సాహితి

మరుగునపడిన మహనీయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా, న్యూజిలాండ్‌లోని ఆదిమ తెగల్లాగే హిందూ జాతి కూడా
అంతరించి పోతుందని లెఫ్టినెంట్ కల్నల్ యు.ఎన్.ముఖర్జీ నూరేళ్లకు పూర్వమే ప్రమాద ఘంటిక
మోగించాడు. దానికి స్పందించే స్వామి శ్రద్ధానంద శుద్ధి, సంగఠన్ లను మహోద్యమంగా చేపట్టి,
బలవంతంగా మతాంతరీకరణ
అయినవారిని లక్షల సంఖ్యలో హిందూ ధర్మంలోకి తిరిగి
తీసుకొచ్చాడు.

ఋషి దయానంద సరస్వతి అడుగుజాడల్లో ఆర్య సమాజ్‌ని, హైందవ సమాజాన్ని సంస్కరణ మార్గంలో నడిపించిన మరుగునపడ్డ మహనీయుడు శ్రద్ధానంద్‌జీ జీవిత విశేషాలతో నేను తెలుగులో రచించిన గ్రంథానికి హిందీ అనువాదం ఇంతమంది మహామహుల సమక్షంలో ఆవిష్కృతమవుతున్నందుకు సంతోషం.
మహాత్మా బిరుదును ఎవరూ ఇవ్వకపోయనా తగిలించుకున్న వారు ఆధునిక చరిత్రలో ఎంతోమంది ఉండవచ్చు. కాని ఆ పేరుకు అన్ని విధాల తగినవాడు, అఖిల ఆర్యావర్తం గర్వించదగినవాడు, యావద్భారత జాతికి ప్రాతః స్మరణీయుడు స్వామి శ్రద్ధానంద. సాక్షాత్తూ గాంధీజీయే ‘మహాత్మా’ అని వినమ్రంగా సంబోధించిన మహాపురుషుడాయన. ఒకప్పుడు శ్రద్ధానంద విద్యారంగంలో ఒక విప్లవం. ధార్మిక రంగంలో పెనుసంచలనం. దళిత లోకానికి ఆశాకిరణం. జాతీయ రాజకీయాల్లో ఆయనకు ఎనలేని ప్రాముఖ్యం.
దురదృష్టం ఏమిటంటే నాలుగు దశాబ్దాలపాటు జాతి జీవితాన్ని విశేషంగా ప్రభావితం చేసి దేశ రాజకీయ రంగంలో కీలక పాత్ర వహించిన అటువంటి మహనీయుడొకడు ఉన్నాడన్న సంగతే ఈ తరంలో చాలామందికి తెలియదు. మతం మారినవారి పునరాగమనానికి శుద్ధి ఉద్యమం తెచ్చి, తద్వారా మహమ్మదీయుల ఆగ్రహాగ్నికి గురై ఒక ముస్లిం మతోన్మాది చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్న ఆర్య సమాజ్ నాయకుడుగానే స్వామి శ్రద్థానంద చాలామందికి ఎరుక. ఉత్తరాదిన మొట్టమొదటి బాలికల విద్యాలయాన్ని, కాంగ్‌డీలో ఆదర్శ గురుకుల విద్యా సంస్థను నెలకొల్పి విద్యారంగంలో ఆయన చేసిన విప్లవాత్మక కృషిగాని, దళిత జనబాహుళ్యం అభ్యున్నతికి ఆయన చేసిన నిరుపమాన సేవగాని ఈనాడు ఎవరికోతప్ప తెలియదు. తెలియకపోవడం మనవాళ్ల తప్పుకాదు. ఈ దేశం గర్వించదగ్గ యథార్థ చరిత్రను, అందులో ఎందరో ధర్మవీరుల అద్భుత భూమికను మరుగుపరచి, అయోగ్యులను, అంగుష్టమాత్రులను ఆకాశానికెత్తి, ఈ జాతికి తానేమిటో, తన వారసత్వమేమిటో తెలియకుండా చీకట్లో పెట్టేందుకు శతాబ్దానికిపైగా పథకం ప్రకారం జరుగుతున్న భయానక కుట్ర దుష్ఫలితమే ఈ తెలియనితనం. అమాంబాపతు నాయకులు, పక్కా హిపోక్రైట్లు, నకిలీ మహాత్ముల గురించి బండ్ల కొద్దీ పుస్తకాలు వెలువడ్డా, అసలైన మహాత్ముడు స్వామి శ్రద్ధానంద గురించి సమగ్రం, ప్రామాణికం అని చెప్పదగ్గ ఒక్క గ్రంథమూ నాకు తెలిసినంతలో లేదు. ఈ లోటును ఏకాస్తయినా పూరించాలన్న సంకల్పంతో, నాకున్న పరిమితుల్లో చేసిన చిన్న ప్రయత్నమే ఈ పుస్తకం.
