సాహితి

బ్రాహ్మణులపై వైరభక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాఙ్మయ చరిత్రకారుడికి కులతత్వం వుండకూడదు. భావజాల సంకుచితత్వం వుండకూడదు. సమకాలీన ద్వేషం ఉండకూడదు. ప్రత్యర్థి భావజాలాన్ని కూడా స్వీకరించగలిగిన ధైర్యం కావాలి. విమర్శను సహించగలిగిన ఓర్పు, సమ్యక్ దర్శనం కావాలి. ప్రత్యర్థిని అర్థం చేసుకోవడం వల్లే తన వ్యక్తిత్వాన్ని పెంచుకోగలగాలి (పుట-240). కొందరు ఎక్కువ చదువుతారు. రాయలేరు. కొందరు ఎక్కువ రాస్తారు. దానివెంట అధ్యయనం ఉండదు (పుట.446). సంకుచిత పరిధుల్లో నుండి విస్తృతమైన అంశాలను చూడకూడదు (పుట-345), వ్యక్తిత్వ నిర్మాణంలో ప్రధానాంశం భావావేశాన్ని నియంత్రించుకోగలగటం. దీనికి ఎంతో సంయమనం అవసరం (పు.314) లాంటి అక్షర లక్షలివ్వదగిన గొప్ప మాటలు, మంచి మాటలు ఈ గ్రంథంలో కోకొల్లలుగా ఉన్నాయి. కత్తి పద్మారావుతో సహా అవి అందరికీ వర్తించేవే. జీవితం నిరంతర సాధన క్రమం. కులమతాల గీట్లు, భావ పరిణామాల తెరువాట్లు, ఊహాపోహలకు భిన్నమైన అనుభవాల వాస్తవాలు ఇలా అన్ని అడ్డంకులను దారిచూపే మార్గాలుగా భావించుకుంటూ, అధిగమిస్తూ ఒక విశాల దృక్పథంవైపు, సమత్వం వైపు పయనించడమే మన కర్తవ్యం. ఈ అరవై ఏళ్లల్లో ఎంత సామాజిక పరిణామం సంభవించింది? అదేమీ తక్కువది కాదు. కత్తి పద్మారావు గొప్ప అధ్యయనశీలి. సామాజిక ఉద్యమకారులు, బాధితుల పక్షాన నిలిచి కారాగార శిక్షలు పొందినవారు. చుండూరు, కారంచేడు సంఘటనల్లో బ్రాహ్మణుల పాత్ర ఎంత? కారంచేడు కేసు వాదించిన లాయర్ చంద్రశేఖర్‌ది బ్రాహ్మణ సామాజికవర్గమే కదా. వేంజీ రాందాసు పంతులు, మంగిపూడి వెంకటశర్మ, చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు, గోరా శాస్ర్తీ, అక్కిరాజు హరగోపాల్(రామకృష్ణ), సుబ్బారావు పాణిగ్రాహి, ఎస్సార్ శంకరన్, బి.డి.శర్మ, యాదాటి కాశీపతి లాంటి ప్రగతిశీలురు లేరా? అంబేద్కర్, బోయి భీమన్న, లవణం, వివేక్, వినోద్ (జి.వెంకటస్వామిగారి కుమారులు) - ఇలా వందలాదిమందికి బ్రాహ్మణా బ్రాహ్మణ వివాహాలు జరిగాయి. అసలు కత్తి పద్మారావు స్వయంగా కులాంతర వివాహాలు చేసిన వ్యక్తిగదా. మరి వారిలో బ్రాహ్మణులు ఉండే వుంటారు గదా. అంటే ఆధునిక సమాజ నిర్మాణంలో బ్రాహ్మణుల పాత్ర తక్కువేమీ కాదు. పైకి చెప్పడానికి ఇష్టం లేకపోవచ్చు. అది వేరే విషయం. అందరిలోనూ మంచి చెడ్డలున్నట్లే బ్రాహ్మణుల్లోనూ ఉంటాయి. పద్మారావు యువకుడు, కొత్తగా కలం పట్టిన ఔత్సాహికుడు కాదు. రావలసినంత గుర్తింపు వచ్చింది. చేయదగినన్ని మంచి పనులు చేశారు. అరవై మూడేళ్ల వయసుకు తగిన పరిణతిని, సంయమనాన్ని రచనలో ప్రదర్శించి వుంటే బాగుండేదనిపించింది.
