సాహితి

మరుగున పడిన అశ్వశాస్త్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

...........
తెలంగాణ మాండలికంలో చిరుపొత్తంగా వెలువడిన అశ్వశాస్త్రం అరుదైన పుస్తకం. సహదేవ
పశువైద్యశాస్త్రం
తెలుగులో ప్రాచుర్యంలో వుంది. కాని
కవి పండితులెవ్వరూ
అశ్వశాస్త్రం రాసిన
దాఖలాలు లేవు.
..................
1935 సం. (్భవనామ సంవత్సర శ్రావణ శుద్ధ సప్తమి)లో వెలువడిన ‘అశ్వశాస్తమ్రు - వచన కావ్యాని’కి నేటికి 80 ఏండ్ల వయస్సు. కొండా వీరయ్యగారి ప్రీమియర్ ముద్రాక్షరశాల, సికింద్రాబాదులో అచ్చయింది. మహబూబ్‌నగర్ జిల్లా, కల్వకుర్తి తాలూక, ఎల్లమ్మ రంగాపురం గ్రామ వాస్తవ్యుడు బుక్క సిద్ధాంతి ఈ గ్రంథం రచించాడు. నాకు నిజాం ప్రభువు ప్రతినిధులైన దేశముఖ్ గున్నరెడ్డి దొరలు ఈ పుస్తక ముద్రణకు ద్రవ్య సహాయం చేసి ప్రచురించారు.
అశ్వశాస్త్ర రచయిత బుక్క సిద్ధాంతి పంతొమ్మిదవ శతాబ్దం ద్వితీయార్థంలో జీవించాడు. తల్లిదండ్రులు రామాంబ, లక్ష్మయ్యలు. తమది వావిళ్ల వంశమని చెప్పుకున్న సిద్ధాంతికి పంచాక్షరి, వేదాంతి ఇరువురు తమ్ములు. వీరు కూడా కవులే. ఆధునిక వాహన సదుపాయం లేని నాటి పరిస్థితుల్లో జనం ఎడ్లబండ్లు, గుర్రాలపైనే ఆధారపడి ప్రయాణం సాగించేవారు. దొరల ప్రాపకంలో వున్న సిద్ధాంతి కవి గానే గాక వైద్యుడుగా పేరున్నవాడు. దొరల గుర్రాలకు సంక్రమించే పలు వ్యాధులకు నిత్య జీవితంలో వాడుకలో వుండే దినుసులతో, చెట్లు చేమలతో మందుల తయారీ, ఉపయోగించే విధానం పల్లె ప్రజల వ్యావహారిక తెలంగాణ మాండలికంలో చిరుపొత్తంగా రచించాడు. తెలుగులో ఇదొక అరుదైన పుస్తకం. సహదేవ పశువైద్యశాస్త్రం తెలుగులో ప్రాచుర్యంలో వుంది. కాని కవి పండితులెవ్వరూ అశ్వశాస్త్రం రాసిన దాఖలాలు లేవు. సంస్కృతంలో కికులేశుడు అనే మాతాణ పండితుడు అశ్వశాస్త్రం రచించాడని తెలుస్తుంది.
గ్రంథ ప్రారంభంలో ఇష్టదేవతా ప్రార్థన చేస్తూ ‘కృతిపతికి నిత్య సంపదలొసగున్’ అని ప్రభుభక్తికి ప్రకటించుకొని, అజ్ఞాతవాస కాలంలో విరాట రాజు కొలువులో గుర్రాల ఆలనా పాలనా చూసుకునే సహదేవుడు విరాట రాజుకు ఈ శాస్త్రాన్ని ఎరుకపరిచాడని వివరించాడు. గుర్రాలకుండే సుడుల ఆధారంగా యజమానికి కలిగే శుభాశుభాలను వివరిస్తూ- మెడమీది జూలులో సుడి శుభం. నెత్తిమీద సుడి వుంటే అశుభం, మెడకింద సుడి వుంటే ఎక్కినవాడు మరణించును అని వాక్రుచ్చాడు. గుర్రానికి వుండే పండ్ల సంఖ్యను బట్టి దాని వయస్సును నిర్ణయించే విధానం, చెప్పి గుఱ్ఱానికి ఆయుఃప్రమాణం 32 ఏండ్లన్నాడు. అలాగే గుర్రం పొడవు, ముఖం, కండ్లు, నాలుక, ముక్కు, మెడ, గిట్టలు, చెవులు, వీపు, కడుపు, తోక, రొమ్ముల తీరుతెన్నులతో శుభాశుభాలను, గుర్రం రంగు, రోమాలు వగైరా ఎలా వుండాలో చెపుతూ, ఏయే వర్ణాలు ఎక్కడెక్కడ వుంటే శుభాశుభాలను దీర్ఘంగా వివరించాడు.
