సాహితి

సామాజిక దర్పణాలు - కాళోజీ కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాళోజీ నారాయణరావు నిజాం ప్రాంత సామాజిక చరిత్రకు, సాహిత్య చరిత్రకు ఒక ప్రతీక, ప్రతినిధి. అచ్చ తెలంగాణ భాషను స్వచ్ఛంగా, ఆకర్షణీయంగా మాట్లాడటం, ఆ భాషలో కవిత్వం, కథలు, వ్యాసాలు రాయడంలో సిద్ధహస్తుడు.
తెలంగాణ రచయితలు ఆధునిక ప్రక్రియల్లో ఎక్కువ మక్కువ చూపిన ప్రక్రియ కథ. నిజాం వ్యతిరేక ఉద్యమం, గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న సాహిత్యకారులు కథ ప్రక్రియలో రచనలు ఎక్కువే చేశారు. ‘తెలంగాణ కథా రచయితల కథలను పరిశీలించమంటే సమకాలిన సమాజాన్ని పరిశీలించటమన్న మాటే. వాళ్ళ కథలు సమాజం అధ్యయనానికి సాధనాలు. సమాజ చరిత్ర గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ కథలను చదివితే చాలు తెలంగాణ ప్రాంతపు సమాజం చరిత్ర గురించి అవగాహన కలుగుతుంది’’ అని సాహితీవేత్త ఆచార్య ముదిగంటి సుజాతారెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ నుంచి 1910-1960 మధ్యకాలంలో విరివిగా కథలు రాసిన వారిలో బిడారు శ్రీనివాసరావు, సురవరం, మాడపాటి, వట్టికోట, హీరాలాల్, నందగిరి దంపతులు, ఒద్దిరాజు సోదరులు మొదలగువారు. ఈ కోవకే చెందినవారు కాళోజీ నారాయణరావు. రాసింది కొన్ని కథలైనా అవి తెలంగాణ భాష, సంస్కృతిక, సామాజిక, రాజకీయ జీవనానికి ప్రతిబింబాలుగా నిలుస్తున్నాయి.
తొలితరం తెలంగాణ కథకుల్లో కాళోజీ ఒకరు. కాళోజీ గొప్ప కథా రచయితని కొద్దిమందికి మాత్రమే తెలుసు. కాళోజీ కవిత్వానికి గల్గిన ఆదరణ కథలకు లేదు. దీనికి కారణం కాళోజీ అనగానే ‘నాగొడవ’ కావ్యం స్ఫురణకు రావడమే. కాళోజీ వ్రాసింది చాలా తక్కువ కథలు. వీరి కథల్లో ఐదు కథలు స్వతంత్రమైనవి. మూడు కథలు మరాఠీ నుంచి ఒక కథ ఇంగ్లీషు నుంచి అనువాదం చేశారు. కాళోజీ కథలు మొదటిసారిగా 1943లో ‘కాళోజీ కథలు’ పేరుతో ఆంధ్ర పబ్లిషింగ్ కంపెనీ, ఆగ్రా గ్రంథమాల 24వ ప్రచురణగా ముద్రించింది. ఈ సంపుటిలో మూడు కథలున్నాయి. ఇవీ స్వతంత్రమైనవి. అవి- మనమే నయం, తెలియక ప్రేమ తెలిసి ద్వేషము, విభూతి లేక ఫేస్ పౌడర్.
‘మనమే నయం’ కథలో పశువులకు వాటి కష్టాలకు విముక్తి కల్గించే కసాయి ఖానాలున్నాయని అంటాడు. కాని మనుషులకు వారి కష్టాలను దూరం చేసే ఏ మార్గం లేదని, మనుషుల కన్నా పశువులే నయం అని ఈ కథ సందేశం. మనుషులు పేదరికంలో ముగ్గుతూ పశువులకన్నా హీన జీవితాన్ని గడుపుతున్నారన్న సత్యాన్ని చిత్రించాడు.
‘విభూతి’- ఈ కథ పేరడిగా కొనసాగుతుంది. పారిజాతపహరణం కథకు విభూతి కథ పేరడిగా సాగింది. కథలో రచయిత ఫేస్ పౌడర్‌ను విభూతిగా పేర్కొన్నాడు. ఈ కథ హాస్యరసాన్ని అద్భుతంగా చిత్రించింది. ప్రబంధాలలోని కొన్ని సన్నివేశాలను సున్నితంగా విమర్శించడం కోసం ఈ కథ రాసి ఉంటుందని మనం భావించవచ్చు. కథనం నాటకీయంగా నడిచింది.
సున్నితమైన వ్యంగం, పేరడి ధోరణిలో కళాత్మకంగా ప్రదర్శింబడి సంభాషణలో కథను నడిపించడం పేర్కొనదగింది. ‘తెలియక ప్రేమ తెలిసి ద్వేషము’ కథలో ఈ దేశంలో మనుషులు చచ్చిపోయినా వర్ణ వర్గ వైషమ్యాల్ని ప్రజలు మరిచిపోవడం లేదని సూటిగా చెప్పాడు. హాస్య వంగ్యంతో కూడిన మంచి కథ. ధ్వన్యాత్మకంగా ఉంది. చక్కటి ఊహకల్పనతో కూడిన సన్నివేశంతో నడిచింది. కాళోజీ అభ్యుదయ భావాలు, సున్నితమైన వ్యంగ్య సంభాషణా ధోరణులు కథలో కనిపిస్తాయి. వ్యవహారిక భాషలో తెలంగాణ పదాలను నుడికారాలను ప్రయోగిస్తూ కాళోజీ భాష సజీవంగా వుంది. ‘లంకాపునరుద్ధరణ’ కథ సెప్టెంబరు 1948లో తెలంగాణ పోలీసు చర్య నాటినుంచి 1950లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడేవరకు అధికారంలో ఉన్నవాళ్ళు జరిపిన అన్యాయాలను, అరాచకాలు, ఆగడాలను కాళోజీ కళ్ళారా చూసినవాటిని వ్యంగ్యభరితంగా ఈ కథలో వల్లించాడు. ఈ కథలో రాముడు, విభీషణుడు, సుగ్రీవుడు అతని బంధుకోటి అయిన కోతుల పాత్రలు. కథ కల్పితం. ‘‘అలాంటి చక్కటి రచన ఎక్కడో నూటికి కోటికి ఒక్కటి కన్పిస్తుంది. ఇది తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది’’ అని కాళోజీ లంకా పునరుద్ధరణ కథను ప్రసంగిస్తూ నెల్లూరు కేశవస్వామి పేర్కొన్నారు.
