సాహితి

చేను గట్టుపై కవి తాండవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివారెడ్డి గారన్నట్లు ప్రసాదమూర్తి వస్తుతః కవి. ప్రసాదమూర్తి ‘పూలండోయ్ పూలు’ ఇంకా తాజాగా ఉండగానే వచ్చిన మరో కవితా సంపుటి ‘చేనుగట్టు పియానో’. దీనిలోని కవితలన్నీ గత రెండేళ్ళలో రాసినవే. ఒక నెలలో రాసిన ఏడెనిమిది కవితలు ఇందులో ఉన్నాయంటే నిజానికి అంతకన్నా ఎక్కువే రాసియుండవచ్చు. విరివిగా కవితలు రాస్తూ తరచూ పత్రికల్లో కనబడే కవుల్లో ఈయనొకరు. తన గోడును అక్షరంతో మొదలుపెట్టుకోవడం అలవాటైపోయిన మనిషి ప్రసాదమూర్తి. ఆయన దేన్నయినా కవిత్వంగా చెక్కగల శక్తి సంపన్నుడని విశే్లషకులు ప్రశంసల జల్లు కురిపించినా ఆయన్ను కవిగా నిలబెట్టినది మాత్రం ఆయన సామాజిక అంశాలపై ప్రతిస్పందనగా రాసిన కవితలే. కవిత్వానికి సామాజిక కోణం ప్రాణపదం, ప్రాయోజకం. శుద్ధ వ్యక్తిగత భావావేశాలు, కవిత్వం పండించడానికి చేసే ప్రయోగాలు నిజమైన ప్రయోజనానికి గండికొడ్తాయి. కవి ఎంత ప్రసవ వేదన పడినా ‘అదిగో కవీ!’ అంటూ జనం వెంపడితేనే సార్థకత. ఇది ఏ కవికైనా వర్తిస్తుందని చరిత్ర చెబుతోంది. ప్రసాదమూర్తిని జ్ఞాపకాల బంఢాగారంగా చెప్పుకోవాలి. అందులోంచి ఓ ముతక సరుకును తీసి తనివితీరా తడిమి ఆనక తన పద విన్యాసంతో అక్షర సొగసులద్ది పఠితులను ఓలలాడిస్తాడు. ఊరెల్లినాడంటే నాలుగు కవితలు భుజానవేసుకోందే తిరిగిరాడు.
‘చేనుగట్టు పియానో’ సంపుటిలో కవి తన మనోవీధుల్లో విహరించి మూటగట్టుకొచ్చిన దొంతరలే అధికంగా ఉన్నాయి. అక్షరాలతో ఊహల వంతెనల్ని నిర్మించడం ప్రసాదమూర్తికి అలవోక విద్య. వాటిని ఎక్కితేగాని దృశ్యరూపం సాకారం కాదు. ‘పెరట్లో జామచెట్టు కప్పుకున్న దుప్పటి’ ‘ఓ బొమ్మ అయితే కనురెప్పలమీద పాదాల అలికిడి’ నైరూప్య స్పర్శ.
‘బొమ్మల గోడలు’ కవిత ఆయన ఇంటి గోడలే.
‘ఏ మల్టీప్లెక్స్‌లోనూ దొరకని ఆనందం / మా ఇంటి గోడలమీద దొరుకుతుంది/ దేహమంతా మెత్తటి గుడ్డముక్క చేసుకొని / ఇంట్లో గోడల్ని తుడుచుకోని వస్తాను’ అనడంలో ఊరిపై, ఇంటిపై బెంగ గోచరిస్తుంది.
భావుకతలోంచి బతుకుని చూసుకోవడం ఈ కవి లక్షణం. తన బతుకు ముచ్చట్లు పంచుకుంటూనే తలుపులు తెరుచుకొని వీధుల్లోకి వెళ్లి సంఘజీవిగా అవతారమెత్తుతాడు.
‘ఆమె గొడుగు కోసుకురమ్మంది/ అవును మరి / అది ప్రణయ రుతువులో విచ్చుకునే పువ్వు’ లోంచి కవి ‘వీధుల్లో పోతుంటే చిల్లులు పడ్డ గొడుగుల్లా గుడిసెలు / ఈ నాయకులకు చెప్పాలి/ కాస్త ఈ పథకాల ప్రచారాలు ఆపి / గుడిసె గుడిసెకీ ముందు గొడుగుల్ని నాటమని’ వీధులోకి వస్తాడు.
రెక్కల కొల్లేరు, చెరువులో పిట్ట అడుగులు, సుముద్రంతో సాయంత్రం, ఇక్కడ నది ఉండాలి. విశాఖ వెళ్లి రావాలి, కొల్లేటి తోరణం ఇలా చాలా కవితలు కవికి ప్రకృతిపై ఉన్న ప్రేమను ఒలకబోస్తాయి. ప్రసాదమూర్తి అక్షరాల్లో నిండుమనసుతో కూడిన నిజాయితీ కనిపిస్తుంది. మనసు చివుక్కుమన్నచోట అక్షరమై స్పందించడం ఆయన సుగుణం.
‘ఒంటరి దుఃఖం’లో ‘మనల్ని మనమే నవ్వించే / విదూషక విద్య నేర్చుకోవాలి’ అంటూ కవి దేవిప్రియను ఓదార్చుతాడు.
పెషావర్ బడిపై ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ ‘పిల్లల్ని వదిలేస్తామని చెప్తే / పెద్దలమంతా వాళ్ల ముందు చేతులెత్తి నిలబడే వాళ్లం కదా!’ అని గుండెలు బాదుకుంటాడు. ఘర్ వాపస్, నిన్న చనిపోయిన రైతు, విగ్రహం లాంటి కవితల్లో కవి సత్యాగ్రహం కనిపిస్తుంది.
‘అక్షరాల నాగళ్లతో / నన్ను నేను దున్నుకునే వ్యవసాయాన్ని / వ్యసనం మార్చుకుంటాను’ అని చిన్ని ఆశలో చెప్పుకున్నట్లు కవి పండించిన పంటయే ఈ కవితలు.
తన చుట్టూ వున్న పరిసరాలకే కవి దృష్టి పరిమితమైతే వస్తువైవిధ్యం, విస్తృతి కొరవడుతుందని విశే్లషకులు తరచు చెబుతూనే ఉన్నారు. నేటి కవులు దాన్ని దాటలేకపోవడానికి వారి జీవన విధానమే కారణం కావచ్చు. ప్రసాదమూర్తికి కొంత మినహాయింపు ఇవ్వొచ్చు.
వస్తు ప్రాధాన్యతతోపాటు చేపట్టిన అంశాన్ని కవిత్వీకరించడంలో మంచి రసపట్టు. ప్రదర్శించిన ఈ రచనలు వర్థమాన, కొత్త కవులకు దిశానిర్దేశంగా కూడా పనికొస్తాయి. కవిగా నిలబడే సత్తా వున్న ఈ కాలపు అతి తక్కువ మందిలో ప్రసాదమూర్తి ఒకరని నిరభ్యంతరంగా చెప్పవచ్చు.

- బి.నర్సన్, 9440128169