సాహితి

ఒంటరి వాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆవల తీరమీద... అమ్మ
ఈవల తీరమీద... నాన్న
రెండు తీరాల మధ్య
కొట్లాడుతున్న తెరచాపలా... నేను!
తూరుపుదిక్కులా... అమ్మ
పడమర దిక్కులా... నాన్న
రెండు దిక్కుల మధ్య
ఒంటరి పొద్దుతిరుగుడు పువ్వులా... నేను!

తొలుత చిన్న తుంపరే అనుకుంటాను గానీ
వాన క్రమేణా పెరిగీ వాయుగుండమవుతుంది!
ఇద్దరి మధ్యా పచ్చినీళ్లు పోసినా...
పెట్రోలై మండుతాయి!
శతృ శిబిరాల్లా
యుద్ధమేఘాలు ఆవరించుకున్నపుడల్లా...
నా చిన్నిగుండె
పశువులు కుమ్మిన చిత్తడినేలైపోతుంది!
నవ్వులతో... కేరింతలతో...
నందనవనంలా తుళ్లిపడాల్సిన - యిల్లు
కర్ఫ్యూ విధించినట్టు కనిపిస్తుంది!
తుఫాను వెలిసాక- రెండు తీరాల మధ్య
నేనో మాటల వారధినవుతాను!

కళ్లు రెండు
ఏ కన్ను కావాలంటే ఏం చెప్తాను!?
నాకూ అమ్మ ఒడినో ఆటస్థలం జేసి
ఆడుకోవాలనే ఉంటుంది!
నాన్న భుజాలమీదెక్కి
లోకమంతా ఊరేగాలనే ఉంటుంది!
యిద్దరూ చెరో వైపు నిలబడితే...
వాళ్ల చేతుల మీద ఉయ్యాలలూగాలనే ఉంటుంది!
కానీ... కన్నవాళ్లు- పంతాలమాటున
పేగుబంధాలు తెంపుకున్నపుడల్లా...
బాల్యం బందిఖానాగా మారుపోతుంది!

కలసే రెండు సెలయేటి పాయల్ని చూసినపుడల్లా...
నాకు అమ్మానాన్నలే గుర్తొస్తారు!
ఎవరైనా జంటకొమ్మల్ని కలిపినపుడల్లా...
అమ్మానాన్నల్నిలా అంటుగడితే
ఎంత బావుణ్ణనిపిస్తుంది!
నా ఒంటరితనాన్ని చూడలేక
సీతాకోకలూ తూనీగలూ
బాల్యం కొమ్మలమీంచి బావురుమంటున్నాయి!
నా వేదన జూసీ...
నదీ తీరం శోకధారగా కుమిలిపోతోంది!

భూమీ ఆకాశాల మధ్య
వెచ్చని పొత్తిళ్లలో నిదురించాల్సిన నేను
యిపుడీ హాస్టల్ చెరసాల ఎండుకొమ్మమీద
ఒంటరి ఎడారిపిట్టనై దిగులు దిగులుగా...
పీడకలేదో రాకాసినీడలా భయపెడితే
తుళ్లిపడి లేచి కెవ్వున కేకేసినపుడు
వెన్ను నిమిరే ధైర్యంలేక ఎంత ఏడ్చానో...
అమ్మ చేతి గోరుముద్దలకు దూరమై- నేను
పిండంలా విసిరేసిన ముద్దను తింటున్నపుడల్లా
కడుపైతే నిండుతుందేమోగానీ...
ఆకలి మాత్రం అలానే ఉంటోంది!

ప్చ్! తల్లిదండ్రులుండీ అనాధలా
యిపుడీ ఒంటరితనపు వాగులో కొట్టుకుపోతూ... నేను!!

- సిరికి స్వామినాయుడు, 9494010330