సాహితి

కథా రచన - ముఖ్య విషయ ప్రసక్తి ( శ్రీవిఠించీయం 22)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కథారచన ఎవరయినా చేయవచ్చును’అనే మాట ఎంత అసామాన్యమో ‘కథారచన చాల కష్టం’అనేది కూడా అంతే అసామాన్యం. ఏ ప్రక్రియనయినా తన అభ్యాసబలంచేత అలవరుచుకోగల ప్రజ్ఞ ప్రతి మనిషికీ వుంది. అయితే కొందరు రుూ ‘ప్రజ్ఞ’ను మేలుకొలుపుకోగలుగుతారు. కొందరు యిటువంటిది ఒకటి వున్నదనే విషయమే మరచిపోతారు. కథా రచనను ‘సీరియస్’గా తీసుకునేవాళ్లు తప్పనిసరిగా తెలుసుకోవలసిన సంగతులు కొన్ని వున్నాయి.
మొదటిది: కథ ప్రారంభం ‘ఆసక్తికరం’గా వుండాలి. మొదటి వాక్యమే చదువరిని ముందుకు నడిపించేదిగా వుండాలి. చదవాలనే ఉత్సాహం మీద నీళ్లుపోసి ఆర్పివేసేదిగా వుండకూడదు.
రెండవది: కథలో తప్పనిసరిగా సంభాషణలు వుండాలి. లేకపోతే కథనం అంతా మొండిగా, స్తబ్ధంగా తయారయే ప్రమాదంవుంది. సంభాషణలవల్ల చదువరి ఆ పాత్రల శీల సంపదను, సంస్కృతీ విలాసాన్ని తెలుసుకోగల అవకాశం వుంటుంది. చదవడంలో వున్న యిబ్బందిని సంభాషణలు తప్పకుండా కొంతవరకు తగ్గిస్తాయి. చెప్పుకుంటూ పోవడం కంటె, పాత్రలచేత మాట్లాడించి వాళ్లచేతనే వాళ్ల కథనం నడిపించడం శ్రేయోదాయకం.
మూడవది: మాటల పొందికతోపాటు, వాటి పొదుపరితనం తప్పనిసరిగా వుండాలి. అనవసరమయిన మాట, అప్రస్తుతం అయిన ప్రశంస వుండకూడదు. ఏమాట ఎవరిచేత పలికించినా, అది కథాగమనానికి, యానానికి అనుకూలతను తీసుకువచ్చేదిగా వుండాలి. అంతేగాని మాటలను ‘స్పేస్ ఫిల్లర్’లాగ వాడుకోగూడదు. చిన్న కథే చింతలు లేని కథ అనే విషయం మరిచిపోగూడదు.
నాలుగో ముఖ్య విషయం: పాత్రల చిత్రణ వారి చర్యల ద్వారానే వ్యక్తం కావాలిగాని, రచయిత పదేపదే గుర్తుచేసి చెబుతున్నట్లుగా వుండగూడదు. రచయిత పని పాత్రను ప్రవేశపెట్టటం వరకేగాని తరువాత అతను యేం చేస్తాడో యేం చేయడో అతనికే వదలివేయాలి. పాత్రల స్వాతంత్య్రాన్ని నిర్దేశించడానికి ప్రయత్నించకూడదు. ఏ పాత్రను ఎంతవరకు ఎలా ఉపయోగించుకోవాలి, అన్న విషయం కథ రాయడానికి ముందే మనసులో కొంతకాలం తర్జనభర్జన అవుతుంది గనుక- యిదో కొత్త విషయంగా తయారవకూడదు.
అన్నిటికంటే మరింత ముఖ్యమయిన విషయం అయిదోది: కథలలో వర్ణనలు తగుమాత్రంగానే వుండాలి గాని, రచయితయొక్క భాషా పటిమ, ప్రదర్శనకు ఆలంబనగా తయారవగూడదు. మన పాండిత్యం, బహుప్రజ్ఞ అంతా ఒక్కచోటనే ఒక్క మారుగానో ప్రదర్శించాలనే ఉత్సాహాన్ని నివారించుకోవడం అతి ముఖ్యం. కథలో ఒక కొత్త సంగతి, యిదివరకు మరచిపోయి లుప్తం అయిన విషయాన్ని ఒక్కదానిని ప్రస్తావించగలిగితే చాలు, మనకు అన్ని విషయాలు తెలుసుననే విషయాన్ని ప్రదర్శించనక్కరలేదు.
కథ యొక్క లక్ష్యం యెప్పుడూ యిది చదివిన తరువాత, పాఠకుడిలో ఎలాంటి మార్పురావాలని కోరుకుంటున్నాం- అది యెంతవరకు కృతకుత్యం అయింది అన్న విషయంమీదనే వుండాలి. చదువరి మనఃప్రవృత్తిలో మార్పురావాలి, అతని ఆదరణ విధానం మార్పుకావాలి. అతని మనస్సు తృప్తిలో మునిగిపోవడం అవసరం. ఈ తృప్తి తక్షణం యేర్పడవచ్చను. లేదా దానిని గురించి అతడు తరువాత తీరుబడిగా ఆలోచించుకున్నప్పుడు కావచ్చును.
కథ ద్వారా చదువరిని కొంతలోకొంత వివేకవంతుడిని చేయడం అవసరం. అయితే వివేకాన్ని యిస్తున్నాం అన్న సంగతి బయటకు తెలియగూడదు. బయట పడగూడదు. ‘చెప్పక చెప్పడం’అంటే యిదే. నీతులు మరొకరివద్ద నేర్చుకోవడం సాధారణంగా ఎవరికీ యిష్టం వుండదు.
‘వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనె వేగపడక వివరింపదగున్’అనే సూత్రం సుమతీ శతకకారుడు చాలకాలం క్రితమే చెప్పినా, దాని ఆచరణ సూత్రం మటుకు యింతవరకు జనసామాన్యానికి అందుబాటులోనికి వచ్చినట్లు కనిపించదు.

- శ్రీవిరించి, ఫోన్ : 09444963584