ఈ మూడు కథల్లో కాళోజీ పౌరాణిక అంశాలను ప్రవేశపెట్టి సమకాలిక సమాజాన్ని సమస్యలను చిత్రించాడు. పౌరాణిక పాత్రలను తీసుకొని తాను భావించిన కథా సన్నివేశాలను వాటి చుట్టూ కల్పన చేశాడు. ఈ కథలు అపూర్వమైన కథాశిల్పాన్ని సృష్టించాయి.
ఆంగ్ల అనువాద కథ ‘అపోహ’. ఈ కథ 1947లో శోభ సాహిత్య మాత్రికలో (జూలై) ప్రచురించబడింది. మూల రచయిత పేరు లేదు. చమత్కారపూరితమైన సంఘటనల సమాహారం ఈ కథ. ‘జాజితీగ’ కథ మరాఠీ నుంచి అనువదించబడింది. 1947లో శోభ మాసపత్రిక ఏప్రిల్ సంచికలో వెలువడింది. మూల రచయిత ఆచార్య గోరె ‘రెండు గింజలు’ అనే మరో అనువలాద కథ మరాఠీ నుంచి తీసుకోబడింది. ఈ కథ చలం ‘ఓ పువ్వు నవ్వింది’, పొట్లపల్లి రామారావు ‘ఒంటరి చావు’ కథలను స్మరింపజేస్తుందని సుజాతారెడ్డిఅభిప్రాయం. ఈ కథ ‘తెలుగుతల్లి’ పత్రికలో 1940లో వెలువడింది. ‘మనమే నయం’ కథలో పాత్రలు రెండు ఎద్దులు. ఈ కథలో కాళోజీ మూగజీవాలపట్ల మనుషులు అనుసరిస్తున్న వైనాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించాడు. పశువులకు వాటి కష్టాలకు విముక్తి కల్గించే కసాయి ఖానాలున్నాయని అంటాడు. కాని మనుషులకు వారి కష్టాలను దూరం చేసే ఏ మార్గం లేదని, మనుషుల కన్నా పశువులే నయం అని ఈ కథ సందేశం. మనుషులు పేదరికంలో ముగ్గుతూ పశువులకన్నా హీన జీవితాన్ని గడుపుతున్నారన్న సత్యాన్ని చిత్రించాడు. ‘ఆగస్టు పదిహేను’ కథను 1959 ఆగస్టులో వ్రాసి పదివేల కాపీలను పంచిపెట్టాడు. ఈ కథలో కాళోజీ పరమేశ్వరుడు దుష్టశిక్షణార్థం మత్స్య, కూర్మ, వరాహ అవతారాలు ఎత్తాడని, అదేవిధంగా భారతావనిలోని సామ్రాజ్య పిశాచాలను రక్షించటానికి కాంగ్రెస్‌గా అవతరించిందని భావించి పౌరాణిక వృత్తాంతాల ఆధారంగా కథ కల్పన చేశాడు.
‘్భతదయ’ ఈ కథను కాళోజీతోపాటు వెల్దుర్తి మాణిక్యరావు, వి.ఆర్.అవధాని కలిసి రచించారు. ఈ కథలో మానవత్వం విలువను చాటారు. మత చాదస్తం మనుషులను ఏ విధంగా అంధులను చేస్తుందో వివరిస్తుంది. హిందూ ధర్మంలోని అమానవీయతను, మూఢభక్తిని వాస్తవికంగా చూపారు.
కాళోజీ కథలు సామాజిక విశే్లషణాలు, రాజకీయ విమర్శలను ఎత్తిచూపాయి. ప్రతి కథ మనలను ఆలోచింపచేస్తుంది. సజీవ తత్వాన్ని అందిస్తుంది. వీరి కథల్లో పౌరాణిక అంశాలను ప్రస్తావించిన, పాత్రలున్న ఆయన చెప్పదల్చుకున్న విషయం సూటిగా చెప్పాడు. వీరి కథలు వర్ణనలకు, కల్పనలకు తావివ్వలేదు. సమకాలీన సామాజిక, రాజకీయాంశాలను పట్టిచూపిస్తున్నాయి. శైలి సరళంగా ఉంటుంది. అనువాద కథల్లో అక్కడక్కడ సరళ గ్రాంధికం ఉపయోగించాడు. అన్ని కథల్లో తెలంగాణ మాండలిక భాష, యాసలు కన్పిస్తాయి. ఆసక్తికరంగా చదివించే గుణం వీరి కథల ప్రత్యేకత. తన సమకాలీన సమాజంలోని వాస్తవిక విషయాలను వ్యంగ్య ధోరణిలో కథల్లో చొప్పించాడు.

- గుంటి గోపి, 8019808207