సాహితి

కవిత్వ ప్రయోజనాలు... వింత ధోరణులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిత్వానికి నేడు కొన్ని పరిధులు నిర్ణయించి అదే కవిత్వం అంటున్నారు కొందరు. పీడిత తాడిత జనుల ప్రయోజనాలు కాంక్షించేదే కవిత్వం అంటున్నారు. దోపిడీ విధానానికి అడ్డుకట్ట వేయగలిగినదే కవిత్వం అంటున్నారు. సమాజంలోని మూఢాచారాలను ఎత్తి చూపి వాటిని సరిదిద్దగలిగినదే కవిత్వం అంటున్నారు. కవిత్వం వలన సంఘం మారుతుందా? అలా అనుకోవడం ఒక భ్రమ. కన్యాశుల్కం నాటకం వలన వృద్ధులు బాలికలను వివాహం చేసుకునే ఆచారం సమసిపోలేదు. కాలమే దానిని సరిదిద్దింది. కన్యాశుల్కం నిత్యనూతనమే. ఆ సమస్య ఇప్పుడు లేకపోయినా దానిని చదివి ఆనందిస్తున్నాం. అందుకు కారణం కవి ప్రతిభ. ‘‘ఆ రూఢిగ సకల జనులు ఔరాయనగా’’ అనే విధంగా కవిత్వం చెప్పి మెప్పిస్తానని ప్రతిజ్ఞ చేసి ఆ మాట నిలబెట్టుకున్నాడు సుమతీ శతక కర్త బద్దెన. తిలక్ తన కవిత్వం వెనె్నలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలలాటిదని చెప్పి రుజువు చేశాడు. తిలక్ రచనలలో ‘పోస్టుమాన్’ అను గేయాన్ని పరిశీలించండి. ఇప్పుడు ఆ వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. పోస్టుమాన్ కోసం ఎదురుచూసేవారు వేరు. అయినప్పటికీ ఆ గేయం చదివినప్పుడు ఆనందం కల్గుతుంది. భవభూతి ‘ఉత్తర రామచరిత్ర’ను సమకాలికులు చిన్నచూపు చూశారు. అందుకు అతడు కోపించి ‘‘కాలం అనంతమైనది. భూమి బహు విశాలమైనది. నా కవిత్వాన్ని అవగాహన చేసుకునేవారు ముందు జన్మింపవచ్చు. అట్టివారు నా కవిత్వం చదివి ఆనందిస్తారు’’ అన్నాడు. ఆ మాటలు యధార్థమైనాయి. సంస్కృత వాఙ్మయంలో ఆ నాటకానికి విశిష్ట స్థానం ఉంది. జర్మన్ సంస్కృత పండితులు దీనిని చదివి బహు విధాల ప్రశంసించారు. poetry is the highest philosophy అన్నారు ఆంగ్ల విమర్శకులు. కవిత్వ మనోనేత్రంతో ఎక్కఢ ఉన్న దృశ్యాన్నయినా చూడగలడు. ముంతాజ్ మహల్ కావ్యపీఠికలో జాషువా ఒకచోట ఇలా వ్రాశాడు. ‘‘తాజ్‌మహల్‌ను గన్నులారా జూడవలెను కోర్కె నాకు బాల్యము నుండియు గలదు. కాని ప్రాప్తి లేమికి జింతించుచుందును’’ తాను చూడని తాజ్‌మహలు సౌందర్యం చూచినట్లు ఎలా వర్ణించాడో ఈ దిగువ పద్యం పరిశీలించండి.
ప్రతిబింబించు గులాబి మొగ్గలకనుప్రాంసబులై తచ్చిలా
లతలున్ గాలికి దూగుపోలిన్ మహోల్లాసంబు గల్పించు న
ద్భుతమై తాజమహలు ద్వారములపై ముద్దారు శిల్పంబుతో
బ్రతిరాదీశ్వర్ శిల్పమున్ మనసులన్ రంజించు మర్యాదలన్