కత్తి పద్మారావు నేను బ్రాహ్మణ వ్యతిరేకిని కాను. బ్రాహ్మణుల్లో ఎంతోమంది నా మిత్రులు, శిష్యులు, ప్రోత్సాహకులు ఉన్నారు. (పుట 20) అని పేర్కొన్నారు. బ్రాహ్మణవాదం అనేది వర్ణ, కుల, ఆధిపత్యానికి ఒక సూత్రీకరణ అంతే అన్నారు. మనకెన్నో పదాలను కాలానుగుణంగా లేవని మార్చుతున్నాం. భార్యను జీవన సహచారి, భర్తను జీవన సహచరుడు, వికలాంగుడిని దివ్యాంగుడు, హరిజనుని దళితుడు, వేశ్యను సెక్స్‌వర్కర్ అని ఇలా ఎనె్నన్నో కొత్త పదాలు ప్రవేశపెట్టి వ్యాప్తిలోకి తెస్తున్నాం. మరి బ్రాహ్మణుల్లో కూడ ప్రగతిశీలురు, వర్ణాంతర వివాహాలు చేసుకున్నవారు, ఆధునిక భావజాలంతో జీవిస్తున్నవారు అసంఖ్యాకంగా ఉన్నారు. అలాంటప్పుడు బ్రాహ్మణ ఆధిక్యత అంటూ ఒక కులానికే పరిమితం కాకుండా ఏ కులాధిక్యతనైనా తిరస్కరించే అర్ధ విస్తృతిలో కూడిక కులాధిక భావజాలం అని కాని, అలాంటి అర్థంవచ్చే మరొక పదాన్ని కత్తి పద్మారావులాంటి సృజనశీలురు, మేధావులు తయారుచేసి వ్యాప్తిలోకి తెస్తే బాగుంటుంది.
శ్రీశ్రీలో, దిగంబర విప్లవ కవుల్లో సాహిత్యాన్ని కులాధిక్యానికి ప్రత్యామ్నాయ సంస్కృతిని ప్రతిష్ఠించాలన్న దృక్పథం లేకపోవడంతో సామాజిక అణచివేతను గుర్తించలేదు. (పుట 296) ఇది కత్తి పద్మారావు భావం. ఏకీభవించేవారు ఏకీభవిస్తారు. విభేదించేవారు విభేదిస్తారు. ఈమధ్య తరగతి బుద్ధిజీవులు ఆంధ్ర సాహిత్యంలో దళితవాద యుగ ఆవిర్భావానికి ఒక అర్థశతాబ్ది అడ్డుపడ్డారు. అయినా వేమన, పోతులూరి, సిద్ధప్ప, జాషువా దళితవాద సాహితీ సంస్కృతిని రక్షించారు. (పుట 296). శ్రీశ్రీ లాంటివారు అర్థ శతాబ్ధి అడ్డుపడితే శ్రీశ్రీకి రెండు వందల ఏళ్ళు ముందున్న వేమన్న ఇత్యాదులు రక్షిస్తారా? ఇదే రకం వాదన?
మధ్యతరగతి బుద్ధిజీవులకు రెండు ప్రధాన గుణాలుంటాయి. ఒకటి వాళ్ళొక గుంపుగాచేరి ఒక ట్రెండ్‌ను తీసుకురావడం, ఒకరినొకరు అకస్మాత్తుగా పొగుడుకోవడం, ఒక అర్థరాత్రిలో అకస్మాత్తుగా చీలిపోవడం, నిందించుకోవడం, తమ వ్యక్తి నిందలనంతా సాహిత్య విమర్శగా ప్రచారంచేసుకోవడం (పుట 294) జరుగుతుందని ఓ వ్యాఖ్య చేశారు. ఈ బలహీనత శ్రీశ్రీ లాంటివారికే పరిమితమా?. ఇతరులకు వర్తించదా? ఇందులో జాషువా, బోయి భీమన్న, శివసాగర్, ఆశారాజు, బి.యస్. రాములు, ఎన్.గోపి, గూడ అంజయ్య, పాపినేని శివశంకర్, శాంతినారాయణ, విద్యాసాగర్, నగేశ్‌బాబు, ఇనాక్ లాంటి వారిని గురించి ప్రశంసావహంగా గొప్పగా రాశారు. కాని ఎండ్లూరి సుధాకర్, సతీశ్‌చంద్ర (వీరిని గురించి రాయవలసి వుంది అని పీఠికలో చెప్పారనుకోండి), దార్ల వెంకటేశ్వరరావు, పైడి తెరేశ్‌బాబు లాంటి వారిని గురించి ప్రస్తావించక పోవడానికి నియోగి వైదికి శాఖాభేదాల్లాంటివేమైనా ఉంటాయని నేననుకోను. ఉన్నా నాకు తెలిసే అవకాశం లేదు.
