సాహితి

సీక్వెల్ రచనలకు కాలం చెల్లిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రఖ్యాతి పొందిన రచనలకు లేదా అప్పటికే ప్రచురింపబడిన కథ లేదా నవలకు కొనసాగింపుగా చేసిన రచనలనే సీక్వెల్ అని అంటారు. తెలుగులో వచ్చిన సీక్వెల్ సాహిత్యాన్ని వేళ్ళమీద లెక్కబెట్టుకోవచ్చు. నవీన్ రాసిన ‘‘అంపశయ్య, ముళ్ళపొదలు, ‘‘అంతస్స్రవంతి’’ సీక్వెల్ నవలలే. ‘అంపశయ్య’ రవి విద్యార్థి జీవితాన్ని, ‘‘ముళ్ళపొదలు’’ రవి నిరుద్యోగ జీవితాన్ని, ‘‘అంతస్స్రవంతి’’ రవి ఉద్యోగ-వైవాహిక జీవితాన్ని చిత్రీకరించింది. మళ్ళీ నవీన్‌గారే 75 ఏళ్ళ తెలంగాణ చరిత్రను ఒక వ్యక్తి కోణంలోంచి చిత్రీకరిస్తూ వరుసగా నాలుగు సీక్వెల్ నవలలు రాశారు. కాలక్రమ పట్టికలో చూస్తే కాలరేఖలు (- 1956), చెదిరిన స్వప్నాలు (1956-70), బాంధవ్యాలు (1970-2000) ఏ వెలుగులకీ ప్రస్థానం (2000-2014) అలా వచ్చినవే. ఆయా కాలాల్లో చోటుచేసుకున్న ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, చరిత్రకు ఈ సీక్వెల్ నవలలు అద్దంపడతాయి. యండమూరి వీరేంద్రనాథ్ రాసిన ‘‘తులసీదళం, తులసి’’ సీక్వెల్ నవలలే. రావిశాస్ర్తీ రాసిన ‘‘రత్తాలు-రాంబాబు’’ నిడివి ఎక్కువ కావడంవల్ల నాలుగు భాగాలుగా తయారయిందే తప్ప అవి సీక్వెల్ నవలలుకాదు. రంగనాయకమ్మ ‘‘జానకి విముక్తి’’ మూడుభాగాలు సీక్వెల్‌గా రాబోయి సీరియల్‌గా వచ్చింది. అందుకే మూడుభాగాలు కలిసి ఒకే నవలగా ప్రచురించారు. అలాగే నాయిని సుబ్రహ్మణ్యంనాయుడు ‘పచ్చనాకు సాక్షిగా’ కథలు సీరియల్ కథలే తప్ప సీక్వెల్ కథలు కావు. కాని వారే తర్వాత వెలువరించిన ‘సినబ్బ కథలు, మిట్టూరోడి కథలు’తో పోల్చిచూస్తే, వాటి అంతస్సూత్రాన్నిబట్టి వాటిని సీక్వెల్‌గా గుర్తించవచ్చు. ‘పచ్చనాకు సాక్షిగా’ రచయిత బాల్యాన్ని, ‘‘సినబ్బకథలు’’ కౌమారాన్ని, ‘‘మిట్టూరోడి కథలు’’ యవ్వన దశను చిత్రీకరించాయని గుర్తించవచ్చు.
కథల విషయానికొస్తే, శ్రీశ్రీ రాసిన ‘‘ఒసే తువ్వాలు అందుకో, కోనేటి కల, కోనేటి దినం, కోనేటి జన్మ’’అనే నాలుగు కోనేటి కథలు తెలుగులో వచ్చిన మొదటి సీక్వెల్ కథలనే చెప్పాలి. కథలపరంగా వచ్చిన మొదటి సీక్వెల్ కథలు, నవలల పరంగా నవీన్ రాసిన ‘అంపశయ్య’ ట్రయాలజీ చైతన్యస్రవంతి ధోరణిలో రావడం ఆశ్చర్యం. ‘‘గ్రహాంతర యాత్ర, గ్రహాంతర శకలం’’ అనే సీక్వెల్ కథలను కొడవటిగంటి కుటుంబరావు రాశారు. ఇవన్నీ ఆయా రచయితలు తాము స్వయంగా తమ రచనలకు కొనసాగింపుగా రాసుకున్నవే.
