సాహితి

సరికొత్త మాధ్యమంలో ప్రాచీన వాఙ్మయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతిదూర విభిన్న కాలాలకు చెందిన ప్రక్రమాలు (processes) ఒకే కాలంలో కలిసి ఉండడం అనేది భారతదేశంలోనే జరుగుతుంది. మరెక్కడైనా జరుగుతుందో లేదో ఇప్పటికిప్పుడే తెలియదు. మన తెలుగు నేలలో నెల్లూరు జిల్లాలో శ్రీహరికోటలో అంతర్జాతీయ ప్రసిద్ధి పొందిన రాకెట్ కేంద్రం ఉంది. ఇక్కడినుండి ఎన్నో ఉపగ్రహాలను సుదూర అంతరిక్షంలోనికి ప్రవేశపెడతారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి ప్రతినిధి. కాని దానికి పక్కనే ఒక పొలంలో ఒక రైతు రెండు నుండి మూడు వేల సంవత్సరాల క్రితం నాగరికతకు చెందిన నాగలితో ఎడ్లు కట్టి దున్నడం కనిపిస్తుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి సాంకేతికత అయిన ఎడ్లబండి కనిపిస్తుంది. ఒకసారి ఈ అంతరిక్ష కేంద్రంలోని రాకెట్ యంత్రాన్ని డెక్ దగ్గరికి తీసుకుపోవడానికి ఎడ్లబండిని వినియోగించిన తీరును పత్రికలలో చూశాము. ఇది రెండు సుదూర కాలాలను కలిపే ద్వైదీప్రక్రియ. ఇదే క్రమాన్ని మనం సాహిత్య ప్రక్రియలకు సంబంధించి సంప్రదాయ విలువలకు చెందిన ఆచారాలకు చెందిన విషయాలలోను చూడవచ్చు.
అభివృద్ధి చెందిన దేశాలలో ఈ విధానం మనం చూడం. ఆధునిక సాంకేతిక అభివృద్ధి అక్కడి సంప్రదాయ ప్రక్రియలను కళారూపాలను అంతం చేసింది. మత అనుష్ఠానాలపైన కూడా అది ప్రభావం చూపింది. ఆధునిక నాగరికత అక్కడ ఎక్కువ ప్రశ్నించడాన్ని నేర్పింది. హేతు దృష్టి ప్రబలిపోయేలాగా చేసింది. కాని భారతదేశంలో ఈ పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. ఇక్కడ ఆధునిక నాగరికత ఎంత ప్రబలినా సాంప్రదాయిక మత అనుష్ఠానాలు మారలేదు. జానపద మత అనుష్ఠానాలు కొన్ని వేల సంవత్సరాల నాటివి ఈనాటికీ సజీవంగా కనిపిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలలో చాలా వాటిలో జానపద కళాప్రక్రియలు, జానపద సాహిత్య ప్రక్రియలు అంతరించాయి. కాని భారతదేశంలో కొన్ని పోయినా ప్రతి భాష ప్రాంతంలో జానపద సాహిత్య ప్రక్రియలు కొన్ని వందలు ఇంకా సజీవంగా ఉన్నాయి. జానపద అనుష్ఠానాలు ఏ మాత్రం చెదరక సజీవంగా ఉన్నాయి. ఉపరితలంలో కొన్ని మార్పులు కనిపించవచ్చు. కాని వౌలిక క్రమాలు అలాగే ఉన్నాయి.
చాలా పురాణ సాహిత్య ప్రక్రియలు పురాణ కథలు నాటక ప్రదర్శనల ద్వారా ప్రజలకు చేరేవి. నాటక సాహిత్యం ప్రత్యేకంగా ఒక ప్రక్రియగా ఉన్నా ప్రదర్శన కళ అయినా కూడా అందులో ఉండే వౌలిక పురాణం అనేది మళ్లీ ఒక సాహిత్య ప్రక్రియ. ఇలా ఉండగా మనకు సినిమా అనే మాధ్యమం వచ్చింది. సినిమావల్ల నాటక కళ చావుదెబ్బ తిని నామమాత్రావశేషంగా మిగిలింది. కాని అదే పురాణ కథలు సినిమా ప్రక్రియలో ప్రవేశించాయి. చాలా పురాణ కథలు సినిమా మాధ్యమం ద్వారా ప్రజల్లోకి చాలా బలంగా ప్రవేశించాయి. విశేషించి తెలుగు సినిమా పురాణ కథలను తీయడంలో ప్రఖ్యాతి వహించింది. మిగతా భాషలవారికి ఆదర్శంగా నిలిచింది. కొన్ని దశాబ్దాలపాటు పురాణ కథలు జానపద కథలే తెలుగు సినిమాలో రాజ్యం ఏలాయి. నేటికీ అవి కళాఖండాలుగా మిగిలాయి. జానపద కథ అనే సాహిత్య ప్రక్రియ సినిమా మాధ్యమంలో చాలా బాగా విజయవంతం అయింది.
