సాహితి

నిజాన్ని సమాధి చేయలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రష్యా సోషలిస్టు విప్లవానికి వందేళ్లు. ఈ సందర్భంగా అనేకానేక ఆత్మావలోక కథనాలు వెలువడ్డాయి. అనేక సమీక్షలు వచ్చాయి. గొప్ప వ్యవస్థ కుప్పకూలిందనే వ్యధ, వగపుకూడా వాటిల్లో ధ్వనించింది. మొట్టమొదటిసారిగా కార్మిక-కర్షక శ్రేయోరాజ్యం ప్రాణంపోసుకుని కొన్ని దశాబ్దాలుగా కొనసాగిన అనంతరం తన బరువుకు తానే కూలిపోవడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోయారు. మంచి ఎక్కడున్నా ఆహ్వానించాల్సిందే! అయితే ఆ మంచి చాటున మొరటుదనం, అమానవీయత, నియంతృత్వం, నిజాన్ని సమాధి చేయడం సబబుకాదు. కాని రష్యాలో అదే జరిగింది. ఈ విషయాన్ని రష్యా వెలుపలగల సాహితీ, సాంస్కృతికవేత్తలు, రాజకీయవాదులు గాక ఆ దేశంలోని వారే, స్పందించే హృదయాలే, సున్నిత మనస్కులే లెనిన్, ట్రాట్‌స్కీ, స్టాలిన్ బతికున్న కాలంలోనే గొంతు విప్పడం గమనార్హం. కొందరు బాహాటంగా తప్పుపట్టారు. వారికి వేధింపులు, కక్ష సాధింపులు... చివరకు చావుబహుమతిగా లభించింది. దీన్నిమాత్రం చాలా తక్కువమంది ప్రస్తావించారు. వర్తమాన సమాజంలో ఈ రకమైన భావాల విస్తృతి కావలసిన అవసరముంది. సంక్షేమంమాటున సాయుధ చర్యలు, సామాన్యుల వధ, చిత్రహింసలు, నిర్బంధ క్యాంపులు, కాల్చి చంపడాలు సరైన విధానం ఎప్పుడూ కాదు. అందులో కార్మిక-కర్షక శ్రేయోసమాజం నడుపుతున్నామని చెబుతున్నవారు మరింత సహనం, క్షమాగుణం కలిగి ఉండాలి. కాని వాటిని దరిచేరనీయకుండా, అనుమానమున్న రచయితలను, కళాకారులను, చిత్రకారులను, మేధావుల్ని, పురుగుల్ని చూసినట్టు చూస్తూ వారు తమ సమాజానికి పనికిరారని వారే విచారించి, తీర్మానించి తుపాకి తూటాలకు బలిగొన్నారు. ఆత్మహత్యలు చేసుకునే వాతావరణం కల్పించారు. కొందరు రహస్యంగా దేశం వదిలివెళ్ళేలా ఒత్తిడిపెంచారు. శతాబ్దం క్రితం ఈ రకమైన ఆలోచన సరళి ఆదర్శప్రాయంగా కొందరికి కనిపించవచ్చుగాని ఆధునిక కాలంలో ఇది పూర్తిగా నిందనీయం. ప్రజల సాధికారత, వారి స్వేచ్ఛ, వికాసం అత్యంత కీలకంగా ఉబికివచ్చిన 21వ శతాబ్దంలో ఆ భావధారకు ప్రాసంగికత లేదు. కాని ఆ రకమైన నియంతృత్వాన్ని ఆరాధించే, ప్రేమించే కొందరు ఇప్పటికీ కనిపిస్తున్నారు. అదో వీరభక్తి, వీరాభిమానం. కాని ఇతరుల ప్రాణాలను ఆహుతి తీసుకునేందుకు ఆ భక్తి, అభిమానం ఉండరాదు. ఆ తెలివిడి గత శతాబ్దంలో కొరవడినా, ఈనాడు అది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. లెనిన్, స్టాలిన్ బతికున్న రోజుల్లోనే ఈ ఆలోచనలు, రచనలు వెలుగు చూశాయి, చాలామందిని ఆలోచింపజేశాయి అంటే ఆ తెలివిడి ఏదోమేరకు అప్పుడూ ఉందని గమనించాలి. ఉప్పెనలా విరుచుకుపడిన విప్లవకారుల ఉద్రేకపూరిత దాడుల నేపథ్యంలో