సాహితి

అరవిరిసిన కవి హృదయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘విశ్వశ్రేయః కావ్యమ్’ అని చాటిన కవి సంస్కృత కవి కాదు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగు జనుల కవి నన్నయ. కవులు ఏ ప్రాంతానికి చెందినా వారి కావ్యాలూ కవిత్వాలూ విశ్వజనీనంగానే ఉంటుంటాయి. చాలామట్టుకు పవిత్ర గోదావరీ జలాలను తనలో కలుపుకున్న అందాల కృష్ణమ్మ కనుసన్నలలో చలచల్లని గాలుల వీవనల చెంగిట 2016 నవంబరు 13, 14 తేదీలలో అంతర్జాతీయ అనేక భాషా కవి సమ్మేళనం జరిగింది. శతాబ్దాల చరిత్ర గల విజయవాడలో నదీతీరంలో హంతభెర్మ్ పార్క్‌లో ఎపిటిడిసి హోటలు సమావేశ మందిరంలో ప్రపంచంలోని బహుభాషలు గొంతులు విప్పాయి. పురివిప్పిన వివిధ భావాలు నృత్యం చేశాయి. శ్రోతల హృదయాలు కరతాళ ధ్వనులయ్యాయి. భాషలు తెలిసినవారు అర్థానందం పొందారు. అంగ్లానువాదాల వల్ల లబ్ధి పొందారు. భాషలు తెలియని సందర్భాలలో ముద్రిత కవితా సంపుటంలోని పుటలు చూసుకుంటూ కవి గూర్చి కైత గూర్చి సంక్షిప్త సార్థక వాక్యాల వల్ల అంతో సుంతో గ్రహిస్తూ ఈ భాషలు ఈ విధంగా ఉంటాయా అని శ్రవణానందం పొందీ ప్రయోజనాన్ని పొందారు.
‘అమరావతి పొయిటిక్ ప్రిసమ్ 2016’ పేరిట అనేక భాషల కవితాసంపుటిని 14వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. అమరావతి సంబంధ చరిత్రయే, విజయవాడ ప్రాధాన్యాన్ని, గోదావరి, కృష్ణానదుల ఇటీవల పుష్కర సంఘటనలను ప్రసక్తి చేస్తూ ఎక్కడో ఢిల్లీలోనో మరోచోటనో వ్రాస్తే కవిత్వం సృజియింపబడదని ప్రవృత్తి స్థిత వాతావరణం గల కృష్ణానది ఒడ్డుకు కవులు వస్తే కవిత్వం పుడుతుందని, విజయవాడ దుర్గమ్మను స్ఫూర్తిగా తీసుకొని కవయిత్రులు చెడుపై పోరాడాలని, సమ్మేళనానికి దూరాల నుండి మహిళలు రావడం ఆనందకరమని అన్నారు.
ఘనంగా ముగిసిన
అమరావతి పొయిటిక్ ప్రిసమ్
ప్రపంచంలోని బహుభాషలు గొంతులు విప్పాయి. పురివిప్పిన వివిధ భావాలు నృత్యం చేశాయి. శ్రోతల హృదయాలు కరతాళ ధ్వనులయ్యాయి. ఆంధ్రప్రాంతంలో జరిగిన ఈ బహుభాషా సమ్మేళనంలో ఆవిష్కృత కవితా
సంపుటిలో తెలంగాణ, ఆంధ్ర
ప్రాంతాలకు చెందిన యాభైమంది
కవితలుండడం స్థానిక ప్రాధాన్యతని గుర్తించడమైంది.
527 కవితలతో బృహత్కవితాసంకలనంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్సులో ప్రవేశించనున్న ఈ గ్రంథం వందకు మించిన కవిహృదయ సంపుటిగా 53 భాషల సృజనల స్వరూపాన్ని సంతరించుకుంది. 17 ఏళ్ల చిన్నారి పొన్నారి వయసు నుండి 85 ఏళ్ల వృద్ధ కవియిత్రి వరకూ ఇందులో కవిత్వపు పాలు పంచుకున్నారు.
