సాహితి

కథా సిద్ధాంతం (శీవిరించీయం 8)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదయినా సిద్ధాంత ప్రతిపాదన చేయదలచుకున్నప్పుడు ‘వ్యాసం’ వ్రాసుకోవడం మంచి పద్ధతి. అయితే ఏ సిద్ధాంతమూ కేవలం కొన్ని పొడిమాటలతో, కట్టుబా భావాలతో నిల్చిపోదు. సిద్ధాంతానికి ఒక ఆచరణ సూత్రం, అవలంబన పద్ధతి ఉంటుంది. అప్పుడు ‘కథ’ ముందుకు వస్తుంది. వ్యాస కథలకు, సాధారణ కథలకు ఉన్న వ్యత్యాసాలను కూడా గమనించడం అవసరం.
‘అబద్ధం ఆడగూడదు’ అనే విషయం మీద (దీనే్న సిద్ధాంతం అని కూడా అనవచ్చు) ఎంతయినా వ్రాసుకోవచ్చును. అబద్ధం ఆడితే ఎట్లా తనకు, ఇతరులకు ఇబ్బంది అవుతుందో-ఒక్కొక్కసారి ఊబిలో మునిగిపోవలసి వస్తుందో సోదాహరణంగా వివరిస్తూ గొప్ప వ్యాసం రాయవచ్చును. ఎన్నో ఉటంగింపులు శాస్త్రాలనుంచి ఇవ్వవచ్చును. అయితే ఈ వివరాలనే కొన్ని పాత్రల కల్పన ద్వారా, సన్నివేశాల కూర్పుద్వారా కథగా మలుచుకున్నప్పుడు అది చదువరులకు, వాళ్ల హృదయాలలోనికి సూటిగా చొచ్చుకుపోయేట్టు రాయగలిగే అవకాశం ఉంది. సిద్ధాంతాలను కేవలం ముడిసరుకుగా కాకుండా దాని అనుసరణీయత జీవితాన్ని ఎలా సుగమపరుస్తుందో చెప్పడం కథ చేసినంత వేగంగా ఏ ఇతర ప్రక్రియ చేయలేదు.
దేశంలో బీదరికం ఉంది. చదువుకున్నా ఉద్యోగాలు దొరక్క జీవనోపాధికి మంచి మార్గం ఏమీ లేక బాధపడుతున్న వాళ్లున్నారు. దీనికి కారణం ఏమిటి?- అని ప్రశ్న వేసుకుంటే ఆర్థిక శాస్తవ్రేత్త రకరకాల సమాధానాలు ఇస్తాడు. ఈ సమాధానాలు సమాలోచన చేసుకుని, కథలుగా అల్లుకోవడానికి వీలుఉన్నది. మనుషుల మనస్సులలో ‘ఇతరులు ఏమయిపోతే నాకేల? నా చిన్ని పొట్టకు శ్రీరామ రక్ష’ అన్న అభిప్రాయాలు ఏర్పడడానికి కారణం అయిన సామాజిక స్థితిగతులను గురించి ఎన్నయినా కథలు తయారుచేసుకోవచ్చును. ఇతరులను గురించి, వారి బాగోగులను గురించి పట్టించుకోవలసిన సాంఘిక బాధ్యత ప్రతి పౌరుడికి ఉన్నదని చెప్పడానికి వ్యాసం కంటె, కథ సూటిగా ఉపకరిస్తుంది. మనుషుల మనస్సులలో, హృదయాలలో ‘కరుణ, ‘సానుభూతి’, ‘సదవగాహన’ ఏర్పరచడానికి కథ ప్రయోజనకరంగా వుపయోగించుకోవడమే ఇప్పుడు ‘సామాజిక స్పృహ’ అనే పెద్ద పేరుతో వ్యవహరిస్తున్నాం.
కల్పన చాతుర్యంలోనే జీవిత దర్శనం పొందడం, కల్పనల యదార్ధతలో జీవితాన్ని దర్శించగలగడం సాధ్యం అవుతుంది. జీవితం, కల్పన అనేవి వేరు వేరు అంశాలు కావు. జీవితం అంతా కూడా మనం తయారుచేసుకున్న ‘కల్పనే’ అనే విషయం మనం మరచిపోకూడదు. జీవితం అంతా కల్పన. మనం కావచ్చు, మన చుట్టు ఉన్న మనుషులు, పరిసరాలు, సందర్భాలు, సన్నివేశాలు ఇవన్నీ మన జీవితాలను రూపకల్పన చేస్తున్నాయి గదా.
‘అభ్యుదయం’ కోరని రచయిత-ఆ మాటకు వస్తే ‘మనిషీ’ ఉండకూడదు. ప్రతివాడూ తను ఉన్న స్థితినుంచి ఉన్నత స్థితికి ఎదగాలని అనుక్షణమూ ప్రయత్నం చేస్తునే ఉన్నాడు. ఈ ప్రయత్నంలో ఇతరులతో కలిసికట్టుగా పనిచేస్తు పోతున్నాడా లేక ఇతరుల గొంతులు పిసికి ముందుకు సాగుతున్నాడా?- ఇది సామాజిక పరిణామంగా చూడడం అలవాటు అయింది. ఈ పరిణామానే్న కథ నాలుగు కాలాలపాటు నిలిచే చరిత్రగా తయారుచేసి చూపుతోంది.
గమ్యం లేని గమనం ఉండదు. చీకటిలో చిందులాటనుంచి వెలుగుబాటకు వెదుకులాటగా కథ నడుస్తుంది. జీవితంలో ఉన్న మురికి స్థానాలను ఎత్తి చూపుతుంది. దానిమీద టార్చ్‌లైట్ వేసి అందరికీ ఆ ప్రమాదం అర్ధం అయ్యేట్టుగా చూపుతుంది. కథ నడవాలి, జీవితాన్ని నడపాలి. కథనం తన విధానాన్ని కనుగొని తీరాలి. విధికి వదిలేయడం కాకుండా, తానే విధాత అవుతాడు కథకుడు.

- శ్రీవిరించి, ఫోన్ : 09444963584