కవిత్వం ఒక మెస్మరిజం
కవి కన్ను ఒక ప్రిజం
నేను సృష్టించిన అలంకారం
నీ అంధకారానికి దీపం
అని చెబుతూ నా కవిత్వం ఏ జెండాను ఎగురవేయదు అన్నాడు శేషేంద్ర శర్మ.
కథలు కథానికలు కూడా సాహిత్యంలో ఒక భాగ్యమే. కాని అదే సాహిత్యమని కొన్ని పత్రికలు వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. జుగుప్స కల్గించేది ద్వేషాన్ని పెంచేది కవిత్వం కాదు. ఈ రచన పరిశీలించండి.
నోరు ఎరుపెక్కేదాకా
దవడ అల్లాడించినవాడు
దేశ సౌభాగ్యం కోసం పశువధ
చెయ్యకూడదంటాడు బాబాయ్
మనం బతకాలంటే బాబాయ్
ఆవు కడుపు కోయవలసిందే
అంటూ ఆవును కోయడం మాదిగల జీవనాధారం అని గోసంరక్షణ పేరుతో ఇవ్వాళ దేశ వ్యాప్తంగా కాషాయ శక్తులు చేస్తున్న ఉద్యమం దళితుల నోటికాడ ఆహారాన్ని లాగేయడమే అనే సత్యాన్ని బలంగా నాటాడు కవి. ఆవు కేంద్రంగా సాగే తప్పుడు ఆందోళనలకు ఇతని కవిత్వం పెద్ద అడ్డుగోడ. ఇది ఎంతో బలమైన కవిత అని ప్రశంసింపబడింది. ఆలోచించండి. ఆవులు మరణించినప్పుడు వాటిని కొందరు ఉప్పు పాతర వేయించేవారు. మరికొందరు వాటిని మాదిగలకు ఇచ్చేవారు. వారు వాటి చర్మాలను ఉపయోగించేవారు. బ్రతికివున్న ఆవులను వధించి మాంస భక్షణ చేసేవారు నూటికో కోటికో ఒకరుండేవారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా శాస్తవ్రేత్తలు శాకాహార ప్రాశస్త్యం నొక్కి చెబుతున్నారు. దేశవాళీ ఆవు నెయ్యి వాడమని కొందరు రోగులకు ఇంగ్లీషు వైద్యం చేసే డాక్టర్లు సూచిస్తున్నారు. ఆవు యొక్క ప్రయోజనాలు అనేకం వున్నాయి. అది వేరే విషయం. కవులు సన్మార్గాన్ని ప్రోత్సహించాలి. ఇటీవల కవిత్వానికి విశేషణాలు చేరుస్తున్నారు. ఇదేం పద్ధతి? కవిత్వం ఎప్పుడూ ఒకటే. అది రసజ్ఞుల మనస్సు రంజింపజేస్తుంది. నగ్నముని కొయ్య గుఱ్ఱంలో-
‘‘నాగలి భుజాన వేసుకుని
పొలం వెళ్ళే ప్రతిరైతు నాకు
శిలువ మోస్తున్న జీసస్‌లా కనిపిస్తాడు’’
అంటాడు. ఇప్పుడు నాగలి భుజాన వేసుకుని వెళ్ళే రైతు ఎక్కడా కనిపించడు. వ్యవసాయం ఆధునికమై ట్రాక్టర్లు వచ్చాయి. ఇది ఒకనాటి రైతు దీనగాథను సూచించడమే.
మరొకచోట ‘‘నాకు రాకెట్లు వద్దు చంద్రమండలం వద్దు విమానాలొద్దు కాలాన్నీ జీవితాన్ని కలుషితం చేసే రాజకీయ కార్యకలాపాలొద్దు రైళ్ళొద్దు బస్సులొద్దు రుూ నాగరికత రద్దీ వద్దు. పాలరాతి యుగం పనిముట్టు పట్టుకుని చరిత్ర చీకటి కోణాల గుహల్లోకి వెళ్లిపోతాను’’ అన్నాడు. ఇది తిరోగమనం కాదు. కవి విసిగి వేసారి చెప్పిన మాటలు. కవిత్వానికి ఆధునిక మరియు ప్రాచీనం అని పేరు పెట్టనవసరం లేదు. అది అజరామరం.

- వేదుల సత్యనారాయణ 9618396071