సాహితి

తెలుగు రచయితల తొలి రచనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ జీవితంలో ముఖ్యంగా తెలుగువారి జీవితంలో ‘తొలి’ అన్నదానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ‘తొలి పుట్టిన రోజు, తొలి పెళ్లిరోజు, తొలి సంపాదన, తొలిరాత్రి, తొలి కాన్పు..’ వగైరా వగైరా.. అదేవిధంగా తెలుగు సాహిత్యంలో కూడా ‘తొలి’ అన్నదానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ‘తొలి రచన, ‘తొలి పారితోషికం’.. ఇలా..ఎంతటి రచయితకైనా మరెంతటి మహాకవికైనా ఇంకా చెప్పాలంటే కలం పట్టిన ప్రతి రచయితకు తొలి రచన అంటూ ఒకటి ఉంటుంది. అంతేకాకుండా అది ఏ స్థాయి రచన అయినప్పటికీ ప్రతి కవికి, రచయితకు తన తొలి రచన పట్ల మమకారం, మక్కువ ఉంటాయి. ఆ కారణంగానే ప్రతి రచయిత తన తొలి రచనను తన మదిలో సజీవంగా నిలుపుకుంటాడు. ఎందుకంటే తొలి రచనను గుర్తుపెట్టుకోవడమంటే తన మూలాలను గుర్తుపెట్టుకోవడమే కాబట్టి!
రచయిత భమిడిపాటి రామగోపాలంగారు మొదటి స్వాతంత్య్రదిన వార్షికోత్సవం సందర్భంగా ‘సంఘ సంస్కరణ - చట్టాల పాత్ర’ అనే అంశంమీద వ్యాసం రాసి రచనా వ్యాసంగానికి శ్రీకారం చుట్టారు. అచ్చులో ఆయన తొలి రచన ‘నేను - మా ఆవిడ’ అనే కథ 11-02-1949వ తేదీ ఆంధ్ర సచిత్ర వార పత్రికలో అచ్చయింది. మంధా వెంకట రమణారావుగారి తొలి రచన ‘చిల్లంగి’ అన్న కథానిక. ఇది 1952లో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ప్రచురింపబడింది.
తూమాటి దొణప్పగారు హైస్కూల్‌లో చదువుతుండగానే ఆనందవాణి, రూపవాణి, ఢంకా, సూర్యప్రభ, ప్రజాబంధు మొ పత్రికలలో పుంఖానుపుంఖంగా పద్యాలు, గేయాలు, వ్యాసాలు వ్రాశారు. తొలి కథ ‘చిత్రగుప్త’లో వచ్చింది. మునిపల్లె రాజుగారి తొలి రచన హైస్కూల్‌లో చదివే రోజులలో ‘వివేకవర్దని’ వ్రాత పత్రికలోను అచ్చులో తొలి రచన (కాదు) ‘చిత్రగుప్త’ పక్షపత్రికలోను వచ్చాయి. కావీవిశ్వనాధ్ తనకు తెలిసిన, తెలుగురాని ఒక తమిళ హోటల్ సర్వర్ కోసం అతని ప్రియురాలికి అతని తరపున ప్రేమలేఖలు వ్రాసిపెట్టిన అనుభవంతో రచయితగా అవతారమెత్తి స్కూల్ మ్యాగజైన్‌కు వ్రాసిన, స్కూలు మ్యాగజైన్‌లో ప్రచురింపబడిన ‘వరకట్నం’ కథ ఆయన తొలి రచన. పత్రికలలో ప్రచురింపబడిన తొలి రచన ‘పొలికేక’ పత్రికలో ప్రచురింపబడిన ‘ఓ వర్షం రాత్రి’ కథ.
శీలా వీర్రాజుగారి తొలి రచన ‘మాతృసేవ’లో అచ్చయింది. శ్రీవాత్సవ ప్రతి ఏటా రాసే ఆ ఏడాది సాహిత్య సమీక్ష వ్యాసాలలో వీర్రాజుగారి రచనలను ప్రత్యేకంగా పేర్కొనడం ఆయనకు మంచి ప్రోత్సాహాన్నిచ్చింది. పాపినేని శివశంకర్‌గారు తొమ్మిదవ తరగతి చదువుతున్న రోజులలోనే తేటగీతి పద్యసాధన చేశారు. హైస్కూలు చదువు పూర్తయ్యేలోపు ఎన్నో పద్యాలు, కథలు వ్రాశారు. కాకపోతే అన్నీ అనుకరణలే. అవి చదివిన సహచరులు ‘పిల్లకవి’ బిరుదునిచ్చారు. తర్వాతి కాలంలో తెనుగులెంక తుమ్మల ‘్భళిరా సత్కవివౌదువ’ని ఆశీర్వదించారు. ఆ ఉత్సాహంతో సౌందరనందం స్టైల్‌లో ‘ఆమ్రపాలి’ అనే అసంపూర్ణ కావ్యం వ్రాశారు. అలా ఆయన తొలి రచన ‘కలుపుమొక్క’ కథ 1977లో అచ్చుపడింది ప్రజాతంత్ర వారపత్రికలో.
