సాహితి

గిడుగు రచనా సర్వస్వం ‘సవర సంబంధి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

...............
రామమూర్తిగారు సవర భాషకు లిపిని రూపొందించారని
కొందరంటుంటారు. అది చాలా తప్పు. లిపిని రూపొందించలేదు గాని సవర భాషాపదాల్ని ఎలా ఉచ్ఛరిస్తారో అలాగే తెలుగు లిపిలో కథలు, పాటలు రాశారు. సేకరించి గ్రంథస్థం చేశారు. ‘‘నేను ఇంగ్లీష్ భాషను పుస్తకాల ద్వారా నేర్చుకున్నాను. సవర (సోర) భాషను మనుషుల ద్వారా నేర్చుకున్నాను. అందుకని మాండలికంలోనే ఉంటుంది’’ అని కూడా అన్నారు సవర భాష గురించి. ‘లిపిలేని భాషకు నిఘంటువుల్ని రూపొందించడం ఎంత కష్టం’ అన్నారాయన.
...................
గురజాడ, గిడుగు- ఇద్దరూ మంచి మిత్రులు. ఒకరంటే మరొకరికి గౌరవం, అభిమానం. ఇద్దరి మనస్తత్వాలూ ఒకటే- విద్య, సాహిత్యం అందరికీ అందుబాటులోకి తేవాలంటే వ్యావహారిక భాషే ఊతం కావాలి, అందుకు నిబద్ధతతో పనిచేయాలని! ఒకసారిగురజాడ, ఆనందగజపతిరాజా వారితో గుర్రంమీద వెలుగోడు ప్రాంతం వ్యాహ్యాళికి వెళ్లినపుడు గుర్రంమీద నుంచీ పడితే గొంతుకు దెబ్బ తగిలి, మాట పీలగా రాసాగింది. గిడుగు, పర్లాకిమిడి కొండల్లోకి సవరల కథలు, పాటలు సేకరించడానికి వెళ్లినపుడు దోమలు కుట్టి పుట్టు చెముడు వచ్చింది.
గిడుగుకు గురజాడ చెవులైనాడు. గురజాడకి గిడుగు గొంతయ్యాడు. ఇద్దరూ కలిసి ఒకటిగా కృషిచేశారు. రెండు మెదడులూ ఒకడవటంతో, మరింత ధీటుగా, నిబద్ధతతో తాము చేయదల్చుకున్న పనులు చేసారు. ఒకరు భాషైతే, మరొకరు సాహిత్యం. అందుకే గిడుగు జయంతినాడు ‘్భషాదినోత్సవమైతే’, గురజాడ జయంతినాడు ‘ఆధునిక సాహిత్య దినోత్సవం’! ప్రాథమికంగా గురజాడ శాసన పరిష్కర్త. అందుకే గిడుగు శ్రీముఖలింగం శాసనాలని పరిశీలించి వ్యాసం రాయగానే గురజాడకి చూపించాడు.
గురజాడని, గవర్నర్ చెన్నై విశ్వవిద్యాలయ సెనేట్ సభ్యుడుగా ఎంపిక చేశారు. విద్యాబోధన కూడా మాట్లాడే భాషలోనే జరిపించడానికి ఎంతో కృషి చేశారు. శ్రీనివాసయ్యంగారు, ఏట్స్‌తోబాటు గిడుగు ఈ విషయంలో ఆయనకు ఎంతో సహకారాన్నందించారు. గిడుగు ‘మెమోరాండమ్ ఆన్ మోడర్న్ స్టడీస్’ అనే గ్రంథాన్ని రచించారు. గురజాడ గ్రాంథికవాదుల తీరు మీద అసమ్మతిని ‘మినిట్ ఆఫ్ డిసెంట్’ ద్వారా ప్రకటించి, సకాలంలో సబ్ కమిటీకి సమర్పించారు. ఆ సమయంలో అసలే ఆరోగ్యం బాగుండని గురజాడ రక్తవిరేచనాలతో బాధపడుతూ- ఒకక్షరం చిన్నది, మరొకక్షరం పెద్దది రావడంతో నానాయాతనలు పడీ ఎదురుగా కూర్చున్న వ్యక్తికి అందించలేక క్రిందికి వదిలేసేవారు. దాంతో దాదాపు ఆయన కాళ్ళ సమీపంలో గిడుగు క్రిందకి పడిన కాగితాల్ని సేకరించి, సాఫీ ప్రతి రాశారు. ఆ రెండు పుస్తకాల జిరాక్స్ కాపీలు డా పోరంకి దక్షిణామూర్తి గారి ద్వారా నాకు లభించాయి. గిడుగు మెమొరాండమ్ ఆన్ మోడర్న్ స్టడీస్’, గురజాడ ‘మినిట్ ఆఫ్ డిసెంట్’ని వందేళ్ళ తర్వాత శ్రీవేదగిరి కమ్యూనికేషన్స్ ద్వారా పునర్ముద్రణ చేశాను.