సంస్కృతం, జపనీస్, కొడవట్టన్ మైథిలి, కషయా, స్పానిష్, తమిళం, కన్నడం, తెలుగు (ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలు) మళయాళం, ఆంగ్లం ఇలా అనేక భాషల సామాజిక సాంస్కృతిక మానవీయ అంశలు గల కవితల పఠనాలు కవితాశక్తి ప్రదర్శకంగా ఆసక్తిదాయకంగా జరిగాయి. చెలి ప్రేమపై తల్లి ప్రేమపై, కుటుంబ స్ర్తి రోజంతా స్వేదబిందువులు చిందించడంపై, అదృశ్యమవుతున్న విలువలపై, అజరామర అమరావతిపై, తూనీగల గుంపుపై, వానపై, వెనె్నలపై, మట్టిపై, చేదు నిజాలపై ఇలా ఇలా ఒకటి కాదు సవాలక్ష అంశాలపై సమకాలీన కవుల భావావేశాలకు, సంస్పందనలకు అనుభూతులకు రెండురోజుల కవిసమ్మేళనాలూ అర్ధ దర్శనాలనదగిన అద్దాలయ్యాయి. కవితలను కవులను సాటి కవులకు శ్రోతలను అనుసంధాన పరచడంలో సంక్షిప్త సమర్థయుత వ్యాఖ్యలతో విజయవాడ అమరావతి సాంస్కృతిక కేంద్రం (సిసివివి) గౌరవ సాహిత్య సలహాదారు, భాగస్వామ్య కవయిత్రి, శ్రీమతి పద్మజా అయ్యంగారు పాత్ర అభినందన పాత్రమయింది. సుప్రసిద్ధ చరిత్ర గ్రంథ రచయిత డా. ఈమని శివనాగిరెడ్డి క్రమశిక్షణాయుత కార్యక్రమ దక్షత ప్రశంసనీయం. జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి గద్దే అనూరాధ కవులను అభినందించారు. విజయవాడ మునిసిపల్ కమీషనర్ జి. వీరాపాండ్యన్ విజయవాడ కార్పోరేషన్ భవిష్య కాలంలో కూడా వర్తమాన సమ్మేళనానికి వలెనే సహకరిస్తుందని ఇటువంటివి మరిన్ని జరగాలని ఆకాంక్షించారు. విజయవాడ మేయరు కోనేరు శ్రీధర్ సమకాలీన సమస్యలపై మార్గదర్శకంగా స్పందించిన కవిగణాన్ని అభినందించారు. మహలక్ష్మీ సముదాయ సంస్థలకు సి.సి.వి.వి.కు సంస్థాపక, ప్రధాన సలహాదారుడైన వై. హరీష్ చంద్ర ప్రసాద్ ముక్తసరిగా ఔచిత్యవంతంగా స్వాగతోపన్యాసం చేస్తూ భవిష్య కార్యక్రమాల చేయూతకు ముఖ్యమంత్రిని సభాసాక్షిగా అభ్యర్థించారు. 13, 14 తేదీల కార్యక్రమాలతో ఎన్ని విశేషాలు చోటు చేసుకున్నా ప్రధాన ఆకర్షణలు కవితా పఠనకే. రామేష్ గౌరీ రాఘవన్ ఏకంగా 12 భాషల్లో కవితలు రాయడం సమావేశాన్ని ఆశ్చర్యపరిచింది. ఇటువంటి సమ్మేళనాల్లో వివిధ భాషానువాద కవుల ప్రాధాన్యం ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రసిద్ధ అనువాదకులు ఎన్.ఎస్. సుబ్బరామన్, ఆత్రేయ శర్మ, రామతీర్థ వంటి మరికొందరు పాల్గొని సమ్మేళన ప్రయోజనం సంపన్నత్వానికి దోహదమయ్యారు.
