సాహితి

సామాన్యుడి హృదయ స్పందన శంఖాఘోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈయేటి జ్ఞానపీఠ్ పురస్కారానికి ప్రఖ్యాత బెంగాలీ కవి, విమర్శకుడు, విద్యావేత్త, ప్రయోగశీలి అయిన శంఖాఘోష్ ఎన్నికయ్యారు. నోబెల్ పురస్కారం గ్రహీత విశ్వకవి రవీంద్రుడి సాహిత్యంపై వీరిది సాధికారికమైన కృషి. భూత-్భవిష్యత్ కాలాలకు అనుసంధానకర్తగా నిలబడ్డ ఈ కవి, నేటి యువతరాన్ని కూడా విశేషంగా ప్రభావితం చేశారు. ‘దిల్ గులి రాత్ గులీ’ ‘నిహిత పాతాళ ఛాయ’వంటి వీరి కవితలు నవ తరాన్ని ఉర్రూతలూగించాయి. పర్యావరణ పరిరక్షణ అంశం వీరి కవిత్వంలో అంతస్సూత్రంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఏ విషయం చెప్పినా, ఘాటుగా కటువుగా కాకుండా మెత్తగా, స్పష్టంగా చెప్పడం, విషయం ఎలాంటిదైనా కవిత్వపు సున్నితత్వాన్ని కాపాడుకుంటూ చెప్పడం వీరికి మాత్రమే సాధ్యం! అదే వీరి ప్రత్యేకత!! బెంగాలీ సాహిత్య ప్రపంచంలో వీరికెంతో గౌరవప్రదమైన పేరుంది. ఈ పురస్కారం ప్రకటింపబడగానే.. ఈయనకీ పురస్కారం రావడం ఇరవై యేళ్ళు ఆలస్యమైందని బెంగాలీ సాహిత్య లోకం అసహనాన్ని వ్యక్తంచేసింది.
దేశంలో అత్యున్నత స్థాయి సాహిత్య కృషిచేసిన ఒక రచయితకు ప్రతి యేటా జ్ఞానపీఠ్ పురస్కారం ఇవ్వబడుతుంది. దీనికి దేశంలోని ఇరవై మూడు భాషా రచయితల్ని అర్హులుగా పరిగణిస్తారు. అయితే ఇప్పటివరకు పదిహేను భాషలకు సంబంధించిన కవులు- రచయితలకు మాత్రమే ఈ పురస్కారం దక్కింది. భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ ప్రకరణ ప్రకారం ఈ పురస్కారాన్ని 1961లో ప్రారంభించారు. ప్రారంభించినపుడున్న నగదు బహుమతి కాలక్రమంలో పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడది పదకొండు లక్షలయ్యింది. ఈ నగదు బహుమతితోపాటు, ఇత్తడి సరస్వతీ విగ్రహం, శాలువా, సన్మానపత్రం మొదలయినవి పురస్కార గ్రహీతలకు ప్రదానం చేస్తారు. దీనికున్న నిబంధనల ప్రకారం ఈ పురస్కారం మరణానంతరం ఎవరికీ ప్రకటించరు.
శంఖాఘోష్ (84) అసలు పేరు చిట్టోప్రియోఘోష్. ఇప్పటి బంగ్లాదేశ్‌లోని చాంద్‌పూర్‌లో 6 ఫిబ్రవరి 1932న జన్మించారు. కోల్‌కతా ప్రెసిడెన్సీ కాలేజి నుండి 1951లో డిగ్రీ తీసుకున్న ఘోష్, ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ కలకత్తానుండి 1954లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు. వెనువెంటనే అదే విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కలకత్తాలోని అనేక విద్యాసంస్థలలో ఉద్యోగాలు చేశారు. చివరకు జాదవ్‌పూర్ యూనివర్సిటీలో చేరి, బెంగాలీ ప్రొఫెసర్‌గా 1992లో పదవీ విరమణ చేసేదాకా అందులోనే పనిచేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోనూ సిమ్లాలోని అడ్వాన్స్‌డ్ స్టడీస్‌లోనూ, విశ్వభారతి విశ్వవిద్యాలయంలోనూ ఆయన కొంత కాలం బెంగాలీ భాషా, సాహిత్యాలు బోధించారు. 1967-68 మధ్యకాలంలో అమెరికాలోని ఐఓవా రైటర్స్ వర్క్‌షాపులో పాల్గొన్నారు. శాంతి నికేతన్‌లోని రవీంద్రభవన్‌కు ప్రిన్సిపాల్‌గా కూడా పనిచేశారు. ఆదిమ్‌లతా గుల్‌మొమై (పురాతన సిరలు- వృక్షాలు) ముర్క్భారో సామాజిక్ నై (పిచ్చివాడు- సామాజికం కాదు) కబీర్ అభిప్రే (కవి అభిప్రాయం) బబరేర్ ప్రార్థన (బాబు ప్రార్థన) ముఖే ముఖే జాయ్ బిగై పానె వంటివి ఆయన ప్రసిద్ధ కవితా గ్రంథాలు. ప్రచురించిన అరవై గ్రంథాలలో పదిహేను సంపుటాల కవిత్వముంది. వాసిలోనూ, రాసిలోనూ తన స్థాయిని సమున్నతంగా నిలుపుకోవడానికి నిరంతరం కృషిచేసిన మహాకవి శంఖాఘోష్. వీరి కవిత్వం చాలావరకు వివిధ భారతీయ భాషల్లోకి అనువాదమయ్యింది. 1989లో భోపాల్-్భరత్ భవన్‌లో జరిగిన జాతీయస్థాయి సమావేశాల్లో ఈ వ్యాస రచయిత శంఖాఘోష్‌ను కలుసుకోవడం జరిగింది. ఆయన అందించిన కవితల్ని తెలుగులోకి అనువదించడమూ జరిగింది.