మద్దూరి నగేశ్‌బాబు, నాగప్పగారి సుందరరాజు, మద్దెల శాంతయ్య, గేరా యాదయ్య లాంటి యువ దళిత రచయితలు అకాల మరణం చెందారు. వ్యసనాల బారినపడకుండా క్రమశిక్షణతో జీవించవలసిన బాధ్యత మీమీద లేదా.? (పుట 472) అని ఆ కీర్తిశేషులను కత్తి పద్మారావు ప్రశ్నించడం మిగిలిన వారికి హెచ్చరికగా పనికిరావచ్చు. కాని వెంటనే ‘బలహీనతలకు లోబడడం బ్రాహ్మణవాదంలో భాగమే’(పుట 473) అంటూ ఒక విచిత్రమైన వ్యాఖ్యచేశారు. ఆ కవులు తాగుడుకు బానిసలై చనిపోవడానికి బ్రాహ్మణవాదానికి మధ్యవున్న సంబంధమేమిటో!.
ఆచార్య ఎన్.గోపి వచన కవిత్వంకంటే నానీల్లోనే బాగాపలికారు. (పుట 372) తెలుగులో ఏ ప్రక్రియకైనా సృష్టికర్తలపట్ల, తొలి రచనల పట్ల సంశయాలు, వాదోపవాదాలు ఉన్నాయేమో కానీ నానీల విషయంలో మాత్రంలేదు. గోపిగారు నానీలను తయారుచేసింది వాస్తవం. చాలమందికి వాటిపట్ల ఆకర్షణ ఏర్పడి రాసింది వాస్తవం. 300దాక నానీల సంకలనాలు వచ్చింది వాస్తవం. నానీలకు ఒక తత్త్వశాస్త్రం ఏర్పడాలని కత్తి పద్మారావు హితవుచెప్పారు. ఒప్పుకుందాం. అంతటితో ఆగకుండా గోపిగారు దీనికొక తత్త్వశాస్త్ర భూమికను రూపొందించడానికి వెనుకాడితే దీన్ని బ్రాహ్మణులు సొంతంచేసుకొని నానీల రామాయణమని రాసిస్తారు. (పుట.376) అప్పుడు గోపిగారు ఈ ప్రక్రియను నేను కనిపెట్టాను అని చెప్పుకున్నా ప్రయోజనం (పుట.375) లేదన్నారు. ఇప్పుడు నానీల సృష్టికర్తను నేనేనని ఏ బ్రాహ్మణుడైనా అన్నాడా? దళితులకు, బహుజనులకు అలా అనకూడదని ఎవరైనా నిషేధించారా?.
ఇక్కడ కత్తి పద్మారావు బ్రాహ్మణుల నేర్పరితనాన్ని పొగడుతున్నారా లేక దాన్నిచూసి భయపడుతున్నారా బోధ పడడంలేదు. చాలాచోట్ల బ్రాహ్మణులను విమర్శించాలనుకొని వైరభక్తితో స్తుతించడం విచిత్ర విరోధభాసం. ఈ గ్రంథంలో ఎన్నోచోట్ల అనవసరంగా బ్రాహ్మణులతో సరిసమానంగా, ధీటుగా రాశారని వస్తుంది. తాపీధర్మారావు, కట్టమంచి, జాషువా, బోయి భీమన్న లాంటి పెద్దలకు అది గౌరవాపాదకం కాకపోను తక్కువతనానే్న కలిగిస్తుందనే గుర్తించాలి.
దళిత గిరిజన తెగల్లోని భాషను నిఘంటువుల్లోకెక్కించి భాషను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్క యానాది మూడువందల జంతువుల పేర్లు 5వ సంవత్సరం నాటికే చెప్పగలడు. (పుట.208) బెస్తవారు రెండుమూడువందల చేపల పేర్లు చెప్పగలరన్నారు. ఆ జీవితంలో ఉన్నవారు అవి చెప్పవచ్చుగాక.. ఇది మంచిదేకాని పెరిగిపోయిన యాంత్రిక నాగరికత, మారిపోయిన జీవన విధానంలో పాత భాష ఉపయోగంలోనుండి పోక తప్పదు.
గ్రంథం నిండా కుప్పతెప్పలుగా అచ్చుతప్పులు. అన్ని అచ్చుతప్పులకన్నా పరాకాష్ట - ఈ వ్యాసాలను నడుస్తున్న చరిత్రలో ధారావాహికగా ప్రచురించిన సామల రమేశ్‌బాబుగారు సామాల రమేశ్‌బాబుగా మారడమే. కొందరు ఎక్కువ రాస్తారు. దాని వెంట అధ్యయనం వుండదు. (పుట.446) సంకుచిత పరిధుల్లోనుండి విస్తృతమైన అంశాలను చూడకూడదు. పుట (345)లాంటి మంచి మాటలు ఈ గ్రంథంలో కోకొల్లలుగా ఉన్నాయి. అవి అందరికీ వర్తించేవి. కత్తి పద్మారావుకు కూడ. భారతదేశంలో పుట్టిన ప్రతిమనిషి అణచివేతకు, అవమానాలకు గురికాకుండా ఆర్థికంగా సామాజికంగా సాంస్కృతికంగా సమంగా ఆత్మగౌరవంతో జీవించాలి. సకల జనుల, సకల కులాల, వర్గాల పదాలతో కూడిన సమగ్ర నిఘంటువు తయారయి సర్వవ్యవహార సమర్థమైన భాషగా తెలుగు వెలగాలన్న మాన్యశ్రీ కత్తి పద్మారావు ఉదారాశయం నెరవేరాలని మనమూ మనసారా ఆకాంక్షిద్దాం.
