సాహితి

విశ్వనరుడు జాషువా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కులమతాలు గీచుకున్న గీతలుజొచ్చి
పంజరాన కట్టువరను నేను
నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు
తరుగులేదు విశ్వనరుడ నేను
(జాషువ: నేను)
తల్లి గర్భంలో నుంచి నేలమీద పడిన ప్రతి బిడ్డకు స్థలకాలాలనుబట్టి ఒక మతం, ఒక కులం, ఒక భాష, ఒక ప్రాంతం, ఒక రాష్ట్రం, ఒక దేశం వంటివి అనేక గుర్తింపులు సంక్రమిస్తాయి. అయితే మనుషులు పెరుగుతున్నకొలదీ విద్యనార్జించే క్రమంలో, ప్రపంచాన్ని అర్థం చేసుకునే క్రమంలో పుట్టుకతో ఏర్పడిన పరిమితులను అధిగమించాలి. మనిషి తననుతాను విస్తృతపరచుకోవాలి. అది వివేకం. లేకుంటే బావిలో కప్పలుగా మిగిలిపోతారు. సాంస్కృతికంగా, వైజ్ఞానికంగా మరుగుజ్జులుగా మిగిలిపోయినవాళ్ళు ఎందుకూ కొరగాకుండాపోతారు. మన కులాలను దాటి ఇతర కులాలను, మన మతాన్ని దాటి ఇతర మతాలను, మన భాషను దాటి ఇతర భాషలను మన దేశాన్ని దాటి ఇతర దేశాలను కౌగిలించుకోలేనివాళ్ళు సాంస్కృతిక మరుగుజ్జులు. కౌగిలించుకున్నవాళ్ళు విశ్వమానవులు. తామే గొప్పవాళ్ళమని, తమ వంశమే గొప్పదని, తమ కుల మతాలే గొప్పవని తమ దేశ భాషలే గొప్పవని పొంగిపోవడం కురచ బుద్ధి. ‘‘్భషలింతె వేరు పరతత్వమొక్కటే’’ అని భావించడం విశాలబుద్ధి. శాస్ర్తియ చింతన. ‘విపులాచ పృథ్వీ’అని మన పూర్వికులే అన్నారు. పృథ్వి విశాలమే గాని, మనలో అనేకులు అనేక కారణాలచేత సాంస్కృతిక వైజ్ఞానిక మరుగుజ్జులుగా మిగిలిపోతున్నారు. ఈ మరుగుజ్జుతనం నిరంకుశత్వానికి, అరాచకానికి దారితీస్తుంది. సమాజానికి హానిచేస్తుంది. దీనికి పరిష్కారం విశ్వజనీన చింతన. గుర్రం జాషువ ఇలాంటి విశ్వజనీన చింతనగల తెలుగుకవి.
‘మాది తెలుగు కలికి.. ‘‘మా కలికి తెలుగు కులము,’’ ‘‘అచ్చముగ భారతీయుడనయితిని నేడు’’ అని ధైర్యంగా ప్రకటించుకున్న జాషువ, ‘‘విశ్వనరుడ నేను’’ అని కూడా ప్రకటించుకున్నారు. వినుకొండ వీధులనుండి విశ్వవీధులకు ప్రయాణించారు గుర్రం జాషువ. పుట్టుకతో వచ్చిన కుల మత ప్రాదేశిక పరిమితులను తాను గుర్తిస్తూనే వైజ్ఞానికంగా సాంస్కృతికంగా విశాలమై జాషువ చేసిన ప్రకటన అది.
ఈ విషయంలో గుర్రం జాషువాది వసుధైక కుటుంబవాదం. ఆయనది వేమన వారసత్వం ‘‘ఉర్వివారికెల్ల నొక్కకంచముబెట్ట’’మన్న వేమన వారసత్వం.
ఎల్లలోకము వొక్కయిల్లై
వర్ణ్భేదములెల్ల కల్లై
పోవాలని కోరుకున్న గురజాడ అప్పారావు వారసత్వం. వీరి మార్గంలోనే గుర్రం జాషువా ‘‘విశ్వసౌభ్రాతృత నభ్యసింపుము’’ అని ప్రబోధించారు. వీరి మార్గంలోనే శ్రీశ్రీ.