ప్రఖ్యాతి పొందిన రచనలకు లేదా అప్పటికే ప్రచురింపబడిన రచనల పట్ల ప్రభావితులై వాటికి కొనసాగింపుగా రాయాలన్న ఉబలాటంతో సీక్వెల్ కథలు రాసినవారున్నారు. డి.కామేశ్వరి రాసిన ‘’‘కొత్తమలుపు’’, వాసిరెడ్డి సీతాదేవి రాసిన ‘‘ఉరితాడు’’ కథలకు సీక్వెల్‌గా విహారి ‘‘కొత్తమలుపులో ఉరితాడు’’అనే కథ రాశారు. కాళీపట్నం రామారావు ‘‘యజ్ఞం’’కథను చాలామంది తిరగరాయడానికి ప్రయత్నించారు. ‘‘యజ్ఞం’’కు సీక్వెల్‌గా ‘‘యజ్ఞం తర్వాత’’అంటూ అట్టాడ అప్పల్నాయుడు, చందు సుబ్బారావు విడిగా రెండు కథలు రాశారు. ‘‘యజ్ఞం’’ కథ గడిచిన యాభై సంవత్సరాల తర్వాత అందులోని పాత్రలు ఎలా ప్రవర్తిస్తాయో తెలుపుతూ ఆ కథలు వచ్చాయి. కాని ‘యజ్ఞం’కథకు వచ్చినంత పేరుగానీ, సంచలనం గానీ సీక్వెల్ కథలకు రాలేదు. ఎవరూ పట్టించుకోలేదు సరికదా నెగెటివ్ విమర్శలే ఆ కథలపై వచ్చాయి. ప్రఖ్యాతి పొందిన కథలను ఎన్నుకుంటే వచ్చే ప్రమాదమే ఇది. ఇక వేరేకథలకు సీక్వెల్ కథలు రాసినా పట్టించుకునేవారు ఉండరు. ఎందుకంటే సీక్వెల్ కథను మూలకథతో పోల్చుకుంటేనే అది సీక్వెల్ అని తెలుస్తుంది. లేకపోతే అది స్వతంత్ర కథగానే పాఠకులు భావించి చదువుకుంటారు. గుర్తుపట్టినవాళ్లకు సీక్వెల్ కథగానూ, లేని వాళ్ళకు స్వతంత్ర కథలానూ కనిపించడం ఈ కథల ప్రత్యేకత.
సీక్వెల్ కథలు రాయాలనుకునేవారు ఎదుర్కొనే ప్రధాన సమస్య కథల ఎంపిక. సంచలనం సృష్టించిన కథలను లేదా పేరుపొందిన కథలకు సీక్వెల్ రాస్తే గుర్తింపు దొరుకుతుందని చాలామంది భావిస్తారు. అలాంటి ప్రముఖ కథ పేరునుకూడా అనుకరిస్తూ రాయడంవల్ల పాఠకులు ఆ సీక్వెల్‌ను గుర్తించగలుగుతారు. ‘‘యజ్ఞం తర్వాత’’అనే పేరును బట్టే అది ‘‘యజ్ఞం’’కు సీక్వెల్‌గా గుర్తించవచ్చు. సామాన్యంగా పాఠకుడు ఒక కథను చదువుతున్నప్పుడు కథలోని ప్రధాన పాత్రనో, కొన్ని సన్నివేశాలతోనో మమేకమవుతాడు. ఆ కథ విషాదాంతం అయినప్పుడు కథకుడు ఆ కథకు అన్యాయం చేశాడనో, ఫలానా పాత్రను చంపాల్సింది కాదని అనుకుంటారు. ఒకవేళ తనే ఆ కథనురాస్తే అలారాయనని, వేరే విధంగా ముగింపునిస్తానని అనుకుంటారు. ఇలాంటి భావనలతోనే కొంతమంది సీక్వెల్ కథలకు పూనుకుంటారు.
గురజాడ ‘కన్యాశుల్కం’ను అసంపూర్తిగా వదిలేశాడని భావించి ‘కన్యాశుల్కం నాటకం’రాసి అభాసుపాలయిన వారున్నారు. గోపీచంద్ ‘చీకటి గదులు’ నవల అసంపూర్తిగావున్నా, రావిశాస్ర్తీ అసంపూర్తిగా నవలలువున్నా వాటిని పూర్తిచేయడానికి ఎవరూ సాహసించలేకపోయారు. దీనికి ఆసక్తి లేకపోవడం ఒక కారణంకాగా, అంతటి ప్రతిభాపాటవాలు లేకపోవడంకూడా మరో కారణంగా చెప్పుకోవచ్చు.
మొట్టమొదటిసారిగా తెలుగులో ఒక ప్రముఖ రచయిత కథలకు వేరే రచయిత సీక్వెల్‌గా కథలు రాసి పత్రికల్లో ప్రచురించడం, వాటిని పుస్తకంగా తీసుకువచ్చిన ఘనత భీమరాజు వెంకటరమణకే దక్కుతుంది. వీరు సలీం రాసిన కథలనుండి ఎంపికచేసుకున్న తొమ్మిది కథలకు సీక్వెల్‌గా కథలను రాశారు. వీటికోసం సలీం రాసిన అనేకానేక కథలను క్షుణ్ణంగా చదివి, సీక్వెల్‌కు అనుకూలమైన కథలను ఎంపిక చేసుకున్నారు. ఎంపిక చేసుకున్న కథలను 1.మూల రచయిత అర్ధాంతరంగా వదిలేసిన కథలు, 2.విషాదాంతం చేసిన కథలు, 3.పూర్తిగా ముగించిన కథలుగా విభజించుకోవచ్చు.