మధురాంతకం మహేంద్ర తొలి రచన ‘జర్తె‘ కథ 1981లో ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక కథల పోటీలో ప్రథమ బహుమతి పొందింది. కొమ్మూరి వేణుగోపాలరావు గారి తొలి రచన జ్యోతి మాసపత్రికలో ‘మా అనుభవాలు’ శీర్షికన వచ్చిన ఒక చిరురచన. తన రచనకు గాను కాంప్లిమెంటరీ కాపీ వస్తుందని ఆశగా ఎదురుచూసి చూసి, అది రాకపోగా మార్కెట్‌లో కొనడానికి వెళ్తే అది దొరకక తన తొలి రచన పడిన పత్రికను పోగొట్టుకున్న కొమ్మూరి వారి కథ ఇది.
వల్లంపాటి వెంకట సుబ్బయ్యగార్కి రాయాలనే కోరిక దండిగానే ఉండింది గాని ఏమి రాయాలో ఎలా రాయలో తెలియక సతమతమవుతున్న సమయంలో మధురాంతకం రాజారామ్‌గారితో పరిచయం ఏర్పడి ఆయన ‘కతలు రాయి, కతలు రాయి’అని పోరు పెట్టగా పెట్టగా ఒక కథ రాశారు. అది ‘అన్యధా శరణం నాస్తి’ అన్న కథ. ఇది 1958లో ఆంధ్రప్రభలో అచ్చయింది. తెనుగులెంక తుమ్మలవారు వెళ్లిన ఒక అవధానంలో అవధానికి సమస్యాపూరణమున పృచ్చకుడు ఇచ్చిన సమస్యను ఇంటికి వచ్చిన తర్వాత తుమ్మలవారు కవితావేశంతో పూరించిన ‘మునుపున్ రాత్రిచరుల్ విమానములపై మోదమ్ముగానెక్కి..’ అన్న పద్యం తుమ్మలవారి తొలి పద్యం. తొలి రచన!
ఏడుపదుల వయసులో కవితా వ్యాసంగాన్ని ప్రారంభించిన బెజవాడ గోపాలరెడ్డిగారి తొలిరచన ‘తాజ్‌మహల్’. సుదీర్ఘ కవిత ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది. బోయ జంగయ్య పదవ తరగతి చదివే రోజులలో ‘కష్టసుఖాలు’ పేరుతో నాటిక రాసి పాఠశాల వార్షికోత్సవంలో ప్రదర్శిస్తే దానికి అందరి ప్రశంసలతోపాటు ప్రథమ బహుమతి వచ్చింది. అది 1963లో పుస్తకంగా వచ్చింది. అదే ఆయన తొలి రచన. డి.వి.నరసరాజుగారి తొలి రచన ‘చాణక్యుడు’ వ్యాసం. కాలేజీ మ్యాగజైన్‌లో ప్రచురింపబడింది. విశేషమేమిటంటే వ్యాసశీర్షిక ‘చాణ్యకుడు’గా ప్రచురింపబడింది. ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా తొలి రచన పేరులోనే ముద్రారాక్షసం. ఇంద్రగంటి హనుమచ్ఛాస్ర్తీగారి తొలి రచన ‘ఒకనాటి గీతి’ భారతిలో అచ్చయింది. ‘‘ఎన్ని యబ్దాలనుండో నా హృదయ సుమము..’’ అని ప్రారంభమవుతుంది ఆ గీతం.
1936లో ‘నవ్వుల రాణి’ పత్రికలో వచ్చిన ‘కామావధాని యుక్తి’ అన్నది తొలి వచన రచన. దేవులపల్లి కృష్ణశాస్ర్తీగారి సంపాదకత్వంలోని కాలేజీ మ్యాగజైన్ మొదటి పేజీలో ప్రచురింపబడిన ‘మధువు -నేను’ తొలి వచనకవిత. 1939లో ‘్భరతి’లో ప్రచురింపబడిన ‘నేడు’ తొలి పద్య కవిత.
