సాహితి

కథ - నిర్వచన వచనం 26

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ అనేది యిట్లాగే వుండాలి- అని నిర్వచనం చేయబూనుకోవడం అసాధ్యం. ఎందుకంటే, వీలయినంత తక్కువ స్థలం ఆక్రమించుకుని- చదువరి హృదయంలోనికి సూటిగా బాణంగా ప్రవేశించగల సంఘటనను- దాని పూర్వాపరాల ప్రసక్తులు తీసుకురాకుండా- చర్చించే సంవిధానాన్ని ఏమని నిర్ణయించగలం? పూర్వాపరాల జోలికి వస్తే అవి మళ్లీ వేరే కథలు అవుతాయి. సంఘటనలో యిమిడిపోయే సన్నివేశం మటుకే మనముందు నిలిచి వుంటుంది, తాత్కాలికంగా. కథ పేజీలు పెరిగిపోయినకొద్దీ చదువరి అభిరుచి మారిపోతూ వస్తుంది. కారణం-పాత్రల పేర్లు ఎన్ని అని గుర్తుపెట్టుకోవడం, ఎవరు యే సమయంలో యేం మాట్లాడారో గుర్తుతెచ్చుకోవడం అసాధ్యం. పేజీలు వెనక్కు తిప్పి చూచుకోవలసి రావడం పెద్దది కాదు.
నియమాలు, నిషేధాలు యేర్పాటుచేసుకున్నకొద్దీ ‘మినహాయింపుల’ ఆస్కారం కూడా ముందుకు మారుతుంది. గోడమీద తుపాకీ చూపించావు- అంటే, కథ అయిపోయే లోపల అది పేలాలి అనేది సిద్ధాంతంగా కొన్నాళ్లు వుంటే- తుపాకి పేలవలసిన అవసరం లేదు, అది కేవలం స్థల వర్ణనకోసం రాశాను, నేనేమీ హత్యాకాండల కథ రాయడం లేదు అని జవాబు చెప్పే కథకులు ఎక్కువయిపోయారు. ‘ఆమె మల్లెపూలు జడలో తురుముకుని వుంది’ అన్నప్పుడు ఆ మల్లెపూల వాసన కథ వాతావరణం అంతటిలోనూ అమరిపోవడం అవసరం. కథ అయిదారు పేజీలు నిడివి వుంటే, వాతావరణ కల్పన మొదటి రెండుమూడు పేజీలలో స్థిరపడిపోవాలి. కథ ఇతివృత్తానికి తగినంత ‘వాతావరణం’ ముందుగానే సృష్టించకుండా, కథను చెలామణీ చేయలేదు. చదువరిని సమగ్రంగా నమ్మేట్లు తయారుచేయలేము. ‘ఏది కథకాదో చెప్పడం’తేలిక. కథను నిర్దేశించడం కంటె- పత్రికలో కథల పేజీలు దింపి వేరుచేసి ‘తరువాత మళ్లీ విరామంగా చదువుకుందాం’ అనే సదుద్దేశ్యంతో ప్రవర్తింపచేసే ‘కథ’ ప్రయోజనకరమయినదిగా చెప్పుకోవచ్చు. ‘చదివినదే చదవడం’ అక్కడ యిబ్బంది కలిగించకపోగా, ఆనందం- ప్రమోదం తీసుకువస్తుంది. కథలో ‘చెప్పిందే చెప్పడం’ కలిగించేంత విసుగు మరింకెక్కడా దొరకదు. పాత్రలు, సంభాషణ తీరుతెన్నులలో రుూ విషయం ప్రత్యేకంగా గమనించుకోవాలి- నికార్సయిన రచయిత. తక్కువ సమయం (రాయడానికీ, చదవడానికి కూడా), ఎక్కువ వినిమయం (మనసుకు హత్తుకోవడం, ఆలోచింపచేయడం) వున్న ప్రక్రియ కథ/కథానిక. గాలిలో కొట్టుకుపోదు, ఇలా ఎగరేసిన జండా కెరటం ఆకాశంలోనే కొత్తకొత్త పల్లవులు సృష్టించటానికి అవకాశం వుంది. వాటిని కథలుగా సరికొత్త సరంజామాగా తయారుచేసుకోవడంలోనే కథకుడి ప్రజ్ఞ వుంది. కథను రసజ్ఞంగా - పెద్ద రచన కంటె ప్రయోగశీలంగా తయారుచేసుకోవడం ముఖ్యమైన విషయం. స్తంభంలాగ స్పష్టంగా నేలనుంచి ఆకాశంమీదకు ఎగురుతూ వెడుతుంది కథ. దానికి స్థిరత్వం వుంది, గాలి-వెలుగురుల మధ్య మనుగడ వుంది. ఫలితంగా తేజోవంతంగా తయారవుతుంది. ఒకే పాత్ర- ఒకే సంఘటన- ఒకే ఉద్రిక్తత- ఉద్వేగాల పరంపర, ఒక ప్రవేశంలో పరమప్రమాణంగా పరిపూర్ణంగా చూపించేది ‘కథానిక’ తప్ప యింకొకటి దొరకదు. వివరాలన్నీ నిశ్శబ్దంలో కూరుకుపోయి, మనస్సు పొరలలోనుంచి అడపదడప ముందుకు తొంగిచూస్తాయి. వ్యక్తిగతమయిన శైలి, తర్క విచక్షణ యిందుకు దోహదం కూరుస్తాయి.
కథకువున్న కుదింపుతోనే పట్టు-విడుపు యిమిడి వుంటాయి. ఒక వాక్యంనుంచి మరో వాక్యానికి దూకడంలో సమాధాన సరళి, సంయుక్తత హాయిగా కలిసిపోతాయి. కథకుడి పాండిత్యం కథలో కనబడుతుంది గాని దాని ప్రకర్షమాత్రం కాదు. ప్రకృతిలో కలిసిపోయి పనిచేసే పురుషుడిలా కథకుడు తనచుట్టూ వున్న వాతావరణంతో, వస్తువులతో, మనుషులతో కలిసిపోయి ఒక కొత్తరూపాన్ని చదువరులముందు ప్రదర్శిస్తాడు. ప్రతిదీ ఒక కొత్త ‘దర్శనం’గానే రూపుకట్టుకుంటుంది గాని చర్విత చర్వణంగా అనిపించదు. సంఘటన, సన్నివేశం ఒకటే అయినా దానికి చెప్పే పద్ధతి, చూపే కొత్త కోణాలు, తయారయ్యే చతురస్త్రాలు భిన్నమయినవి.

- శ్రీవిరించి, ఫోన్ : 09444963584