ఏ రచయితా కథను అర్ధాంతరంగా వదిలేయడు. కొన్ని సమస్యలను తీసుకున్నప్పుడు రచయిత పరిష్కారం చూపించక పాఠకుల ఊహకే వదిలేస్తాడు. కొన్ని సమస్యలకు పరిష్కారం ఉండదు. సమస్యలు సమస్యలుగానే మిగిలిపోతాయి. ఒక్కోసారి ఒక సమస్య ఇంకో సమస్యకు దారితీయవచ్చు. ప్రధాన సమస్య తీవ్రతనుబట్టి రచయిత ఎక్కడో ఒక దగ్గర కథను నిలిపేయవచ్చు. అలాంటి కథలు పాఠకుడ్ని ఆలోచింపజేస్తాయి. అంతేతప్ప వాటిని అర్ధాంతరంగా ఆపేశారనే నిర్ధారణకు రాకూడదు.
రచయిత అర్ధాంతరంగా వదిలేసాడని భావించిన కథలన్నీ విషాదాంత కథలే. సున్నితమనస్కుడైన సీక్వెల్ రచయిత భీమరాజు వెంకటరమణ విషాదాన్ని భరించలేక, పనిగట్టుకుని ఆ కథలన్నింటిని సుఖాంతం చేశాడు. ఇలా సుఖాంతం చేయడంవల్ల ఆ కథల్లో అవాస్తవికత, అతి నాటకీయత చోటుచేసుకున్నాయి. అది సహజమే. అందుకే ఈ సీక్వెల్ కథల్లో కొన్ని సరిపోయాయి. కొన్ని తేలిపోయాయి.
కథ ప్రారంభం, ముగింపులను పాఠకుడు స్పష్టంగా గుర్తించ గలుగుతాడు. రచయిత రాసిన కథ ముగిసిందని తెలిసిన తర్వాత కూడా దానికి కొనసాగింపుగా రాయాలని అనుకోవడం సాహసమే. ముగిసిన కథను పట్టుకుని దానిలోని పాత్రధారులు వారి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను విశే్లషిస్తూ సీక్వెల్ రాయవచ్చు. మూల రచయిత చేసిన ముగింపు నచ్చకనో లేదా వేరేతీరుగా ఆ ముగింపును కొనసాగించవచ్చనే నమ్మకంతో, లేదా మూల రచయిత కంటే భిన్నంగా ఆ కథను రాయాలనే కోరికతో సీక్వెల్ కథలు రాయవచ్చు. వెంకటరమణ చేసింది కూడా ఇదే. ఈ కోవలో వచ్చిన సీక్వెల్ కథలను పరిశీలిద్దామంటే, ముందుగా సలీం రాసిన ‘‘మురికి’’కథ చూద్దాం. ఇందులో దయ, జాలి, కరుణ అంటే తెలియని ధనవంతురాలు పార్వతమ్మ తన ఇంట్లో పనివాడు శీనుని బానిసలా కాదుకదా, అసలు మనిషిలా చూడలేకపోతుంది’. ఎప్పుడూ వాడ్ని చీదరించుకుంటూ దూరంపెడుతుంది. ఆకలితో వున్నవాడ్ని పట్టించుకోదు. సోలిపోతున్న వాడికి బూజుపట్టిన బ్రెడ్‌ముక్కలు ఇస్తుంది. అది తిని వాంతి చేసుకుని జ్వరంవచ్చి ఇంటికి పోతానంటే ఆరోజు జీతం కోసేస్తానని అంటుంది. శుభ్రత పేరిట ఇంటిని అద్దంలాచూసుకునే ఆమె బుర్రలో, మనసులో అంతా మురికినే అంటూ వివిధ సంఘటనల ద్వారా వివరించిన విధానం బాగుంది. ఈ కథలోని కఠినురాలైన పార్వతమ్మను శిక్షించడం, శీనును ఉద్ధరించడంకోసం వెంకటరమణ ‘‘పనోడు’’ కథ రాశారు.
కథ సుఖాంతమైనా, విషాదాంతమైనా దానికి సీక్వెల్ రాయడంకంటే, స్వంత కథ రాసుకోవడం సులువు. అందుకనే ఎవరూ సీక్వెల్‌కథల జోలికిపోరు. కాని భీమరాజు వెంకటరమణ దీన్ని ఛాలెంజింగ్‌గా తీసుకుని ఈ సీక్వెల్ కథలను రాశారు. ఎలాంటి కథనైనా సీక్వెల్‌గా రాయవచ్చని ఆయన నిరూపించారు. అయినా వీరు సీక్వెల్ కథలుగా రాయడానికి ఎన్నుకున్న కథలన్నీ ఎక్కువగా విషాదాంత కథలే కావడం గమనించదగ్గ విషయం. రమణలో వున్న సున్నితత్వం, ఆదర్శవాదం ఈ సీక్వెల్ కథల్లో ప్రతిబింబిస్తుంది. ఈ సీక్వెల్ కథలు రమణ ప్రయోగశీలత్వంతోపాటు, సలీం కథల గొప్పదనాన్ని మరోమారు తెలియజేస్తాయి. మొత్తానికి తెలుగులో మొదటి సీక్వెల్ కథాసంకలనాన్ని తీసుకొచ్చిన ఘనత మాత్రం భీమరాజు వెంకటరమణకే దక్కుతుంది.

- కె.పి.అశోక్‌కుమార్, 9700000948