పట్టుదలతో గురజాడ గురించి అప్పటి 23 జిల్లాలలో సభలు, సమావేశాలు జరపడమే కాకుండా రమణాచారి కవితా ప్రసాద్‌గార్ల సాయంతో గురజాడ 150వ జయంతిని ప్రభుత్వం ఘనంగా జరిపేలా కృషి చేశాను. నన్ను ప్రచురణల ఇన్‌ఛార్జ్ అనడంతో గురజాడ సాహితీ సర్వస్వం, మార్గదర్శి గురజాడ, ఆధునిక ధృవతార (జీవిత రేఖా చిత్రం), బాలల బొమ్మల గురజాడ పుస్తకాల్ని తేవడం జరిగింది. శ్రీవేదగిరి కమ్యూనికేషన్ గురజాడ కథానికల్ని ఇంగ్లీష్, హిందీ, కన్నడ భాషలలోను, ఆధునిక ధృవతారని ఇంగ్లీష్, హిందీ భాషల్లోను, గురజాడ దేశభక్తి గేయాన్ని 24 జాతీయ, అంతర్జాతీయ భాషల్లోకి అనువదింపజేసి ప్రచురించడం కూడా 150వ జయంతి సందర్భంగా తేవాలని నిశ్చయించాం, ప్రచురించాం కూడా. గురజాడ 150వ జయంతి 2013 సెప్టెంబర్‌తో ముగిసింది. 22 రోజుల ముందు గిడుగు 150వ జయంతి ప్రారంభమైంది. గురజాడకన్నా గిడుగు 21 రోజులు తక్కువ సంవత్సరం చిన్నవాడు.
అప్పటి రాజకీయ సామాజిక పరిస్థితులవల్ల ప్రభుత్వంగాని, ప్రజలుగాని గిడుగు 150వ జయంతి పట్ల అంతగా ఆసక్తి చూపలేదు. దాంతో బాధవేసి శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్ తరఫున గిడుగు జీవించిన అన్ని ప్రదేశాలలోనూ సభలు నిర్వహించాలని నిశ్చయించుకున్నాను. భాషకోసం తపించే మిత్రుడు సామల రమేష్ బాబుగార్ని ‘‘ఇద్దరం కలిసి గిడుగు 150వ జయంతిని పర్లాకిమిడి దగ్గరనుంచి చెన్నైవరకు చేసుకుంటూ వెళ్దామాండి’’ అని అడిగాను. ఆయన వెంటనే ఒప్పుకోవడంతో గిడుగు చాలాకాలం జీవించిన పర్లాకిమిడి దగ్గరనుంచి ప్రారంభించాలనుకున్నాం. శ్రీకాకుళం జిల్లా పొందూరు వెళ్లి సవర భాషమీద కృషిచేసిన ఎ.చంద్రశేఖరరావుగార్ని కలుపుకుని ‘‘ముందు గిడుగు పుట్టిన పర్వతాల పేట వెళ్దామా?’’ అని అడిగాను.
దట్టంగా వాన కురుస్తోంది. ముందే గిడుగు మునిమనవడు నాగేశ్వరరావుని పర్లాకిమిడి పంపి, అక్కడ సమావేశానికి ఏర్పాట్లు చేయమన్నాం. ‘‘పర్వతాల పేటలో ఆయన గుర్తులేవీ లేవు. అప్పుడాయన తల్లిదండ్రులతో కలిసివున్న ఇంటిని నేలమట్టం చేసి అక్కడ మరో ఇల్లు కట్టుకున్నారు’’ అని చంద్రశేఖరరావుగారనడంలో ముగ్గురం, నా శ్రీమతి పెమ్మరాజు సంధ్యారాణి అదే కారులో పర్లాకిమిడి వెళ్లాం. నాకు ఆరోగ్యం అంతగా బావుండకపోవడంతో ఆవిడా నన్ననుసరిస్తూ బయల్దేరింది.