ఆ భావనలు, ఆలోచనలు, అభిప్రాయాలు సాంద్రతను సంతరించుకోకపోవచ్చు. అంకురంగా అవి కనిపించవచ్చు, వందేళ్ళ తరువాత సైతం అదే పరిస్థితి ఉండాలనుకోవడం విడ్డూరం. ఆ అంకురం ఇప్పుడు అనేక ఖండాలలో, దేశాల్లో విస్తరిస్తోంది. ప్రశ్నించే తత్త్వాన్ని ఒంటబట్టించుకుని నిలదీసేతత్వం పొడసూపుతోంది. ఇందులో సాధికారత దర్శనమిస్తోంది. శతాబ్దం క్రితం రష్యన్ సమాజపు ప్రముఖ రచయిత ఇసాక్ బాబెల్ అయితే ‘‘విప్లవం తన బిడ్డలను తానే తిన్నది’’అని విప్లవం పూర్తయిన తొలి నాళ్ళలో ఎలుగెత్తిచాటాడు. గోర్కీకి మంచి స్నేహితుడు, మనసులోని మాటను నిక్కచ్చిగా చెప్పే తత్వంగల ఈయన 1940 సంవత్సరంలో కనిపించకుండాపోయాడు.. అదృశ్యమయ్యాడు. మరో మాటలో చెప్పాలంటే ఆనాటి పాలకులు అతని గొంతు శాశ్వతంగా నొక్కేశారు. హత్యచేశారు. ఇది ప్రపంచానికి తెలుసు. రష్యా రచయితలకు, కవులకు, కళాకారులకూ తెలుసు. అయినా వారు మొరటు మనుషులను ఎదుర్కొనే శక్తిలేక నిశే్చష్టులయ్యారు. అదీ కమ్యూనిస్టుల నిర్వాకం. ఇసాక్ బాబెల్ భార్య, పిల్లలు అమెరికాకు పారిపోయారు. అక్కడ అతని రచనలు దొరికినవరకు సేకరించి ప్రచురించారు. అందులో రష్యా ప్రజల వేదన, స్వేచ్ఛపట్ల ఆర్తి, విశృంఖలత్వంపై నిరసన, జరుగుతున్న పరిస్థితులపై నిరసన ఎంతో గంభీరంగా కనిపిస్తున్నాయి. మరో రచయిత ఓసిప్ మెందెల్ స్టామ్ స్టాలిన్‌పై విమర్శనాత్మక రచనలు చేశారు. స్టాలిన్ మీసాలు బొద్దింకల మాదిరిగా ఉంటాయని పేర్కొన్నాడు. దాంతో అతడిని సైబీరియాకు పశువును తరలించినట్టు తరలించారు. అక్కడ చెత్తకుండీల్లో కుక్కల్తో పోటీపడి తిని కొంతకాలం ప్రాణం నిలబెట్టుకున్నాడు. రష్యాలో కవిత్వం మనుషుల్ని చంపిస్తోంది అని మరోచోట ఆయన రాశారు. ప్రవాసంలోనే ఆ స్వేచ్ఛాగీతిక కన్నుమూసింది. స్వేచ్ఛ, భావవ్యక్తీకరణను విప్లవం ఇచ్చిన బహుమతి ఎంత గొప్పదో అందరూ ఆలోచించాలి. బ్లాక్ అనే రష్యన్ రచయిత, కవిలో విప్లవానుకూల భావవ్యక్తీకరణలు లేవని, విప్లవ ప్రతీప శక్తులకనుకూలంగా ఉన్నాయని భావించి అతనికి మెరుగైన చికిత్స అందకుండా పాలకులు చేశారు. ఇలాంటి పరిస్థితుల్ని ఎందరో రచయితలు ఎదుర్కొన్నారు. వీరి మార్గంలోనే పయనించిన అలెగ్జాండర్ సోల్జెనిత్సిన్ రచయితలు అనధికార శాసనకర్తలుగా ప్రవచించారు. తన బలమైన గొంతుకను ప్రపంచానికి వినిపించారు. నోబెల్ బహుమతిని కూడా ఆయన అందుకున్నారు. ఇలాంటివి విప్లవకారులకు ఇష్టం ఉండదు. అందుకే వారందరిని వేధించారు, కాల్చుకుతిన్నారు. చైనాలోనూ ఇవే పునరావృత్తమయ్యాయి. అలా కాల్చుకు తిన్నవారే కొందరికి ఆదర్శం కావడం విచిత్రం. అలాంటివారి మానసిక స్థితిపై తప్పకుండా అనుమానపడాలి. అలా అనుమానపడకపోతే ప్రజలకు, స్వేచ్ఛకు ద్రోహం చేసిన వారికింద లెక్క.

- వుప్పల నరసింహం