సాహితి

ప్రవహించే లోపలి పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భావాన్ని కొలిచే కొలమానం
బాధను తూచే తూకం- పాటే అయినా,
నిజానికి గాయకుడు పాడిందే పాట కాదు
కవి మెదడులో కదలికలు- పాట
సంగీత జ్ఞాని మనసులో ముద్రించుకున్న ముద్ర- పాట
వాయిద్యకారుల చేతివేళ్ళ నృత్యం- పాట
పాటంటే కేవలం వినిపించేదే కాదు, వినిపించని
సాంకేతిక నిపుణుల పరిజ్ఞానమూ పాటే
ఒక జీవిత దర్శనం పాట!
చేదు జ్ఞాపకాన్నైనా ఒక మధుర స్మృతిగా
రగిలే జ్వాలనైనా చల్లని రసగుళికగా
మార్చగలిగే మాయాజాలం- పాట
కవి లోతైన భావుకతను తీసుకుపోయి
అత్యున్నత శిఖరంమీదుంచే ఆ గొంతు సామర్థ్యమే- పాట
రాగం పలికించగలిగే ఆ నేర్పు కేవలం పాడడమే కాదు,
భావాలతో, గమకాలతో నటించడం కూడా!
ఆరోహణ, అవరోహణలతో శ్రోతకు జీవితపు
ఎత్తుపల్లాలు చూపించడం మహాసాధన కాక మరేమిటీ?
ఎప్పుడో ఎక్కడో పాడి, తర తరాలుగా కోట్లమందిని
వశుల్ని, వివశుల్ని, పరవశుల్ని చేయడం ఒక యోగం
నటీనటులు ఒక జీవితాన్ని మూడు గంటల్లో కుదిస్తే
గాయకులు దాన్ని మూడు నిమిషాల్లో అందిస్తారు కదా?
అండంలో బ్రహ్మాండాన్ని చూపే కనికట్టు
పిండంలో జీవన సాఫల్యాన్ని చూపే పడికట్టు
జీవంలో చైతన్యం నింపే పనిముట్టు

ప్రపంచం నిండా దుఃఖితుల ఆర్తనాదాలు
బీభత్సంలో గిలగిల కొట్టుకు చచ్చే
అభాగ్యులు, విధివంచితులూ
ఉన్నచోట వారికింత ఊరట కలిగించడానికి,
మబ్బుపట్టిన జీవితమీద అక్కడక్కడైనా
కాసిన్ని మెరుపు తీగలద్దడానికి
అదిగో కవి లోలోపల తన జీవ చైతన్యాన్నంతా
అక్షరాల్లో కూరుస్తున్నాడు-
కవి అక్షరాల్లో, గాయకుల గొంతుల్లో
వాయిద్యకారుల ధ్వని తరంగాల్లో, శ్రోతల హృదయాల్లో
ఇక, ఒకేసారి ఒకే విధంగా నాడి కొట్టుకుంటుంది
అప్పుడది అద్భుత రసమయ ధ్వని చిత్తరువవుతుంది
అక్కడే అప్పుడే రసోత్పత్తి జరుగుతుంది.
ఇక ఓడిపోయిన వారు గెలుపు ద్వారాలు వెతుక్కుంటారు
భగ్నజీవులు ఆత్మవిశ్వాసంతో నిలబడతారు
పడిన వాళ్ళంతా లేచి నిలబడతారు
చచ్చిన ఆశలు, పాట జల్లుతో మళ్లీ మొలకెత్తుతాయి
హృదయ సామ్రాజ్యాలు విస్తరిస్తాయి.

- దేవరాజు మహారాజు, 9908633949