దేవులపల్లి వెంకట కృష్ణశాస్ర్తీగారు 1920 ప్రాంతంలో ఒకసారి విజయవాడనుండి బళ్ళారికి రైలు ప్రయాణం చేస్తుండగా నల్లమలఅడవులలో ఆ కొండ కోనల నడుమ, ఆ చెట్టు చేమల మధ్య ఆ రైలు పరుగుల యొక్క లయబద్ధమైన సవ్వడికి ఉత్తేజితుడై వ్రాసిన పాట ‘ఆకులో ఆకునై..’ అన్నపాట. అదే ఆయన తొలి రచన.
ఇతర రచయితలలాగా మల్లాది వెంకట కృష్ణమూర్తిగారు తొలి రచన విషయమై పురిటినొప్పులు పడలేదు. ఆయన తొలిసారిగా ఒకేసారి 3 కథలు వ్రాసి మూడు పత్రికలకు పంపితే మూడూ వెంట వెంటనే ప్రచురింపబడ్డాయి. అవే.. 1970 ఆగస్టు చందమామలో ‘ఉపాయశాలి’ కథ, ఆ తర్వాత ఆంధ్రపత్రికలో ‘పిరికివాడు’ కథ, అపరాధ పరిశోధన పత్రికలో ‘శివాజ్ఞ లేనిదే..’ కథ. ఒక తొలి రచన ప్రచురణకే ఎంతోమంది నానా ఇక్కట్లు పడుతుంటే మల్లాదివారికి ఏకంగా మూడు కథలు ఒకేసారి ప్రచురింపబడ్డాయి.
పోలాప్రగడ రాజ్యలక్ష్మిగారి తొలి రచన 1964లో ఒక మాసపత్రికలో ప్రచురింపబడింది. అదే ‘ఏమైనా కథ రాయాలి’. ఆ రచనకు పేజీకొక్క బొమ్మ చొప్పున బాపుగారిచే అలంకృతం కావడం రాజ్యలక్ష్మిగార్కి ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది. ఇల్లిందల సరస్వతీదేవిగారు ఆమె దొడ్డమ్మగారు చెప్పిన కథలు ఆసక్తిగా వినటంవల్లనూ, అదే సమయంలో ఇంట్లో తెలుగు, ఇంగ్లీషు పుస్తకాలు ఎక్కువగా చదవటం వల్లనూ ఆమెకు కథలు చెప్పాలనే కుతూహలం కలిగింది. అలా ఆమె కథ ఒకటి ఆకాశవాణి ద్వారా ప్రసారమైంది. అచ్చులో అయితే 1943లో భారతిలో వచ్చింది. డి.కామేశ్వరిగారు 1962లో ‘వనితలు-వస్త్రాలు’ వ్యాస రచనతో రచనలకు శ్రీకారం చుడితే, ఇంద్రగంటి జానకిబాలగారు 1970లో జగతి పత్రికలో ఒక చిన్న స్కెచ్‌తో రచనలకు శ్రీకారం చుట్టారు. పదమూడేళ్ళకే పెళ్లి అయి కాపురానికి వచ్చేయడంతో ఇంటిమీద బెంగతో రచయిత్రి లక్ష్మిగారు తనవారికి రాసుకున్న (పోస్ట్ చెయ్యని) ఉత్తర రచనానుభవంతో 1957లో స్ర్తివాద కథనొకదానిని రాసి పంపితే, పంపినంత వేగంగానూ క్షేమంగా తిరిగొచ్చేసింది. ఇలా 1957లో రచనకు శ్రీకారం చుడితే 1977లో లక్ష్మిగారి తొలి రచన ఊపిరి పోసుకుని ‘జ్యోతి’ మాసపత్రిక ఒడిలో కన్నుతెరిచింది.
ఆధునిక నవలా యుగ మహారాణి యద్దనపూడి సులోచనా రాణిగారి తొలి రచన ‘చిత్రనళినీయం’ కథ 1956లో మే నెలలో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో అచ్చయింది. ‘పత్రిక చేతిలోకి తీసుకొని నా కథ పేరు, నా పేరు కళ్ళారా చూసుకున్నాను. ఎంత సంతోషం అనిపించిందో. ఆ ఆనందానికి కోటి ఐశ్వర్యాలు కూడా సాటిరావనిపించింది’ అంటున్న సులోచనారాణిగారు ఆ రచనకు వచ్చిన తొలి పారితోషికం రూ.15-00లతో వారి నాన్నగారికి ఒక జత జరీ అంచు పంచెలు కొని ఇచ్చారు. రచయిత్రి కావాలని కె.రామలక్ష్మిగారు ఎప్పుడూ అనుకోలేదు. ఖాసా సుబ్బారావుగారి స్వతంత్రలో పనిచేసేటపుడు అప్పుడప్పుడూ అందులో చిన్న చిన్న ఖాళీలు (్ఫల్లర్స్) పూర్తిచేయడం ద్వారా అనుకోకుండా రచయిత్రిగా మారారు. ఆమె తొలి కథ ‘పార్క్ బెంచ్’ 1951లో రాశారు. భాగవతుల సుందరమ్మ (బీనాదేవి) 1960లో ‘అమృతం’ వ్యాసంతో రచనలకు శ్రీకారం చుట్టారు. ఆమె తొలి కథ ‘రాధమ్మ పెళ్ళి’ (1965).