పైగా కమ్మ, రెడ్లు బ్రాహ్మణులకన్నా ఎక్కువ అపకారం చేశారనీ, కనీసం బ్రాహ్మణుల్లో వచ్చిన కుల సంస్కర్తలు రెడ్లలో రాలేదనీ, ఆ కులానికి అంత అహం అక్కర లేదంటారు (పుట.480). ‘త్రిపురనేని రామస్వామి చేసింది బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం కానీ కుల నిర్మూలన ఉద్యమం కాదు. ఆయన బ్రాహ్మణుల సామాజిక సాంస్కృతిక ఆధిపత్యాన్ని వ్యతిరేకించారు. తన సంఘం సామాజిక సాంస్కృతిక ఆర్థిక ఆధిపత్యాన్ని స్వీకరించి కొత్త బ్రాహ్మణ సంఘంగా తయారయ్యింది’ (పుట.252) అని రాస్తారు. ‘అసలే హిందూమత కులజాడ్యం దేశాభ్యుదయాన్ని వేల సంవత్సరాలు వెనక్కు నడిపించింది. దానికి తోడు క్రైస్తవమతం ప్రజల్లో చొరబడి మాలమాదిగల్లో వున్న వైరుధ్యాలను చూపించడమే గాక ఒక్క మాల వారిలోనే మాల రోమన్ క్యాథలిక్, మాల బాప్తిస్ట్, మాలలూథరన్, సెవెన్త్ డే ఎడ్వంటిస్ట్, ఈ విధంగా ఎన్నో గ్రూపులు ఏర్పరిచింది’ (పుట-261). ఈ రెండు కులాలవారు హిందూ సమాజం చేత ఈసడింపబడినవారే. అవమానింపబడినవారే. ఈసడింపులకు, అవమానాలకు వ్యతిరేకంగా, కలిసికట్టుగా పోరాటం చేయవలసిన వీరు నిర్వీర్య సిద్ధాంతాన్ని బోధించే, దాస్యభావాన్ని పులిమే, వ్ఢ్యౌతత్త్వాన్ని రుద్దే క్రైస్తవ మతాన్ని స్వీకరించి కులం మలినాన్ని పెంచుకొంటున్నారు (పుట.262) - అని కత్తి పద్మారావు నిక్కచ్చిగా అనుభవపూర్వకంగా కాదనడానికి వీలు లేదన్నంతగా చెప్తున్నారు. ‘బ్రాహ్మణులలో కూడా సంస్కరణ కోరినవారు, విస్తృతిని కోరినవారు, సమకాలీనాన్ని సమన్వయం చేసుకున్నవారు, సాంప్రదాయానికి ఎదురుతిరిగినవారు ఉన్నారు’ (పుట-229) అని తాము గుర్తించిన విషయాన్ని బాహాటంగా చెప్పడానికి సంకోచించని విజ్ఞులు కత్తి పద్మారావు. కుల వ్యవస్థ, కులాధిక్యత ఉన్నది వాస్తవం. దానికి ఏ ఒక్క వర్గమో, కులమో బాధ్యత కాక అన్ని కులాలది, అన్ని వర్గాలది ఈ దోషంలో సమ భాగస్వామ్యమే. యాంత్రిక నాగరికత, ఆధునిక భావజాల విజృంభణం కారణంగా కులవ్యవస్థ తిరోగమిస్తున్నది వాస్తవం. అమాయకంగా ఉండే బాగుండుననుకున్నా దాన్ని తోసిరాజని సమసమాజ భావనారథం దూసుకొని ముందుకు సాగుతుంది. అయితే ఈ సంధి సమయంలో కులం పేరిట ప్రజల్ని చీల్చి తమ స్వార్థ ప్రయోజనాలను సాధించుకునే ఉద్యమ నేతలు, అవకాశవాదులు అంతటా ఉంటారు. దీనికి అగ్రవర్ణాలు, అనగ్రవర్ణాలన్న మినహాయింపులేమీ ఉండవు. అవకాశం దొరికినవారూ, అవకాశం దొరకనివారు - అంతే తేడా. ఒక కాలంలో ఒకరికి దోపిడీకి అవకాశం లభిస్తే మరో కాలంలో మరొకరికి లభించడం సామాజిక న్యాయం కావచ్చు.

- వెలుదండ నిత్యానందరావు సెల్: 9441666881