కాగా నేటి అత్యంత ఆధునిక మాధ్యమం టీవీ. అదీ శాటిలైట్ టివి. మన పురాణ కథా సాహిత్యం టివి మాధ్యమంలో కూడా విజయవంతం అయింది. రామాయణ, మహాభారతాలు ఒకే దూరదర్శన్ ఛానల్‌లో ఉన్న రోజుల్లో కూడా అత్యంత ప్రజాభిమానాన్ని నోచుకున్నాయి. అంతేకాదు రామాయణం మహాభారతాన్ని అంత విస్తృతంగా ప్రజలు తెలుసుకునే పరిస్థితి అంతకుముందు ప్రక్రియలలో లేదు. ఒక రాత్రి ఆడే నాటకంలో కాని మూడు గంటలపాటు ప్రదర్శించే సినిమాలో కాని మహాభారతాన్ని అంత విస్తృతంగా చూపే అవకాశం రాలేదు. కాని రెండు సంవత్సరాలపాటు 1988-1990లలో మహాభారతాన్ని 94 వారాలలో గంట చొప్పున ప్రదర్శించారు. ఇంత విస్తారంగా సామాన్య జనానికి మహాభారతాన్ని అంతకుముందు ఏ ప్రక్రియ కూడా ప్రదర్శించలేకపోయింది. చాలా చిన్న చిన్న పాత్రల స్వభావాన్ని కూడా ప్రజలు విస్తృతంగా తెలుసుకునే వీలు చిక్కింది. ఈ పురాణాల కోసమే లోన్ తీసుకుని టివిలు కొన్నవారున్నారు ఆ రోజుల్లో.
ఇక దీని తర్వాత విష్ణుపురాణం, శివపురాణం, మహాభాగవతం చాలా విస్తృతంగా వేరు వేరు ఛానళ్లలో ప్రసారం అయ్యాయి. దీనికోసం ఆయా భాషలలోని ప్రజల భాషలో ఈ పురాణాలను రాయవలసి వచ్చింది. దీనితో ఒక కొత్త సాహిత్య ప్రక్రియ పురుడుపోసుకుంది. ఒక సుదీర్ఘ పురాణాన్ని ఎపిసోడ్ అనే విభాగంతో అంటే ఆ నిర్మాణంతో పూర్తిగా రాయవలసి వచ్చింది. ఇది అన్ని భారతీయ భాషలలో జరిగింది. ఈ టివి పురాణ కథలను ప్రత్యేక సాహిత్య ప్రక్రియగా గుర్తించవలసి ఉంది. కాని మనం ఇంకా ఆ పనిచేయలేదు. మనకు నాటకం ఉంది. రేడియో మాధ్యమం వచ్చిన తర్వాత నాటకం రేడియో మాధ్యమంలోనికి వచ్చింది. దీనివల్ల శ్రవ్య నాటకం అనే ప్రక్రియ ఏర్పడింది. నాటకం ప్రజలు చూడడానికి ఉద్దేశించింది. చూడడానికి ఉద్దేశించిన నాటకానికి సాహిత్యాన్ని కూర్చడం భిన్నంగా ఉంటుంది. అక్కడి పాత్రలు వాటి ఆహార్యం అక్కడి వాతావరణం కూడా ప్రేక్షకుడికి కనిపించి కథను అవి కూడా వహించి చూపరులకు అందజేస్తాయి. కాని రేడియో నాటకంలో ఏదీ కనిపించదు. కేవలం వినిపించడం అనే కారణంగా రచనలో చాలా మార్పు చేయవలసి వుంటుంది. కనిపించే విషయాన్ని పాత్ర మాట ద్వారా శ్రోతకు వినిపింపజేయాలి. ఇదే ఈ సాహిత్య ప్రక్రియ ప్రత్యేకత. అందుకే రేడియో నాటకాలను ప్రత్యేక సాహిత్య ప్రక్రియగా గుర్తించడం దానిపైన పరిశోధనలు కూడా జరిగాయి. కాని తిరిగి పురాణాలు వివిధ జానపద కథలు టివి మాధ్యమంలోనికి అత్యంత ప్రభావవంతమైన మాధ్యమంలోనికి ప్రవేశించాయి. ఈ కారణంగా పురాణాలను తిరిగి ప్రజలకు అందించే రీతిలో పునారచన చేయవలసి వచ్చింది. విస్తృతంగా కథాకథనాలకు అవకాశం లభించింది. ఈ కారణంగా రేడియో నాటకం మాదిరిగానే టివి పురాణం అనే కొత్త సాహిత్య ప్రక్రియ పుట్టింది. దీనిలోని భాష సాహిత్యం వివిధ ఎపిసోడ్‌లలో ఉండే నిర్మాణ క్రమం ఈ టివి పురాణ ప్రక్రియను ప్రత్యేక సాహిత్య ప్రక్రియగా చేశాయి.
