సాహితి

ఊక దంచితే.. వ్యుత్పన్నత అంతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిభ పాండిత్యాలలో ప్రతిభకు పట్టం కట్టినవాడెవ్వడు పాండిత్యాన్ని త్రోసిపుచ్చలేదు. అనభియోగమే కవిని బైట పడేస్తుంది. ‘కవి’ అనే తోక తగిలించుకున్న అప్రయోజకుడు తోచింది వ్రాస్తే తోకను కత్తిరించి పారేస్తారు. అనుభూతి వినా కవిత్వం లేదు. రాదు. ఐతే అనుభూతి ఉన్న ప్రతివాడు కవి అవుతాడని అనేది కేవలం ఒక వర్గపు రొడ్డకొట్టుడు మాట. ప్రతివాడు కవి కాలేకపోవడానికి కారణం అభియోగం లేకనే. అభియోగం లోని వైలక్ష్యమొకటి అనుభూతినాక్రమిస్తుంది. ఆక్రమించబడ్డ అనుభూతి కవిలోంచి అలంకార భూషిత కావ్యఝురిగా క్రేళ్లుఱుకుతుంది. ఈ క్రేళ్లుఱకడమే వ్యుత్పన్నతగా గుర్తించినవారు మొదట ఆలంకారికులు. భారతీయ ఆలంకారికులు ‘వ్యుత్పన్నత‘ అంటే లోకానుభవము దివ్యానుశీలనం-న్యాయ వైశేషి కాదు పదార్ధ శాస్త్ర జ్ఞానము అన్నారు. ఈ వివరణతో ఎవరూ ఎవరితోను విభేదించనవసరం లేదు. కనుక లోకానుభవ సముజ్జ్వలితమైన సాధన సిద్ధే ‘వ్యుత్పన్నత’. కవిత్వంపట్ల ఈ వ్యుత్పత్తి విషయమై అవిధేయత అహం. అహంభావం లోంచి యేది వెలికి వచ్చినా అది అస్తిమితాంతర ధ్వనే. అంగీకారయోగ్యం కాదు.
వ్యుత్పన్నత ఫలితంగా తేలిన విలక్షణానుభూతి సామాన్యమైన అనుభూతి కన్నా ఉన్నతమైనది. సామాన్యమైన అనుభూతి తదుత్ప్రేరకమైన శ్రుత పాండిత్యంతో వచ్చిన వ్యక్తావేశం కవిత్వం కాదన్నమాట. ఋతువులు, జలపాతాలు, నదాల భాష వినబడినప్పుడే వాటి అంతశ్చైతన్య ఘోష కూడ వినబడాలి. బయట వెదికేవి లోపల కనిపించాలి. లోపలి తపస్సు లోబడి స్ఫాటిక ప్రభలతో వెలికిరావాలి. బహిఃప్రయాణాలన్నీ అంతర్లగ్న పర్యవసానాలే అని తెలియాలి. బయటి బాధలకు కరిగి నీరైపోయినపుడే లోపలి జల ఘోషలు వినిపిస్తాయి. అంతేకానీ-ద్వేష మోహాలతో చేసే మాటల గారడీ కవిత్వం కాదని గ్రహించాలి. రసానుభూతి విశే్లషణకు వ్యుత్పన్నత తప్పని సరి అన్నది తాత్పర్యం. ఈ వ్యుత్పన్నత అక్కరలేదని భావించేవారి మనసులోంచి పుట్టిన ఆత్మరక్షణ కవచమే సామాజిక స్పృహ. అసలు ఈ సామాజిక స్పృహ సాహిత్య చైతన్యంతో సహజంగానే కలిసి వుంటుందన్న కనీసావగాహన లేనివారు సంఖ్యాపరంగా ఎక్కువయ్యారు. ప్రస్తుతం తెలుగు సాహిత్యానికి ఇది ఒక అజ్ఞాన మూలక విషక్రిమి.
