సాహితి

కథామాధురి (శ్రీవిరించీయం 11)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథలో మాధుర్యం ఎక్కడ వున్నదంటే- చదువరి కథ చదవటానికి ముందు అతని వైఖరి, కథ చదివేసిన తరువాత అతని వైఖరిని బేరీజు వేయడంలో వుంది. మధురమయిన కథ చదువరి మనస్సును ఆలోచనలను మార్చివేయాలి. అతని మనఃస్థితి కొత్త రూపు కట్టుకోవాలి. కథలో చదివిన సన్నివేశ ధోరణికి యిచ్చిన సమాధానం అతన్ని అక్కర పరిచేదిగా, అంతకుముందు ఊహించనిదిగా వుండాలి. కథ చివర మెలిక యివ్వడం కాదు యిది. కథను కొత్తగా అర్థం చేసుకోవటానికి దోహదపడడం. మంచి కథ రాయడం వేరు; కథ రాయడం వేరు. గొప్ప కథ అంతకన్నా వేరు. విమర్శకులు ‘నమూనా’గా పది కాలాలపాటు ఎత్తిచూపే కథ వ్రాయడం అంతకన్నా వేరు. కథను ‘వేరు’గా వ్రాయడం యిక్కడ జరిగే పని. భిన్నంగా వ్రాయడం ఎప్పటికప్పుడు కొత్త దనాన్ని తీసుకువస్తుంది. కథ అంటేనే వేరు (బీజం). అది మొలకెత్తే పద్ధతి ఒక్కొక్కటీ ఒక్కొక్క రకం.
మంచి కథ చదువుతున్నప్పుడు అది ఎప్పుడు సమాప్తం అవుతుందో గమనించగలగడం అవసరం. కథారంభం ఒక ఎత్తయితే, కథాసమాప్తి మరో మెట్టు. ఎక్కడ మొదలయింది, ఎక్కడ అంతం అయిందీ అనేది ప్రభాతభేరి లాగ, ఏకాంత సేవగా గుర్తుండిపోవాలి. మొదలుకు, తుదికి పొంతన వున్నదా లేదా? చదవడం పూర్తయిన తరువాత మరో రకమయిన ముగింపు మనలో రూపకల్పన అయిందా లేదా? సుప్త మనస్సు కదలికను పొంది శుభప్రదంగా తయారయిందా లేదా? ఇదే పరీక్ష. కథ అస్సలు ఎప్పుడు మొదలయింది అనేది అంతు తెలియని ప్రశ్నగా కనిపిస్తుంది గాని, జవాబు మాత్రం తేలికగానే చెప్పుకోవచ్చు. కథ సృష్టితోనే మొదలయింది. సృష్టికథే అసలు కథ. అందులో మనిషి కథ, అతను ఆలోచించడం గురించి ఆలోచించడం మొదలుపెట్టినప్పటి నుంచీ ఆరంభం అయింది. సృష్టికర్తకు ఆదిమధ్యాంతరహితుడు అనే ఒక కితాబు వున్నది. అతని సృష్టికి కూడా అంతే. మళ్లీ మొదలయిన చోటుకు చేరుకోవడంలోనే కథ సమాప్తం అవుతుంది. మొదలయినచోటు అంటే వెనకటి ప్రదేశం కాదు. దానికి పై స్థాయిలో అంతస్తులో వున్న జాగా. బొంగరం తిరుగుతూ వున్నప్పుడు, తాడు ఎప్పటికప్పుడు పైకిపోతూ వుంటుంది. అదే జాగాకు వస్తుంది గాని, పై స్థాయికి కదా. బొంగరం మీద గీతలు గీసుకుంటూ దారిపైకి పోయి శిఖరాన్ని అందుకుంటుంది. ఆ శిఖరంలో వరదరాజస్వామి పాదాలున్నాయి. అందుకే కథలన్నీ కంచికి వెళ్లడం.
సినిమా చూస్తూ వున్నప్పుడు చివరి సీన్ వస్తుందనగానే ప్రేక్షకులు తమ జాగాలలోంచి లేచి నిలబడి, హాలు బయటకు వెళ్లిపోవటానికి ఆయత్తం అవుతారు. అలాగే కథ చదువుతూ వున్నప్పుడు గూడా ఎక్కడ యిది సమాప్తం అవుతుందో మంచి చదువరి అంచనా వేసుకోగలుగుతాడు. అతను ఊహించని ముగింపే అయినా, అతని ఊహకు అందని ముగింపు కాదు. ఆ ముగింపుతో అతనికి తాదాత్మ్యం అయిందనడానికి నిదర్శనం. అతను హాయిగా పుస్తకాన్ని గుండెల మీద నిలుపుకుని కొంతసేపు మానసిక ప్రపంచంలో తిరుగడమే.
కథ దుఃఖాంతం అయినా చదువరికి యేమీ విచారం రాకూడదు. ఎందుకంటే కథ మధ్యలో యిందుకు కావలసిన సరంజామా అంతా అప్పటికే అతన్ని సమాయత్తం చేసింది కనుక. కథ పొడుగునా ప్రాణం నిలచి వుండడం అంటే యిదే. ప్రాణం ఒక క్షణం పోయి మరుక్షణంలో మళ్లా రాదు. కథ పొడుగునా అంతఃస్రవంతిలా అన్ని అక్షరాలను అదుముకునే వుంది. అన్నిటినీ అలరిస్తూనే వుంది. జీవితాన్ని తారలు తరచి చూచుకున్నకొద్దీ రచయిత యిలా ప్రపంచం నాడిని అందుకుంటాడు. తనలో నిలుపుకుంటాడు. మధురంగా ప్రదర్శిస్తాడు.

- శ్రీవిరించి, ఫోన్ : 09444963584