సాహితి

వర్తమాన సామాజిక చలనం.. ఈ దశాబ్ది కవిత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్,
గిరిప్రసాద్ భవన్,
బండ్లగూడ, నాగోల్
వెల: రు.290/-

ఈ దశాబ్ది కవిత్వం విషాదానికి ఒక సుదీర్ఘమైన సంకేతం. సామ్రాజ్యవాద కుట్రలకు బలై వెలవెలబోతున్న ప్రపంచ మానవ సమాజ నిట్టూర్పులకు సమర్థమైన ప్రతిఫలనం. ప్రాంతీయ, సైద్ధాంతిక, ప్రాపంచిక దృక్పథంతో కలం విప్పిన కవితా సారధుల అక్షర మూల్యాంకనానికి ఇదో బలమైన ప్రయత్నం. ఈ సంకలనంలో కవులంతా వర్తమానంలోని ప్రతి సూక్ష్మ కోణాన్ని జాగ్రత్తగా గమనించినవారు, ప్రపంచీకరణ వెనుక ఉన్న క్రౌర్యం అది మానవ విలువలను ధ్వంసం చేస్తున్న తీరుపట్ల పూర్తి అవగాహన ఉన్నవారు. మాయమైపోతున్న మనిషి ఆచూకీ కోసం ఆరాటపడుతున్న వారు. తనను చుట్టుకున్న తాను దాటలేని చీకటిని ఛేదించే తపన కలవారు.
వాస్తవాన్ని కవి చెప్పడం ఎప్పుడైనా స్వాగతించదగిందే. కాని వాస్తవాన్ని వాస్తవికంగా చెప్పడానికి ఎవరూ కవిత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. అందుకు వ్యాసాలున్నాయి. ఇంకా అనేక మార్గాలున్నాయి. (ఈమధ్య కొంతమంది వ్యాసాన్ని కూడా సంక్లిష్ట వాక్యాలతో అర్థం కాకుండా చేస్తున్నారనుకోండి. అది వేరే విషయం). కవిత్వం వాస్తవాన్ని రొమాంటిక్‌గా చెప్పినప్పుడు మరింత నిటారుగా పాఠకుని గుండెల్లోకి వెడుతుంది. కవి తన స్థాయిని పాఠకునిలో నిలుపగలుగుతాడు. చాలామంది కవులు సిద్ధాంత నిబద్ధత మాత్రమే కవిత్వం అనుకుంటారు. ఈ నిబద్ధతను తను పాటిస్తున్న వైనం గురించి అత్యంత గర్వపడుతూ ఇది లేనివాడ్ని అరాచకవాది అనీ, వస్తుబలం లేనివాడని, విధ్వంసక కవి అని బట్ట కాల్చి మీదేస్తుంటారు. సైద్ధాంతిక నిబద్ధత ఒక వ్యక్తిలోని లేక ఒక కవిలోని పార్శ్వం మాత్రమే.. ఆ సిద్ధాంతానికి కావలసిన పునాది ఎక్కడ ఉన్నది? ఏ జీవన విషాదం నుంచి జరిగే సాంస్కృతికత మనిషిలో ఒక సిద్ధాంతాన్ని దానికి ప్రాతిపదిక లాంటి తత్వాన్ని నిర్మిస్తుంది అనేది పరిశీలించాలి. ఇలాంటి ప్రాతిపదికలను వ్యక్తీకరించడానికి కవిపడే తపన ఎంత తీవ్రంగా ఉంటే కవిత అంత బలంగా రూపొందుతుంది. ఇలాంటి వ్యక్తీకరణను సాధించడానికి కవి కవిత్వవంతుడు కావడానికి మూలమైన సామాజిక దుఃఖం ఈ దశాబ్దిలో పుష్కలంగా ఉంది. ఈ సంకలనంలోని చాలా కవితల్లో వేదన చాలా ఒడుపుగా ప్రతిఫలించింది. ఈస్తటిక్స్ కోసం కవి చేసే అభ్యాసం కంటే సామాజిక దుఃఖం అక్షరానువాదం చేసే క్రమమే ఒక గొప్ప ఈస్తటిక్స్‌గా నిలబడింది.