ఏ కాలంలో ఏ దేశంలో కవిత్వం పుట్టినా అది అనుభూతిలోంచి పుట్టినదే. కవిత్వం కేవలం ఊహా జనితం కాదు. ఒకవేళ ఊహనుంచి పుట్టడమే అనివార్యమైతే అది తప్పకుండా నెలలు నిండక నేలబడ్డ మృత శిశువే. కనుక కొంతసేపు ఈ బతకని బారెడు బిడ్డను వారి గుంపే వారి సగం తెఱుపుడు కళ్లతో చూసుకుంటారు. ఉద్రేకంలో వ్యక్తిగత స్పృహ కోల్పోయి మతి స్థిమితం తప్పిన కారణంగా కళా పరిధులనతిక్రమించిన అక్షర స్ఖలనం ఏ విధంగానూ కవిత్వం కాదు. కళాపరిధికొదిగిన రచనకు తప్పక వ్యుత్పన్నత వుండి తీరవలసిందే.
ఇంతకూ భావం ఏమిటంటే కవి వయో విజ్ఞానములిచ్చే లోకానుభవ పరిపాకం చేతనే అంటే అనుభూతి చేతనే ఉత్తమ ప్రయోజనం సాధించగలుగుతాడు. అలా కాక నినాదాలచేత సామాజిక స్పృహ అనే చౌకబారు సిద్ధాంత ఆకర్షణ చేత తత్కాలీన వ్యామోహాల చేత బలాత్కృతుడై గొప్పకోసం తానొక మహా కవిత్వ ప్రతిబద్ధుడనని అనటం వట్టి లోక వంచన. ఈ లోక వంచనా ప్రతిబద్దుని జీవితం మీదికి అసలు చూపు త్రిప్పండి. వాడొక మహా నాగరికుడు అని తేలిపోతుంది. వారికి అసలు కవిత్వమంటేనే తెలియదు. తన జీవితంలో వాడెప్పుడు అసలు కవిత్వం చదివి వుండడు. మన గోడు పడలేక వాడు చదివినా అది కుప్ప తగలేసి పేలాలు తినడమే. కనుక ఒకడు కవిత్వ విషయంలో ప్రతిబద్ధుడనని ప్రకటించుకున్నంత మాత్రాన ఒరిగేదేమీ లేదు. కవి దాని కోసం జ్వలించే దశ చేరాలి. దశ చేరడమంటే కవిత్వం అనుభూతి మూలకమని తెలుసుకోవడమన్న మాట. ఈ తెలుసుకోవడమనే విషయంలో అనుభూతి; కావ్యప్రయోజనము; నిబద్ధత; ఈ మూడు కలిసి ఒకటైపోవాలి. అప్పుడే అర్ధము, ఆత్మవికాసములుంటాయి. ఇదంతా ఓ తపోభూమిక. ఇక్కడ తపించడమే జీవి తం. జగత్తుకోసం తపించడమన్నమాట. కవి జగత్తుకోసం ఎందుకు తపించాలి? లేక జగత్తు ఎందుకు కవిని తపింపచేస్తుంది? అధర్మం అనేది ఇక్కడ కీలక మవుతుంది. పక్షిని కొట్టటం లాంటిది. సృష్టిలో వున్న పాశువికత, హింస, విశృంఖల కామం, వాటి రూపాంతరంగా మానవ సమాజంలోవున్న ‘అధర్మం’ కవి పరితాప హేతువు. అనుభూతి పరిణామం చేత కవి అధర్మ దృశ్యాన్ని సహించలేక సత్య క్రోధంతో తాననుభవిస్తున్న బాధకు రూపాంతరంగా భావోద్వేగి అవుతాడు. గాలితాకుచే విలవిల్లాడుతాడు. ఎక్కుపెట్టిన బాణం ధరించిన విల్లు అయిపోతాడు. ఇదంతా కవి తాను తన జీవితంలోకి చొప్పించుకున్న అధర్మవౌతుంది. కవి జీవితమీవిధంగానే ఉంటుంది. వ్యుత్పన్నతా ప్రేరకమైన అనుభూతి ఆదర్శమవుతుంది. అది కావ్యమైతే ఆత్మోద్వేల్లితవౌతుంది. అంటే కవిత్వంలో చెప్పబడే వస్తువు వ్యంగ్య విలసితమై- అలంకార భూషితమై అనుభూతి మగ్నమై శిల్పచారిమతో ఒప్పాలి కాని, వృథా