హిందీ భాషలో జాతీయ స్థాయిలో ప్రసారం అయిన చాలా పురాణ కథలను కొన్ని చానెళ్ళు తెలుగులోనికి అనువాదం చేసి ప్రసారం చేశాయి. రామాయణం, భారతం భాగవతం, శివపురాణం, విష్ణుపురాణం, శ్రీకృష్ణ అనేది ఇలా తెలుగులోనికి వచ్చాయి. తెలుగు సాహిత్యంలో ఈ విధంగా కొత్త సాహిత్య ప్రక్రియ పుట్టింది. కాని దీన్ని విమర్శకులు కానీ విశ్వవిద్యాలయాలు కాని ఇంకా ప్రత్యేక సాహిత్య ప్రక్రియగా గుర్తించలేదు. కాని అలా ప్రత్యేక సాహిత్య ప్రక్రియగా గుర్తించి అధ్యయనం, పరిశోధన చేయవలసిన అవసరం ఉన్న ప్రక్రియ టివి పురాణం లేదా దీనే్న దృశ్యపురాణం అని కాని దృశ్యమాధ్యమ పురాణం అని కాని కొత్త పేరుతో గుర్తించి అధ్యయనం చేయాలి. ఇదే విధంగా టివిలో ప్రసారమయ్యే సీరియల్ కథలు అన్నీ కూడా సాహిత్య ప్రక్రియే అవుతాయి. రేడియో నాటకాన్ని సాహిత్య ప్రక్రియగా గుర్తించినట్లు, వారపత్రికలో సీరియల్‌ని ప్రత్యేక ప్రక్రియగా గుర్తించినప్పుడు టీవీలో వచ్చే సీరియల్ కథని కూడా ప్రత్యేక సాహిత్య ప్రక్రియగా గుర్తించి అధ్యయనం చేయవలసిన అవసరం వుంది.
ఇక ఈ వ్యాసంలో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన ప్రక్రియ పురాణ ప్రవచనం అనే వాఙ్మయ ప్రక్రియ. పురాణ ప్రవచనం అనే కళని ప్రత్యేక వాఙ్మయ ప్రక్రియ అని తొలిసారి చెప్పింది వెల్చేరు నారాయణరావుగారు. ఇది వౌఖిక సాహిత్య ప్రక్రియ అవుతుందని చెప్పారు వారు. ఆ తర్వాత నేను కూడా పురాణ ప్రవచన ప్రక్రియ గురించి వివరంగా ఒక పుస్తకంలో రాశాను (తెలుగు కవిత్వం అభివ్యక్తి మాధ్యమం). ఇది అర్ధ లిఖిత సాహిత్య ప్రక్రియ అవుతుందని లేదా ఉభయ మాధ్యమ సాహిత్యం అవుతుందని చెప్పాను. పురాణ ప్రవచనం అన్నది కొన్ని వందలు వేల సంవత్సరాలుగా మనకు అందివస్తూ ఉంది. ఇది సాధారణంగా గుడులలో లేదా పుణ్యక్షేత్ర ప్రాంగణాలలో పౌరాణికుడు ప్రవచనం చేసే ప్రక్రియ. సంస్కృత శ్లోకాలలో ఉన్న పురాణాన్ని కాని లేదా తెలుగులో సంప్రదాయ ఛందంలో వున్న పురాణాన్ని కాని ప్రజలకు అర్థం అయ్యే భాషలో పౌరాణికుడు చెప్తాడు. అయితే పూర్తిగా తన వచనంలోనే చెప్పకుండా మధ్యలో మధ్యలో అసలు పాఠ్యంలోని శ్లోకాలను కాని పద్యాలను కాని పఠించి దానికి అర్థవివరణ చేస్తూ తర్వాత తన వ్యాఖ్యానాన్ని జోడిస్తూ పురాణాన్ని ప్రవచిస్తాడు. అందుకే ఇది అర్ధలిఖిత అర్ధ వౌఖిక ప్రక్రియ లేదా ఉభయ మాధ్యమ ప్రక్రియ అయింది. ఇది సాహిత్య ప్రక్రియగా మాత్రమే కాక ప్రత్యేక కళగా కూడా గుర్తించబడింది.