సమస్త మానవాళికి కొత్త ఉత్తేజాన్ని, గొప్ప స్ఫూర్తిని ఇచ్చే భారతీయ చరిత్రకు జరిగిన బుద్ధిపూర్వక వక్రీకరణలను, వక్రభాష్యాలను బయటపెట్టే ప్రయత్నంలో తెలుగులో ఇప్పటికి నేను పదకొండు గ్రంథాలు రచించాను. ఈ వరసలో స్వామి శ్రద్ధానందకు సంబంధించిన పుస్తకం మొదటిదీ కాదు; చివరిదీ కాదు. చెప్పాలంటే దాని క్రమసంఖ్య 10. హిందీలోకి నా పుస్తకమేదైనా తర్జుమా చేయించాలని సంకల్పించినప్పుడు ప్రత్యేకంగా ఈ గ్రంథానే్న ఎంచుకోవడానికి ఒక కారణం ఉంది. స్వామి శ్రద్ధానందజీ Public Life 19వ శతాబ్దం చివరి పాదంలో మొదలై 20వ శతాబ్దం మొదటి పాదంతో ముగిసింది. అయినా ఈ 21వ శతాబ్దంలో ఆయన స్ఫూర్తి దాయక జీవన సందేశానికి అత్యంత ప్రాసంగిత ఉంది. తొంభై ఏళ్ల కిందట ఒక మతోన్మాది తుపాకి గుండుకు స్వామీజీ బలి అవడానికి దారితీసిన పరిస్థితులు అప్పటికంటే నూరింతలు ఆందోళనజనకంగా ఇప్పుడూ దేశంలో నెలకొని ఉన్నాయి. తమను చుట్టుముడుతున్న సమస్యల గురించి, వాటిని ఉపేక్షిస్తే ముంచుకురాగల ఉపద్రవాల గురించి జాతి జనులకు, ప్రజా నాయకులకు, మేధావులకు ఆనాడు ఉన్న అవగాహనలో శతాంశమైనా సూడో సెక్యులర్ మేధావి వర్గాల్లో కానరాదు. తరాలు మారి.. విషాదానుభవాలను, విపరిణామాలను ఎన్నో చవిచూసిన తరువాత వాటికి హేతుభూతమైన వౌలిక సమస్యల గురించి స్పష్టత పెరగాల్సిందిపోయి గందరగోళం అంతకంతకూ అధికమైంది. దేశానికి శాపమైన దుష్ట రాజకీయ శక్తులపట్ల భ్రమలు తొలగకపోగా ఇంకా ఎక్కువయ్యాయి. మన కళ్లకు కమ్మిన మాయ పొరలను తొలగించి, నిజస్థితిని గ్రహించడానికి, భారత జాతీయతకు, భారతీయ ధర్మానికి మూలాధారమైన విలువలకు మనం చేతులారా చేసుకుంటున్న హానిని, దానివల్ల దేశానికి కలుగుతున్న గ్లానిని గుర్తించడానికి స్వామి శ్రద్ధానంద ఉదాత్త చరిత్ర దీపస్తంభంలా ఉపయోగపడుతుంది.