నర్సింగ్‌దాస్ పురస్కారం, రవీంద్ర పురస్కారం, సరస్వతీ సమ్మాన్ వంటి ప్రతిష్టాత్మకమైన పురస్కారాల్ని శంఖాఘోష్ లోగడ స్వీకరించారు. తన స్వీయ కవితకు సాహిత్య అకాడెమీ అవార్డు(1977) స్వీకరించిన వీరు, ఇరవై యేళ్ళ తర్వాత 1999లో ఉత్తమ అనువాదానిక్కూడా సాహిత్య అకాడమీ అవార్డు స్వీకరించారు. ఇలా కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు ఎవరైనా రెండుసార్లు తీసుకోవడం చాలా అరుదు. 2011లో భారత ప్రభుత్వం వీరికి పద్మభూషణ్ ప్రకటించింది. అంతేకాక, విశ్వభారతి వారి ‘దేశికోత్తమ్’ బిరుదు, వరల్డ్ ఫోరమ్ ఫర్ జర్నలిస్ట్స్ అండ్ రైటర్స్ వారి ‘సాహిత్యబ్రహ్మ’ బిరుదూ లభించాయి. రెండు విశ్వవిద్యాలయాలనుండి గౌరవ డి.లిట్‌లు పొందారు. 2016 సంవత్సరానికి ఇప్పుడు జ్ఞానపీఠ్ ప్రకటింపబడింది.
మహాశే్వతాదేవికి జ్ఞానపీఠ్ లభించిన తర్వాత ఇరవై యేళ్ళకు, మళ్ళీ ఇప్పుడు బెంగాలి కవికి ఆ జ్ఞానపీఠ్ దక్కింది. 1966లో తొలిసారిగా బెంగాలీ రచయిత తారాశంకర్ బంధోపాధ్యాయకు లభించిన జ్ఞానపీఠ్, ఆ తర్వాత అయిదేళ్ళకు విష్ణుడే (1971)కు, మరో అయిదేళ్ళకు ఆశాపూర్ణాదేవి (1976)కి లభించాయి. దేశంలో జ్ఞానపీఠ్ స్వీకరించిన తొలి మహిళ ఈమే! వీరి ‘ప్రథమ్ ప్రతిశ్రుతి’ గ్రంథానికి ఈ గౌరవం దక్కింది. ఆ తర్వాత ఒక దశాబ్దిన్నర వరకు ఏ బెంగాలీ సాహిత్యకారుడికి ఈ పురస్కారం అందలేదు. 1991లో సుభాశ్ ముఖోపాధ్యాయకు రావడం, మళ్ళీ అయిదేళ్ళ విరామం తర్వాత 1996లో మహాశే్వతాదేవికి లభించడం జరిగింది. ఆ వరుసలో ఇప్పుడు శంఖాఘోష్‌కు ప్రకటించింది యాభై రెండవ పురస్కారం. నిజానికి జ్ఞానపీఠ్ దక్కాల్సిన బెంగాలీ సాహిత్యకారులెంతోమంది ఉన్నారు. జిబానంద్‌దాస్, శక్తి ఛటోపాధ్యాయ, సునీల్ గంగోపాధ్యాయ, నిరేంద్రనాథ్ చక్రవర్తి, రమాపద చౌధరీ లాంటి దిగ్గజాలు ఎంతోమంది ఉన్నారని చెపుతారు. నిజమే! ప్రపంచ భాషలన్నింటా అవార్డుకందని మహాకవులూ, రచయితలూ ఎంతోమంది ఉన్నారు. జన హృదయాలలో స్థానం సంపాదించుకున్న వారిదెప్పుడూ ప్రథమస్థానమే.
వాదాల వివాదాల జోలికి పోకుండా, ప్రతీకాత్మక, సందేశాత్మక కవిత్వం రాసిన శంఖాఘోష్, సామాన్యుడి హృదయ స్పందనల్ని, ఆక్రోశాల్ని నమోదుచేశారు. చుట్టూఉన్న పరిస్థితుల్లో తన జీవిస్తున్న కాలంలో వీరు తన అక్షరాల్ని ముంచి తీస్తారు. అందుకే వీరి కవిత్వానికంత వాస్తవ సౌరభం! వీరి కవితా సంపుటాలన్నీ ఒక క్లాసిక్ స్థాయినందుకున్నవని విమర్శకులు భావించారు. లలితంగా, లయాత్మకంగా సాగే వీరి కవితా శైలి జన జీవనాన్ని వర్ణిస్తుంది. వ్యవస్థ ఎంత దిగజారుతూ ఉందో వివరిస్తుంది. కానీ, కోపంతో ప్రశ్నించదు. కరుణాత్మకంగా దయనీయమైన స్థితిని విశదపరుస్తుంది. వీరి కవిత్వం ఒక మెత్తని కత్తి! విశ్వకవి రవీంద్రుడి సాహిత్యాన్ని బాగాఇష్టపడే శంఖాఘోష్ ఆయన సమగ్ర రచనల్ని ఔపోసన పట్టారు. వాటిమీద సాధికారతను సాధించారు. అందుకే ఆ విశ్వకవి ప్రభావం ఈ మహాకవిపై ఉంది.

- డాక్టర్ దేవరాజు మహారాజు, 9908633949