సాహితి

బ్రాహ్మణీయ భావజాలంపై దూసిన కత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సాహిత్య చరిత్ర
భాష, సామాజికత, కులాధిపత్యం
పుటలు: 528, వెల: రు.500-00
: ప్రతులకు :
కత్తి స్వర్ణకుమారి
లోకాయత ప్రచురణలు,
లుంబినీవనం, అంబేద్కర్ కాలనీ
పొన్నూరు- 522 124

మనకెన్నో తెలుగు సాహిత్య చరిత్రలు ఉన్నాయి. వారి వారి లక్ష్యాలకు, ప్రణాళికలకు అనుగుణంగా అవి రూపుదిద్దుకొన్నాయి. ఇప్పుడు మరొక సరికొత్త తెలుగు సాహిత్య చరిత్ర వచ్చింది. దీని కర్త కత్తి పద్మారావు. కత్తి పద్మారావు దళిత ఉద్యమకారునిగా, వక్తగా, కవిగా, విశే్లషకునిగా, ప్రగతిశీలిగా ప్రసిద్ధులైనవారు. సంస్కృతాంధ్రాలు అధ్యయనం చేసి, ఎన్నో ఏళ్ళు అధ్యాపకునిగా పనిచేసిన విద్వాంసులు. తెలుగు సాహిత్య చరిత్ర అంతా సాంప్రదాయక బ్రాహ్మణీయ భావజాల చరిత్ర. దానిని తిరస్కరించి భాష, సామాజికత, కులాధిపత్యాలకు ప్రత్యామ్నాయంగా ప్రధానంగా దళిత కొంతమేరకు బహుజన సంస్కృతిని ప్రతిష్ఠిస్తే తప్ప మోక్షంలేదన్న స్థిర లక్ష్యంతో ఈ సాహిత్య చరిత్రను కత్తి పద్మారావు రచించారు. వారి భావాలు నిశితమైనవి. ఈ గ్రంథంలో ఎనె్నన్నో మంచి విషయాలున్నాయి. ఆలోచనీయాలైన అంశాలెన్నింటినో ప్రతిపాదించారు. వారి సదాశయంతో విభేదించాల్సిన పనిలేదు.
రచన రెండు తీరులుగా చేయవచ్చు. ఒక శీర్షికకు అనుగుణమైన అధ్యాయ విభజన, ప్రణాళిక, అంతస్సూత్రంతో సాగే వాటిని ‘గ్రంథాలు’అనుకుందాం. అంతస్సూత్రత లేకుండా స్వతంత్ర ప్రతిపత్తితో సాగే వ్యాసాలను కలిపి పుస్తకంగా అచ్చొత్తిస్తే ‘‘వ్యాస సంపుటాలు’’అవుతాయి. మరి కత్తి పద్మారావు తెలుగు సాహిత్య చరిత్రను ఈ కోణంనుండి పరిశీలిస్తే ఏకాంశనిష్ఠమైన గ్రంథం కాకుండా కేవలం వ్యాస సంపుటంగా తేలుతుంది. దీనికి తెలుగు సాహిత్య చరిత్ర అని నామకరణం చేయడం అతివ్యాప్తి దోషం. కులాధిపత్యంఅనో మరోటో పెట్టేసి బ్రాకెట్లో వ్యాస సంచలనం అని రాసి వుంటే సరిపోయేది. సామల రమేశ్‌బాబు నడుస్తున్న చరిత్ర పత్రికలో పరంపరగా రాసిన వ్యాసాలన్నింటినీ దీనిలో చేర్చారు. ఆ విధంగా స్వతంత్రప్రతిపత్తి గలిగిన వ్యాస సంకలనం కావడంవల్ల పునరుక్తులు, అప్రయోజనకరమైన అలవోక వ్యాఖ్యలు, మధ్యమధ్య రచయిత ప్రవేశం, కాలక్రమాలను అనుసరించని ప్రస్తావనలు, చంద్రబాబు, యన్.టి.ఆర్ ఇతర శాసనసభ్యుల ప్రస్తావనలు, ఉపన్యాసధోరణి చోటుచేసుకున్నాయి. ఈ వ్యాసాలను ముడిసరుకుగా ఉపయోగించుకొని తమ లక్ష్యానికి అనుగుణమైన ఒక విద్యాత్మకమైన క్రమశిక్షణతో, సంయమన శీలంతో రాసి వుంటే సాహిత్య చరిత్రగా రూపుదాల్చేది. ఇంచుమించు ఇదే భావజాలంతో గతంలో బి.ఎస్.రాములు ఒక పుస్తకం రాసారు. దానిలో వున్న సీరియస్‌నెస్ దీనిలో లేకపోవడానికి హేతువు ఇది పుస్తకంకాక వ్యాస సంపుటం కావడమే. ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం తన ధోరణిలో రాసిన ఒక బృహద్వ్యాస సంపుటానికి ‘సాహిత్య చరిత్ర’ అని కాకుండా ‘సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు’ అని పేరు పెట్టడం గమనార్హం.
