సాహితి

ఒక ‘స్నేహవీచి’ స్పర్శ - పరామర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నేనీ యుగ సంకేతాన్ని’ అని నినదిస్తూ- ‘నిరాశను ఎరువు చేసి / విశ్వాసం పండిస్తాను / నిరాశతో మేల్కొంటాను / ఆశతో జయిస్తాను’ అని కవిత్వావరణంలోకి ప్రవేశించిన కవి డా మాదిరాజు రంగారావుగారు. సమాజ వైరుధ్యాల్ని నేపథ్యంలో ఉంచి, వైయుక్తిక అంతర్మధనాన్ని సానుకూల దృక్పథ ప్రకటనగా వెలువరిస్తూ ‘యుగసంకేతం’ సంపుటిని ఎన్నడో ప్రచురించారు. ‘ఈ ప్రపంచం నాదై / నాది కాదన్నట్లుంది / దీపపు వెలుగులో కొంత భాగం ఉంది / దీపపు నీడలో కొంత భాగం ఉంది’ అంటారు - ‘అంతమవని రాత్రి’ ఖండికలో. ఇది హాఫ్ ఫుల్, హాఫ్ ఎంప్టీ పరిస్థితికి తార్కాణం. వెలుగు నీడల సయ్యాటలో ఉంది ఈ ప్రపంచకం. దాని నీడల్లో, క్రీనీడల్లో- ‘నేను’ - కవి. తనది అనిపించే లోకం తనది కాదన్నట్లు తోస్తున్నది. ఆశా నిరాశల మధ్య ఉనికి. చేష్టలుడిగినదేమో అన్నట్లు భావన. కాలం వెన్ను చరుస్తున్నది. చలనం, గమనం- స్పృహకొస్తున్నాయి.
అసలు తాను చేపట్టిన కవితా వరివస్యకి లక్ష్య లక్షణాల్ని స్పష్టంగా చిత్రించుకున్నారు రంగారావుగారు. బహిరంతర యుద్ధారావంలో అభ్యుదయ సాఫల్యానికి బహిరంగ కవితా కదనం. స్వేచ్ఛా సహిత వ్యక్తిచేతన సిద్ధికి అంతరంగ మధన ప్రకటనం. కవిత్వమంతా సామాజికతా వృత్తాన్ని స్ఫురింపజేస్తుంది. కానీ స్పష్టం చేయదు. ఆ వృత్తానికి కేంద్ర బిందువు మనిషి! మానవతా జీవత్కాంతి! కవిత్వాభివ్యక్తిలో పరచుకునే అక్షర స్ఫూర్తి ఇది! ఈ కారణం వల్లనే కవిత్వ రూపక చిత్రణలో (తానే చెప్పుకున్నట్టు) ‘ఆనందించటానికి అనుభూతి శీలంతోపాటు ఆలోచనా అపేక్షిస్తాయి’ వారి గీతాల రూపరేఖలు. వారు అపేక్షించే ఆలోచనని అందుకోవటానికి పఠిత- కవితా ఖండికలోని వస్తుశిల్పాల గుణగ్రహణం మీద శ్రద్ధ చూపాలి.
1955లో రంగారావుగారు రాసిన ‘స్నేహవీచి’ ఆత్మాశ్రయంగా సాగిన కవిత. ఇందులో ‘నేను’- ‘నిశ్శబ్దంగా, రహస్యంగా విశ్వ సందేశాన్ని వినగలిగిన’ ఆశయ విశ్వాసి. ఆ ఆశయం ‘మనిషి మనిషి, మనస్సు మనస్సు పరస్పర సాహిత్య పరామర్శన / విశ్వశాంతికి సమర్చన’. ఈ విశ్వాసం మానవతా విలువల పరిరక్షణ పట్ల కవికి గల నిబద్ధత నుండి వెలువడింది. అనేకానేక జీవిత వాస్తవాల బరువును నెత్తికెత్తుకున్న మనిషి, అనుభవాల నుండి నేర్చుకొనే పాఠాలూ, గుణపాఠాలూ, అతని చైతన్య పరిధిని విస్తరింపజేస్తూనే ఉంటాయి. ఆ చైతన్యమే స్వేచ్ఛా భావనని ప్రోది చేస్తుంది. ఆ స్వేచ్ఛ్భావనే కవి ఆశిస్తున్న క్రియాత్మకతని సాధించుకుంటుంది.