నినాదం కారాదు. కవి చూపులోనే అతని ప్రతిభ పాండిత్యము మిళితమై వుంటే కల్పనముత్త మోత్తమనటంలో ఏ సందేహము లేదు. అవకాశవాద ఫలితాన్ని అందిపుచ్చుకుని అరవటం కవిత్వం కాదు, కానేరదు.. జీవితాన్ని ఆచమనం చేసే సాహస యాత్రిక లక్షణాన్ని అలవరుచుకున్నవాడు మనిషి. ఆ మనిషికి ధైర్యము, నీతి, కరుణ, ధర్మము, త్యాగము అనే ఐదు లక్షణాలతో వ్యక్తిత్వం కలిగించేవాడు కవి. ఇలా ప్రతిభ వ్యుత్పన్నతల పరస్పర ప్రజ్జ్వలనం చేత ఉత్పన్నమైన అగ్నివంటి కవి సాధారణ మానవుని కంటె విశిష్టంగా వుంటాడు. ఈ మిథః ప్రజ్జ్వలన ప్రక్రియ కారణంగా కవిలో సుషుప్తి దశలో వున్న ఆత్మశక్తి విస్ఫోటనం జరుగుతుంది. అప్పుడు కావ్యగతమైన అర్ధ సంపదలో ఔన్నత్యమే భాసిస్తుంది. ఆ ఒదుగుదలలోనే కవి ప్రతిభ ప్రముఖ స్థానం ఆక్రమిస్తుంది. ప్రతిభ బీజప్రాయంగా వుంటే దానిని స్థిమిత మనన ధ్యానాదులతో పరిపుష్టం చేసుకోవచ్చు. వ్యుత్పన్నతను దాని అధిష్టానంగా చేసుకుని కాపాడుకోవచ్చు. అంతే తప్ప వృత్తికోసం పాండిత్యప్పట్టా పుచ్చుకున్న ప్రతివాడు ప్రతిభావంతుడు కాడు. కవిత్యాకర్షణకు లోనైన అప్రగల్భుడు ఎన్నో దిష్టిబొమ్మల్ని కట్టినంత మాత్రాన ఆ కోతి కొక్కిరింతల్ని కళాఖండాలుగా భావించనక్కరలేదు. వ్రాసే ప్రతివాడు అచ్చమైన కవితా హృదయాన్ని కలిగి వుండవలసిందే. తద్వారా లభించిన అనుశీలనాది రసజ్ఞరుచులతో కవితాధ్యయనం చేయవలసిందే.
కవి సుఖ దుఃఖాత్మకమైన జీవితంలో కలిసిపోయేటప్పుడు తనని విభిన్న రూపాలుగా విశే్లషించుకుంటాడు. వివిధ రసాలై ప్రవహిస్తాడు. జీవన మైదానాల్లోకి రసఝురి తరంగాలై క్రీళ్ళుఱుకుతాడు. ఇదంతా తన తపస్సుతో ఒనగూర్చుకున్న ఆత్మశక్తి చేత మాత్రమే సాధ్యం. ఈ ఆత్మశక్తి నానావిధ రసరూపాల్లో మమేకమై విహృతిస్తుంది. ఇదంతా మానవజీవితంలోకి ప్రవహించే కార్యక్రమ ప్రక్రియ. అంటే కవి అనే వ్యక్తి రసనీయుడై రసత్వాన్ని పొందుతాడు. ఆ రసత్వ దశా విశేషానికి కలిగే ఆత్మాక్షర రూపమే కావ్యం. తదన్యం మృత్పిండం. కొందరాధునిక కవులు(?) ఈ మట్టి సుద్దనే చేతపట్టుకుని ఊరేగుతున్నారు. ఆగిన ప్రతి చోటూ ఒక సభే. ఈ తరహా కవులు చాలామంది తాము విశ్వసించే సిద్ధాంతాలలోని సత్యాసత్యాలను గురించి పర్యాలోచనం చేయరు. అది కాదన్న వారిని మాత్రం అభ్యుదయ నిరోధకులుగా చిత్రిస్తారు. వీరు చూపే హేతువులు ప్రతి సమాధేయం కానో కాదో కూడా అక్కరలేదు. నోరు, మూక ఈ రెండింటిలో ఎంతటి పనినైనా సాధించగల సమర్ధులు. ఒక రచన యొక్క ఎక్కువ తక్కువలు నిర్ణయించేది రాజకీయ వర్గమో దాని నాయకులో అయినప్పుడు వారి నిర్ణయం, దానిననుసరించి