తెలంగాణ భాష ఉర్దు పదాలతో జమిలినేతగా కలిసిపోయిన విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. స్కైబాబా సూఫి దేవుడు ఆస్మాన్‌కి కబూతర్, హనీస్ నయా దుఃఖం ఈ పద్ధతిలోనే సాగిపోయిన కవితలు.
కాల స్పృహ కవిత్వంలో అనివార్యం అనేది ఈనాడు అందరూ అంగీకరిస్తున్న అంశం. కాగా ఆ స్పృహ కవిలో చేతనలో వుండడం ఒక పద్ధతైతే సుప్త చేతనలో వుండడం మరో పద్ధతి. ఈ సుప్త చేతనలోని సామాజిక చైతన్యం కవి ఏ వస్తువును స్వీకరించినా ఆ వస్తువుకు అతీతంగా ఉండదు. వస్తువుతో అంతర్లీనం చెంది అక్షరాలుగా అనువాదం చెందుతూనే ఉంటుంది. ఈ రకంగా పేర్కొనదగిన కవితలు వేముగంటి మురళి ఆర్డినరీ బతుకులు, కె.ఎస్. రమణ వొక తర్వాత, వి.ఆర్.విద్యార్థి ఆదిమానవుడు మనం, కూర్మానాధ్ ఇంకా, కాసుల లింగారెడ్డి, రూపకుమార్ డబ్బికార్, జనజ్వాల లాంటి కవులంతా ఇక్కడ పేర్కొనవలసినవారే. మాట్లాడుతున్నట్టే కవి మొదలెట్టి మనసుకు హత్తుకుపోయేలా కవిత్వం పేర్చే అపురూప కవులు మనకున్నారు. ఆశారాజు నిషేధం, వేణు సంకోజ్ నాల్కల ఎండ్లూరి సుధాకర్ దుఃఖైర్లంజి ఇలా సాగిపోయిన కవితలు. మనిషిని ప్రకృతీకరించడం ప్రకతిని మానవీకరించడం కవితా నిర్మాణంలో మరో విశిష్టమైన దారి. అంతమాత్రాన ఇదేమీ కేవలం ప్రకృతీ కవిత్వం కాదు. ఇక్కడ కూడా ఈనాటి కవి వేదనే ఉంటుంది. విమల తెలిసి..తెలిసీ... మోతుకూరి అశోక్‌కుమార్ చీకటి భాష, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి వట్టిదే, దాసరాజు రామారావు చెర్వొక కల, మాకినీడు సూర్యభాస్కర్ తడితడిగా ఆలోచించే - లాంటి కవితలన్నీ ఈ దారిలో నడిచినవే. నిదురించే తోటపాట, ప్రకృతిని మానవీకరించిన కవిత్వం. పైకి రొమాంటిక్‌గా ఉందనుకుంటాం గానీ కవితలో బుసకొట్టి సామాజికత నిలకడగా చదివితే తెలిసిపోతుంది. ఇదే పద్ధతిలో కొనసాగిన కవిత బాణాల శ్రీనివాస్ పురాజ్ఞాపకం. అలాగే చిత్తలూరి సత్యనారాయణ కూడా ఈ బాటలో నడిచిన కవే. ఏమైనా ఒక దశాబ్దనుంచి అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ ప్రకంపనలన్నింటికీ ఈ సంకలనం అద్దం పడుతోంది. వచ్చిన కవితలే మళ్లీ వచ్చిన అన్యాపదేశాలను మినహాయిస్తే డా.ఎస్.వి.సత్యనారాయణ, డా.పెన్నా శివరామకృష్ణల సంపాదకత్వాన్ని అభినందించాలి. కవితా పరిణామాల మీద పరిశోధన చేసే విద్యార్థులకు ఎంతో ఉపయుక్త గ్రంథం ఇది. కాల స్పృహతో ప్రయాణించే ప్రతి సాహితీవేత్త చదువదగింది.

- డా. కాంచనపల్లి, 9676096614