అవిభక్త కుటుంబీ!
ఏక రక్తబంధూ!
మానవుడా! మానవుడా! - అని సంబోధించారు. వీళ్ళు విశ్వనరులు, విశ్వకవులు.
జాషువ ఒకవైపు తెలుగు జాతి, దాని చరిత్ర, భాషా సాహిత్యాలు, తెలుగు పాలకులు నాయకులు తత్వవేత్తలు గురించి కవిత్వం రాశారు. మరోవైపు భారతదేశం, భారతచరిత్ర, భారత వీరులు, భారత తత్వవేత్తలు గురించీ కవిత్వం రాశారు. ఈ అన్నిటిలోను తనదైన దళిత వేదనను వినిపిస్తూ వచ్చారు. అదే సమయంలో సమాజంలోని అనేక వైరుధ్యాలను, ముళ్ళ కంచెలను ఎత్తిచూపి, వాటికతీతంగా ‘‘విశ్వనరుడ నేను’’ ప్రకటించారు. నిజానికి ఈ ప్రకటన భారతీయ సమాజంలోని సాంఘిక నిరంకుశత్వం మీద నిరసన. అదే సమయంలో అది ఆయన సాంస్కృతిక ఎదుగుదలకు సంకేతం. గౌతమబుద్ధుడు, ఏసుక్రీస్తు, మహాత్మాగాంధి- ఈ ముగ్గురిని ఆయన శాంతి, అహింసా, కరుణవంటి విశ్వజనీన భావాలకు మూల పురుషులుగా భావించారు. రుక్మిణి కళ్యాణము, శివాజీ, ముంతాజమహలు, క్రీస్తు చరిత్ర, కాందిశీకులు వంటి కావ్యాల ద్వారా ఆయన తన విశ్వజనీన భావాలను చాటారు. అన్ని మతాల ఇతివృత్తాలను తెలుగు కవిత్వంగా మార్చడం ద్వారా తాను మతపరమైన కంచెలను దాటినట్లు సూచించారు.
ఇరవయ్యవ శతాబ్దం ప్రపంచవ్యాప్తంగా అనేక విప్లవాలకు, అనేక విజయాలకు సాక్షి. అదే సమయంలో అనేక విధ్వంసాలకు కూడా సాక్షి. రష్యా, చైనా వంటి దేశాలలో విప్లవాలు వచ్చాయి. భారతదేశంతోపాటు అనేక దేశాలు వలస పాలనలనుండి విముక్తమయ్యాయి. తెలుగు నేలకు సంబంధించినంతవరకు తెలంగాణ రైతాంగ ఉద్యమం, ఆంధ్రోద్యమాలు కొనసాగాయి. అలాగే ప్రపంచ దేశాలు గడగడ వణికిపోయిన రెండు ప్రపంచ యుద్ధాలు, అనేక దేశాల మధ్య జరిగిన యుద్ధాలు ప్రపంచ ప్రజలు మరచిపోలేని విధ్వంసం సృష్టించాయి. ఈ విధ్వంస చరిత్రలో రెండవ ప్రపంచయుద్ధం సృష్టించిన విధ్వంసం అపారమైనది. ప్రపంచ ప్రజలందరినీ కలవరపరచిన యుద్ధం ఇది. ప్రపంచ ప్రజలందరితో ప్రపంచ శాంతి నినాదం చేయించిన యుద్ధమిది. ఈ నినాదాలలో గుర్రం జాషువ కూడా తన గొంతు కలిపారు. ప్రపంచ యుద్ధవ్యతిరేకత, ప్రపంచ శాంతి ప్రీతి ఆయన కవి కంఠంలో మార్మ్రోగాయి. మనం ఇవాళ జరుగుతున్న విధ్వంసాలను చూస్తున్నాం. విద్యావంతులే విధ్వంసాలకు దోహదం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జాషువ ప్రశ్నకు ఇంకా విలువ ఉంది.