ఆంధ్రప్రాంతంలో జరిగిన ఈ బహుభాషా సమ్మేళనంలో ఆవిష్కృత కవితా సంపుటిలో తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలకు చెందిన యాభైమంది కవితలుండడం స్థానిక ప్రాధాన్యతని గుర్తించడమైంది. వచ్చిన కవుల కవితా పఠనలే కాక సమావేశానికి కారణాంతరాల వల్ల రాలేకపోయిన ఎన్.గోపి వంటివారి ఒకటి రెండు కవితలు ఇతరులచే చదివించడం జరిగింది.
వచన కవిత అంటే తమాషా కాదు, దానికీ ఓ కేంద్రీకృత భావ బిందువు వుండాలి సుమా అని చెప్పేటట్లు మధురాంతక నరేంద్ర హృదయాలు కవిత వుంది. కొన్ని మొగ్గలు పువ్వులుగా విప్పారవు/ మేఘాలు విడమర్చలేని చందమామల్లా/..... కొన్ని తనులోకి తాము తొంగిచూడవు/ బండలో నక్కిన కొండపూటల్లా’ అంటారు గిరిజనుల సాంస్కృతిక ఆత్మభాధాకవిత ‘ఆత్మఘోష’ అనుసూయ , పద్దం తాను కోయభాషలో రాసిన కవితకు తానే అనువదించుకున్న కవిత. అందులో ‘రూపం అదే - ఆత్మ పరాధీనమైంది. / నేనిప్పుడు మైదానం ముందు మోకరిల్లిన సాంస్కృతిక దుఃఖాన్ని / గానం అదే. సాహిత్యం సంకరమైంది. నేనిప్పుడు - సినిమా పాటల ఉచ్చులో చిక్కిన పురాగీతాన్ని’’ అనడంలో ఒక సాంస్కృతిక దుఃఖ సముద్రం కనపడి తీరుతుంది. ‘పోయినా... వృథా కాని దేహం పరిశోధకుల ద్వారా పదిమందిని బతికించడం’ గురించి ఆత్మసంతృప్తిలో చలపాక రమేష్ మానవీయ భావాన్ని వెలార్చారు. ఐతా చంద్రయ్య ‘వానొచ్చింది’ పదుగురికి నచ్చే కవిత. ప్రసవ వేదన అంటే కవిత జనించడానికి ఎంత శ్రమ పడ్డారోగాని కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ ప్రసూతి గృహం కవిత - ఒక తాత్త్విక కవిత. అందులో ‘కొందరిది బ్రతుకులో చావు / ఇంకొందరిది చావులో బ్రతుకు / చావు - బ్రతుకు తేడా లేని వాడికి / క్షణక్షణమూ ఆనందమయమే. మందరపు హైమవతి ‘మాట్లాడకూడదూ కాసేపు...’ అనే కవిత అంతర్జాలం టీవీల మాయాజాలం తప్పించుకుని సహజంగా మాట్లాడే అవసరాన్ని తెలిపింది. మోచర్ల హరికృష్ణ సెలవుల తీపి బతుకులు గుర్తుచేసే కవిత రాశారు. మాజళ్ళ శ్రీనివాస్ అమరావతి కవిత చరిత్రని విపులీకరించింది. పరకాల ప్రభాకర్ ‘అహాల అరణ్యంలో...’ కవిత అహాల కీకారణ్యంలో సంచరించే మానవ వేషధారులైన మృగాలపై కొరడా ఝళిపింపు. పెరుగు రామకృష్ణ ‘కవిత్వం’లో పొట్ట మీదున్న పైరుని స్పర్శించి / నిలువెత్తు కవిత్వమై పరవశిస్తా’నన్నారు. వి.