సాహితి

హాటీ కెరోల్ ఒంటరి చావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విలియం జాన్ జింగర్ చంపాడు పేదరాలు హాటీ కెరోల్‌ని
తన వజ్రపుటుంగరపు వేలు చుట్టూ చుట్టుకున్న లాఠీతో
బాల్టిమోర్ హోటల్ పానీయ శాలలో
వచ్చారు పోలీసులు, ఆయుధం వశపర్చుకున్నారు
కస్టడీలో అతనిని తీసుకెళ్లారు స్టేషన్‌కు
ఆరోపించారు విలియం జాన్ జింగర్‌పై హత్యా నేరాన్ని
కానీ మీరెవరైతే అవమానాల్ని తాత్వికబద్ధం చేసి
అన్ని భయాలను విమర్శిస్తారో
మీరు మీ ముఖాన ఆ రుమాలు తీసేయండి
ఇప్పుడిది మీ దుఃఖాలకు సమయం కాదు

విలియం జాన్ జింగర్ ఇరవై ఒక్కేళ్లవాడు
ఆరొందల ఎకరాల పొగాకు తోటకు సొంతదారు
ఉన్నారు సంపన్నులు, సంరక్షకులైన అమ్మానాన్నలు
మేరీల్యాండ్ రాజకీయాల్లో ఉంది పలుకుబడి
యధాలాపంగా భుజాలెగరేసి స్పందించాడు తన పనికి
తిట్లూ, బూతులూ, కస్సుబుస్సుల నాలుకతో కరవబోతూ
నిమిషాలలో వచ్చాడు బయటకు బెయిల్‌మీద
కానీ మీరెవరైతే అవమానపర్చబడ్డానికో సిద్ధాంతం వెదకి
దిగుళ్ళన్నిటినీ వెక్కిరిస్తారో
మీరు మీ ముఖాన ఆ రుమాలు తీసేయండి
ఇప్పుడిది మీ రోదనలకు వేళ కాదు

హాటీ కెరోల్ ఒక వంటింటి సహాయకురాలు
యాభై ఒక్క ఏళ్ల ఆమె పదుగురు బిడ్డల తల్లి
గినె్నలు కడిగేది, ఎంగిళ్లు ఎత్తేది,
ఎప్పుడూ స్థిమితంగా ఏ బల్ల ముందూ కూచున్నది కాదు
బల్లల ముందు కూచున్న వారితో మాట్లాడినదీ కాదు
బల్లమీద పడున్న ఎంగిళ్లెత్తి శుభ్రపర్చేది అంతే
ఆష్‌ట్రేలు నిండితే ఖాళీ చేసి తెచ్చేది
చనిపోయింది ఒక్క దెబ్బతో, లాఠీ దెబ్బ తిని
అది గాల్లోకి లేచి గదిలోని శూన్యం గుండా
వచ్చి పడిందామె పైకి
ఆ సున్నితురాలిని నాశనం చేయ సంకల్ప సిద్ధంగా

గౌరవనీయ కోర్టులో జడ్జి సుత్తి మోతతో కోరారు నిశ్శబ్దం
చెప్పారు ఆ మోతతో న్యాయం ఎదుట అందరూ సమానం అని
ఈ విషయంలో కోర్టులన్నిటిదీ ఒకే స్థాయి అని

ఏ హెచ్చరిక లేకుండానే ప్రాణాలు తీసేసినందుకు
తన పొడుగాటి కోట్‌లోంచి మాట్లాడారు లోతుగా
స్పష్టంగా తెలిపారు శిక్ష నిర్దిష్టంగా చెప్పారు
జరిమానా, పశ్చాత్తాపాలతో సహా ఆరు నెలల ఖైదు
విలియం జాన్ జింగర్‌కు ఆరు నెలల ఖైదు
కానీ మీరెవరైతే అవమానాలు తలరాతలంటూ
అన్ని బెరుకుతనాలను ఆడిపోసుకుంటూ ఉంటారో
ఇప్పుడిక మీరు ఆ రుమాలుతో గట్టిగా ముఖం కప్పుకోండి
ఇప్పుడిక నిజంగా ఇది ఏడవాల్సిన సమయమే.

(1963లో బాబ్ డిలాన్ రాసిన గేయ కథకు అనువాదం)