సాహితి

గాయాలను రేపడమే సాహిత్య లక్ష్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుల, మత ప్రాంతీయ సమస్యలు మునుపటివలె కాకుండా నిర్ణయాత్మక, ఊహాత్మక, వ్యూహాత్మక అంశాలను మార్చుకుంటూ కొత్తదోపిడీని, దగాకోరుతనాన్ని ప్రోత్సహించడానికో తెరలేపుతుంటాయి. కొత్త పన్నాగాలతో, సరికొత్త పడగలు ఎత్తుతుంటాయి. అంతకు మిన్నగా ఊహాత్మకంగా, వ్యూహాత్మకంగా ఆలోచనా పరిధిని విస్తరించుకోకుండా సాహితీవేత్తలు వెనుకబడిపోతున్నారు. మానిన గాయాల్ని గెలకడమే సాహిత్యం అనుకుంటున్నారు.

అనుక్షణం ముందు చూపుతో, ముందడుగుతో, సరికొత్త రూపులతో సాగిపోతున్న అనంత యానం కాలం. కాలం దోసిట్లో తీరుతున్న సత్యోల్మీలనం, సమస్యల బిలం, మానవ సమ్మేళనం, సమాజం. కాలం తనలో వచ్చే వికృత, ప్రాకృత, విలక్షణ నైజాల్ని, సరికొత్త రూపాల్ని సమాజం మీద ప్రతిఫలింపచేస్తుంటుంది. సామాజిక పరిణామ క్రమానికి కాలం దోహదపడుతుంటుంది. కాలం సమాజం పోకడలను అవగాహనించుకుంటూ, భావ వైశిష్యం, వివేకంతో విప్పారే నేత్రంగా, లోతుపాతుల్ని విప్పిచెప్పే సూత్రమే సాహిత్యం. కాలానికి ఛాయగా సాహిత్యం నిలుస్తుంటుంది. మనిషి సమాజంలో బతుకుబావుటా ఎగరేయాలంటే శ్రమ జీవనానికి సామాజిక గౌరవం దక్కాలి. సామజిక పరిణామ వేగాన్ని గమనించాల్సి వుంది. కాలం కదలికల్లో కనిపించే పురోగమన, తిరోగమన భావ ప్రకంపల్ని రహస్య అంతరంగ వైశిష్ట్యాన్ని, నిష్టతో సాహిత్యం సమయోజనా స్పర్శతో పరిశీలనాత్మకంగా పట్టుకోగలగాలి. అవగాహన దృక్పథాన్ని, అనుభవ సారాన్ని వడగట్టిన జ్ఞానాన్ని సాహిత్యం అక్షరంగా ఆవిష్కరిస్తుంటుంది. మనోవిజ్ఞాన వికాసంగా విలసిల్లే జ్ఞానం ఎప్పుడు అచంచల పదార్ధంగా వుండదు. అది కాలానుగుణ్యంగా సామాజిక స్పృహతో రియాక్టు అవుతు విస్ఫోటనా శక్తిని పొందుతుంటుంది. జీవన సంగ్రామాన్ని ఎదురొడ్డి నిలిచే దార్శనిక జ్యోతిగా వెలుగును ప్రసాదిస్తుంటుంది. దీపం సాహిత్యం. దాని వెలుగు జ్ఞానంగా చెప్పుకోవచ్చును. జ్ఞాన సంపద కలిగిన సాహిత్యమే తిమిరం మీద సమరం సాగించగలుగుతుంది.
కాలమార్పుతోపాటు సాహిత్య ప్రక్రియా రూపాలు కూడా మారిపోతుంటాయి. ప్రాచీనం పద్యానికి పట్టం గట్టింది. ఆధునికత వచనాన్ని అందలం ఎక్కించింది. నవీనత మొత్తం కవిత్వాన్ని నాలుగు లైన్స్‌గా కుదించి వివిధ శీర్షికలతో వెలువడు అవకాశం కల్పిస్తుంది. ఏది ఏమైనా కాలం ఒడిలో మొగ్గ తొడుగుతున్న కొత్త కొత్త ప్రక్రియలతో, సంవిధానాలతో, నవీన వస్తు పరిగ్రహణతో సాహిత్యం మమేకమై సామాజిక రుగ్మతల లోతుపాతుల్ని అవలోకనం చేసుకుంటు సాగిపోతునే వుంటుంది. నేడు నవ నాగరికత ముసుగులో పాశ్చాత్య భావదాస్యంతో మనం మనం కాకుండా పోతున్న సందర్భాల్ని, రహస్యపు నడకల్ని, పసిగట్టాలంటే సాహిత్యం కొత్త కొలమానాలతో సమాజాన్ని కొలవాల్సి వుంటుంది. దీనికి తగిన భాష భావాన్ని సాహిత్యం పట్టుకుని వ్యక్తీకరించాల్సి వుంటుంది. నేడు మనం అందుకున్న వివేకం, రహస్య ముఖాలతో విస్తరిస్తున్న అడియాశలతో అస్తమిస్తున్న జీవన శైలిని, నవీన అవివేకాన్ని అంతమొందించడానికి సరిపోకపోవచ్చు. అందుకే వివేక విధానం తీవ్రతరం దాల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేట మొదలయ్యాక క్రూరమృగం వేగాన్ని ఛేదించే వ్యూహం ఎరిగుండాల్సి వుంటుంది.