1910, 1920ల దశకానికి భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాధాన్యం ఉంది. Charles Dickens జగత్ప్రసిద్ధమైన తన "Tale of two Cities'' నవలను ఆరంభిస్తూ P "It was the best of times, it was the worst of times, it was the age of wisdom, it was the age of foolishness, it was the season of light, it was the season of darkness, it was the spring of hope, it was the winter of despair.'' అన్న మాటలు 20వ శతాబ్దపు ప్రథమ పాదంలో భారతదేశ పరిస్థితికి కూడా చక్కగా సరిపోతాయ.
హిందువులు, ముసల్మాన్లు అన్నదమ్ముల్లా, భుజాలు కలిపి బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పోరాడిన కాలమది. మహమ్మదీయ సోదరులు మనస్ఫూర్తిగా గొంతెత్తి వందేమాతరం పాడిన సమయమది. ఇదే ఢిల్లీ మహానగరంలో పోలీసు కాల్పుల్లో నేలకొరిగిన హిందువుల పాడెలను మహమ్మదీయులూ, మహమ్మదీయుల శవపేటికలను హిందువులూ మోసుకుంటూ స్మశానవాటికకు తీసుకువెళ్లిన అపూర్వ సన్నివేశం ఆనాటిదే. ఢిల్లీ జామా మసీదులో ఒక హైందవ సన్యాసి వేద ఘోష వినిపిస్తే వేలమంది మహమ్మదీయులు ఆసక్తిగా ఆలకించిన అద్భుత ఘట్టం అప్పుడే జరిగింది. అంతేకాదు, అదే హిందూ సన్యాసిని జబ్బుపడి మంచాన ఉండగా ఒక ముస్లిం తీవ్రవాది క్రూరంగా కాల్చిచంపిన కాలమూ అదే.
అనంతర కాలంలో జాతిని దావానలంలా దహించి, దేశాన్ని నిలువునా చీల్చిన ముస్లిం మతోన్మాదానికి, దిక్కుమాలిన ద్విజాతి సిద్ధాంతానికి బీజాలు ఈ కాలంలోనే పడ్డాయి. మైనారిటీల మెహర్బానీ కోసం దేశద్రోహకర ధోరణులను ప్రోత్సహించే... జాతి హితాన్ని తుంగలో తొక్కి సంకుచిత లాభం కోసం జాతి వ్యతిరేక శక్తులను సమర్థించే రాజకీయ దిగజారుడు ఈ కాలంలోనే మోర సాచింది. మునుముందు నవఖాళి లాంటి ఎన్నోచోట్ల హిందువుల ఊచకోతకు డ్రస్ రిహార్సల్ అనదగ్గ మోప్లా సంహారకాండ ఈ కాలం నాటిదే. మత వ్ఢ్యౌనికి సెక్యులర్ రాజకీయం పాదాక్రాంతమవడానికి నాంది అనదగ్గ ఖిలాఫత్ ఉద్యమం కూడా అప్పుడు తలెత్తిందే. మత పక్షపాతపూరిత, అవకాశవాద దుర్విధానాలతో మన మహానాయకులు ఆనాడు దిద్దిన ఒరవడులే మరింత వికృత రూపంలో నేటికీ కొనసాగుతున్నాయి.
హిందువులు, ముసల్మాన్లు కలిసికట్టుగా సాగిస్తున్న జాతీయోద్యమాన్ని పక్కదారి పట్టించి, మత ఛాందసశక్తుల కొమ్ముగాసి, జాతీయ సంఘీభావాన్ని మంట కలిపిన రాజకీయ భ్రష్టత్వాన్ని ఆదిలోనే దృఢంగా ఎదిరించి, సర్వశక్తులూ ఒడ్డి పోరాడిన ధర్మవీరుడు స్వామి శ్రద్ధానంద. అలాగే అస్పృశ్యులపట్ల కపట ప్రేమ కుమ్మరించి, ఆచరణలో అంటరానితనాన్ని పెంచి పోషించి, దళిత జనావళికి తీరని హాని చేసిన గాంధీ బ్రాండు హిపోక్రసీని నిర్భయంగా ఖండించి, నిజమైన దళిత బాంధవుడిగా బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహామహుల ప్రశంసలందుకున్న మహామనీషి కూడా శ్రద్ధానందే.