పర్లాకిమిడి చేరేటప్పటికి రమణపంతులు, గిడుగు వేంకట నాగేశ్వరరావు, మరికొంతమంది మా కోసం ఎదురుచూస్తున్నారు. రమణ పంతులు మమ్మల్ని సమావేశం ప్రారంభమయ్యేలోపు ఒకసారి మా ఇంటికి వెళ్లివద్దాం అంటూ వాళ్ళింటికి పట్టుకువెళ్ళారు. ‘‘సవరల కోసం గిడుగు రాసిన రీడర్స్ నాదగ్గరున్నాయి’’ అన్నారు రమణపంతులు. అంతకుముందే కారులో చంద్రశేఖరరావుగారు తమదగ్గర గిడుగు రాసిన సవర నిఘంటువులున్నాయన్నారు. అందుకని రీడర్స్ కాపీలని తీసుకున్నాం. రమణ పంతులు మాకు గిడుగువాడిన టేబుల్ లాంటి వాటితో ఆయన పనిచేసిన పాఠశాల, కళాశాలల్ని చూపించాడు. రాజావారి కోటకు దగ్గరలోనే అవి ఉన్నాయి. అక్కడాయన పనిచేసిన కళాశాల గ్రంథాలయంలో గిడుగు రచనలేవైనా దొరుకుతాయేమోనని ఆశించిన మాకు అక్కడివాళ్ళు సహకరించకపోవడంతో నిరాశకు లోనయ్యాను. కానీ అప్పుడే పట్టుదల పెరిగింది. ఇలా ఆయనున్న ప్రదేశాలన్నింటిలో గిడుగు రచనలేమైనా దొరికితే సేకరించి గిడుగు రచనలన్నింటినీ ప్రచురించాలని నిశ్చయించకున్నాను. ‘‘గిడుగువారి లైబ్రరీని ఆంధ్రా యూనివర్సిటీ లైబ్రరీకి ఇచ్చివేశారు. అక్కడ వెదికితే మరికొన్ని రచనలు దొరకవచ్చు’’ అన్నారు చంద్రశేఖరరావు. అప్పటికే ఆయన ఆంధ్రా యూనివర్సిటీ నుంచి వాళ్ళబ్బాయిలతో కొన్నినిఘంటువుల్ని తెప్పించి నాకిచ్చారాయన.
ఆయన గురజాడతో కలిసి చదువుకున్న విజయనగరం, తాత్కాలికోద్యోగం చేసిన విశాఖపట్టణంలో కూడా సదస్సులు పూర్తిచేసి రాజమండ్రి చేరుకున్నాం. అక్కడ గౌతమి గ్రంథాలయంలో గిడుగుకి సంబంధించిన మరికొంత సాహిత్యం దొరికింది. అక్కడ కళాగౌతమి బులుసు మూర్తిగారు, సత్యప్రసాద్‌గారు ఎంతగానో సహకరించారు.
ఇక్కడ మరో విషయాన్ని చెప్పాలి. గౌతమి గ్రంథాలయం మరికొన్ని చోట్ల గిడుగు రచనల వయస్సు వందేళ్ళు కావస్తూండడంతో ఆ గ్రంథ కాగితాలు ముట్టుకుంటే చాలు పాడైపోతున్నాయి. జిరాక్స్ తీయించడం చాలా కష్టం. అయినా బాగుంటాయని సేకరించే గ్రంథాలన్నింటిని స్కాన్ చేయించి సి.డిలలో సేకరించాం. చెన్నైలో ఆయన మరణించారు. అందుకని అక్కడ సభని నిర్వహించి, వేదం సూర్యప్రకాశం సాయంతో కనె్నమర లైబ్రరీనుంచి గిడుగు వారి శ్రీముఖలింగ శాసనాల్ని ‘ఎపిగ్రాఫియా ఇండికా’ నుంచి సేకరించాం. ఇలా 150వ జయంతిని పలు ప్రదేశాలలో చేస్తూ ఆయన రచనలన్నింటిని సేకరించగలిగాను.
సేకరణ పూర్తయింది. మరి ప్రచురణ ఎలా?
ఆర్టీసీలో చేసి రిటైరైన గిడుగు మనవడు, పోరంకి దక్షిణామూర్తి, ఎన్.ఎస్.రాజుగార్లతో కలిసి తెలుగు అకాడమి కార్యాలయానికి వెళ్లి డైరెక్టర్ యాదగిరిగార్ని కలిసి, గిడుగు వారి విలువైన సాహిత్యం కనుమరుగైపోతోంది. దయచేసి వీటిని పునర్ముద్రించమని లేఖ రాసి మరీ కోరాం. ఆయన ఈ పనిని డిప్యూటీ డైరెక్టర్ మాణిక్యలక్ష్మిగారికి అప్పజెప్పారు.