ప్రతిమ ‘పద్యపు ముద్ద’ కవితం రోజువారీ సామాన్య మహిళా జీవితం ఎంత శ్రామికంగా అంకితమై ఉంటుందో చెప్పే కరుణారస స్ఫోరక కవిత. రామా చంద్రవౌళి ఆంధ్రానువాద కవితకు ఫొటో తీస్తే మూల కవి ఇందిరా బాబ్బెల్లపల్లి భావచిత్రం దృశ్యమానమవుతుంది. విశాఖపట్టణాన్ని కాటేసిన హుద్‌హుద్ తుపాను స్థితిని మానస రంగంపై ‘నగర తరంగం’గా రామతీర్థ తుపాను తీర్థ కవిత రాశారు. షేక్ ఖాదర్ ‘ప్రేమవేదం’ ఖండికలో ప్రేయసికి చెందిన ప్రేమ నిర్వేద గానాన్ని ఆలాపించారు. స్నేహితుని మృతి వెంటాడే భావస్థితిని శిఖామణి ‘క్రీనీడ’లో రాస్తూ ‘వెలికి వెలిగి దీపం ఆరిపోయినా / ప్రమిద కింద / క్రీనీడ దాగున్నట్టు నాలో నీ జ్ఞాపకం’ అన్నారు. ఉప్పులూరి ఆత్రేయశర్మ ‘చేదు నిజం’లో ‘గాయాలన్నీ మచ్చలుగా మారకపోవచ్చు / కానీ ప్రతి మచ్చ వెనకా ఓ గాయం వుంటుంది’ అంటారు. ఇలా పేర్కొన్నవే కాదు, మరెన్నో పేర్కొని తీరవలసిన మరెందరి కవితలో ఉన్నాయి. రెండు రోజుల కవితా పఠనాల్లో భాగస్వామ్య స్థానాలు పొందాయి.
సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషా కవితలను శ్రోతలు బాగా అవగాహన చేసుకున్నారనిపించింది. ఎవరు ఏ భాషలో ప్రావీణ్యం వుండి దీనిని ఆస్వాదించారో ఆనందించారో వెల్లడయ్యే సంగతి కాదు. బెంగాలు నుండి వచ్చిన కవయిత్రి, మరికొంతమంది తమ ప్రాంతాలకు చెందిన పాటలు వినసొంపుగా పాడి ఆనందింపజేశారు.
కవి సెబాస్టియన్, ఎలిజబెత్ కురియన్ (మలయాళం), ముసరాత్ రెహనా అసీర్ (ఉర్దూ), అమనితా సేన్ (బెంగాలీ), అగ్నివేశ్ మహాపాత్ర (ఒరియా), మంజత్ ఇందిరా (పంజాబీ), పోర్న్‌పెన్ హర్తకూల్ (్థయ్ మరియు వియత్నామాస్)- ఇంకా ఎందరో ప్రముఖులు, ప్రసిద్ధులూ, సుప్రసిద్ధులూ ఈ బృహత్కవి సమ్మేళనంలో పాల్గొని సాహితీ చరితార్థులయ్యారు, చేశారు. ఇతర ప్రాంతాల వారికి తెలుగు రుచుల విందులు కూడా చవిచూపించారు. విందు సందడుల మధ్య, చాయాగ్రహణ నేపథ్యాలలో ఎందరో కవులు కవయిత్రులూ కవిత్వపరమైన స్నేహపరమైన ముచ్చటింపుల కోలాహలం. ఒక మరపురాని మధుర స్మృతిగా మారింది. చివర్లో పెళ్లి అయిన పచ్చని పందిరి వీడి వస్తున్న అనుభూతి. కావలసిన వారిని వదలి వెళ్లవలసిన తప్పని పరిస్థితి. ఉత్సవానంతరం బెంగను, ఆత్మీయంగా అనుభవిస్తూ ఎక్కడి వారక్కడకు ఆయా మార్గాలలో కవిత్వాలుగా పయనమయ్యారు. అమరావతి గీతానికి, మహిషాసురమర్దనికి సౌమ్య చేసిన రమ్య నృత్యదృశ్యాల్ని నెమరువేసుకుంటూ వెళ్లారు. నిండుగా జరిగిన రెండు రోజుల కవితోత్సవాలు మధురమైనవి, మరపురానివి.

- సన్నిధానం నరసింహశర్మ, 9292055531