బ్రాహ్మణీయ భావజాలం అన్న పదం ఒక నిర్దుష్టార్థంలో సాహిత్య చరిత్రలో స్థిరపడింది. కాని దీనితోపాటు బ్రాహ్మణవాదం, నయా బ్రాహ్మణవాదం అన్న మరో రెండు పదాలను కూడా ప్రయోగించారు. బ్రాహ్మణుల కంటే కమ్మ, రెడ్లు బ్రాహ్మణత్వాన్ని పొందిన తర్వాత కర్కశంగా తయారయ్యారు. బ్రాహ్మణుల్లో కుట్రలు, కుతంత్రాలు, ఆత్మస్తుతి, పరనింద, పరభాగ్యోపజీవనం వుంటాయి. వీటన్నింటితోపాటు కమ్మరెడ్లకు, భూస్వామ్య మనస్తత్వం వుంటుంది. (పుట 286). బ్రాహ్మణులకంటే కూడా రెడ్డి, కమ్మ మేధావులు దళితుల పట్ల చాలా ద్వేషభావంతో వున్నారు. (పుట.22) ఇదీ నయాబ్రాహ్మణవాదం. అణగారిన కులాల్లో కులం స్పృహ పెరగడం. ఆశ్చర్యం. ప్రభుత్వం ఇచ్చే రాయితీలకోసం కార్డును ఉపయోగించడం అధికమవుతుంది. దళితుల్లోనే ఉపకులాలు పెండ్లిచేసుకోవడానికి సిద్ధంగా లేరు. (పుట.492) అని కత్తి పద్మారావు నిష్కర్షగా రాసి తలెత్తుతున్న దళిత బ్రాహ్మణవాదాన్ని కూడా సూచించి ‘‘యథార్థవాది’’ అనిపించుకున్నారు.
తమ వర్ణమే గొప్పదని భావించే బ్రాహ్మణులతో కత్తి పద్మారావు పేచీపడడం లేదు. సాంప్రదాయ బ్రాహ్మణుల కంటే ముసుగువేసుకొన్న బ్రాహ్మణుల్లో వివక్ష ఎక్కువ వుందని తేల్చారు. విప్లవకవి వరవరరావు బ్రాహ్మణవాద పెత్తనాన్ని కొనసాగిస్తున్నారు. దళితులన్న, దళిత సాహిత్యమన్న వరవరరావుకు పట్టదు. (పుట.21) విరసంలో వరవరరావు సాహితీ బాధితుల సంఖ్యే కాదు. వరవరరావుచేత వేధింపులకు గురైనవారు కొల్లలు. (పుట.28) కె.వి.రమణారెడ్డి ఒక అరాచకవాది. మార్క్సిజం, మావోయిజం చదివినట్లు చెప్పుకొనే వీరి మనస్సునిండా దళితులంటే వుండే ద్వేషాన్ని కత్తి పద్మారావు స్వయంగా చూశారు. విన్నారట. (పుట.21.) ఆశ్చర్యంగా అనిపించింది. వరవరరావు కుటుంబం, కెవిఆర్ కుటుంబం కులాంతర వివాహాలతో ముడిపడి వుందనీ, వారు పీడిత జన పక్షపాతులనీ, నిజాయితీపరులైన సిద్ధాంత నిబద్ధులనీ పత్రికల్లో చదువుతుంటాం.
