?’’ అని ప్రశ్నించే ఉష్టప్రక్షులకు సరైన సమాధానం మహాశే్వతాదేవి.
ఆధునిక మహిళలు చరిత్రను తిరిగి రచిస్తారు అన్న గురజాడ మాటకు శాస్ర్తియమైన ఉదాహరణ మహాశే్వతాదేవి. ఆమె సాహిత్యం ఇప్పటికే చాలా భాషల్లోకి అనువాదమైంది చాలావరకు. ఈ విషయంలో ఏవైనా భాషలు వెనుకబడివుంటే ఆ భాషల వాళ్ళు మేల్కొనాలి. ఇప్పుడు కావలసింది, ఇప్పుడు చేయవలసింది ఆమె సాహిత్య అధ్యయనం, పునరధ్యయనం. 20వ శతాబ్దపు భారతీయ ప్రజారచయిత్రి మహాశే్వతాదేవికి నా వినమ్ర నివాళి.

- రాచపాళెం చంద్రశేఖరరెడ్డి 9440222117