‘మానవుడు ప్రసరించవలసింది/ అతడు గమనం సాగించవలసింది/ స్థూల ప్రకృతి నుండి సూక్ష్మభావం వరకు, వైయక్తిక వలయం నుండి విశ్వాసంలోకి అంటూ ‘నేను మేల్కొని ఉంటాను’ అని హామీనిస్తున్నారు కవి. పై పాదాల్లో చిత్రమైన గమనం, గమ్యం ఉన్నాయి. ‘స్థూల ప్రకృతి నుండి సూక్ష్మ స్వభావం’ వరకూ సాగాలి గమనం. భౌతిక వాస్తవాల పీడనలన్నీ స్థూల ప్రకృతి జనకాలే. అక్కడినుండి వ్యక్తి చైతన్యం ఆధార భూమికకు సాగాలి నడక. అది సూక్ష్మ స్వభావం. అయితే అక్కడనే ఆగరాదీ పయనం. ఆ వైయక్తిక చైతన్య ప్రసరణం- బహిరావరణంలోనికి- విశ్వాత్మలోనికి గమనించాలి. అప్పుడూ క్రియాత్మక సాఫల్యానికి అవకాశం. ఇలా కవి దృష్టి మనిషి మేధోవలయం నుండి, దాని ఆవలి తీరాలకు విస్తరిల్లిన వ్యవస్థావలయానికి సారింపబడింది. ఇదే బహిరంతర జగత్తుల అనుసంధానికి కవిత్వ సందేశం. ఇదే మానవోద్యమ నిర్మాణ విధానం. దీని సాఫల్యానికి, ఆశయ సాధనకు ఆచరణనోదకశక్తి కావాలి. అందుకనే- కవి మరోచోట ఉద్ఘాటిస్తున్నారు. ‘మానవునిలో మానవత చివురెత్తినపుడు/ ఎవడైతేనేం/ ఏ దేశమైతేనేం! / అదంతా ఒకే ఆకృతిలో చైతన్య శిఖలు అని. అంటే ఎన్ని సమూహాలైనా నిర్మింపబడేది ఒక్కొక్క మనిషీ మరో మనిషితో జంటగడితేనే! ‘స్నేహవీచి’ ఎత్తుగడలో రెండు చరణాలు ప్రధానంగా కదులుతాయి. మొదటిది-
‘అంగారనిధి గ్రీష్మదేవత / రక్తానళం చిమ్మే నాల్కలు చాచే వేళ
తడి ఆరిన పుడమి గొంతుక / చల్లని నీటికోసం తపించే వేళ
ఎండలు మృగతృష్ణ పెంచేవేళ/ శిలవలె హృదయం ఘనీభవించి
ప్రపంచం శ్మశానంవలె మారే వేళ’ అని సమయాన్ని వివరిస్తుంది. రెండవది
‘ఎక్కడనుండో ఏ కోననుండో / వేలాది మైళ్ళు వ్యాపించిన
అగాధ సముద్ర తరంగాలపై రవళిస్తూ / వాటిని కబుర్లతో మురిపిస్తూ
సైకతాలపైకి పొరలే నదీ తరంగాలను / కిలకిలా నవ్వులతో ముంచేస్తూ
వృక్షాలను కుశల ప్రశ్నలతో/ సంభావిస్తూ గలగల ఊగిస్తూ
మధ్యమధ్య ప్రేమతో / సమున్నత శైల శిఖరాలను
శీతల హస్తాలతో స్పృశిస్తూ’ అని సందర్భాన్ని వ్యక్తీకరిస్తుంది.
‘స్నేహవీచి’ ‘విశ్వమానవభావనకు ప్రతీక. ప్రకృతి రూప చిత్రాలు మానవ మనో అంతర వివిధ దశలు చూపించేవి’ అని తమ వివరణలో పేర్కొన్నారు కవి. మొత్తం కవిత ఒక అనలానిలమఃస్థితిని ఆవిష్కరించింది. ఆందోళనలతో, అలజడులతో ఉడుకెత్తిన కుతకుతనుండి- ఒక కమ్మతెమ్మర వచ్చింది. ఎలా వచ్చిందో చెప్పారు. వచ్చి, తన సందేశాన్ని ‘టీకాటిప్పణి వ్యాఖ్యాన ప్రమేయం’ అక్కర్లేకుండా అందించి, గుండెను చల్లగా తాకి నిశ్శబ్దపు కదలికలో మరో కొనకు తరలిపోయింది.
ఇలా తన విశ్వమానవ భావనకు నూతన ఓజస్సుని సమకూర్చుకుని పఠితతో సంభాషణ మొదలెట్టినపుడు కణకణలాడుతూ, దగ్గరవుతున్నకొద్ది వెట్టదనాన్ని కూరుస్తూ, చివరికి ఆత్మీయ స్పర్శతో సార్వకాలిక విలువను పంచారు కవి. ఇదే కవిత్వం అంతశ్చైతన్య ప్రసారం. బాహ్యవాస్తవికత సెగ పెడుతోంది. సమాజ స్థితి అస్తవ్యస్తతతో రగులుతున్నది. ఆ స్థితి నుండి ఉద్భవించాలి విశ్వప్రేమ భావన! ద్రష్టగా రంగారావుగారి భావం, భావన- ఇలా కవితామయంగా మనముందుకొచ్చాయి. దీనికి నిదర్శనంగా మరో మాటా అంటున్నారు వారు, ‘మానవత వధ్యశిలపై ఉన్నా/ మానవ హృదయంపై నమ్మకముంది/ మానవ వివేకంపై ప్రత్యయముంది/ అందుకే ఇంకా బ్రతికి ఉన్నాను’ అని! పాఠకుడు తన ఉత్సుకతని కాపాడుకుంటూ, భావగాఢతని ఆలోచిస్తూ, రసాస్వాదన చేయవలసిన కవిత్వం రంగారావుగారిది. అలా ఆస్వాదిస్తేనే అతని మనసు ‘అనిర్వచనీయత’తో ఓలలాడుతుంది!

- విహారి, 9848025600