సాహితి

కథావనం - ఉద్యానవనం (శ్రీవిరించీయం 10)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథల తోటలో రకరకాల మొక్కలు, పువ్వులు, సుగంధాలు, మత ప్రసక్తులు రావచ్చును, రాజకీయ ప్రస్తావనలు చోటుచేసుకోవచ్చును. చెట్ల వేర్లు, కాండాలు దృఢంగా వున్నంత వరకూ వౌనికేమీ ఢోకా లేదు. చింతచెట్లతో పాటు పనస చెట్లూ వుంటాయి. గులాబీ పువ్వుల వెనక గుచ్చుకునే ముళ్లూ వుంటాయి. పనస తోటలో పాములు చేరడం సహజ ప్రక్రియే కదా!
తెలుగులో రాస్తేనే తెలుగు కథ అవుతుందనుకుంటారు మరికొందరు. తెలుగు దేశంలో జరిగితేనే ఇది తెలుగు కథ అనుకుంటారు మరికొందరు. ఏ భాషలోనైనా, ఏ దేశంలోనైనా జరగవచ్చును తెలుగు కథ. తెలుగు మనిషి దేశంలో నలుమూలలకూ వెళ్లి తన సంప్రదాయాలు సంస్కారాలు విస్తరణ చేస్తున్నప్పుడు తెలుగు కథకు మాత్రం ఇలాంటి కట్టుబాట్లు, నియమ నిషేధాలు వుండటానికి అవకాశం ఉన్నదా?
ఇంగ్లీషులో మంచుగడ్డలాగ తెల్లగా వుంది అని రాస్తారు. అది తెలుగులో రాసినప్పుడు పాలవలె తెల్లగా వున్నది అని వ్రాయడం విధాయకం. దేశ దేశాల నుడికారాలు, పలుకుబడులు తెలిసి వుండకపోతే ఇబ్బంది అవుతుంది. కొన్ని కథలకు చివరలో ‘గ్లాసరీ’ ఇవ్వవలసి వస్తుంది. అలాగే మాండలిక భాష ఉపయోగించినప్పుడు కూడా జరుగుతుంది. అర్థం తెలియని, కాని మాట కనిపించినప్పుడు చదువరి వెంటనే నిఘంటువు కోసం పరుగు తీయడు. ఆమాటను పక్కకునెట్టి తరువాతి వాక్యానికి వెళ్లిపోతాడు. కథా సందర్భంలో ఒక్కోసారి అదే అర్థం అయిపోతుంది, లేకపోయినా కథా గమనానికి అడ్డుపుల్లగా నిలవదు. తెలిసిన విషయాల నుంచి, తెలియని విషయాలను తెలుసుకోవడం అన్నిమార్లూ సాధ్యపడదు. తెలిసి వుండటమే ప్రధానంగా అడ్డంకిగా తయారవుతుంది. మాట్లాడే ధ్వనిని బట్టి మనిషి భావాన్ని అర్థం చేసుకుంటాం. అలాగే రాసిన వాక్యంలో ధ్వని పాత్రల మనోభావాలను ఎరుక పరచటానికి ప్రయత్నిస్తుంది. ఒక మాటను కోపంగా అంటున్నామా, ప్రేమ పూర్వకంగా అంటున్నామా అనేది ఉచ్ఛారణ పద్ధతి మీద ఆధారపడి వుంటుంది. నిజానికి ధ్వనిదే ఒక ప్రత్యేక లోకం. అది వేరే విషయం - అలంకారాలకు సంబంధించినది. అయినా కథలో దీనికి వున్న ప్రాముఖ్యం మాత్రం తక్కువ అయినది కాదు, తీసిపారవేయవలసింది కాదు.
హాస్యం వేరు, వేళాకోళం వేరు. పొగడ్త వేరు, మెచ్చుకోలు వేరు. ఇంటువంటి ద్వంద్వాలను, నిర్ద్వంద్వంగా ఉపయోగించాలి గాని - చదువరికి అయోమయ స్థితి ఏర్పడేట్టు ప్రయోగించకూడదు.
పద్యరచనలో విషయాన్ని బట్టి ఏ ఛందస్సులో ఏ పద్యం రాయాలని కొన్ని పద్ధతులు ఉన్నాయి. గద్య రచనలో అలాంటివేమీ లేవు. కాకపోతే, మానవ స్వభావాన్ని బట్టి ఉద్రేకం, రాగభావం ఎక్కువ తక్కువలు అయినప్పుడు పరభాషా పదాలు ఉపయోగించడం జరగవచ్చు.
తెలుగులో కథా వ్రాస్తున్నప్పుడు పాత్రోచితం అయినా ‘తెలుగు కాని మాటలు’ ఉపయోగించడం అనవసరం. మామూలు మాటల్లో ఇతర భాషా పదాలు విరివిగా దొరుకుతున్నాయి గదా, ఇందుకు అభ్యంతరం చెప్పడం దేనికి అనుకుంటే - సమాధానం లేదు. సమంజసం కాదు అనడం తప్ప. రైలు, రోడ్డు, బస్సు, టెలిగ్రాం, ఫోన్ ఇలాంటివి తెలుగు మాటలు కాదని ఎవరూ అనుకోవడం లేదు ఇప్పుడు. వాటికి అచ్చ తెలుగు మాటలు తయారు చేసుకోవాలంటే ‘కుక్క మూతి పిందెలు’ తయారవుతాయి. అర్థం అవడం అనేది ప్రాతిపదికగా పెట్టుకుని పదప్రయోగం చేసినంతవరకు ఏమీ అభ్యంతరం, ఆటంకం లేదు. విశ్వమంతా ఒక్కటే అనుకుంటున్న రోజుల్లో స్వదేశీ విదేశీ విషయాలపట్ల ఎక్కువ వ్యత్యాసం లేకపోవచ్చును. అయినా ఔచిత్యం ప్రధానాంశం అవవలసి వుంటుంది. ప్రాంతీయ భాషలలో కూడా ‘అసలు అయిన’ భాష ఎక్కడ వున్నది - అని వెదుక్కుంటున్న రోజులు ఇవి. మన ప్రయోగాల వల్ల చదువరికి ఇబ్బంది కలుగకుండా చూసుకోవడం ముఖ్యం.

- శ్రీవిరించి, ఫోన్ : 09444963584