సాహితి

కవితా శిఖరానికి దారిచూపిన దివ్వెలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లలిత కళలలో కవిత్వానిది అగ్రపీఠం. ఏ కళ అయినా కవితామయం అయినప్పుడే రాణిస్తుంది. కవిత్వాంశ లేని కళ వాసన లేని పువ్వులా ఆకర్షించదు. అందుకే కవిత్వంకోసం ప్రపంచం అంతా తపించింది. నేడూ తపిస్తోంది. భవిష్యత్తులోనూ తపిస్తుంది. ఇదీ కవిత్వ ప్రత్యేకత. అసలు సృష్టి అనేదే ఒక రమణీయ కవిత్వమనీ, దానిని సృజించిన మహాకవి సృష్టికర్త అయిన భగవంతుడే అనీ వేదాలు వర్ణిస్తున్నాయి. ఇలాంటి కవిత్వం సకల సాహిత్యాలకూ శిఖరం వంటిది. ఆ శిఖరానికి మనిషిని చేర్చడానికి దోహదం చేసిన దివ్వెల వంటివారు ఆలంకారికులు. కవిత్వం సాహిత్యంలో అంతర్భాగం. ‘సహితస్య భావః సాహిత్యమ్’అని నిర్వచనం. అంటే అన్ని కళలూ కలగలసిందే సాహిత్యం అని అర్థం. శబ్దార్థాల కలయిక కూడా సాహిత్యమే. శబ్దార్థాలే కదా కళలకు మూలాలు!
కవిత్వం అంటే దుఃఖార్తులకూ, శ్రమార్తులకూ, శోకార్తులకూ మానసికోల్లాసాన్ని కలిగించే దివ్య కళ అని భరతుడు అంటాడు. లోకంలో అడుగడుగునా ఉన్నవి దుఃఖాలే. పైకి సుఖాలవలె కనిపించేవన్నీ పరిణామంలో దుఃఖానే్న మిగిలిస్తున్నాయి. ఉదాహరణకు వనం సఖాభిలాషలతో సుఖాన్ని కలిగిస్తున్నట్లే అనిపించినా, అది ఎంతోకాలం నిలువదు. వార్ధక్యం అడుగుపెట్టగానే వన సఖాలన్నీ హరించుకొనిపోతాయి. కనుక ఇలాంటి దుఃఖార్తులకు ఉపశమనాన్ని కలిగించేది కవిత్వమే. లోకంలో శ్రమజీవులు అసంఖ్యాకంగా ఉన్నారు. వారు నిరంతర శ్రమవల్ల అలసిపోయి, విశ్రాంతిని కోరుకుంటారు. కేవలం శారీరక విశ్రాంతి సరిపోదు. మానసిక విశ్రాంతి కావాలి. మనస్సు మధురోహలకు నిలయం కావాలి. అప్పుడే శ్రమవల్ల కలిగిన ఆర్తి నశిస్తుంది. మానసిక వినోదం కవిత్వంవల్లనే సాధ్యం. ఇష్టజన వియోగంవల్ల, అనిష్ట సంఘటనలవల్ల మనిషికి శోకం సంభవిస్తుంది. ఆ శోకం ఎన్నటికీ చల్లారదు. సుదీర్ఘమై జీవితాంతం కష్టపెడుతుంది. శోకం నశించాలంటే కవిత్వాన్ని ఆశ్రయించవలసిందే. రామకథ వాల్మీకి శోకాన్ని దూరం చేసింది. కనుక కవిత్వం భరతుడు చెప్పిన విధంగా దుఃఖ, శ్రమ, శోకాలకు ఔషధంలా పనిచేసి మనిషిని ఆరోగ్యవంతుణ్ణి చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
