సాహితి

కథావస్తు వైవిధ్యం ( శ్రీవిరించీయం 24)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథావస్తువులో వైవిధ్యం కనబరుస్తున్న కథలు వస్తూనే వున్నాయి. కాని బహు స్వల్ప సంఖ్యలో వున్నాయి. రచయితలు యింకా నేల-నీరు వదలి, గాలి-వెలుతురు- ఆకాశ అవకాశాల వయిపు అలవోకగా పరుగులు తీయలేకపోతున్నారు. భౌతికతను అధిగమించి, మానసికత- బౌద్ధికత- ఆత్మీయత వయిపు చేతులు చాచలేకపోతున్నారు.
మనిషి తన స్వస్వరూపాన్ని కనుగొనడానికి ఎంతో శ్రమిస్తున్నాడు. ఈ శ్రమను కథలుగా ‘రికార్డ్’ చేసుకుంటున్నాడు. అతన్ని ఆకట్టుకోవడం కోసం, కాల్పనిక రచయిత కొత్త సంవిధానాలు కనుగొని తప్పనిసరిగా ముందుకు వెడుతున్నాడు.
ఒక దేశంనుండి మరో దేశానికి వలసపోవడం (దేశం అంటే రాష్ట్రం అనుకోవచ్చు), వలసపోతున్నానన్న దుగ్ధ ఒక పక్క, గర్వం మరోపక్క. పోకుండా వుండలేని అసమర్థత, పాతను కొత్తను కలగాపులకంగా చూడాలనే తాపత్రయం ఎక్కువగా కనిపిస్తున్నాయి.
వర్తమానంలో చెప్పుకోదగిన మార్పులు రెండు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకటి: స్ర్తివాద సాహిత్యం ఎక్కువగా రావడం, రెండు: దళితుల కథలు విరివిగా ప్రచారమవడం. ఈ ధోరణులతో తప్పు యేమీలేదుగాని, యిదివరకు ‘అశ్రద్ధ’ చేశాం అన్న ఆ భావంతో యిప్పుడు ‘ఓవర్ ప్లే’చేస్తే, అత్యంత సున్నితమైన వ్యవహారం కూడా మొహం మొత్తే అవకాశం వుంది.
చదువుకున్న భారత మహిళలు ‘ప్రస్తుతం’తో ఒదిగి వుండలేక పోతున్నారు. చదువురాని భారత స్ర్తిలు యిప్పటికే ఆడపిల్ల పట్ల చిన్నచూపు చూస్తున్నారు. సామాజికంగా ‘లంచగొండితనం’ అనే దానికి ఆమోదముద్ర పడిపోయింది. డబ్బుకున్న గౌరవం మరిదేనికీ లేని పరిస్థితి అవతరించింది. కనీసం యాభయి అరవయి సంవత్సరాల క్రితం సామాజికంగా ‘అన్యాయ ఆర్జితం’ చేసిన వాళ్లను అగౌరవంగా చూచేవాళ్లు. ఇప్పుడు న్యాయం, అన్యాయం-అనే మాటల మధ్య గీత సన్నబడిపోయింది.
‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అనే పద్య పాదంలో మొదటి అక్షరం ‘సా’ తీసివేయడానికి యిప్పుడు ఎవరూ వెనుకాడడం లేదు- ఎక్కడో వేలకొకడు, మరీ పాత కాలపు మనిషి తప్ప.
దేవాలయాలలో దళితులకే గాదు, కొంతమంది స్ర్తిలకు కూడా ప్రవేశం లేదు. దేవాలయాలు అలా వుంచండి. కార్యాలయాలలో కూడా కొందరికి స్వాగతం లేదు. వాళ్లు ఉపయోగించిన గ్లాసులు, పళ్లాలు శుద్ధి చేయందే యితరులు ఉపయోగించడానికి వీలుకాకుండా పోతున్నాయి.
కులం పేర, మతం పేర యింకా అంతర్యుద్ధాలు జరుగుతూనే వున్నాయి. గ్రామాలలో కక్షలు, ఒక వీధికి మరో వీధికీ పోరాటాలు కొనసాగుతూనే వున్నాయి.
మనిషి యే పని చేయదలుచుకున్నా, తన పూర్వులు - పూర్వ సమాజం పూర్వ సంస్కృతి తయారుచేసి పెట్టని కోటగోడలుగా నిలిపిన ‘అడ్డుగోడలు’ ఎదురయి, అతన్ని విశ్రాంతుడిని చేస్తున్నాయి. ‘మాలలు మాత్రము మనుషులు కారా, మీలోనున్నవి పాలా?’
‘కల్లు మానండోయ్ - కళ్లు తెరవండోయ్’ - అని స్వాతంత్య్ర సమరానికి పరాకాష్ఠ రోజులలో పాడిన పాటలు యిప్పుడందరూ మరచిపోయారు. కనీసం మరచిపోయినట్లు ప్రవర్తిస్తున్నారు. అవి ‘అప్రస్తుతం’ అన్నట్లుగానే జీవన విధానం యేర్పరచుకుంటున్నారు.
ఇవన్నీ కథావస్తువులు. వీటికి ప్రాధాన్యం యిచ్చి - సమస్యను సమస్యగా చూడడం కాకుండా, సమాధానం వెదికే వయసు చదువరిని తోసుకుపోవడం కథారచయిత చేయవలసిన పని. ఆర్థిక విప్లవం, వ్యవసాయ విప్లవం, పారిశ్రామిక విప్లవం - వస్తున్నంత వేగంగా ‘నైతిక విప్లవం’ కూడా రాకపోతే, మనిషి మనుగడ అసాధ్యం అయిపోతుందని నొక్కిచెప్పడం యిప్పుడు కథారచయిత తన ‘ఎజెండా’లో చేర్చుకోవలసిన ప్రధానాంశం. కత్తిద్వారా కాదు, కలం ద్వారా కూడా విప్లవం వస్తుంది అనేది ప్రాపంచిక సత్యం. దీన్ని మరచిపోలేం.