పరభాగ్యోప జీవనులైన బ్రాహ్మణులు తమ కవితాకన్యలను ఎలా అమ్ముకుంటారో చెప్తూ నండూరి సుబ్బారావు ఎంకి పాటలను రేడియో వారికిచ్చిన విషయాన్ని చలం మాటల్లో ఉదాహరించారు. చలం తన స్వీయశైలి విన్యాసంతో చెప్పిన మాటలే అవి తప్ప వ్యతిరేకించినవి కావు. అలా అంకితమివ్వడం తప్పు అని కత్తి పద్మారావు అనుకుంటున్నారా. మరి ఈ సాహిత్య చరిత్ర పుస్తకానికి ‘కృతిభర్త’గా వచ్చిన చందన కేదారీష్ గారిని గురించి అంకిత వాక్యాలు, రెండు పుటల్లో రాసి పొగిడి ఫొటోవేసి కృతజ్ఞతను వ్యక్తీకరించారు. నండూరి సుబ్బారావు చేస్తే తప్పు పద్మారావు చేస్తే ఒప్పా?. అసలు కృతజ్ఞతాశీలం అనేది ఉత్తమ సంస్కారాల్లో ఒకటి. ప్రచురణకు చేయూతనిచ్చిన వ్యక్తికి అంకితం పేరుతో నాలుగు మంచి మాటలు చెప్తే ప్రగతిశీలురం కాకుండాపోతామా? బ్రాహ్మణులనే కాదు, పద్మారావును సైతం ఈ విషయంలో ఆక్షేపించాల్సిన పనేమీ లేదు.
ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యంలో దళితుల ప్రస్తావనలేదన్నారు. ఇప్పుడా సంపుటాల్ని తెరచి చూసి సమర్థించాల్సిన, వ్యతిరేకించాల్సిన పనికి అవకాశం లేదు. ఆరుద్రైతే జాషువాకి ప్రత్యేక శీర్షిక పెట్టడం ఇష్టంలేక రెండు కోయిలలు అని దువ్వూరిని, జాషువాని కలిపి శీర్షిక పెట్టారు. ఈ వివక్షను ప్రశ్నిస్తే ఆరుద్ర జవాబివ్వలేదన్నారని ఒక వ్యాసంలో చెప్పుకున్నారు కత్తి పద్మారావు. (పుట 22.) మరో వ్యాసంలో జాషువా దువ్వూరిల నడుమ ఎన్నో సామ్యాలున్నాయని ఆరుద్రనే ఉల్లేఖిస్తూ రెండు కవి కోకిలలు అని కలిపి రాయడం విచిత్రం. (పుట.383) మాసపత్రికకు రాసిన సీరియల్ వ్యాసాలు కావడంవల్ల ఈ రెండు వ్యాసాలకు మధ్య రెండేళ్ళకు పైగా వ్యవధి ఏర్పడడమే దీనికి కారణం.
తెలుగు కవుల అంకిత పద్యాలమీద పరిశోధన చేసినట్లైతే ఎంతో సామాజిక చరిత్ర మనకు సాహిత్యం ద్వారా అందుతుంది. (పుట 318) అన్న కత్తివారి విలువైన సూచన ఏ జిజ్ఞాసువు మనస్సులోనైనా స్థిరపడితే ఓ మంచి పుస్తకం వస్తుంది. అంతకన్న కావలసిందేమి? కానీ ఈపాటికే జరిగిందది.
ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్‌గా చేసిన లంకపల్లి బుల్లయ్యగారు ప్రసిద్ధ కవులైన గుర్రం జాషువాగారు, కొత్త సత్యనారాయణ చౌదరి గారు (పండితుడు) తుమ్మల సీతారామమూర్తిగారు, ఏటుకూరి వెంకట నర్సయ్య, కొండవీటి వెంకట కవిగారు వంటి శూద్ర, అతి శూద్ర కవులెందరికో కళాప్రపూర్ణ ఇచ్చి ప్రతిభకు కులం లేదని చాటిచెప్పారు. (పుట. 199). కత్తి పద్మారావు ఈ మాటలను తమ జ్ఞాపకాల్లోంచి రాసినట్లున్నారు. గుర్రం జాషువా దళిత కవి అని తెలుసు. మరి తక్కిన నలుగురు కవుల్లో శూద్ర, అతిశూద్ర కవులెవరో తెలియడం లేదు. పైన పేర్కొనబడిన నలుగురూ ఒకే సామాజికవర్గానికి చెందినవారు. ఇప్పటి తరానికి లంకపల్లి బుల్లయ్య గారెవరో తెలియకపోవచ్చు. వారొక సమర్థులైన ఉన్నతాధికారులు, హైదరాబాదులో డిపిఐ డైరెక్టర్‌గా ఉండి ఎందరినో ఉద్యోగాల్లో నియమించిన వ్యక్తి. పద్మారావు తన వాదనకు అనుకూలంగా ఉంటారని బుల్లయ్యను ఉదహరించారేమో. నేను అధికారికమైన సమాచారాన్ని పాఠకుల కోసం ఇస్తున్నాను. ఇందులో కొంత పద్మారావుకు కూడా ఉపయోగపడవచ్చు.
కళాప్రపూర్ణ అనేది ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా సాహిత్య సాంస్కృతిక విషయాలలో విశేషమైన కృషి చేసిన వారికి ప్రదానం చేసే గౌరవ డాక్టరేటు. ఇది కట్టమంచి రామలింగారెడ్డి వేదం వెంకటరాయ శాస్ర్తీకి 1927లో కళాప్రపూర్ణ ఇవ్వడంతో ప్రారంభమైంది. (దీని వెనుక తమాషా కథ ఉంది. ఇప్పుడు చెప్పే అవకాశం లేదు). లంకపల్లి బుల్లయ్య ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 30-11-1968 నుండి 12-12-1974 వరకు ఆరేళ్లపాటు ఉపాధ్యక్షులుగా వ్యవహరించారు. కార్యదక్షులు. వారి హయాంలో గుర్రం జాషువా (1969), తుమ్మల సీతారామమూర్తి (1969), కొండవీటి వెంకట కవి (1971), కొత్త సత్యనారాయణ చౌదరి (1974)లకు ఇచ్చిన సంగతిని పద్మారావు చెప్పారు. వీరితోపాటు అయ్యగారి సాంబశివరావు (1969), బోయి భీమన్న (1971), దివాకర్ల వేంకటావధాని (1972), నిడుదవోలు వెంకటరావు (1973), పురిపండా అప్పలస్వామి (1973), అబ్బూరి రామకృష్ణారావు (1974), ఎస్.టి. జ్ఞానానంద కవి (1974), గంటి జోగి సోమయాజులు (1974)లను సత్కరించారు. అంటే బుల్లయ్యగారి హయాంలో ముగ్గురు దళితులు, ముగ్గురు కమ్మలు, ఆరుగురు బ్రాహ్మణులకు కళాప్రపూర్ణలు దక్కాయన్నమాట. బుల్లయ్యకు ‘వీరిని’ సత్కరించాలని ఉండవచ్చు. కాని ఆ పేరుమీద ‘వారిని’ తిరస్కరించాలని లేదన్న ఉద్దేశం స్పష్టమవుతూనే వుంది గదా! సగం సమాధానం ‘తొక్కిపెట్టడం’ వల్ల నిజంగా ‘కీర్తిశేషుడే’ అయిన లంకపల్లి బుల్లయ్యగారికి అపకీర్తిని కలిగించడమే కాక తెలియని పాఠకులను తప్పుదోవ పట్టించిన వారమవుతాం. ఏటుకూరి వెంకట నర్సయ్య క్షేత్రలక్ష్మి, రుద్రమదేవి లాంటి గొప్ప కావ్యాలు రాసిన ఉత్తమ కవి. కాని 38వ ఏట 1949లోనే అస్తమించారు. అందువల్ల ఆయన కళాప్రపూర్ణ కాలేదు.

(మిగతా వచ్చే సంచికలో)

- వెలుదండ నిత్యానందరావు, 9441666881