భరతుని నాట్యశాస్త్రాన్ని వ్యాఖ్యానించిన అభినవగుప్తుడు కవిత్వంవల్ల ప్రీతి ఉద్భవిస్తుందనీ, ప్రీతి అంటే ఆనందమే అనీ అంటాడు. కవిత్వానికి ప్రీతి ఒక్కటే ప్రధానమనీ, ప్రీతి లేనిదే కవిత్వానికి సార్థకత లేదనీ అతని అభిప్రాయం. కావ్య ప్రకాశకారుడైన మమ్మటుడు కవిత్వంవల్ల కలిగే పరమ ప్రయోజనం ఆనందమే అనీ, అది సకలప్రయోజనాలకూ శిఖరాయమాణమైందని అంటాడు. అయితే కవిత్వానికి ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయనీ, కాళిదాసాదులకు లభించినట్లు కీర్తి, శ్రీహర్షాదులకు లభించినట్లు ధనమూ, లోకంలో బ్రతికేందుకు కావలసిన లోకజ్ఞానం కవిత్వంవల్లనే సాధ్యం అంటాడు. కవిత్వం ప్రియురాలివలె అనునయ వాక్యాలతో హితాన్ని బోధిస్తుందనీ, రాముడిలా ఉండాలనీ, రావణునిలా ఉండకూడదని చెబుతుందనీ అంటాడు. కవితాలోకం అపారమైందనీ, ఆ లోకాన్ని సృష్టించే బ్రహ్మదేవుడు కవియే అనీ, కవిబ్రహ్మ ఎలా సంకల్పిస్తే అలాగే కవిత్వలోకం ఆవిష్కృతవౌతుందని అగ్నిపురాణం చెబుతోంది. కవిత్వం రాయకపోవడం తప్పుకాదు గానీ, కవిత్వాన్ని చెడుగా రాస్తే మాత్రం అది మరణంతో సమానమనీ, కుకవిత్వం రాసే వాళ్లను శిక్షించాలనీ భామహుడు అంటాడు. కవిత్వంలో కించిన్మాత్రంగా కూడా చెడు చేరదాదనీ, నిండైన అమృతభాండంలో ఒక్క విషపు చుక్క సైతం హానిని చేకూర్చినట్లే ఎంత గొప్ప కావ్యంలోనైనా చిన్న దోషం సైతం మనస్సును కలచివేస్తుందని దండి అంటాడు.
వామనుడు కవిత్వ విషయంలో సుదీర్ఘంగా చర్చించాడు. కవిత్వం మంచిదైతే కేవలం ప్రత్యక్షంగానే కాకుండా, పరోక్షంగా కూడా అనేక ఫలితాలను ప్రసాదిస్తుందని అంటాడు. ప్రీతిని కలిగించడం ప్రత్యక్ష ప్రయోజనమనీ, కీర్తిని సంపాదించి పెట్టడం పరోక్ష ప్రయోజనమనీ విశే్లషిస్తాడు. చెడు కవిత్వం కవిని నరకానికి నడిపే యమదూత వంటిదనీ, మంచి కవిత్వం స్వర్గానికి తీసికొనివెళ్లే దేవదూత వంటిదనీ అంటాడు.
రాజశేఖరుడు కవిత్వాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి, ఎన్నో సత్యాలను ఆవిష్కరించాడు. చెడు కవిత్వాన్ని తప్పక నిషేధించవలసిందే అని అతడు నిష్కర్షగా చెబుతాడు. కవిత్వం అనేక రుచులతో అలరారుతూ ఉంటుందనీ, ఎవరికి నచ్చిన రుచిలోవారు కవితా రచన చేయవచ్చునని అంటాడాయన. పిచుమంద (వేప), బదరీ (మేడి), మృద్వీ (ద్రాక్ష), వార్తాక (వంకాయ), తింత్రిణీ (చింతపండు), సహకార (మామిడి), క్రముక (వక్కపొడి), నారికేళ (కొబ్బరి), త్రపుస (దోస)ల వలె ఒక్కొక్క కవి రచన ఒక్కొక్క రుచిలో అలరారుతూ ఉంటుందని అంటాడు. ఆద్యంతాలూ ఏమాత్రం రుచించకుండా ఉండేది వేపలాంటి కవిత్వమనీ, తొలుత రుచి లేకుండా ఉంటూ, పరిణామంలో బాగుండేది మేడి లాంటి కవిత్వమనీ, తొలుత సాధారణంగా ఉంటూ, తింటున్నకొద్దీ మధురమయ్యేది ద్రాక్ష వంటి కవిత్వమనీ, తొలుత మధ్యరకంగా ఉంటూ, చివర రుచిలేకుండా ఉండేది వంకాయ వంటి కవిత్వమనీ, మొదలూ, చివరా మధ్యరకంగా ఉండేది చింతపండు లాంటి కవిత్వమనీ, ఆదిమధ్యాంతరాలలో మధురంగా ఉండేది మామిడిపండు లాంటి కవిత్వమనీ, తొలుత రుచికరంగా ఉంటూ క్రమంగా రుచిని కోల్పోయేది వక్కపొడి లాంటి కవిత్వమనీ, ఆద్యంతాలలో తీయగా ఉండేది. కొబ్బరి లాంటి కవిత్వమనీ, తొలుత బాగుండి, చివరికి మధ్యమంగా ఉండేది దోసకాయ లాంటి కవిత్వమనీ అంటాడు. వస్తువు రమణీయమైనదైనా, జుగుప్స కలిగించేదైనా, ఉగ్రతను కలిగించేదైనా, ప్రశాంతతను చేకూర్చేదైనా కవి చేతిలో పడినప్పుడు నూతనత్వాన్ని సంతరించుకొంటుందనీ, ఆస్వాదయోగ్యం అవుతుందనీ ధనంజయుడు అంటాడు.
చక్కగా ఆయా రసాలను పోషిస్తూ, ఎక్కువ తక్కువలు (అన్యూనాతిరిక్తాలు) లేకుండా ఉండే సుందరవాక్కు కవిత్వం అని కుంతకుడు అంటాడు. కవిత్వానికి ఔచిత్యమే ప్రాణమనీ, ఔచిత్యం లేకుంటే కవిత్వం రాణించదనీ క్షేమేంద్రుని అభిప్రాయం. మనిషి శరీరం అందంగా కనబడాలంటే అవయవాలన్నీ సలక్షణంగా ఉండాలి. ఏ అవయవంలో వికారం ఏర్పడినా మనిషి ఆకర్షణీయంగా కనబడని విధంగా కవిత్వం ఆసాంతమూ ఔచిత్యవంతంగా ఉండాలంటాడు. ఔచిత్యం లేని కవిత్వాన్ని జనులు ఇష్టపడరనీ, ప్రజాహృదయాలను గెలుచుకోవాలంటే ఔచిత్యవంతమైన కవిత్వాన్ని రాయాలనీ అంటాడాయన. ఏ దోషాలూ లేని రసమయ శబ్దార్థాలే కవిత్వానికి ప్రాణాలని భోజుడు అంటాడు. రసమయ కవిత్వమే కవికీ, పాఠకునికీ కీర్తిప్రతిష్ఠలను చేకూరుస్తుందని అంటాడు. కవిత్వంలో మహత్త్వమూ, రసికత్వమూ రెండూ ఉండాలంటాడు రుయ్యకుడు. కవి వాక్కులలో మానవ శ్రేయస్సు నిక్షిప్తమై ఉంటుందనీ, సకల మంగళాలకూ కవివాక్కు నెలవనీ అంటాడాయన. కవిత్వంవల్ల ధర్మార్థకామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయని విశ్వనాథుడు అంటాడు. కవిత్వం ద్వారా బ్రతికి ఉన్నంతకాలం ధర్మార్థకామాలనూ, మరణానంతరం మోక్షాన్నీ సాధించవచ్చునని ఆయన అభిమతం.