‘‘అణ్వస్త్రాలు మాకొద్దు అన్న వస్త్రాలు కావాలి’’ అనే నినాదం పెట్టుబడిదారీ దేశాల అణ్వాయుధ వ్యామోహాన్ని నిరసిస్తూ ప్రపంచ ప్రజలందరూ చేశారు. ‘కాందిశీకుడు’ కావ్యాన్ని సంపూర్ణంగా బౌద్ధతాత్వికతతో ప్రపంచ శాంతి స్థాపనకోసమే రాశారు జాషువ. ‘‘దిక్కులు నిండ నిప్పులన్ గ్రక్కుచునున్న నేటి రణమృత్యువు సేయు దురాగతముల్’’ ఈ కావ్యంలో నిరసించారు జాషువ.
అలాగే ఎల్లజాతుల వారు లేకోదరులయట్లు
ముద్దుముద్దుగ పొంది పొసగుచోటు
ఈనాటి అవసరమని చాటారు. యుద్ధంలో పాల్గొని ఆ బీభత్సాన్ని భరించలేని ఒక తెలుగు సైనికుడు బర్మానుండి బయటపడి నల్లమల అడవులు చేరుకుంటాడు. అక్కడ కాసేపు సేదతీరినపుడు ఆయనకు ఒక బౌద్ధ్భిక్షువు కపాలం కనిపిస్తుంది. కాందిశీకునికి ఈ కపాలానికి మధ్య జరిగిన సంవాదమే ఈ కావ్యం. కాందిశీకుడు బుద్ధుని కాలానికి తన కాలానికి మధ్య వచ్చిన మార్పులను వివరిస్తాడు. అన్నీ చెప్పి
వెలితి వడ్డది మాకు విశ్వసౌభ్రాత్రంబు
మధురాతిమధుర సమత్వదృష్టి
అని వాపోతాడు. అలాగే
ఆశించుచున్నార మఖల దేశాల ముత్త
మమైన నిరతబాంధవ్య లబ్ధి
- అన్న ఆకాంక్షను వ్యక్తంచేస్తాడు. ప్రపంచ ప్రజలమధ్య మంటపెడుతున్న ప్రపంచ యుద్ధం ఎప్పుడు నశిస్తుందో ప్రపంచ శాంతి ఎప్పుడు సాధ్యవౌతుందోనని ఆవేదన పడతాడు.
‘‘ఎన్నండు రణవహ్ని చల్లవడు
నిర్వన్నండు దిగ్దేశముల్
కన్నులో విచ్చెడి విశ్వలోక సమతా కళ్యాణ సంపత్తు అని
అన్నం డబ్బెడి.’’
కాందిశీకుని ఆవేదనను ఆమోదించిన కపాలం
‘విశ్వైక్యత, విశ్వసోదరత,
విశ్వప్రాజ్య జాతీయతల్
వెలయంగా వలె’’నని గొంతుకలిపింది.
ఎవరిని దృష్టిలో పెట్టుకొని రాశారో గాని, పాలకులు కవులను బిరుదులతో, హోదాలతో, పదవులతో సత్కరించే సందర్భంమీద ‘నవ భారతము’అనే కవితలో ఒక ప్రశ్నవేశారు. ఆ ప్రశ్నకూడా విశ్వశాంతికి సంబంధించినది. పాలకులు చేరదీసే కవులు.... విశ్వమా
నవ సౌభ్రాత్రము సృష్టిచేయగల గ్రంథం బొండు నిర్మించి యా
హవ దాహంబు హరించి సంకుచిత భావావేశముల్ మాన్పిరే
‘జోతలు’ కవితలో ‘‘సృజియింతున్ విశ్వసాహిత్యమున్’’అని ఆయన సంకల్పించుకున్నారు. తెలుగు ప్రాంగణం, భారతీయ ప్రాంగణం, విశ్వప్రాంగణం అని జాషువ కవిత్వంలో మూడు ప్రాంగణాలున్నాయి. తెలుగు కవి విశ్వనరుడుగా వ్యాప్తిచెందడం నాటికీ ఆహ్వానింపదగినదే.
కోటాను కోట్ల నరులొక
మేటి జగన్మాతృసుతులు మిత్రులని మదిం
చాటింపు మీసువార్తన్
జాటింపుము జీవితంబు సార్థక్యమగున్
ఇది ‘ముసాఫరులు’ కావ్యంలో ఆయన చివరి సందేశం.

- రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి 9440222117