సాహిత్యం సామాజిక బాధల్ని, గాథల్ని, గాయాల్ని, దైన్యాన్ని, సోదల్ని, వ్యధల్ని పాడేదిగా వుండాలి. సమాజాన్ని మాయమాటలతో పొద్దుపోచేసేదిగా సాహిత్యం మారకూడదు. సామాజిక హితవు కోరే సాహిత్యం కూడా పాఠకలోకం లేక పరితపిస్తుంది. అంటే సమాజంలో ‘రసప్రలుబ్ధత’ తరిగిపోతుందనే నమ్మాలి. దీనికి కారణం మనిషి మనో ఆకాశం ఏ కారుమబ్బులు కమ్మి మసకబారిపోతుందో, ఏ ఏమరుపాటుతనం సోమరిగా మార్చి పారేస్తుందో, వస్తు వ్యామోహం ఆర్థిక ప్రలోభాలకు దారితీస్తుందో ఆలోచించాల్సిన అవసరం వుంది. శాస్ర్తియ విజ్ఞానం ఏవిధంగా పరిశోధనాత్మకంగా కొత్త పుంతలు తొక్కుతుందో నూతన సృష్టిని ఆవిష్కరించడానికి ఉవ్విళ్లూరుతుందో, అదే విధంగా సాహిత్య విజ్ఞానం కూడా పరిశోధన, పరిశీలన, పర్యవేక్షణకు లోను కావాల్సి వుంది. సరికొత్త వొరవళ్లను కరచాలించాల్సి వుంటుంది. సామాజిక సమస్యలను పక్కదారి పట్టిస్తూ పాలక వర్గ వైఫల్యాలను పట్టించుకోకుండా తంతు పూజలతో, వింత భజనలతో, మోక్ష ప్రాప్తి నొందవచ్చుననే మూఢ విశ్వాసాలకు ఆజ్యం పోసే సాహిత్యం సామాజిక విద్రోహానికి తోడ్పాటవుతుందనే సత్యం మొదట సాహితీవేత్తలు గమనించాల్సి వుంది. సాహిత్యం రాయకపోయినా పర్వాలేదు. కానీ తప్పుడు సంకేతాలను సమాజానికి అందించే సాహిత్యం సృష్టించడం సామాజిక ద్రోహమే అవుతుంది. వ్యక్తిగత స్పర్శలోకి వచ్చిన అనుభవ సారాన్ని సామాజికం చేయాలంటే, అది విస్తృతపడి పది కాలాలపాటు మనుగడించాలంటే సాహితీవేత్తలకు ఎంతటి నిష్ఠ ఉండాలో, ఎంతటి తపస్సు చేయాలో వోసారి ఆలోచించాల్సి వుంది. ప్రపంచపు నడకకు మతం, రాజకీయం రెండు పాదాలు అనేవారు. ఇవి తప్పటడుగులు వేస్తే సంభవించేది వినాశనం. వెలుగు చూసేది వికృత చేష్టలు అని తెలుసుకోవాలి. అట్టి మతం, రాజకీయం స్వార్ధపూరితమై వాటి ఆత్మను పోగొట్టుకుని కొందరి బతుకుతెరువుకు, అక్రమ సంపాదనకు సామాజిక విధ్వంసానికి అశాంతికి హింసకు నిలయాలుగా మారుతున్నాయి. మనిషిని మానసిక బానిసత్వంలోకి జారుస్తున్నాయి. సైద్ధాంతిక లక్ష్యం లేని రాజకీయం బడుగు బలహీన వర్గాల ఆర్థిక బలహీనతలను ఆసరాగా చేసుకుని కంటి తుడుపు సంస్కరణలను వారి ముందుంచి ‘మూతులు బిగియగట్ట‘ గాఢాందకారపు గోతుల్లోకి నెట్టివేస్తుంది. మతం ఉగ్రజ్వాలై ఎగసి మానవ హననానికి కారణభూతమవుతుంది. రక్తపాతం, రాక్షస కృత్యాలే దేవుని సందేశాలుగా ఆత్మాహుతి దాడులతో సమాజం కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. మతం, రాజకీయం దారితప్పిన వైనాన్ని సాహిత్యం ఎత్తి చూపాల్సి వుంది.