రమణీయార్థాలను ప్రతిపాదించే చిన్నశబ్దం కూడా కవిత్వమే అవుతుందని జగన్నాథ పండితరాయలు అంటాడు. అంటే రమణీయత కవిత్వానికి ప్రాణం అని భావం. వ్యంగ్య వైభవంతో కూడిన కవి రచన కవిత్వం అవుతుందనీ, అంతటా వాచ్యమే ఉంటే పస ఏముంటుందని విద్యానాథుడు ప్రశ్నిస్తాడు. కవిత్వానికి శబ్దార్థాలు రూపాలనీ, వ్యంగ్యం ప్రాణమనీ, అలంకారాల నగలనీ అంటాడాయన. కవి నిష్కల్మషుడు కావాలి. మాటలలో, మనస్సులో, శరీరంలో నిరంతరం కల్మషాలు చేరుతూ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడూ సంస్కార గంగా జలాలతో కడిగివేసుకోవాలి. అప్పుడే కవి మనీషి అవుతాడు. కవికి తల్లులవలె కాపాడేవి కొన్ని గుణాలున్నాయి. అవి పుష్కలంగా ఉంటే కవికి తిరుగులేదు. వాటిలో మొదటిది ఆరోగ్యం. రెండవది ప్రతిభ. మూడవది అభ్యాసం. నాల్గవది భక్తి. అయిదవది సజ్జన సాంగత్యం. ఆరవది విశేష జ్ఞానం. ఏడవది జ్ఞాపకశక్తి. ఎనిమిదవది నిత్య సంతోషం. ఈ ఎనిమిది సుగుణాలుంటే కవిత్వం పరిపుష్టవౌతుందని రాజశేఖరుని మాట.
కవికి అనేక విద్యలు తెలియాలి. ప్రధాన విద్యలూ, ఉప విద్యలూ కరతలామలకాలు కావాలి. పదకోశం తెలియాలి. వ్యుత్పత్తి పరిజ్ఞానం ఉండాలి. అనేక ఛందోరీతులు అవగతం కావాలి. అలంకార వైచిత్రి ఆవశ్యకం. అరవైనాలుగు కళలలో పరిచయంకావాలి. సౌజన్యంతో కూడిన హృదయం ఉండాలి. ఎల్లప్పుడూ కవి సమ్మేళనాలలో పాల్గొంటూ ఉండాలి. ప్రపంచంలో నిరంతరం జరిగే పరిణామాలు అవగతం కావాలి. యుక్తితో పలికే చాతుర్యంకావాలి. ఎన్నో యాత్రలుచేసి, అన్ని ప్రాంతాల జీవన శైలులను ఆకళింపుచేసుకోవాలి. పండిత గోష్ఠులలో పాల్గొనాలి. ఇవన్నీ ఉంటేనే కవిత్వానికి సార్థకత. చిరునవ్వుతో పలకరించడం, ప్రతి మాటలోనూ అంతరార్థం తొణికిసలాడే తీరును ప్రదర్శించడం, ఇతరుల తప్పుల్ని ఎంచకుండా ఉండడం, అడిగితేనే చెప్పడం, అనుచితంగా మాట్లడకపోవడం లాంటివి కవికి కావలసిన ప్రాథమిక లక్షణాలని ప్రాచీనాలంకారికుల ఉపదేశం.
మంచి కవిత్వం అందమైన యువతి శరీర లావణ్యంలా అనిర్వచనీయంగా ఉంటుందంటాడు కాళిదాసు. లావణ్యాన్ని ఏమని వర్ణించాలి? ఏ వర్ణనలకూ అందనిది అది! అలాగే కవిత్వం అనిర్వచనీయానందాన్ని అందించాలి! నవనవోనే్మషంగా సాగే ప్రతిభలోపుట్టే కవిత్వం ఆచంద్రతారార్కంగా భువిలో వెలిగిపోతూ ఉంటుంది!
అందుకే నీతికోవిదులు- ‘లోకంలో మానవజన్మ దుర్లభమనీ, అందులోనూ విద్యావంతునిగా రూపొందడం ఎంతో కష్టమనీ, విద్యావంతుల్లోనూ కవిత్వంరాసే శక్తి కలగడం కష్టమనీ, కవిత్వంలోనూ అద్భుత సృజనలుచేసే శక్తి దుర్లభమనీ’ అంటారు. నేటి కవులు ఈ సత్యాలను ఆకళింపు చేసుకొంటే గొప్ప రచనలు చేయగలుగుతారు!

- డా. అయాచితం నటేశ్వరశర్మ 9440468557