వుండే కుత్సితము క్రోధము, అసూయ సామాన్యా జనం మీద పడడం దోషవౌతుందా కాదా? దోషమెప్పుడూ కవిని నిర్ణయించదు. ఇదే ఇప్పుడు క్రమం తప్పకుండా జరుగుతోంది, కనుకనే సాహిత్యమవని, కవిత్వమవని సంకుచిత కార్యక్షేత్రానికి చెందిన క్రియా కల్పమై కూర్చుంది. ముఖ్యంగా తెలుగు సాహిత్యలోకంలో ఇది ప్రస్ఫుటం. శబ్దాల చేత, పద చిత్రాల చేత చావు దెబ్బతిన్న కవిత్వాన్ని చూసి దుఃఖించని వాడెవ్వడు? ఒక్కదాని సృష్టికర్త తప్ప. ఈ కల్పనలో గుణతత్వాన్ని కోల్పోయిన వస్తు జాలాన్నంతటిని కవిత్వంగా ఎత్తి చూపుతున్న వారంతా ధృతరాష్ట్ర సూనులే; ఒప్పుకున్నవారంతా పురుగు తొడని తొలుస్తున్నా(అబద్ధం కోసం) ఓర్చుకున్న సూతపుత్రులే. తెలుగుదేశంలో నిర్వ్యాజమైన కవిత్వానికి ప్రధమ శత్రువు అకవిత్వ సృష్టికర్తే. వీడికి వున్నన్ని వనరులు మరి ఏ ఇతర వ్యక్తికి వుండవు. రేడియోలు, దూరదర్శనులు, వార్తాపత్రికలు, విశ్వవిద్యాలయాలు, అచ్చుయంత్రాలు అధికారులు అన్నీ వీడి చేతిలోనే వుంటాయి. పండి రుబ్బుడు విద్యలో పట్టా పుచ్చుకున్నవారంతా కవులే అయితే వారు, జీవితం కాని జీవితాన్ని ప్రతిబింబిస్తూ జీవితాన్ని సంగ్రహణ చారుచర్యగా గడిపేవారికంటే భిన్నులెలా కాగలరు? మనసుకింత ఓపిక ఔదార్యము లేకుండా ఓ కవి ‘పిడక’మీదో ‘పిన్నీసు’మీదో ‘గునపం’ మీదో ‘గుండుసూది’మీదో కవిత్వం అల్లాడనుకోండి వాడు ప్రజాస్వామ్యం కాబట్టి ప్రాణంతో మన్నించబడ్డాడనే భావించాలి. సోపానపంక్తి లేకుండానే సౌధాగ్రం చేరాలనే దురాశా పీడిత పిశాచాలు తిరుగాడుతున్న నేలమీద కవిత్వం పరమ ముగ్ధ. సహృదయులుకాక ఎవరు కాపాడుకుంటారు?
‘తెలుగు సాహిత్య చరిత్ర’ అంటే తిట్లదండకం కాదు! కంపుగొట్టే ఆ వికట పైత్య వమనం అభ్యుదయమూ కాదు. కవిత్వం పేరుతో తోచిందేదో (వచ్చిందేదో) వ్రాసి వాడ పత్రికల్లోనో-వగ్గెర చట్రంలోనో ప్రకటింప చేసుకున్నంత మాత్రాన పాఠకుడెలా పరితృప్తుడౌతాడు? పాఠకుడి కళ్లలో పడే కవి అకృత్యం పాఠమెలా అవుతుంది? నాగరికత పేరుతో అశ్లీల పర్యావరణం అలముకున్నచోట సోకులు బలిసి ఆకులు వేసుకుంటున్న నిర్లజ్జకు విలువలంటగడుతున్న వర్తమాన సమాజంలో కవిత్వం ‘తర్కరనాలపు’ దెబ్బలు తింటోంది. ఈ నాగరికతకు సిగ్గు చౌకబారు ఎగ్గడి వస్తువైంది. ఏది చెబితే కవిత్వం కాదో దానే్న పదిమంది చేత చెప్పించి కవిత్వమనే గుర్తింపు ముద్ర వేస్తున్నారు. బజారుపాలైన తరువాత బ్రతుక్కి అర్ధం ఈ ఉమాద కవిత్వం నిర్వచిస్తోంది. వ్యుత్పన్నత రావాలంటే ఉత్తమాభిరుచులతో అనుశీలనం చేయాలి. అంతే కానీ ఊక దంచితే వ్యుత్పన్నత రాదు.

- సాంధ్యశ్రీ, 8106897404