ఇంకా, అబ్బూరి వరద రాజేశ్వరరావు- ప్రథమ యుద్ధం, కథ (జ్వాల, నవంబరు 1934), చాసో- ధర్మక్షేత్రము, కవిత (్భరతి జూన్ 1941) ఆర్.ఎస్.సుదర్శనం- మూగకథ, పద్య కావ్యం (1943), రావూరి భరద్వాజ - విమల (ప్రజామత, 25 ఆగస్టు 1946), గిడుగు రాజేశ్వరరావు- టార్చిలైట్, కథ (చిత్రగుప్త, 15 ఆగస్టు 1947), జి.వి.యస్. సుబ్రహ్మణ్యం- అంతలోనే మార్పు, కథ (మేథావి 15 ఆగస్టు 1951), నాయని కృష్ణకుమారి - ఆంధ్రుల కథ, కథ; సి.ఆనందరామం- ఆటుపోటు, కథ (ఆంధ్రప్రభ దినపత్రిక 1952), భమిడిపాటి జగన్నాథరావు- వరహీనం, కథ (ఆంధ్ర సచిత్ర వారపత్రిక 1952), అల్లం శేషగిరిరావు- మృగయా వినోదం అను పులి ఛాన్స్ కథ (ఆంధ్రజ్యోతి వార పత్రిక 1967), పి.సత్యవతి గ్లాసు పగిలింది కథ (1970), శీలా సుభద్రాదేవి- పరాజిత కథ (1970), కేశవరెడ్డి- సమాంతర రేఖలు కథ; అర్నాద్ వేలంపాట కథ (స్వాతి ఏప్రిల్ 1972), వివినమూర్తి- రొట్టెముక్క కథ (ఆంధ్రజ్యోతి 1975), సింగమనేని నారాయణ జూదం, కథ (1978), డా.వాసా ప్రభావతి- బిచ్చగత్తె కథ (1979).. అనునవి ఆయా కవుల / రచయి(త్రు)తల తొలి రచనలు.
మన రచయితల తొలి రచనలను పరిశీలించినప్పుడు ఒక విషయం స్పష్టమవుతుంది. చాలామంది రచయితలు రెండు పదుల వయసులోనే ఇంకా చెప్పాలంటే హైస్కూలు స్థాయిలోనే కవితలల్లారని (రచనలు చేశారని) చెప్పవచ్చు. తొలి రచనలలో సాదాసీదా రచనలూ ఉన్నాయి. చేయి తిరిగిన రచయితల మలి రచనలతో పోటీపడి (ప్రథమ) బహుమతులు గెలుచుకున్న తొలి రచనలూ ఉన్నాయి. తాము ప్రఖ్యాతమై తమ రచయితలకు ఎనలేని పేరు ప్రఖ్యాతుల నార్జించి పెట్టిన తొలి రచనలూ ఉన్నాయి. ఇంకా, తెలుగు సాహిత్య వినీలాకాశంలో తమ రచయితలను ధృవతారలుగా వెలుగొందేలా చేసిన తొలి రచనలూ ఉన్నాయి.
తమ తొలి రచనలు పురస్కార గ్రహీతలైనా, కాకపోయినా, పలువురి ప్రశంసాపాత్రమైనా కాకపోయినా, అనామకంగా మిగిలిపోయిన సాదాసీదా రచన అయినప్పటికీ తమ తొలి రచనలపట్ల రచయితలకు మక్కువ మిక్కిలిగానే ఉన్నది. ‘ఇందెనే్నని కొదవలున్న నాకు నిది ప్రియము’ అని తుమ్మలగారు, ‘కాకిపిల్ల కాకికి ముద్దు అయినట్లు ప్రతి రచయితకు తొలి రచన ముద్దుబిడ్డలాంటిది’ అని మరొకరు అన్నారంటే వారికి తమ తొలి రచనలపై ఉన్న మక్కువే కారణం.

- అశ్వని