రచనలనందించడం నా వంతు. అరుంధతి అనే తెలుగు అకాడమీ ఉద్యోగిని మాకు కంపోజైనవి ఇస్తే అకాడమీలో కూర్చునే పోరంకి దక్షిణామూర్తిగారు, గిడుగు రామకృష్ణారావుగారు, నేను ప్రూఫ్‌రీడింగ్ చేసేవారం. మొత్తానికి దాదాపు వెయ్యి పుటలతో గిడుగువేంకట రామమూర్తి రచనా సర్వస్వం మొదటిభాగం ప్రచురితమైంది. సవర భాషా సంబంధ మొత్తంలో రచనా సర్వస్వం రెండవ భాగం తేవాలనుకున్నాం. మారిన పరిస్థితులవల్ల అకాడమీ రెండవ భాగాన్ని ప్రచురించలేమంది. ఇప్పుడు పునర్ముద్రణ కాకపోతే సవర భాషా నిఘంటువులు, మాన్యువల్, వాచకాలు లాంటివి క్రమంగా కనుమరుగైపోయే ప్రమాదముంది. ఒకసారి రచనలన్నీ ముద్ర జరిగితే మరో వందేళ్ళు వయసు పెరుగుతుంది. అందుకని నేను పోరంకి దక్షిణామూర్తి, విహారి, గిడుగు రామకృష్ణారావు, చంద్రశేఖరరావు గారలం కలిసి ఆర్థిక భారాన్ని భరించి సవర భాషా సంబంధిని ప్రచురించాలని నిశ్చయించుకున్నాం. అంతకుముందే సవర-ఇంగ్లీష్, సవర- తెలుగు నిఘంటువుల్ని, సవర భాషా స్వరూప నిరూపణ సవర మాన్యువల్ లాంటివవాటిని కంపోజ్ చేయలేరు. అందుకని వాటినలాగే స్కాన్ చేయించి, ఏ మరకలు రాతలు లేకుండా చాలా జాగ్రత్తగా క్లీన్ చేయించాం. వాచకాలు, గిడుగు రాసిన, సేకరించిన సవరపాటలు, పీఠికల అనువాదాల్ని మళ్లీ కంపోజ్ చేయిం చాం. ఇలా 1160 పేజీలలో గిడుగు సవరల గురించి రాసిన సాహిత్యాన్నంతటినీ ఈ సంపుటిలోకి చేర్చడం జరిగింది. సవరలు విద్య లేకపోవడంవల్లే నాగరికుల చేతుల్లో మోసపోతున్నారని బాధపడి ఊరుకోకుండా సవర భాషని నేర్చుకుని గిడుగు వాళ్ళకోసం ఈ సాహిత్యాన్నంతటినీ రూపొందించారు. రామమూర్తిగారు సవర భాషకు లిపిని రూపొందించారని కొందరంటుంటారు. అది చాలా తప్పు. లిపిని రూపొందించలేదు గాని సవర భాషాపదాల్ని ఎలా ఉచ్ఛరిస్తారో అలాగే తెలుగు లిపిలో కథలు, పాటలు రాశారు. సేకరించి గ్రంథస్థం చేశారు. తెలుగు- సవర నిఘంటువు కూడా ఉందన్నారు గాని అలభ్యం! మాన్యువల్‌లో 73 పుటలు మాత్రమే వ్యాకరణం, తర్వాత సమాజంలో ఎవరితో ఎలా మాట్లాడాలో సంభాషణలనిచ్చారు. భాషను ఎలా నేర్చుకోవాలో సోదాహరణంగా చెప్పారు. సవర పాటల్ని అల్లంశెట్టి చంద్రశేఖరరావు తెలుగులోకి అనువదించారు. సవర-ఇంగ్లీష్ నిఘంటు పీఠికని, సవర మాన్యవల్ పీఠికను కనుగుల వెంకటరావు అనువదించగా అనుబంధంగా ప్రచురించడం జరిగింది.‘‘నేను ఇంగ్లీష్ భాషను పుస్తకాల ద్వారా నేర్చుకున్నాను. సవర (సోర) భాషను మనుషుల ద్వారా నేర్చుకున్నాను. అందుకని మాండలికంలోనే ఉంటుంది’’ అని కూడా అన్నారు సవర భాష గురించి. ‘లిపిలేని భాషకు నిఘంటువుల్ని రూపొందించడం ఎంత కష్టం’ అన్నారాయన. కాబట్టి మూడు నిఘంటువులు, మాన్యువల్, రీడర్స్, పాటలు రాయడానికి ఎంత కష్టపడి ఉంటారు. ఆ కష్టం కనిపించకుండా పోకుండా ఇలా గిడుగు రచనా సర్వస్వం రెండు భాగాలు ప్రచురించి, ఈ తరం- ముందు తరాలవాళ్ళకు కానుకగా ఇవ్వగలగడం ఎంత అదృష్టం.
సవర సంబంధి ప్రచురణకయ్యే ఖర్చుని ప్రతిఒక్కరు ఎలా భరించగలరని ఆలోచిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతికసంస్థ ఆర్థికసాయం చేయడానికి ముందుకువచ్చింది. అందుకు ఆ సంస్థ సంచాలకులు విజయభాస్కర్‌గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు గిడుగు సాహిత్యమంతా అందుబాటులో ఉంది.
కొండజాతివాళ్ళ.. జానపద సాహిత్యాన్ని సేకరించిన మొదటివారూ గిడుగేగా! అందుకే గిడుగు పిడుగు!

- డా వేదగిరి రాంబాబు, 9391343916