అన్యమతాలవారు తమ నుంచి ఎందరిని లాక్కుపోతున్నా పట్టించుకోని హిందువుల ఉదాసీనత ఇలాగే కొనసాగితే మరికొన్ని శతాబ్దాల్లో హిందూ జాతి కాలగర్భంలో కలుస్తుందని దేశంలో 1891 నాటి జనగణన ప్రక్రియను పర్యవేక్షించిన బ్రిటిషు అధికారి C.J.Odonnellహెచ్చరించాడు. ఆ జనాభా లెక్కలను విశే్లషించి, లెఫ్టినెంట్ కల్నల్ యు.ఎన్.ముఖర్జీ A Dying Race అనే ఛిరు పొత్తాన్ని ఆనాడే వెలువరించాడు. తమ మనుగడకు దాపురించిన ఆపదల తీవ్రతను గుర్తించి సకాలంలో మేల్కొనకపోతే అమెరికా, న్యూజిలాండ్‌లోని ఆదిమ తెగల్లాగే హిందూ జాతి కూడా అంతరించి పోతుందని ఆయన నూరేళ్లకు పూర్వమే ప్రమాద ఘంటిక మోగించాడు. దానికి స్పందించే స్వామి శ్రద్ధానంద శుద్ధి, సంగఠన్ లను మహోద్యమంగా చేపట్టి, బలవంతంగా మతాంతరీకరణ అయినవారిని లక్షల సంఖ్యలో హిందూ ధర్మంలోకి తిరిగి తీసుకొచ్చాడు. దానికి పర్యవసానంగానే చివరికి ఒక మతోన్మాద ముష్కరుడి తుపాకి గుండుకు నేలకొరిగి ఆ మహాత్ముడు చరితార్థుడయ్యాడు.
సావధానంగా గమనించాల్సింది ఏమిటంటే 1 ‘A Dying Race' ఫుస్తకాన్ని రచించడానికి ఉపేంద్రనాథ్ ముఖర్జీని పురికొల్పిన పరిస్థితులు మరింత తీవ్ర రూపంలో ఈనాడూ ఉన్నాయి. 1891 జనాభా లెక్కలు సూచించిన దానికంటే ప్రమాదకరమైన ధోరణులే 2011 జనగణనలో ద్యోతకమయ్యాయి. హిందువులుగా నమోదైనవారిలో వాస్తవంగా హిందూ ధర్మంలో మిగిలినది ఎందరు? హిందువులుగా చలామణి అవుతున్నవారిలో అన్యమతస్థులెందరు అన్న లోతుల్లోకి వెళితే నివ్వెరపరిచే నిజాలు బయటపడతాయి. విజ్ఞులైన మీ వంటి పెద్దలకు ఈ విషయాన్ని విస్తరించాల్సిన పనిలేదు. హిందూ దేశానికి, భారతీయ సంస్కృతికి జీవనాధారాలుగా స్వామి వివేకానంద ఏనాడో నిర్ధారించిన మతానికి, ధర్మానికి బహురూపాల్లో వాటిల్లుతున్న గ్లానిని నిర్భయంగా, సమర్ధంగా ఎదుర్కొనడానికి స్వామి శ్రద్ధానంద వంటి మహనీయుల స్ఫూర్తిదాయక ఇతిహాసాలను గుర్తు చేసుకోవలసిన అవసరం ఈరోజుల్లో ఎంతైనా ఉంది. ఆ ఉద్దేశంతోనే నేనీ గ్రంథ రచనకు ఉపక్రమించాను. ఇప్పటిదాకా తెలుగులో నేను రాసిన గ్రంథాలవలెనే ఈ హిందీ అనువాదం కూడా పాఠక జనాదరణకు పాత్రమవుతుందని ఆశిస్తున్నాను.

(న్యూఢిల్లీలోని కాన్సిస్ట్యూషనల్ క్లబ్‌లో నవంబర్ 27, ఆదివారం జరిగిన ‘అసలీ మహత్మా’ హిందీ గ్రంథ ఆవిష్కరణ సభలో ఎంవిఆర్ శాస్ర్తి చేసిన ప్రసంగ పాఠం)