సాహితి

కల దొరికింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైల్లో
మూడు కానుకలు దొరికాయని
మురిసిపోతూ
మిత్రుడు ఫోన్ చేశాడు
వాటి విశిష్టతను
మనసునిండా వర్ణిస్తూ
కావ్యంలా వినిపించాడు
కళ్లల్లో వెలిగిన లోకాన్ని
నాకు కనిపించేలా చెప్పాడు

కవికదా! -
కవిత్వం కోసం
స్వంత రాజ్యాన్ని వదులుకొని
ప్రయాణానికి సిద్ధపడ్డాడు కదా!
కలలో కలవరిస్తుంటే
కవిత్వం విందామని
కిటికీలోంచి చందమామ వచ్చి
తిరిగి వెళ్లడం మరిచిపోయి వుంటుంది

పై బెర్తు మీది సౌందర్యరాశి
పుస్తకం తెరిచి విస్తుపోయి చూస్తుంటే
నెమలీక పేజీ మధ్యలోంచి
జారి వుంటుంది

నిద్రపోయి కూడా
పరిమళాలు వెదజల్లే
పక్క బెర్తు పూలరాణి చేతి రుమాలు
ఫ్యాను గాలికి ఎగిరి
సెలయేటి వొడ్డుమీద పడ్డట్టు
బ్యాగేజి దగ్గర కదలకుండా
ఆగి వుంటుంది

రైలు పరుగుతోపాటు
అశ్వాన్ని దౌడుతీయించి
దూర దూరాలకు చేరి
కవితా పతాకాలను
గగనం దాకా ఎగరేసి వుంటాడు

ఆఖరి స్టేషన్‌లో రైలు ఆగగానే
అందరూ దిగిపోయాక
తొందర తొందరగా సర్దుకోవాలని
కప్పుకొన్న శాలువాను
మడత పెట్టడానికి దులుపుతుంటే
ఏ చందమామనో ఉంగరంలా
బెర్తు సందులో కనిపించి వుంటుంది
శాలువా అంచుమీంచి నెమలీక
సీతాకోక చిలుకలా రెక్కలాడిస్తూ
చొక్కా మీద వచ్చి వాలివుంటుంది
చెప్పుల కోసం కిందికి వంగి చూస్తే
కొట్టుకొట్టి దరికి చేరిన
బంతిపూల బతుకమ్మలా
రంగుల కురిసే దస్తి దొరికి వుంటుంది

నిమిషమాగి
అన్నిటినీ అపురూపంగా చూసి
ఒక్కొక్కదాన్ని
స్వప్నంలా ఏరుకొని
కొత్త కవితతో
పొద్దుపొడుపులా
రైలు దిగి వుంటాడు

అనుకోకుండా దొరికాయని
ఆ విలువైన కానుకలను
మనసులో మూటగట్టుకొని
మరిచిపోయినవాళ్లను
మననం చేసుకొంటూ
కొత్త ఉత్తేజంతో
వేదాంతం పలుకుతూ
ఫోనునిండా పొంగిపోతూ
నన్ను పరవశుడ్ని చేశాడు

- ఆశారాజు, 9392302245