అయితే ఈ పురాణ ప్రవచన ప్రక్రియ ఆధునిక మాధ్యమంలోనికి ప్రవేశించి కొత్త రూపాన్ని కొత్త నిర్మాణాన్ని పొందింది. తెలుగులో ఉషశ్రీ రామాయణాన్ని అత్యద్భుతంగా ఆధునిక వచనంలో ప్రజల భాషలో ప్రవచించాడు. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏమంటే ఆయన ముందుగా వచనంలో రాసుకొని దాన్ని రికార్డు చేశాడు. తర్వాతనే ప్రసారం అవుతుంది. అంటే ఇక్కడ పురాణ ప్రవచన పాఠ్యం ముందుగా రచించబడి పాఠ్యం స్థిరంగా ఉంటుందన్నమాట. కానీ బయట సజీవంగా చేసే పురాణ ప్రవచనం ఝటితి నిర్మాణంతో పూర్తిగా వౌఖికంగా ఉంటుంది. ఇదే పద్ధతి టివిలో ప్రవేశించింది. వాటిని పురాణ ప్రవచనాలను ఛానళ్లలో ప్రసారం చేస్తున్నాయి. ప్రజలు కూడా విపరీతంగా ఆకర్షితులౌతున్నారు. ప్రతి ఇంట్లో కూడా పురాణాన్ని వినడం అనేది తప్పనిసరి అయింది. ఇదొక మతపరమైన కార్యక్రమంగా తప్పక చూడవలసిన అవసరంగా భావిస్తున్నారు. పౌరాణికులు టివిలో చెప్పే పురాణాలను కాగితంమీద రాసి వీటిని కొత్త ప్రక్రియగా ‘ఈ-పురాణం’గా గుర్తించి అధ్యయనం చేయవచ్చు. అతి ప్రాచీనమైన సాహిత్య ప్రక్రియ సరికొత్త మాధ్యమంలో సరికొత్త రూపం పొంది ఇలా సరికొత్త సాహిత్య ప్రక్రియగా అవతరించింది. ఈ ప్రక్రియపైన పరిశోధన అధ్యయనం జరగవలసి ఉంది.
దృశ్యమాధ్యమంలో ప్రసారమయ్యే ప్రతి పురాణం, జానపద కథ, ఆధునిక కథలు కూడా సాహిత్య ప్రక్రియలుగా చూడాలి. అంతేకాదు, కొన్ని చానళ్ళు సాహిత్య చర్చలకు ఆధునిక కవిత్వంపైన సదస్సులాంటి చర్చోపచర్చలకు స్థానం ఇచ్చాయి. ఈ సాహిత్య విమర్శను కూడా కొత్త తరహా ప్రక్రియగా అధ్యయనం చేయవలసి ఉంది. ఈ అన్ని ప్రక్రియలు అధ్యయనం చేయడానికి వీలైనవే. కొత్త అధ్యయనాలు ఈ దిశగా సాగాలి.

దీనితో పురాణ సాహిత్య వ్యాప్తితో పాటు ప్రాచీనమైన కాలానికి చెందిన అనుష్ఠానాలు, మత విధానాలు నమ్మకాల వ్యవస్థ కూడా ప్రజలలోనికి అత్యంత బలవత్తరంగా చేరుతూ ఉంది. ఈ కాలానికి పనికిరాని నమ్మకాల వ్యవస్థ మూఢ విశ్వాసాలు కూడా ప్రజలలోనికి బలంగా వస్తున్నాయి. వీటివల్ల కొంత అపకారం కూడా జరగవచ్చు.

ప్రపంచీకరణవల్ల ఎన్ని నష్టాలు జరుగుతున్నయో విశే్లషణ చూస్తున్నాము. కాని ఇదే ప్రపంచీకరణంవల్ల చాలా లాభాలు కూడా జరుగుతున్నాయి. అంటే ఆధునిక నాగరికత అభివృద్ధి చెందిన దేశాలలో మతానుష్ఠానాలకు దెబ్బగా పరిణమిస్తే అదే ఆధునిక ప్రసార వ్యవస్థ మన మతానుష్ఠానాలకు ప్రాచీన సాహిత్య ప్రక్రియకు దోహదకారిగా మారింది. అభివృద్ధి చెందిన దేశాలలో ఆధునిక నాగరికత సంప్రదాయాన్ని మింగేస్తే ఇక్కడ ఆధునిక నాగరికత సంప్రదాయంలోనే మునిగిపోయింది. సంప్రదాయం వ్యాప్తి కావడానికి దోహదకారిగా మారింది. ఇదే భారతదేశం ప్రత్యేకత. ఇలా సరికొత్త మాధ్యమంలో అతి ప్రాచీన సాహిత్యం కొత్త రూపాన్ని ఎలా ధరిస్తుందో అధ్యయనం చేయవలసి ఉంది.

- పులికొండ సుబ్బాచారి, 9440493604