ఇక అశ్వరోగ చికిత్సా ప్రకరణానికి వస్తే పల్లె జనానికి సులభంగా అర్థమయ్యే రీతిలో అచ్చమైన తెలంగాణ మాండలికాలకు ప్రాణం పోశాడు. అప్పటి అతని అవగాహనకు ప్రశంసించాల్సిందే. అందుబాటులో వుండే దినుసులు, చెట్లు చేమలతో మందుల తయారీ, వాడే విధానం వివరించాడు. మచ్చుకు, గుర్రం ముక్కులోనుంచి సర్దినీరు గారితే ‘బోకిల నిప్పులు పోసి, నిప్పులమీద పిడికెడు రవ్వ శక్కరి పోసి, ఆ పొగ గుర్రం ముక్కులకు పోవు రీతి చేయవలయును. మూడు దినాలలో సర్ది విడుచును. గుర్రం దగ్గులకు- పెద్దవి అల్లం కొమ్ములు దెచ్చి, దానికి తూటుపొడిచి, అద్దతులం ఇంగువ పెట్టి పుటం వేసి, మూడు గోలీలు చేసి ముందు ఉదయాన నీళ్లు తాగించి ఒక గోలి కడుపులకు ఇచ్చేది. నయమగును అని బుక్కసిద్ధాంతి రాయడంలోని సారస్యం మనకు అవగతవౌతున్నది. ఇలా ఎన్నో రోగాలకు సులభ వైద్యం సూచించాడు. ఈ వైద్య శాస్త్రం కేవలం దొరల గుర్రాలకే కాక గుర్రాలున్న ఇతర జనానికి కూడా ప్రయోజనకారి అయింది. బుక్కసిద్ధాంతి హృదయంలో జీవకారుణ్యం లేకపోతే ఈ శాస్త్రం వెలువడి వుండేది కాదు. బుక్క సిద్ధాంతి అశ్వశాస్త్రంతోపాటు ‘తొలి తెలంగాణ రామాయణం బతుకమ్మ పాట, లక్ష్మీ సరస్వతి సంవాదం, కేదారేశ్వరి వ్రతం, గౌరీదేవి కథ, సప్తవర్ణాలపై పద్యాలు, అనుభవ వైద్యశాస్త్రం మొదలగు గ్రంథాలు రచించాడు. ఆయన శుభ సందర్భాల్లో వాడే బుక్క, గులాల్ పొడులను, వాటితోపాటు కీర్తనల పుస్తకాలు, యక్షగానాలు, పురాణ గ్రంథాలు గ్రామ గ్రామం తిరిగి అమ్ముతూ సంచార జీవనం సాగించాడు. పల్లెటూళ్లలో విద్యాసక్తిని కలిగించాడు. బుక్కపొడిని ‘తుంగముస్తెలు’ అనే దుంపలను దంచి తయారుచేసేవారు. ఇది చక్కని సువాసనాద్రవ్యం. ‘బుక్క’ విక్రయించడంవల్ల వీరి యింటిపేరు ‘బుక్క’వారిగా స్థిరపడింది. పాలమూరు కవి, పండితునిగా పేరొందిన డా బుక్క బాలస్వామిగారు వీరి పరంపరలోనివాడే.
సిద్ధాంతి 80 ఏండ్ల నాడు రచించి, ముద్రించిన ‘తొలి తెలంగాణ రామాయణం బతుకమ్మ పాట’ను వెనె్నల సాహిత్య అకాడమీ నాగర్‌కర్నూల్‌వారు ఈమధ్యే పునర్ముద్రించారు. అది ఆవిష్కరణకు సిద్ధంగా వుంది. నేటికీ గుర్రాల వాడకం వున్నవారికి ప్రయోజనకారిగా వుండేందుకు ‘అశ్వశాస్త్రం’ పునర్ముద్రిస్తే బావుంటుంది.

- జి. యాదగిరి, 9440339917