రెండు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతుంది అంటే రెండు భావాల మధ్య సారూప్యత లోపించిందనే కదా! సామాజిక న్యాయానికి ఇందులో ఏదో ఒక భావన వ్యతిరేకత చూపుతుంది. కాబట్టే ఘర్షణ అనివార్యమైంది. ఘర్షణలు జరగాల్సిందే, పోరాటాలు జరగాల్సిందే. తుదకువిజయం సాధించడంలో సామాజిక న్యాయందే పైచేయి కావాలి. దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య ఘర్షణలు జరుగుతునే వుంటాయి. సమస్యలు పరిష్కారం కాగానే ఆగిపోతుంటాయి. కొత్త సమస్యలు తలెత్తితే కొత్త ఘర్షణలు జరగడం న్యాయమే. కాని సమస్యలు సమ సిపోయాక కూడా, మానిన గాయాల్ని రేపుకుంటూ ఘర్షణలను మాసిపోనీకుండా రెచ్చగొట్టే సాహిత్యం నేడు పుంఖాను పుంఖాలుగా వెలువడుతోంది. అంటే పాత వస్తువు విస్మరించి కవులు రచయితలు కొత్త సాహిత్య వస్తువులను స్వీకరించడంలో వెనుకబడి ఉన్నట్టుగా నేటి సాహిత్యపు తీరు బట్టబయలు చేస్తుంది. మరీ ముఖ్యంగా సాహిత్యపు వాదాల్లో చిక్కుకుపోయిన కవులు రచయితలు పాడించే పాడుతూ సాహిత్య పేజీల్లో దర్శనమిస్తుంటారు. సమాజం అన్నాక సమస్యలు పుట్టడం సర్వసాధారణం. ఒక్కొ సమస్యను ఒక్కోవిధంగా పరిష్కారం చేసుకునే భావజాలాన్ని సాహిత్యం అందించడం సబబే. కానీ కుల, మత ప్రాంతీయ సమస్యలు మునుపటివలె కాకుండా నిర్ణయాత్మక, ఊహాత్మక, వ్యూహాత్మక అంశాలను మార్చుకుంటూ కొత్తదోపిడీని, దగాకోరుతనాన్ని ప్రోత్సహించడానికో తెరలేపుతుంటాయి. కొత్త పన్నాగాలతో, సరికొత్త పడగలు ఎత్తుతుంటాయి. అంతకు మిన్నగా వూహాత్మకంగా, వ్యూహాత్మకంగా ఆలోచనా పరిధిని విస్తరించుకోకుండా సాహితీవేత్తలు వెనుకబడిపోతున్నారు. మానిన గాయాల్ని గెలకడమే సాహిత్యం అనుకుంటున్నారు. కొత్త గాయాల చుట్టు ఈగలు ముసరడాన్ని పసిగట్టలేకపోతున్నారు. ఇది ఒక విధంగా సాహిత్యం, పాఠకలోకాన్నుంచి దూరం కావడానికి కారణంగా భావించవచ్చు. భావితరంలో సాహిత్య పిపాస పెంచాలి అంటే సాహితీవేత్తలు వేయికళ్లతో కాల మార్పును పరిశీలించి అవగాహనించుకోవాల్సి వుంటుంది. తాత్త్విక విజ్ఞానానికి, సామాజిక అనుభవ సారానికి, శాస్ర్తియ జ్ఞానానికి, హేతువాదానికి సైద్ధాంతిక సిద్ధాంతాలకు మధ్య సాహితీవేత్త తేనెటీగ కావాల్సివుంటుంది. మానవజీవితమే సంఘర్షణల మయం. సంఘర్షణలోంచే ప్రశ్నలుపుడతాయి. ప్రశ్న నివృత్తితో ప్రసన్నత ఉద్భవిస్తుంది అనేది నిత్య సత్యం. మాసిపోయిన గాయాల్ని రేపుకోవడం సాహిత్య లక్ష్యం కాకూడదు. సాహిత్యానికి నిత్యనూతనత్వం వనత్వం పటత్వానిస్తుందనే సత్యం మరువకూడదు.

-కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి 9948774243